[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]
రెండు జెళ్ల సీత:
4. రెండు జెళ్ళ సీత.. తీపి గుండె కోత..
ఉపోద్ఘాతం:
హాస్యబ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో వెలువడిన ‘రెండు జెళ్ల సీత’ (1983) చిత్రం నుండి గత మూడు సంచికలలో ‘కొబ్బరి నీళ్ళ జలకాలాడి..’, ‘మందారంలో ఘుమఘుమలై..’, అలాగే నలుగురు యువకులు తమ తమ ఊహల్లో పరవశించి ఆలపించే ‘సరి సరి ప ద ప ద నీ..’ గీతాల విశ్లేషణలను ఆస్వాదించాం. అదే చిత్రం నుండి అదే నలుగురు బ్రహ్మచారులు ఊహించుకునే మరొక అపూర్వమైన చిలిపి ప్రణయ గీతం – ‘రెండు జెళ్ళ సీత.. తీపి గుండె కోత..’. 80ల దశకంలో రేడియో శ్రోతలను ఉర్రూతలూగించడమే కాక, జంధ్యాల గారి వినోదభరితమైన చిత్రీకరణతో దృశ్య రూపంలోనూ ప్రేక్షకాభిమానాన్ని విశేషంగా ఆకట్టుకున్న గీతమిది.
నలుగురు బ్రహ్మచారులు అద్దెకు ఉండే ఇంట్లో, పక్క వాటాలోకి కొత్తగా అద్దెకు వచ్చిన పదహారణాల తెలుగుపిల్ల సీత. నిండైన లంగాఓణీ ధరించి, రెండు జెళ్లతో అలరిస్తూ, చిన్నారులకు సంగీతం నేర్పుతూ కనిపించేసరికి ఆ నలుగురు కుర్రాళ్లలోని కవులు ఊహల లోకంలో విహరిస్తారు.
ఈ పాటలోని ముఖ్యాంశం ఏమిటంటే.. నలుగురు పాడుకునే పాట పల్లవి ఒకటే అయినప్పటికీ, నలుగురి స్వభావాలకు తగినట్లుగా నాలుగు వేర్వేరు ట్యూన్స్‌ను సమకూర్చడం. ముఖ్యంగా చరణాలలో వేటూరి గారు చూపిన కవితా వైవిధ్యం అత్యంత ప్రశంసనీయం.
పల్లవి ఒక్కటే అయినా.. నలుగురి భిన్నమైన ఊహలకు తగినట్లుగా చరణాల సాహిత్యం, స్వరచిత్రణ మారిపోతాయి. అందుకే ఇది కేవలం సాధారణ ప్రణయ గీతం కాదు; ఒకే నాయికను నలుగురు యువకులు తమ తమతో ఎలా దర్శిస్తున్నారో ఆవిష్కరించిన అద్భుతమైన హాస్య పాత్రచిత్రణ. వేటూరి గారు ఇక్కడ కేవలం ప్రేమను మాత్రమే రాయలేదు.. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్కొక్క యువకుడు తనదైన రంగంలోని పదజాలాన్నే ప్రయోగించేలా శబ్ద శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఒకరికి క్రీడాభిమానం, మరొకరికి భోజన ప్రియత్వం , ఇంకొకరికి శాస్త్రీయ సంగీతాభిమానం, వేరొకరికి ప్రౌఢ సాహిత్య ప్రియత్వం!
ప్రేమ ఒక్కటే అయినా, దానిని ఆవిష్కరించే ప్రియుడి భావoలో, భాషలో వైవిధ్యం ప్రదర్శించడమే ఈ పాటను తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక ప్రత్యేకాకర్షణగా నిలబెట్టింది.
~
సాహిత్యం:
పల్లవి:
రెండు జెళ్ళసీత
తీపి గుండె కోత
ప్రణయ జీవులకు నీవే భగవద్గీత
చరణం1:
నీ క్రీగంటి చూపులే క్రికెట్
పడనివ్వకు నా వలపు వికెట్
నడుం మీద జడ కుప్పెల టెన్నీసు
గుచ్చుతోంది గుండెల్లో ప్రేమ పిన్నీసు
దరికొస్తే మరి కాస్త ఆడిస్తా ఓడిస్తా.. సీత..
రెండు జెళ్ళ సీత తీపి గుండె కోత
చరణం 2:
నీ అందం అప్పడమైతే
నీ దర్పం దప్పళమైతే
అడ్డంగ విరిచేస్తా
అన్నంలో కలిపేస్తా
ఆత్రంగా మింగేస్తా -2
ఓ సీత నా కవిత..
నేనేలే మీ మాతకి జామాత
చరణం 3:
ఓ బాలిక నా రాగ మాలిక
నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగo
నీ పలుకే హిందోళం – నీ నడకే అది తాళం
ఓ సీత సంగీత – దాటొద్దే నా గీత ఓ సీత
చరణం 4:
వెన్నెలంటి నీ రూపం చదవాలంటే..
ఆకాశం పుస్తకం నక్షత్రం అక్షరం..
నీ వాలు చూపు అర్థాలు నిఘంటువులు చెప్పలేవు
నీ హంసగతుల భాష్యాలు నాట్య శాస్త్రం చెప్పలేదు చెప్పలేదు
ఓ నెలత నా కలత
నీ పేరే కవ్వింత నీ పేరే కవ్వింత. ॥రెండు జెళ్ళ సీత॥
***
విశ్లేషణ:
రెండు జెళ్ళ సీత.. తీపి గుండె కోత..
ప్రణయ జీవులకు నీవే భగవద్గీత..
నాయికను ఒక సాధారణ అమ్మాయిగా కాకుండా, ప్రణయజీవులందరికీ జీవిత పాఠం నేర్పే భగవద్గీతగా, ప్రేమకి నిఘంటువుగా వేటూరి గారు ఊహించారు. ఇదొక అందమైన అతిశయోక్తి.
“తీపి గుండె కోత”.. “కోత” ఎప్పుడూ బాధాకరంగా ఉంటుంది కానీ ప్రియురాలి వల్ల కలిగిన తీయదనo, ప్రేమలో కలిగే బాధ కూడా మధురమే అన్న చిలిపి విరోధాభాస అలంకార భావం ఇందులో ఉంది.
చరణం 1:
“నీ క్రీగంటి చూపులే క్రికెట్.. పడనివ్వకు నా వలపు వికెట్..”
ప్రేమికుడి ప్రపంచంలో ప్రేమ క్రికెట్ ఆటగా మారిపోయింది. నాయిక క్రీగంటి చూపులు బంతుల్లా వస్తుంటే, తన “వలపు వికెట్” పడిపోకుండా కాపాడుకోవాలనుకుంటున్నాడు. “పడనివ్వకు” అనడంలో క్రికెట్లో వికెట్ పడటం, ప్రేమలో మనసు జారిపోవడం అనే రెండు భావాలు సమన్వయమయ్యాయి.
చూపులను క్రికెట్‌గా, వలపును వికెట్‌గా మలచడంలో రూపకాలంకారం క్రికెట్ – వికెట్ శబ్దాలలో అంత్యానుప్రాస అలంకారం అలవోకగా కుదిరాయి.
“నడుం మీద జడ కుప్పెల టెన్నీసు.. గుచ్చుతోంది గుండెల్లో ప్రేమ పిన్నీసు..”
నాయిక జడలోని సంప్రదాయమైన కుప్పెలు నడుముపై ఊగుతూ ఉంటే అతడికి మాత్రం టెన్నిస్ బంతుల్లా కనిపిస్తున్నాయిట, ఆ ఆటలో ‘ప్రేమ పిన్నీసు’ గుండెల్లో గుచ్చుకుంటోందట! ఎంత చక్కటి హాస్య స్ఫోరకమైన అంత్య ప్రాసల రూపకాలంకారం. ఆ యువకుడు తనకి తెలిసిన క్రీడా ప్రపంచాన్నే ఇక్కడ ప్రేమభాషగా మార్చాడు
“దరికొస్తే మరి కాస్త ఆడిస్తా.. ఓడిస్తా.. సీత..”
ప్రియురాలు దగ్గరకు వస్తే ఆమెతో ప్రేమ ఆటలు ఆడుకుంటా, ప్రేమలో ఆమెను ఓడిస్తా అనే చిలిపి ద్వంద్వభావం. ప్రేమే ఇక్కడ ఒక క్రీడగా రూపాంతరం చెందింది.
చరణం 2:
“నీ అందం అప్పడమైతే.. నీ దర్పం ధప్పళమైతే..
అడ్డంగ విరిచేస్తా.. అన్నంలో కలిపేస్తా.. ఆత్రంగా మింగేస్తా (2)”
నిరంతరం భోజనం ధ్యాసలోనే ఉండే మనిషి ప్రేమించినా, అతని ఊహ వంటకాల చుట్టూనే తిరుగుతుంది! నాయిక అందాన్ని కరకరలాడే అప్పడంతో, దర్పాన్ని ధప్పళంతో (పులుసు వంటిది) పోల్చి.. విరిచి, కలిపి మింగేస్తాననడం ప్రేమికుడి నైజాన్ని బయటపెట్టే అద్భుతమైన పాత్రచిత్రణ.
కావ్య సౌందర్యాన్ని వంటకాలకు ఆపాదించి వర్ణించడంలో పరిహాస రూపకాలంకారం, అందం-అప్పడం, దర్పం-దప్పళం, విరిచేస్తా-కలిపేస్తా-మింగేస్తా అనే పదాలలో అంత్యానుప్రాస అలంకారం, హాస్యం పరాకాష్ఠకు చేరింది.
“ఓ సీత నా కవిత.. నేనేలే మీ మాతకి జామాత..”
అనడంలో “మీ మాతకి జామాత” (అత్తగారికి అల్లుడిని) అని పలకడంతో ప్రేమకవిత్వం ఒక్కసారిగా హాస్యకవిత్వంగా మారి ఫక్కున నవ్విస్తుంది. ప్రేమలో ఇంకా మొదటి అడుగులోనే ఉన్నా, ఇతని ఊహల్లో మాత్రం పెళ్లి జరిగిపోవడం హాస్యానికి కొసమెరుపు.
చరణం 3:
“ఓ బాలిక నా రాగ మాలిక..
నీ వదనం మోహనం.. చిరునవ్వే శ్రీరాగం..
నీ పలుకే హిందోళం.. నీ నడకే అది తాళం..”
సంగీత ప్రేమికుడు సంగీతం నేర్పే నాయికను ఒక రాగమాలికగా దర్శిస్తాడు. ఆమె ముఖం మోహన రాగంలా మోహనంగా ఉందని, చిరునవ్వు శ్రీరాగంలా ప్రేమకు శ్రీకారం చుడుతున్నట్టుగా ఉందనీ, పలుకులు హిందోళ రాగంలా శృంగారభరితంగా, నడక ఆది తాళం వేస్తూ లయబద్ధంగా ఉందనీ గొప్ప రూపకాన్ని ఊహించాడు! ఆమెను చూడటం అతనికి ఒక పవిత్రమైన సంగీతానుభవం మరి.
“ఓ సీత సంగీత.. దాటొడ్డే నా గీత ఓ సీత..”
తన పాటకు ఆమే సంగీత సాధనే ప్రేరణ. అందుకే సీత సంగీతలక్ష్మిలా కనిపిస్తోంది. ఆ సీతను తాను గీసిన ప్రేమగీత దాటకుండా తన లోగిలిలోనే ఒదిగిపొమ్మంటున్నాడు, ప్రేమాయణం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నాడు.
చరణం 4:
“వెన్నెలంటి నీ రూపం చదవాలంటే.. ఆకాశం పుస్తకం.. నక్షత్రం అక్షరం..”
నాయిక రూపం వెన్నెలలలా మహా ప్రకాశవంతమైనది. దాన్ని చదవాలంటే భూమిపై ఉన్న పుస్తకాలు సరిపోవు, ఆకాశమే పుస్తకం కావాలి; ఆ నక్షత్రాలే అక్షరాలు కావాలి! అంత అలౌకికమైన దివ్య సౌందర్యం ఆమెది.
వెన్నెలంటి నీ రూపం అనడంలో ఉపమాలంకారం, ఆకాశాన్ని పుస్తకంగా, నక్షత్రాలను అక్షరాలుగా భావించడంలో మహా రూపకాలంకారం అద్భుతంగా ప్రస్ఫుటమవుతోంది.
“నీ వాలు చూపు అర్థాలు నిఘంటువులు చెప్పలేవు..”
సాధారణంగా ఆనాటి ఒద్దికైనా ఆడపిల్లలు ఏనాడు నోరు తెరిచి మాట్లాడేవారు కాదు, వారి భావాలన్నీ ఆ కలువ కళ్ళల్లోనే పలికేవి. అవి స్పందించే మనసుకి అర్థం అయ్యేవి. అందుకే ఆ నాయిక వాలు చూపులను ఒక విలక్షణమైన భాషగా ఆ చూపుల అంతరార్థాలు ఏ నిఘంటువుకూ దొరకని సాంద్రత గల భావాలుగా ఆ యువకుడు అతిశయోక్తిగా ఊహిస్తున్నాడు! ఎందుకంటే ప్రేమభాషకు నిఘంటువులు ఉండవనేది వేటూరి గారి కవితా చమత్కారం.
“నీ హంసగతుల భాష్యాలు నాట్య శాస్త్రం చెప్పలేదు చెప్పలేదు..”
ఆమె వాలు చూపుల భాషనే కాదు హంసనడకలాంటి ఆమె వయ్యారమైన గమనానికి భాష్యం చెప్పడానికి భరతుడి నాట్యశాస్త్రం కూడా సరిపోదనే ప్రౌఢమైన ఊహ చక్కని అతిశయోక్తి అలంకారం.
“ఓ నెలత నా కలత.. నీ పేరే కవ్వింత నీ పేరే కవ్వింత..”
“నెలత” అనే స్త్రీ సంబోధనలో వెన్నెల వంటి సుకుమారత్వం ఉంది. ఆమె పేరు పలకడమే తనలో ప్రేమ కలతను, కవ్వింతను రేపుతోంది.
పాట నిండా హాస్యం, ప్రాసలలో హాస్యం, అందమైన ఉపమా, రూపక, అతిశయోక్తి అలంకారాలలో హాస్యం వెరసి ఈ పాటలో వేటూరి గారి అసమాన వైశిష్ట్యం చమత్కారాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
ఈ పాటలోని విశిష్టత కేవలం ఒక్కో చరణంలో అందమైన ఉపమానాలు వాడటంలో మాత్రమే కాదు; నలుగురు యువకుల ప్రేమభాషను నలుగురు వేర్వేరు ప్రపంచాలుగా మలచడంలో ఉంది
- క్రీడాకాముడు: క్రికెట్\వికెట్\టెన్నిస్\పిన్నీసు\ అంటూ ఆటని ప్రాసని ప్రేమకవిత్వంలో కలుపుతాడు
- భోజన ప్రియుడు: అప్పడం\దప్పళం\అన్నం\మింగడం\ భోజనం చుట్టూ ప్రేమ కవిత్వం అల్లుతాడు.
- సంగీత ప్రియుడు: రాగమాలిక\మోహనం\శ్రీరాగం\హిందోళం\అదితాళం అంటూ విద్వాంసుడు అయిపోతాడు.
- సాహిత్యాభిమాని: పుస్తకం\అక్షరం\నిఘంటువు\భాష్యం\నాట్యశాస్త్రం అంటూ ఉద్ధండ పండితుడు అయిపోతాడు.
అంటే నలుగురూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు.. కానీ వారి ఊహల్లో ఒక్కొక్కరిదీ ప్రేమకి ఒక్కొక్క భాష్యం! ఇది కేవలం ప్రహసన హాస్యం కాదు; అచ్చమైన పాత్రోచిత భాషకు ప్రామాణికమైన ఉదాహరణ.
ఈ పాటను కేవలం సాహిత్యపరంగానే కాక దృశ్య-శ్రవ్య రూపంలోనూ ఆస్వాదించాలి. జంధ్యాల గారి మార్కు దృశ్యహాస్యం, పాత్రల హావభావాలు, నలుగురు యువకుల వేర్వేరు ఊహలు పాటకు సన్నివేశ వినోదాన్ని అందిస్తాయి. రమేష్ నాయుడు గారి సంగీతంలో ఒకే పల్లవికి నాలుగు ట్యూన్స్ ఇస్తూనే చరణాల వ్యక్తిత్వానికి తగ్గట్టుగా స్వరభేదాలను చూపించడం పాట స్వర నిర్మాణానికి మహోన్నత శక్తిని ఇచ్చింది.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో కనిపించే చిలిపితనం, పదాలను పలికించే విధానంలోని నటనాత్మకత ఈ పాటను కేవలం వినే పాటగా కాకుండా శ్రోతల కళ్లముందు పాత్రలను నిలిపేలా చేస్తుంది.
ముగింపు:
‘రెండు జెళ్ళ సీత..’ లోని ఈ గీతంలో వేటూరి సుందరరామమూర్తి గారు కేవలం ఒక ప్రణయ గీతాన్ని రాయలేదు; ఒకే అమ్మాయిని ప్రేమించే నలుగురు యువకుల నాలుగు వైవిధ్యమైన మనస్తత్వాలను అక్షరబద్ధం చేశారు.
ఒకరి కళ్లల్లో సీత చిన్నెలు క్రికెట్ వికెట్, టెన్నిస్ ఆట!
మరొకరి కళ్లల్లో ఆమె అందం అప్పడం, దప్పళం, అన్నం!
మరొకరి మనసులో ఆమె రూపం రాగమాలిక, శ్రీరాగం, హిందోళం!
ఇంకొకరి ఊహల్లో ఆమె తత్వం ఆకాశ పుస్తకం, నిఘంటువు, నాట్యశాస్త్రం!
ఒకే సీత – నాలుగు ఊహలు; ఒకే ప్రేమ – నాలుగు భాషలు! ఇదే వేటూరి గారి పాత్రచిత్రణా ప్రతిభ. కవి తన పాండిత్యాన్ని ప్రదర్శించడమే గొప్పతనం కాదు.. ఆ పాండిత్యాన్ని ఏ పాత్ర నోట, ఏ సందర్భంలో, ఏ స్థాయిలో మాట్లాడించాలో తెలుసుకోవడమే అసలైన కవితా ప్రజ్ఞ! ఈ పాటలో వేటూరి గారు అదే సాధించి చూపించారు.
జంధ్యాల గారి హాస్యదృష్టి, రమేష్ నాయుడు గారి చలాకీ సంగీతం, బాలు గారి గాత్రనటన, వేటూరి గారి పదచమత్కారం కలగలసి ‘రెండు జెళ్ళ సీత’ను తెలుగు సినిమా చరిత్రలో నాలుగు మనస్తత్వాల హాస్యకవిత్వంగా చిరస్థాయిగా నిలబెట్టాయి.
(‘రెండు జెళ్ళ సీత.. తీపి గుండె కోత..’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Ub1JJuRRnlw)
(మళ్ళీ కలుద్దాం)
డా. మాధురి ఇంగువ ప్రముఖ తెలుగు రచయిత్రి, ఆధ్యాత్మిక పరిశోధకురాలు, విశ్లేషకురాలు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న వీరు, తెలుగు సాహిత్యంపై, ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, తెలుగు సినీ గేయాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి పాటలపై ‘వేటూరి గీతామృతం’, ‘వజ్రకుండం’, ‘మధు ప్రణీతం’ వంటి పుస్తకాలను రచించారు. గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం గ్రహీత.
