[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]
రెండు జెళ్ల సీత:
3. సరి సరి ప ద ప ద నీ!
ఉపోద్ఘాతం:
రమేష్ నాయుడు గారి మధురమైన సంగీతానికి, ఎస్. జానకి గారి మృదుమధుర గానానికి, వేటూరి సుందరరామమూర్తి గారి అపూర్వమైన పదసృష్టి తోడైన చిత్రం ‘రెండు జెళ్ల సీత’ (1983). గత సంచికలలో ఇదే చిత్రం నుండి ‘కొబ్బరి నీళ్ల జలకాలాడి’ అనే హాస్య గీతం గురించీ, అటు తరువాత ‘మందారంలో ఘుమ ఘుమలై’ అనే ప్రణయ – తత్వ గీతం గురించీ విశ్లేషించుకున్నాం.
అయితే ఇవాళ్టి ‘సరి సరి -ప ద ప ద- నీ!’ అనే గీతానికి ఒక విశిష్టత ఉంది.
తమ చావిడిలో పిల్లలకి సంగీతం నేర్పే ఒక యువతిని నలుగురు కథానాయకులు తమ తమ ప్రేయసిగా ఊహించుకునే వినూత్నమైన కథా నేపథ్యానికి అనుగుణంగా, ఆమె సంగీత పాఠాల నేపథ్యానికి, నాయకులలో ఒక్కొక్కరి మనోభావానికి ఒక్కో చరణాన్ని వేటూరి గారు మలచిన తీరు ఈ గీతానికి ప్రత్యేకమైన నిర్మాణ సౌందర్యాన్ని అందించింది.
ఇదే తరహాలో ఇదే ‘రెండు జెళ్ళ సీత’ సినిమాలో రెండు పాటలు ఉంటాయి. ఒకటి ఆనాటి రేడియోలో బాగా వినిపించిన ‘రెండు జెళ్ళ సీత – తీపి గుండె కోత’ అనే ప్రసిద్ధ గీతం, అది నలుగురు నాయకులు తాము తమ ప్రేమని నాయికకు వ్యక్తపరుస్తున్నట్టు ఊహించుకునే పాట. అందరికీ పల్లవి ఒకటే అయినా రాగాలు వేరు. కాగా రెండోది ఈ అరుదైన స్వరాక్షర ఆరాధనా గీతం ‘సరి సరి ప ద ప ద నీ!’ ఇది నాయిక తన ప్రేమని ఒకొక్క నాయకుడికి ఒకొక్క పద్ధతిలో వ్యక్త పరుస్తున్నట్టు నాయకులు ఊహించుకునే నాలుగు చరణాల గీతం.
ముందే చెప్పుకున్నట్టు ఈ పాటలో నలుగురు బ్రహ్మచారులు కాపురం ఉంటున్న నాలుగిళ్ల చావిట్లో, ఒక వాటాలో కొత్తగా దిగుతుంది నాయిక, పిల్లలకి సంగీతం నేర్పే ఆ నాయికను నలుగురు భిన్నమైన పురుష మనస్తత్వాలు ఉన్న నాయకులు తమ తమ ఊహల్లో సంగీతానికి ప్రతిరూపంగా దర్శించుకుంటారు. అయితే ఆమె తమని వలచి వచ్చి పాడుతున్నట్టు ఎవరికి వారు ఊహించుకుంటారు. ఆ సంగీత సరస్వతిని వేటూరి గారు కేవలం ఒక అందమైన స్త్రీగా చిత్రించలేదు. ఎక్కడో అక్షరంగా, ఎక్కడో స్వరంగా, ఎక్కడో నాట్యంగా, ఎక్కడో ప్రకృతిగా, మరెక్కడో శిల్పంగా దర్శించారు. అంటే నాయికా సౌందర్యం ఒకే రూపంలో ఉండదు; ఆమెను చూసే ప్రేమికుడి దృష్టిని బట్టి కొత్త కొత్త కళారూపాలను సంతరించుకుంటుంది.
ఈ గీతం మొత్తం పరిశీలిస్తే వేటూరి గారి ఒక ప్రత్యేకమైన కవితా లక్షణం స్పష్టమవుతుంది – సంగీతస్వరాలను పలుకుతూనే అర్థవంతమైన పదాలను సృష్టించడం; ప్రకృతిని వర్ణిస్తూనే ప్రణయాన్ని పలికించడం; ప్రణయాన్ని పలికిస్తూనే నాయికను కళకు ప్రతిరూపంగా నిలపడం.
ఇటువంటి సాహిత్యం సినీ సాహితీ జగత్తులోనే చాలా అరుదైన స్వరాక్షర ప్రక్రియ. ఇటువంటి స్వరాక్షర ప్రణయ గీతం ‘స్వరకల్పన’ చిత్రంలో జొన్నవిత్తుల గారి కలం నుండి జాలవారడం మనం గమనించవచ్చు. అది పూర్తి స్వరక్షర గీతం. ఇందులో పల్లవిలో, అక్కడక్కడా చరణాలలో మాత్రం స్వరాక్షర చమత్కారం కనిపిస్తుంది.
~
సాహిత్య విశ్లేషణ:
పల్లవి:
ఆమె: సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని..?
నీదని.. మది నీదని..
నీ దరి చేరగ తొందర సేయగ..
సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని..?
చరణం 1:
ఆమె: అక్షర సుమాలు నావై..
స్వరలక్షణ సూత్రము నీవై..
సరిగమ పదనిస
సని దప మగ రిస
సప్త వర్ణముల గాన లహరిలో..
ఇంద్రధనుస్సుగా నా సొగసు
ఇలకు చేరగ నీ కొఱకు..
సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని..?
చరణం 2:
ఆమె: సరిసరి నటనల అందియనై..
సరసానికి రేపల్లియనై..
వేణు వీధిలో వేసవి గాలినై..
విరహిణినై.. స్వరధునినై.. రసనదినై..
పొంగిపొరలి నే వస్తున్నా..
నింగి నేల ముడి వేస్తున్నా..
చరణం3:
ఆమె: పులిలా చూడకు ప్రియ
భీత హరిణ నేత్రిని నేను
ఉలిలా చూడకు సఖా
ప్రాణ శిల్పగాత్రిని నేను
ప్రియా..సఖా..
చలిగా చూస్తే నెచ్చెలి
చెలిగా చూస్తే సగమవుతాను
చెలిమై నీకే సఖినౌతాను
చరణం 4:
ఆమె: సనజాజి వానల్లో..
సంపంగి వరదల్లో..
తేనెలో తడిసాను.. తీపిలో మునిగాను..
నీ చూపుల వేడిలో తడి ఆరుతున్నాను..
నచ్చింది మనువు పిల్లకి.. ఓరందగాడా..
వచ్చింది మల్లెల పల్లకి..
సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని..?
నీదని.. మది నీదని..
నీ దరి చేరగ తొందర సేయగ..
సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని…
***
విశ్లేషణ:
“సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని..?
నీదని.. మది నీదని..
నీ దరి చేరగ తొందర సేయగ..”
పల్లవిలోనే వేటూరి గారి అద్భుతమైన స్వర-శబ్ద-అర్థ సమన్వయం ప్రారంభమవుతుంది.
‘సరి సరి ప ద ప ద ని’ అనేవి కేవలం స్వరాలు కావు, అర్థవంతమైన ఒక పదబంధం. ఇది స్వరాక్షరాలతో ఆడిన పదక్రీడ. ‘ప, ద, ని’ అనే సంగీత స్వరాలను కవి ‘సరి’ అనే పదంతో అనుసంధానించి, పాట ప్రారంభాన్నే సంగీతభరితంగా, అర్థవంతంగా తీర్చిదిద్దారు. అందుకే “సరి సరి పద పద ని” అనగానే “సరేమరి కలిసి సాగనీ” అనే అర్థం స్ఫురిస్తుంది.. దాని వెంటనే –
“నీ సరి ఎవరిక అవని?” అనే ప్రయోగం వస్తుంది.
ఇక్కడ “అవని” అంటే “అవనిలో” అని అర్థం. “ఈ అవనిలో నీకు సాటి ఎవరు?”, “ఈ భూమ్మీద నీకు సమానమైనవారు ఎవరు?” అని నాయిక తన ప్రియుడి అసమానమైన వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నది.
ఇక్కడ ఒక అద్భుతమైన ధ్వని కూడా ఉంది.
సరి అనే స్వరాలు
సరి అంటే సాటి
అనే ద్వంద్వార్థసౌందర్యం ఏర్పడింది. తరువాత
“నీదని.. మది నీదని..”
అంటూ నాయిక స్వరాక్షరాలు పలుకుతూ తన హృదయాన్ని ప్రియుడికి సమర్పిస్తుంది. “నీదని మది నీదని” లో ది తప్ప అన్నీ స్వరాక్షరాలే అయినా అవి అర్థవంతమైన వాక్యాన్ని ధ్వనిoపజేస్తున్నాయి. “నీదని” అనే స్వరక్షరాలు పునరుక్తి చేయడం ద్వారా ఇది నీదే అనే అంకితభావాన్ని, ప్రేమలోని నిశ్చయాన్ని బలపరిచారు.
“నీ దరి చేరగ తొందర సేయగ”
అనే పాదంలో ప్రేమ యొక్క ఆతురత వ్యక్తమవుతుంది. ప్రియుడి వద్దకు చేరాలని మనసు తొందరపడుతోంది. “దరి–చేర–తొందర” అనే ధ్వని సామీప్యతను, ఆత్రుతను మరింత బలపరుస్తుంది.
చరణం 1:
“అక్షర సుమాలు నావై..
స్వరలక్షణ సూత్రము నీవై..”
ఇక్కడ నాయికను ప్రేమికుడు ఒక కవితగా చూస్తున్నాడు. ఆమె పలికే ప్రతి అక్షరం ఒక పుష్పం అయితే, అతడు ఆ అక్షరాలకు ప్రాణం పోసే స్వరలక్షణ సూత్రం. “అక్షర సుమాలు” అంటూ అక్షరాలను పూలుగా భావించడం, “స్వరలక్షణ సూత్రము నీవై” అంటూ సంగీత సూత్రంగా రూపకించడం అందమైన రూపకాలంకారాలు.
“సరిగమ పదనిస
సని దప మగ రిస”
“సప్త వర్ణముల గాన లహరిలో..
ఇంద్రధనుస్సుగా నా సొగసు
ఇలకు చేరగ నీ కొఱకు..”
ఇక్కడ వేటూరి గారు కేవలం సంగీతస్వరాలను ఉపయోగించలేదు; స్వరాలనే కవితా పదార్థాలుగా మార్చారు. సప్తస్వరాల నుంచి సప్తవర్ణాలకు కవి అద్భుతమైన వంతెన వేశారు.
సంగీతంలోని సప్తస్వరాలు ప్రకృతిలోని సప్తవర్ణాలుగా, నాయికా సౌందర్యంలోని ఇంద్రధనుస్సుగా ఒక అందమైన రూపకాలంకారాన్ని రచించారు.
స్వరాలు వినిపిస్తాయి. రంగులు కనిపిస్తాయి. కానీ నాయిక మాత్రం ఆ రెండింటినీ కలిపిన ఒక దృశ్య–శ్రావ్య సౌందర్యంగా మారుతుంది నాయకుడి ఊహలో. ఇక్కడ రూపకం, ఉపమాధ్వని, శ్లేషసదృశమైన శబ్దక్రీడ, స్వరానుప్రాస కలగలిసి కనిపిస్తాయి.
“సప్తవర్ణముల గానలహరి”లో అంటూ రంగులకు గానాన్ని ఆపాదించడం ద్వారా ఇంద్రియాల పరస్పర మార్పిడి వంటి సంవేదనాత్మక చిత్రణ కనిపిస్తుంది.
చరణం 2:
“సరిసరి నటనల అందియనై..
సరసానికి రేపల్లియనై..”
ఇక్కడ నాయిక ఒక నర్తకిగా దర్శనమిస్తుంది.
“సరి సరి” అనే స్వరాక్షరాలు సిరిసిరి మువ్వలను తలపిస్తాయి “అందియ” అనే పదంతో నాట్యంలోని అందం, “రేపల్లి” అనే పదంతో శ్రీకృష్ణుని వేణుగాన–గోపికా ప్రణయ ప్రపంచం స్ఫురించే సాంస్కృతిక ధ్వని ఉద్భవిస్తుంది.
“వేణు వీధిలో వేసవి గాలినై..
విరహిణినై..
స్వరధునినై..
రసనదినై..”
అనడంలో ఒకే నాయిక అనేక రూపాలుగా మారుతుంది.
ఆమె వేసవి గాలి – స్పర్శగా.
ఆమె విరహిణి – భావంగా.
ఆమె స్వరధుని – సంగీతంగా.
ఆమె రసనది – అనుభూతిగా దర్శనమిస్తుంది.
ఇక్కడ “నై” అనే ప్రత్యయ పునరావృతితో ఒక ప్రత్యేకమైన శబ్దానుప్రాస, లయాత్మక ప్రవాహం ఏర్పడింది.
“విరహిణినై.. స్వరధునినై.. రసనదినై..” అనే వరుసలో భావం క్రమంగా విస్తరిస్తుంది.
వ్యక్తి → స్వరం → నది.
చివరికి –
“పొంగిపొరలి నే వస్తున్నా..
నింగి నేల ముడి వేస్తున్నా..”
అంటూ ఆ ప్రేమనది ప్రవాహం నింగినీ నేలనూ కలిపే స్థాయికి చేరుతుంది.
నింగి-నేల అనే రెండు విరుద్ధ ధ్రువాలను “ముడి వేయడం” ద్వారా ప్రేమ అనేది విభిన్న ప్రపంచాలను కలిపే శక్తి అనే ధ్వని ఉద్భవిస్తుంది.
చరణం 3:
“పులిలా చూడకు ప్రియ
భీత హరిణ నేత్రిని నేను
ఉలిలా చూడకు సఖా
ప్రాణ శిల్పగాత్రిని నేను”
ఇది పాటలోని అత్యంత అందమైన విరోధాభాసాత్మక దృశ్యకల్పనల్లో ఒకటి.
పులి – భయానికి ప్రతీక..
హరిణి – సున్నితత్వానికి ప్రతీక.
ఉలి – శిల్పాన్ని చెక్కే కఠిన సాధనాo
శిల్పం – సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
“భీత హరిణ నేత్రిని”, “ప్రాణ శిల్పగాత్రిని” అనే పదబంధాల్లో నాయిక తన సున్నితత్వాన్ని, తన ప్రాణభావాన్ని తెలియజేస్తోoది. ప్రియుడు తనను వేటాడే శృంగార చూపులతో చూడవద్దని ఆమె కోరుతోంది.
“చలిగా చూస్తే నెచ్చెలి
చెలిగా చూస్తే సగమవుతాను
చెలిమై నీకే సఖినౌతాను” అని కొంటెగా తెలియజేస్తోంది.
ఇక్కడ “చలి–చెలి–చెలిమి” అనే పదాల ధ్వని సమీపత ఎంతో అందంగా కుదిరింది. చూపు చల్లగా ఉంటే ఆమె “నెచ్చెలి”;
ప్రేమగా చూస్తే “చెలి”;
చెలిమి పెరిగితే అతనిలో సగo అవుతుంది. ఇక్కడ ప్రేమ యొక్క క్రమవికాసం కనిపిస్తుంది:
చూపు → చెలితనం → చెలిమి → ఏకత్వం. అనే భావ పరిణితి కనిపిస్తుంది.
చరణం 4:
“సనజాజి వానల్లో..
సంపంగి వరదల్లో..
తేనెలో తడిసాను.. తీపిలో మునిగాను..”
అంటూ ప్రకృతి వర్ణన పరాకాష్ఠకు చేరుతుంది.
సనజాజి వాన, సంపంగి వరద, తేనె, తీపి – ఇవన్నీ నాయిక అనుభవిస్తున్న ప్రణయానందానికి రూపకాలుగా మారాయి.
‘వాన’ సాధారణంగా నీటితో వస్తుంది. కానీ ఇక్కడ పూల వాన, పరిమళాల వరద, తేనెల తడులు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం శృంగార వర్ణన కాదు; ఇంద్రియాలన్నింటినీ ఒకేసారి మేల్కొలిపే రసచిత్రణ.
అయితే వెంటనే –
“నీ చూపుల వేడిలో తడి ఆరుతున్నాను..” అంటుంది.
ఇంతవరకు తేనెవానలో తడిసిన నాయిక, ప్రియుడి చూపుల వేడికి ఆ తడినే కోల్పోతోంది.
ఇక్కడ విరోధాభాస ధ్వని అద్భుతంగా పనిచేస్తుంది:
తడి → వేడి → తడి ఆరిపోవడం.
ప్రేమలోని సిగ్గు, ఆవేశం, ఆత్రుత, శృంగారంఅన్నీ ఈ ఒక్క పాదంలో కలిసిపోయాయి.
చివరగా
“నచ్చింది మనువు పిల్లకి.. ఓరందగాడా..
వచ్చింది మల్లెల పల్లకి..”
అని వివాహ సంకేతం వస్తుంది. ఇంతవరకు ఊహ, సంగీతం, ప్రకృతి, ప్రేమగా సాగిన గీతం చివరికి మనువు–మల్లెల పల్లకి అనే వైవాహిక పరిణతికి చేరుతుంది.
ఈ పాటలో వేటూరి గారి ప్రత్యేకత సాహిత్యాన్ని సంగీతానికి సరిపెట్టడం మాత్రమే కాదు; సాహిత్యాన్నే సంగీతంగా మార్చడం ఒక అద్భుతమైన అపురూపమైన ప్రక్రియ.
“సరి సరి ప ద ప ద ని” లో స్వరాక్షరాలు పదాలుగా మారాయి.
“సరిగమ పదనిస / సని దప మగ రిస”లో సంగీత స్వరాలే కవితా గానాలుగా మారాయి.
“చలి–చెలి–చెలిమి”లో శబ్దం భావాన్ని ముందుకు నడిపింది.
“విరహిణినై–స్వరధునినై–రసనదినై”లో ఒకే ధ్వనినిర్మాణం భావాల పరిణామాన్ని మోసుకెళ్లింది.
అందుకే ఈ గీతాన్ని కేవలం ప్రేమగీతంగా కాకుండా సంగీతం-సాహిత్యం-నాట్యం-ప్రకృతి-శృంగారం అనే ఐదు కళా ప్రవాహాల సంగమంగా చూడవచ్చు.
ఇందులోని రస వైశిష్ట్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ గీతంలో శృంగార రసం ప్రవహిస్తున్నప్పటికీ, అది ఏకరూపమైన శృంగారం కాదు. సంభోగ శృంగారం, విరహశృంగారం, సౌందర్యానుభూతి, ప్రేమలోని ఆతృత, సిగ్గు, చెలిమి, వివాహాభిలాష – ఇవన్నీ పరస్పరం కలిసిపోతాయి.
ముఖ్యంగా రెండవ చరణంలోని “విరహిణినై”, మూడవ చరణంలోని “భీత హరిణ నేత్రిని”, నాలుగవ చరణంలోని “నీ చూపుల వేడిలో తడి ఆరుతున్నాను” వంటి పాదాలు శృంగారంలోని భిన్న ఛాయలను ఆవిష్కరిస్తాయి.
ముగింపు:
‘సరి సరి ప ద ప ద ని..’ గీతం వేటూరి సుందరరామమూర్తి గారి పదకల్పనా వైభవానికి ఒక చక్కని నిదర్శనం. ఒకే నాయికను నలుగురు కథానాయకులు తమ తమ ఊహల్లో దర్శించుకునే కథా సందర్భాన్ని, ఒక్కొక్కరి చరణంలో ఒక్కొక్క కళారూపంగా ఆవిష్కరించడం వేటూరి గారి సృజనాత్మకతకు నిదర్శనం.
ఒక చరణంలో ఆమె అక్షరాల పుష్పం, మరొకచోట స్వరధుని, ఇంకొకరి ఊహలో భీతహరిణి నేత్రాల సున్నితత్వం, చివరికి జాజి–సంపంగి–తేనెల ప్రకృతి సౌందర్యం అవుతుంది.
అన్నిటికంటే పల్లవిలోని
“సరి సరి ప ద ప ద ని..
నీ సరి ఎవరిక అవని..”
అనే ప్రయోగం ఈ గీతానికి మకుటాయమానం. ‘సరి’ అనే శబ్దాన్ని స్వరంగా వినిపించి, వెంటనే ‘సాటి’ అనే శ్లేషార్థాన్ని ప్రస్ఫుటం చేసి, “ఈ అవనిలో నీకు సాటి ఎవరు?” అనే ప్రణయ ప్రకటనగా మలచడం వేటూరి గారి పదక్రీడకు చక్కని ఉదాహరణ.
స్వరాలను పదాలుగా, పదాలను భావాలుగా, భావాలను ప్రకృతి దృశ్యాలుగా, ప్రకృతి దృశ్యాలను ప్రేమానుభూతిగా మార్చగలిగిన కవి వేటూరి. అందుకే ఆయన గీతాన్ని విన్నప్పుడు ఒక పాట మాత్రమే వినిపించదు – ఒకేసారి కవిత్వం వినిపిస్తుంది, సంగీతం కనిపిస్తుంది, ప్రకృతి పరిమళిస్తుంది, ప్రేమ అనుభూతమవుతుంది.
(‘సరి సరి ప ద ప ద ని..’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=tvuCSjC-rnI)
(మళ్ళీ కలుద్దాం)
డా. మాధురి ఇంగువ ప్రముఖ తెలుగు రచయిత్రి, ఆధ్యాత్మిక పరిశోధకురాలు, విశ్లేషకురాలు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న వీరు, తెలుగు సాహిత్యంపై, ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, తెలుగు సినీ గేయాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి పాటలపై ‘వేటూరి గీతామృతం’, ‘వజ్రకుండం’, ‘మధు ప్రణీతం’ వంటి పుస్తకాలను రచించారు. గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం గ్రహీత.
