Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-12

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

శ్రీవారికి ప్రేమలేఖ (1984):

1. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

ఉపోద్ఘాతం:

హాస్యబ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో, రమేష్ నాయుడు గారి స్వరసారథ్యంలో రూపొందిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984) తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన అపురూపమైన హాస్యప్రణయ చిత్రం. ఈ చిత్రంలోని పాటలు కూడా కాలాన్ని దాటి ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఇవాళ మనం విశ్లేషించుకోబోయేది ఈ చిత్రంలోని ఒక ప్రత్యేకమైన ప్రేమలేఖకు అందమైన సంగీతరూపం .

కథానాయిక పూర్ణిమ తన స్నేహితురాళ్లతో చేసే సరదా సవాలు నేపథ్యంలో, తనకు తెలియని ఒక వ్యక్తికి ప్రేమలేఖ రాయడానికి సిద్ధపడుతుంది. కానీ వేటూరి గారి అద్భుతమైన కల్పనలో ఆ ఉత్తరం సాధారణ ప్రేమలేఖగా కాక రాజదర్బారు విన్నపపత్రం, ప్రణయ సందేశం, విరహగీతం, స్వీయ పరిచయపత్రం, కలల పుస్తకంగా మారిపోతుంది.

ఇక్కడ ఒక గొప్ప కవితా రహస్యం ఉంది. నాయికకు నాయకుడి గురించి అసలు ఏమి తెలియదు. అతని రూపం తెలియదు, అతని కుటుంబం తెలియదు. అతని స్వభావం తెలియదు. అతని స్థాయి తెలియదు. అయినా అతనిని “మహారాజు”, “మార్తాండతేజుడు”, “చరణాంభోజుడు”గా ఊహిస్తుంది. అంటే ఆమె రాసేది అతని గురించి తెలిసిన నిజం కాదు; ఎలాంటి పదాలు వాడితే పాపం అబ్బాయిలు ప్రేమలో పడిపోతారో తెలిసిన లౌక్యం అది. అందుకే ఈ పాటలో నాయకుడి పాత్ర కంటే, నాయకుడిని ఊహించుకుంటున్న నాయిక మనస్సే అసలు హీరో.

వేటూరి గారి ప్రత్యేకత ఉన్నది కూడా ఇక్కడే. ఒక సాధారణ యువతి ప్రేమను సాధారణ ప్రేమపదాలతో చెప్పించకుండా, ఆమె శైలికి ఒక ప్రాచీన రాచరికపు భాషను పెట్టారు. అందుకే “శ్రీచరణాంభోజములు” అన్నారు కానీ పక్కనే “ఈలవేసి చంపుతున్న ఈడు” వచ్చి అల్లరి చేస్తుంది; “భయముతో భక్తితో అనురక్తితో” అంటూ వుండగానే పక్కనే “తుంటరి మల్లె” వచ్చి అల్లరిగా నిలబడుతుంది.

సాహిత్యం:

సాకి:
“శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ, ప్రియానందభోజ,
మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి,
మిము వరించి, మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో, భక్తితో, అనురక్తితో శాయంగల విన్నపములూ..”

పాట మొదలయ్యే మొదటి క్షణంలోనే వేటూరి గారు ఒక అద్భుతమైన మాయ చేస్తారు. సాధారణంగా ప్రేమలేఖ “ప్రియమైన..” అంటూ మొదలవుతుంది. కానీ ఇక్కడ “శ్రీమన్ మహారాజ..” అంటూ మొదలవుతుంది. అంటే ప్రేమికుడిని ముందుగా ప్రియుడిగా కాకుండా రాజుగా పట్టాభిషేకం చేసింది నాయిక మనసు.

“మార్తాండ తేజ”లో ‘మార్తాండ’ అంటే సూర్యుడు. కాబట్టి అతని తేజస్సు సూర్యుని ప్రకాశంతో పోల్చబడింది. ఇది కేవలం ఉపమానం కాదు; తర్వాత వచ్చే చంద్రుడు–సూర్యుడు–సంధ్య వంటి ప్రకృతి చిత్రాలకు ముందుగానే ఒక వెలుగుల విత్తనం వేసినట్టవుతుంది. అంతేకాదు ఆకాలం రాజులకుండే బిరుదులలో అది ఒకటి.

“ప్రియానందభోజ”లో “ఆనందం” అనే భావం వినిపించడం మరొక చమత్కారం. నాయకుడి పేరు ఆనంద్ కావడం దీనికి తోడైతే అది కథాసందర్భంలో మరింత రుచికరమైన శ్లేషానుభూతిని కలిగిస్తుంది.

“మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి” అన్నప్పుడు ప్రేమికుడి పాదాలను పద్మాలతో సమానీకరించిన రూపకభావం కనిపిస్తుంది. “చరణాలు” పాదాలు; “అంభోజాలు” పద్మాలు. సాధారణంగా భక్తుడు దేవుని పాదపద్మాలకు నమస్కరిస్తాడు. ఆడపిల్లల పాదాలను కూడా పద్మరాగాలతో పోలుస్తారు. ఇక్కడ నాయకుడు కూడా సుకుమారుడు అని చెప్పకనే చెప్పటం. మరి శ్రీమన్ మహారాజ అన్నప్పుడు ఆ మాత్రం సౌకుమార్యం ఉండాలిగా!

“మిము వరించి” అనే పదం కూడా చాలా ముఖ్యమైనది. “ప్రేమిస్తున్నాను” అనడం కన్నా “వరించాను” అనడం వల్ల వివాహసంకల్పం, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనే లోతైన భావం వస్తుంది.

“మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ”లో “కన్నె బంగారు” అనే సంబోధన తనను తాను పిలుచుకున్నట్టుగా వినిపించడం, తాను బంగారు బొమ్మను అని చెప్పకనే చెప్పటం ఉన్నాయి.

అంతే కాదు కథలో నాయిక పేరు స్వర్ణ. అదీ వేటూరి వారి శ్లేష.

ఆమె పూర్తిగా సిగ్గుపడే అమ్మాయి కాదు; తన ప్రేమను వ్యక్తం చేసేంత ధైర్యం ఉంది. కానీ ఆ ధైర్యం వెనుక కొంచెం బెరుకు కూడా ఉంది.అందుకే వెంటనే-

“భయముతో భక్తితో అనురక్తితో..” అని మూడు పదాలను వరుసగా పేర్చారు.

“భయము–భక్తి–అనురక్తి” ఒక భావపరమైన ప్రయాణంలా ఉన్నాయి. మొదట భయం – అతను ఎలా స్పందిస్తాడో? తర్వాత భక్తి – అతడిని అంతగా ఆరాధిస్తున్నాను. చివరికి అనురక్తి – అతని ప్రేమలో పడ్డాను అంటూ మూడు పదాలు కలిసి నాయిక మనసులోని మూడు మెట్లను చూపిస్తున్నాయి.

“శాయంగల విన్నపములు” అని ముగించడం వల్ల ప్రేమలేఖ ఒక్కసారిగా మళ్లీ రాజదర్బారు విన్నపపత్రంగా మారిపోతుంది. అదే వేటూరి గారి నిర్మాణ చాతుర్యం.

“సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ..”

ఇక్కడ ప్రకృతే ఒక సంగీతకారిణిగా మారిపోతుంది.

సంధ్యాసమయంలో ఆకాశంలో వ్యాపించే ఎరుపును “సంధ్యారాగం” అంటాము, ఆ రాగం (రంగు), చంద్రునికి హారతి ఇస్తోందని ఊహించడం ఒక అందమైన రూపక–ఉత్ప్రేక్షాత్మక దృశ్యం. సంధ్య రంగు ఒక హారతిగా, చంద్రుడు ఆ హారతి అందుకుంటున్న మూర్తిగా కనిపిస్తాడు. ఆకాశంలో ఎఱ్ఱని సంధ్య వర్ణం కూడా సిగ్గుపడుతూ చంద్రకాంతితో ప్రేమలో పడుతున్న సమయం అది అని అర్థం.

అంతేకాదు, “మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ” అనడం ద్వారా కవి సంగీతాన్ని కేవలం నేపథ్యంగా ఉంచలేదు; సంగీతాన్ని ప్రకృతి అనుభవంగా మార్చాడు. ఈ పాటకు ప్రధాన రాగంగా మధ్యమావతిని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

అంటే కవి ముందుగానే “మధ్యమావతి పాడుతున్న వేళ” అని రాసి, సంగీత దర్శకుడి స్వరరచనతో సాహిత్యంలోని రాగనామాన్ని మరింత బలపరిచినట్లుగా వినిపిస్తుంది. ఇది సాహిత్యం–సంగీతం పరస్పరం ఒకదానిని మరొకటి వ్యాఖ్యానించుకున్న అద్భుతమైన ఉదాహరణ.

“ఓ శుభముహూర్తాన” అనడం కూడా చిన్న విషయం కాదు. ప్రేమ మొదలైన క్షణాన్ని ఆమె సాధారణ సమయంగా చూడడం లేదు. అది ఒక శుభముహూర్తం. అంటే మొదటి చూపు ఆమె జీవితంలో ఒక పవిత్ర ఘట్టంగా మారిపోయింది అని చెప్తోంది.

ఏమి కల్పనా చాతుర్యం!

“తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు,
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు..”

అనే పల్లవి గమనిస్తే.

ఇక్కడ “భావాలు” అని కవి రాయవచ్చు. “ఆశలు” అని రాయవచ్చు. “కలలు” అని కూడా రాయవచ్చు. కానీ వేటూరి గారు “కథలు” అన్నారు. అదే అసలు మాయ.

ఎందుకంటే ఆమె కల్పన ప్రకారం అతడిని మొదటిసారి చూసినప్పుడే ఆమె మనసులో ఒక కథ మొదలైందిట. ఆ కథలో అతనికి ఏ పాత్ర? తనకు ఏ పాత్ర? భవిష్యత్తు ఎలా ఉంటుంది? అతను తనను ప్రేమిస్తాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియకపోయినా, ఆమె ఊహ మాత్రం కథలు రాసేసిందిట. “ఎన్నెన్నో కథలు” అని పునరుక్తి చేయడం ఆ ఆలోచనలకు అంతులేదనే భావాన్ని ఇస్తుంది. పునరుక్తి ఇక్కడ కేవలం శబ్దసౌందర్యం కాదు; మనసు ఒకే ఆలోచనను పదేపదే తిప్పుకోవడాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పల్లవి ఒక ప్రేమకథను చెప్పడం కాదు; ప్రేమకథ పుట్టకముందు మనసులో పుట్టే కథలను చెబుతోంది.

తర్వాత వచ్చే –

“జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామగోవిందా జో జో..”

ఇది ఈ పాటలోని అత్యంత గొప్ప సాంస్కృతిక మలుపు.

తాళ్లపాక అన్నమాచార్యు ప్రసిద్ధ “జో అచ్యుతానంద జో జో ముకుందా” లాలిపాటను వేటూరి ఇక్కడ నేరుగా ప్రేమభావంలోకి తీసుకొచ్చారు. ఆ కీర్తన అన్నమయ్య సంప్రదాయంలో ప్రసిద్ధమైనదని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇక్కడ అసలు చమత్కారం ఏమిటంటే – లాలిపాట పాడాల్సిన శిశువు లేదు; నిద్రపోని నాయికే ఉంది.అందుకే “నిదురపోని కనుపాపలకు జోల పాడలేక..” అంటుంది.

“కనుపాపలు” అన్న పదం చాలా సున్నితమైనది. కళ్లకు నిద్ర పట్టడం లేదని నేరుగా చెప్పవచ్చు. కానీ కను‘పాపలు’ అనగానే కళ్లకు చిన్నారి స్వభావం వస్తుంది. తన కళ్లను తానే ఒక పసిబిడ్డలా ఊహించుకుని, అవి నిద్ర పోవటం లేదు కనుక వాటికి జోల పాడాలనుకుంటుంది. .ఈ లాలిపాటను తన వ్యక్తిగత విరహానికి ఉపయోగించడం వల్ల ఒక అద్భుతమైన అంతర్సంబంధం ఏర్పడుతుంది: దేవుడిని, పసి పిల్లలను నిద్రపుచ్చే జోలపాట, తనను నిద్రపుచ్చలేకపోతోంది.

“ఈలవేసి చంపుతున్న ఈడునాపలేక” అనే పదప్రయోగంలో మాత్రం వేటూరి ఒక్కసారిగా ఆ గ్రాంథిక ప్రపంచాన్ని పగలగొట్టి అచ్చతెలుగు చిలిపితనాన్ని లోపలికి తీసుకొచ్చారు. ఈ లేఖ చదివేవాడు ఎవడైనా, ఏ కాస్త రసజ్ఞత ఉన్నా ఈ ద్వైదీ భావానికీ, ఈ గడుసుతనానికి ఉక్కిరిబిక్కిరి అవవలసిందే.

“ఇన్నాళ్ళకు రాస్తున్న ప్రేమలేఖ” అని వచ్చేసరికి పాటకు శీర్షిక కూడా సహజంగా అర్థమవుతుంది. కానీ అప్పటివరకు మనం విన్నది ప్రేమలేఖలోని విషయం కాదు; ఆ లేఖ రాయడానికి నాయిక మనసు పడిన అంతర్గత ప్రయాణం. ఎన్నో మొహమాటలు దాటి ఎన్నో ప్రేమావస్థలు దాటి చివరికి ధైర్యం చేసి ఈ ప్రేమలేఖ రాస్తున్నా అని చెప్పగానే ఏ కుర్రాడికి పులకరింత కలగదు?

మొదటి చూపు → ఊహలు → నిద్రలేమి → విరహం → ధైర్యం → ప్రేమలేఖ.ఇది పాటకు ఒక అంతర్గత కథన నిర్మాణం.

మొదటి చరణం:

“ఏ తల్లి కుమారులో తెలియదికానీ,
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు..”

అనే మాటతో కవి ప్రేమలోని ఒక అద్భుతమైన విరోధాన్ని పట్టుకున్నారు. “ఏ తల్లి కుమారులో” అనేది వాస్తవపరిచయం లేదని చెబుతుంది. “ఎంతటి సుకుమారులో” అంటూ అతని స్వభావాన్ని నిర్ణయించేసింది. మొదట చెప్పుకున్నట్టు అతడు శ్రీమన్ మహారాజు, శ్రీ చరణాoభోజములుకలిగిన సుకుమారుడు మరి.

“ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ,
నా మనసుని దోచిన చోరులు మీరు” అంటుంది.

“మగధీరుడు” అంటే వీరుడు. “చోరుడు” అంటే దొంగ. ఆ శ్రీమన్ మహారాజు గారు వీరుడైనాడో లేదో తెలియదు; కానీ నా మనసును దోచిన చిలిపి దొంగ మాత్రం అయినాడు! ఇది కేవలం విరోధాభాస ఛాయ కాదు; ప్రేమసాహిత్యంలో కనిపించే ఒక ప్రాచీన భావనను ఆధునిక చిలిపి భాషలోకి మార్చిన ప్రయోగం. ప్రేమికుడు తన మనసును “దోచుకున్నాడు” అని చెప్పడం ద్వారా ఓటమిని గెలుపుగా మార్చుతుంది నాయిక..తాను ఓడిపోయింది. కానీ ఆ ఓటమి ఆమెకు ఇష్టం. ఎందుకంటే దోచుకున్నది ధనం కాదు – మనసు.

“వలచి వచ్చిన వనితను చులకన చేయక..”

ఇక్కడ నాయికకు ఒక్కసారిగా తాను ఆడపిల్లను అన్న సిగ్గు, భయం స్థితి కలిగటం వలన, ఇంతవరకు చిలిపిగా మాట్లాడిన ఆమె ఇప్పుడు అతడు తన గురించి ఏమనుకుంటాడో అని సoశయించసాగింది. వరూధినిలా ఆమె మొదట వలచి వస్తే ప్రవరాఖ్యుడిలా తిరస్కరించవద్దు అన్న విజ్ఞప్తి నర్మగర్భంగా వినిపిస్తుంది. ఎందుకంటే వరూధిని చేత పెద్దన్న అనిపించనే అనిపించాడుగా

“కనుఁగొని మాటలం బొదువు గద్గదికన్ దలయూచి యక్కటావనిత తనంతతా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్.” అని.

అందుకే “నేనే ఆడపిల్లని అయి ఉండీ ముందుగా ప్రేమను వ్యక్తం చేశాను కాబట్టి నన్ను తక్కువగా చూడవద్దు” అనే విజ్ఞప్తి ఇందులో ఉంది.

“తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి”లో పదాల ద్వంద్వం చూడదగ్గది. “తప్పు–ఒప్పు” అనే సాధారణ విరుద్ధ పదాలజంటను ప్రేమకు అన్వయించారు. నా లేఖలో భాషాదోషాలు ఉన్నా, భావంలో మాత్రం నిజాయితీ ఉంది; కాబట్టి నా తప్పులనూ ప్రేమతో ఒప్పులుగా తీసుకోమని అడుగుతోంది. ప్రేమిస్తే తప్పులన్నీ ఒప్పులు అయిపోతాయి.

“చప్పున బదులివ్వండీ” అని రెండు సార్లు పునరావృతం చేయడం వల్ల ఆమె మనసులోని తొందర స్పష్టమవుతుంది. మొదట “బదులివ్వండి” అనడం అభ్యర్థన అయితే, రెండోసారి అదే మాట అనడం సిగ్గుతో కూడిన ఆత్రుత.

రెండవ చరణంలో వేటూరి గారి ప్రకృతి దృశ్యకల్పన మరింత విశాలమవుతుంది.

“తలలోన తరుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే..”

మల్లె సాధారణంగా పరిమళానికి, శృంగారానికి, సౌందర్యానికి ప్రతీక. కానీ ఇక్కడ అది “తుంటరి.” ఎందుకు?

ఆమె తలలో ఉన్న మల్లెపువ్వు పరిమళం వెదజల్లగానే, ఆ పరిమళం ప్రియుడి జ్ఞాపకాన్ని మేల్కొలుపుతోంది. అందుకే మల్లె ఇప్పుడు మల్లె కాదు – జ్ఞాపకాన్ని రెచ్చగొట్టే తుంటరి స్నేహితురాలు.

“తలలో” ఉన్న మల్లె “తలపులలో” మంటలు రేపడం ద్వారా “తల–తలపు” అనే ధ్వని సమీపతను కవి అద్భుతంగా ఉపయోగించారు. ఒకే ధ్వని కుటుంబానికి చెందిన పదాలు బయట ఉన్న పువ్వును లోపల ఉన్న జ్ఞాపకంతో కలిపేశాయి. ఇలాగే భక్త కన్నప్పలో “తలలోని గంగమ్మ తలపులోనికి బారె” అంటారు వేటూరి గారు.

“సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే..”

ఇక్కడ ఒక్కసారిగా వ్యక్తిగత ప్రేమ విశ్వవ్యాప్త ప్రకృతి నియమంగా మారుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే, నా ఆలోచనలు నీ చుట్టూ తిరుగుతున్నాయి.

ఇక్కడ మల్లె అనే యమకం గమనించదగ్గది. మల్లె – మల్లే అంటూ ఒకసారి పూవును ఒకసారి “దానిలాగా/దానికిమల్లే” అనే వాడుకను యమకంగా వాడారు ఒక్క దీర్ఘం తేడాతో.

ఇంకా ఒక సున్నితమైన విషయముంది. ముందు పల్లవిలో “మార్తాండ తేజ” అంటూ నాయకుడిని సూర్యునితో అనుసంధానించారు. ఇప్పుడు “సూర్యుడు చుట్టూ తిరిగే భూమి”తో తనను పోల్చుకున్నారు. అంటే పాట ప్రారంభంలో నాయకుడిని సూర్యుడిగా ఊహించిన నాయిక, చరణంలో తనను ఆ సూర్యుని చుట్టూ తిరిగే భూమిగా ఊహిస్తోంది. ఇది పాట అంతటా నడిచే అంతర్గత ప్రతీకా నిర్మాణం!

“నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే”

ఇక్కడ అతిశయోక్తి మరింత అందంగా పనిచేస్తుంది. తన నిట్టూర్పుల వేడి అంత ఎక్కువైందట. ఆకాశంలోని చల్లని చంద్రుడే వాడిపోతున్నాడట! కానీ అసలు అర్థం చంద్రుడు వాడిపోవడం కాదు. తన విరహం తనకు అంత తీవ్రంగా అనిపిస్తోంది అని చెప్పడానికి ప్రకృతినే తన బాధకు సాక్షిగా నిలబెట్టడం. ఇక్కడ ఒక అందమైన విరుద్ధ నిర్మాణం కూడా ఉంది:

సూర్యుడు – వేడి
చంద్రుడు – చల్లదనం
నిట్టూర్పు – వేడి
విరహం – అంతరాగ్ని

ప్రియుడి ప్రతీక సూర్యుడు; ప్రియురాలి విరహతాపానికి సాక్షి చంద్రుడు. ఇలా పాటలో మొదటి నుంచీ వస్తున్న సూర్య–చంద్ర–సంధ్యా ప్రపంచం రెండవ చరణంలో మళ్లీ కలుస్తుంది.

చివరగా –

“నీ జతనే కోరుకుని లతలాగ అల్లుకునే..” అంటుంది.

“లత” తెలుగు సంస్కృత కవిత్వాలలో స్త్రీ సౌందర్యానికి ప్రతీక. కానీ వేటూరిగారి దాన్ని కేవలం శరీరాకృతికి సంబంధించిన ఉపమానంగా వాడలేదు. ఆధారం కోరుకునే మనసుకు ప్రతీకగా వాడారు. లేతలత ఒంటరిగా ఎదగదు; ఒక ఆధారాన్ని ఆశ్రయిస్తుంది. సుకుమారి అయిన నాయిక కూడా మగధీరుడు, చెట్టు వలే బలవంతుడు అయిన ప్రియుడి జతను కోరుకుంటోంది.

“మీరు నాకు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే” అంటూ ఇప్పుడు అతని మాట కోరుతోంది.ఇదే పాటలో ఒక ముఖ్యమైన మలుపు. మొదట –

“ఎన్నో కలలు గన్న” అమ్మాయి.

చివరికి – “మీరు మాటిస్తే”. అనే వాస్తవానికి వస్తుంది.

అంటే కల నుంచి వాస్తవిక సమాధానం వైపు పాట ప్రయాణిస్తుంది. “ఇప్పుడే బదులివ్వండీ” అని రెండుసార్లు చెప్పడం వల్ల విజ్ఞప్తి చేస్తున్నట్టు భావం ధ్వనిస్తుంది అదే గాయని జానకమ్మ గారి గాత్రంలోనూ వినిపిస్తుంది.

“చప్పున”లో సమాధానం త్వరగా రావాలనే కోరిక ఉంటే, “ఇప్పుడే”లో ఆ కోరిక మరింత వ్యక్తిగతమైన ఆత్రుతగా మారుతుంది.ఈ పాటలో మరో గొప్ప ప్రత్యేకత భాషా స్థాయిలో మార్పు.

ప్రారంభంలో: “శ్రీమన్, మహారాజ, మార్తాండ, చరణాంభోజ, విన్నపములు” వంటి గ్రాంథిక–సంస్కృత పదజాలం.

మధ్యలో: “కనుపాపలు, ఈడు, సుకుమారుడు, చోరుడు” వంటి మృదువైన తెలుగు పదాలు.

చివరికి: “తుంటరి మల్లె, మంటలు, నిట్టూర్పు, లత”

వంటి ప్రకృతి–అనుభూతి పదాలు. అంటే పాట భాష కూడా నాయిక మనసులాగే మారుతుంది. బయటకు రాసే లేఖలో ఆమె రాచభాష వాడుతుంది; తనలో తాను ఉన్నప్పుడు మాత్రం అచ్చతెలుగు మనసుతో మాట్లాడుతుంది. ఇదే వేటూరి గారి పాత్రచిత్రణలో అసలు మహిమ.

ఇంకో విశేషం: ఈ పాటలో “లేఖ” అనే వస్తువు కనిపించదు; లేఖ రాస్తున్న మనసే కనిపిస్తుంది. ఒక ఉత్తరంలో సాధారణంగా చిరునామా, పరిచయం, విషయం, అభ్యర్థన ఉంటాయి. కానీ వేటూరి ఇక్కడ ఆ ఉత్తరాన్ని మనోప్రవాహంగా మార్చారు. అందుకే పాటను చదివితే మనకు కాగితం మీద రాసిన లేఖ కంటే, ఒక అమ్మాయి స్వగతం వినిపిస్తుంది.

సాధారణ పాటలో పల్లవి తర్వాత చరణం వస్తుంది. ఇక్కడ మాత్రం నాయిక పల్లవి చరణాల పాట పడుతున్నట్టు కాక లేఖను రాగయుక్తంగా ఆలపిస్తున్నట్టు ఆలోచనల పొరలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. ఎస్. జానకి గారి గానంలో కూడా ఈ భావస్థితి మరింత జీవిస్తుంది. పాటను ఒకే భావంతో పాడకుండా, భయము, భక్తి, అనురక్తి, చిలిపితనం, ఆత్రుత, సన్నని వణుకు వంటి సూక్ష్మభావాల మధ్య స్వర విన్యాసాలు చేస్తూ సాగుతుంది.

ఈ గీతంలో ప్రధానంగా కనిపించేది విప్రలంభ శృంగారం – కలయికకు ముందున్న ప్రేమ, ఎదురుచూపు, విరహం. కానీ అది ఒక్క రసంతో ఆగిపోదు. భక్తి భాష వల్ల శాంత–భక్తి ఛాయ, “తుంటరి మల్లె”, “ఈలవేసి చంపుతున్న ఈడు” వంటి పదాల వల్ల హాస్యపు చిలిపి మెరుపు, “తప్పులుంటే మన్నించి” వంటి కరుణరసం కూడా కలుస్తాయి. అందుకే ఈ పాటను కేవలం “ప్రేమగీతం” అని చెప్పుకోవడం కన్నా ముగ్ధ శృంగార, విరహ, భక్తి, చిలిపి, ప్రకృతి-కల్పనల సంగమం అని చెప్పుకోవాలి.

మరొక గొప్ప విషయం – ఈ పాటలో నాయకుడి రూపవర్ణన దాదాపు లేదు. ఇది చాలా అరుదైన విషయం. సాధారణ ప్రేమగీతంలో కవి ప్రియుడి కళ్లను, నవ్వును, నడకను, శారీరక ధారుఢ్యంను వర్ణిస్తాడు. కానీ వేటూరిగారు ఇక్కడ నాయకుడి రూపాన్ని దాదాపు వర్ణించరు. ఎందుకంటే నాయికకు అతని రూపం తెలీదు. ఎవరో ఒకరిని అల్లరిపట్టించడానికి ఒక రూపాన్ని ఊహించుకుని వ్రాసిన ప్రేమలేఖ. అదే ఈ ప్రేమలేఖకు వేటూరిగారు ఇచ్చిన జీవితం.

ముగింపు:

ఈ గీతాన్ని ఎన్నిసార్లు విన్నా, మొదట మనకు వినిపించేది ఒక అందమైన ప్రేమలేఖ. రెండోసారి వింటే అద్భుతమైన తెలుగు పదబంధాలు కనిపిస్తాయి. మరింత లోతుగా పరిశీలిస్తే అలంకారాలు, ప్రకృతి చిత్రాలు, సంగీత సూచనలు, అన్నమయ్య స్మరణ, శబ్దసౌందర్యం కనిపిస్తాయి. కానీ ఈ గీతాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు బయటపడే అసలు అద్భుతం మరొకటి. ఇది నాయకుడి అందాన్ని వర్ణించిన పాట కాదు; నాయకుడి గురించి ఏమీ తెలియని ఒక అమ్మాయి ఎలాంటి ఊహాత్మక పాత్రను సృష్టించుకుని తన కల్పనాచాతుర్యం ప్రదర్శించిందో తెలిపే పాట. అందుకే ఈ పాటలో ఆమెకు అతడి గురించి తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే ఎక్కువ. ఆ తెలియని ఖాళీలన్నింటినీ నాయిక తన ఊహతో నింపుతుంది. ఇదే వేటూరి గారి అసాధారణ కవితా ప్రజ్ఞ.

మరొక అద్భుతమైన నిర్మాణాన్ని గమనిస్తే – పాట ప్రారంభంలో ఆమె ప్రేమికుడిని సూర్యుడిగా ఊహిస్తుంది: “మార్తాండ తేజ”. కొద్దిసేపటికి తానే ఆ సూర్యుని చుట్టూ తిరిగే భూమిగా మారుతుంది. మరోవైపు “సంధ్యారాగం” చంద్రునికి హారతి ఇస్తుంది. చివరికి ఆమె విరహాల నిట్టూర్పులకు జాబిలి వాడిపోయింది. అంటే పాట మొత్తం ఒక ప్రేమలేఖలా కనిపించినా, లోపల మాత్రం ఒక సంపూర్ణమైన సూర్య–చంద్ర–భూమి–సంధ్య అనే విశ్వకావ్యం నడుస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే – ప్రారంభంలో ఆమె భాష రాచభాష; మధ్యలో భక్తిభాష; తర్వాత విరహపు భాష; చివరికి అచ్చతెలుగు అమ్మడి భాషగా మారుతుంది. ఈ పాటలో వేటూరి గారి అసలైన కవిత్వం ఒక్కో అందమైన పదంలో లేదు. ఒక అమ్మాయి తన మనసును ఎంత కొద్దికొద్దిగా తెరిచే కొద్దీ, ఆమె భాష కూడా అంత కొద్దికొద్దిగా గ్రాంథికతను విడిచి తన సహజత్వంలోకి రావడంలో ఉంది.

ప్రారంభంలో ఆమె అతనితో మాట్లాడుతున్నట్టుంది.

ముగిసేసరికి మాత్రం మనతోనే తన రహస్యం చెప్పుకున్నట్టుంది.

జంధ్యాల గారి అద్భుత చిత్రణ, రమేష్ నాయుడు గారి శాస్త్రీయ సంగీతస్పర్శ, ఎస్. జానకి గారి గాత్రభావన, వేటూరి గారి గ్రాంథిక–తెలుగు పదశిల్పం కలసి ఈ గీతాన్ని ఒక సాధారణ సినీ ప్రేమగీతం స్థాయి దాటి తెలుగు సినీ సాహిత్యంలో ఒక సజీవమైన ‘ప్రేమలేఖ’గా నిలబెట్టాయి. ఎందరికో ప్రేమలేఖ వ్రాసేందుకు ప్రేరణను ఇచ్చాయి.

(‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=I7-aGw7rBmo)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version