Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-16

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

చంటబ్బాయి (1986):

1. ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం

ఉపోద్ఘాతం:

జంధ్యాల గారి దర్శకత్వంలో ఎన్నో హాస్యరస ప్రథాన చిత్రాలు వచ్చినప్పటికీ చిరంజీవి వంటి అగ్ర హీరోతో ఒక చక్కని చిత్రం కూడా చేయకపోవటం మెగా అభిమానులకు లోటుగా తోచేది. ఆ లోటుని భర్తీ చేస్తూ, చిరంజీవి గారిని ఎన్నో వేషాలలో చూపిస్తూ, ఆహ్లాదకరమైన హాస్యాన్ని పంచి, అత్యద్భుతమైన కామెడీ హిట్ గా శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాన్ని రూపొందించారు జంధ్యాల గారు.

జంధ్యాల – చిరంజీవి గార్ల కలయికలో వచ్చిన ‘చంటబ్బాయి’ చిత్రం నాడే కాదు నేడు కూడా పిల్లా పెద్దా అందరూ మెచ్చే కామెడీ హిట్ చిత్రమే. ఆ చిత్రంలో చిరంజీవి పోషించిన జేమ్స్ పాండ్ అలియాస్ పాండు రంగారావు అనే కామెడీ డిటెక్టివ్ పాత్ర అజరామరం.

అతని డిటెక్టివ్ వృత్తిని జంధ్యాల గారు తనదైన హాస్యశైలిలో ఒక కామెడీ డిటెక్టివ్ పాత్రగా మలిచిన తీరు హాస్యభరితం. మూల కథ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిది అయినప్పటికీ తెర మీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు చేసుకుని, చిరంజీవిని జేమ్స్ బాండ్, చార్లీ చాప్లిన్, దగ్గర నుండి హరిదాసు పాత్రవరకు, ఎన్నో అవతారాల్లో చూపించి జంధ్యాల మార్కు నవ్వుల పూత పూసుకుంది ‘చంటబ్బాయి’.

జేమ్స్ పాండ్ పరిశీలనలోనూ, అన్వేషణలోనూ, సమస్యను పరిష్కరించే విధానంలోనూ ఒక చిలిపితనం ఉంటుంది. అదే స్వభావం ప్రేమలో పడినప్పుడు మరింత వినోదాత్మకంగా మారుతుంది.

కథానాయిక సుహాసిని తరచూ నాయకుడి డిటెక్టివ్ ఆఫీసుకు టెలిఫోన్ క్లీనింగ్ పనిమీద వస్తుంది. ఆమెతో పరిచయం ఉన్నా, ఆమె ఇల్లు ఎక్కడో అతనికి తెలియదు. దానినే సవాలుగా తీసుకుని, “మీ ఇంటి చిరునామా మూడు రోజుల్లో కనిపెడతాను” అంటాడు జేమ్స్ పాండ్. ఆ మాటతో మొదలైన అన్వేషణే ఈ పాటకు నేపథ్యం. ఆమె చిరునామా కోసం పగలు, రాత్రి, అర్ధరాత్రి అన్న తేడా లేకుండా విశాఖపట్నం అంతా తిరుగుతున్నాడు మన కథానాయకుడు.

జంధ్యాల గారు సృష్టించిన కామెడీ డిటెక్టివ్ పాత్రకు వేటూరి సుందర రామ్మూర్తి గారు తమ ప్రణయ భావగీతంలో పాత్రోచిత భాషను అందించగా, చిరంజీవి తన అభినయంతో దానికి అజరామరమైన హాస్యభరితమైన దృశ్యరూపం ఇచ్చారు. అందుకే ఈ పాటను చదివేటప్పుడు వేటూరి గారి కవిత్వాన్ని పాత్ర స్వభావం నుంచి విడదీసి చూడలేం.

సాహిత్యం:

పల్లవి:
ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా.. నీవెక్కడా.. నీవెక్కడా?
చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా! ॥ఉత్తరాన లేవంది॥

చరణం 1:
చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ?
పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ?
జాణవున్న తావునే జాజిమల్లి తావులు
ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ
వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా! ॥ఉత్తరాన లేవంది॥

చరణం 2:
ఈ నిశీధి వీధిలో బాటసారినై
ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై
నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో
నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో
వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా! ॥ఉత్తరాన లేవంది॥

విశ్లేషణ:

“ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం”

అనే పల్లవి ఈ డిటెక్టివ్ అన్వేషణకు కవితా పటాన్ని గీస్తుంది. ధ్రువనక్షత్రం ఉత్తర దిక్కున స్థిరంగా కనిపించే నక్షత్రం. దిశను గుర్తించడానికి బాటసారులు, నావికులు, రైతులు కూడా దానిని ఆధారంగా తీసుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి తనకు దొరకని ప్రేయసి చిరునామా కోసం ఉత్తర దిక్కునే స్థిరంగా ఉండి అన్నిటినీ సాక్షిలా వీక్షిస్తున్న ధ్రువతారను నాయకుడు ప్రశ్నిస్తునట్టుగా వేటూరి గారి ఊహ.

అదే విధంగా యుగయుగాలుగా దక్షిణ దిక్కున స్థిరంగా, ఎత్తుగా నిలబడి, యావత్ దక్షిణ భారతావనిని నిరంతరం వీక్షిస్తున్న చల్లని మలయపర్వతాన్ని ప్రశ్నిస్తాడు. యావత్ దక్షిణభారత దేశంలోనే ఎత్తైన మలయ పర్వతాలకి కనపడనిది ఏముంది? అందుకే వాటిని తన ప్రేయసి చిరునామా తెలుసా అని అడుగుతున్నాడు నాయకుడు.

ఇది ఒక సాధారణ భౌగోళిక వర్ణన కాదు. నాయకుడు డిటెక్టివ్ కాబట్టి అతని అన్వేషణకు సాక్షులు కావాలి. అందుకు యుగయుగాల వయసు ఉన్న తారా గిరులే సాక్షులవుతున్నాయి. సాధారణ డిటెక్టివ్ మనుషులను ప్రశ్నిస్తాడు; ఈ డిటెక్టివ్‌కి ప్రకృతి, నక్షత్రాలు, పర్వతాలు కూడా సాక్షులే!

“నింగిలేని తారకా.. నీవెక్కడా.. నీ వెక్కడా?”

తారక అంటే ఆకాశంలో ఉండాల్సిన నక్షత్రం. కానీ ఈ ప్రేయసి తన కోసం నింగిని విడిచి భూమిమీదికి వచ్చిన తారక వంటి తళుకుల సుందరి. అందుకే ఆమెకు ఇప్పుడు ఆకాశమే చిరునామా కాదు. ఆకాశంలో ఉండాల్సిన తార భూమిమీద ఏదో ఒక ఇంటిని తన నివాసంగా చేసుకుంది. ఆ ఇంటిని కనిపెట్టడమే ఈ డిటెక్టివ్ ముందున్న పని.

అంతకన్నా ముఖ్యమైన విషయం తారక అంటే తరింపజేయునది అని అర్థం. ఆమె అతడిని తరింపజేసే తారక అనే ఆరాధన ఆ పంక్తిలో ఉంది. వేటూరి వారి పాటలో ఒక పదానికి ఒకే అర్థం కాక వేవేల అర్థాలు ఇమిడి ఉంటాయి.

“చెప్పవే నీ చిరునామా.. చెప్పవే నీ చిరునామా!”

ఇక్కడ నీ చిరునామా నువ్వే చెప్పి నన్ను తరింపజేయమని వేడుకోలు ఉంది. భగవంతుడిని ఆరాధించే భక్తుడు కూడా, భగవంతుడి కోసం అన్వేషిస్తూ, నీవు ఎక్కడున్నావో తెలియజేసి తరింపచేయమని వేడుకుంటాడు. ప్రేమలో పడిన ప్రేమికుడి స్థితి కూడా అదే. ప్రేమరాధనకి దైవారాధనకి తేడా లేదని వేటూరి వారికి తెలుసు. అందుకే ఆయన సదా ప్రేమలో దైవత్వాన్ని దర్శిస్తారు.

అక్కడి నుంచి నాయకుడి అన్వేషణను ఆకాశం నుంచి ప్రకృతిలోకి తీసుకువస్తారు –

“చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ?
పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ?”

ఈ రెండు పాదాలను ‘నింగిలేని తారక’తో కలిపి చదివితే మరింత అందమైన ఊహ కనిపిస్తుంది. తన ప్రేయసిని తారకగా భావించిన నాయకుడు, ఇప్పుడు ఆకాశంలోని తోటి చుక్కలనే ఆమె చిరునామా కోసం అడుగుతున్నాడు.

‘చుక్కపాప’ అనడం ఎంతో ముద్దైన ప్రయోగం. ఆకాశంలోని చుక్కలను చిన్న పిల్లలుగా, వెన్నెలను వాళ్ళ తల్లిగా ఊహిస్తే – తన తల్లి ఎక్కడుందో పిల్లలకు తెలుసు కదా! అందుకే “మీ వెన్నెలమ్మ ఎక్కడుంది?” అని ‘చుక్కపాప’ను అడుగుతున్నాడు.

ఇక్కడ మరో సౌందర్యభావన కూడా ఉంది. ఆకాశంలో అనేక చుక్కలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ మించిన అందం, వెలుగు, ఆకర్షణ జాబిలిదే. కాబట్టి తన ప్రేయసిని తరింపజేసే తారక మాత్రమే కాదు, వెండివెన్నెలలు పంచే జాబిలిగానూ ఊహించడం ద్వారా ఆమెను సాధారణ తారలతో సమానం చేయకుండా, తారలను మించిన సౌందర్యానికి ప్రతీకగా నిలబెట్టారు కవి.

అయితే ఆ జాబిలి ఇప్పుడు నింగిలో లేదు. నేలమీదికి వచ్చింది. అందుకే ఆకాశంలోని తన తోటి చుక్కలనే చిరునామా అడగాల్సి వస్తోంది. ఆ అడగడంలో ఒక ప్రేమికుడి తృష్ణ , ఆరాధనతో పాటు అతని డిటెక్టివ్ తెలివి కూడా దాగి ఉంది.

“పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ?”

గాలి తిరుగాడని చోటు లేదు, తాకని పూలకొమ్మ లేదు. పైగా నాయిక అప్పుడే పూచిన పూల కొమ్మలా లేతగా, సుకుమారమైనదిగా ఉంది అని నర్మగర్భంగా చెబుతున్నాడు కవి. కొమ్మ అంటే స్త్రీ అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ పూల కొమ్మ శ్వాసించే గాలినే చిరునామా అడుగుతూ అన్వేషణ సాగిస్తున్నాడు డిటెక్టివ్ నాయకుడు.

“జాణవున్న తావునే జాజిమల్లి తావులు
ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ”

జాజిమల్లి ఉన్న చోట దాని సువాసన ఉంటుంది. తన ప్రేయసి కూడా జాజిమల్లి పువ్వులా సుకుమారమైన సౌందర్యం, సౌగంధం కలిగినదని అతని భావన. అందుకే తన ప్రేయసి ఉన్న చోట జాజిమల్లి వాసన ఉంటుందని , వీచే గాలికి ఆమె జాడ తెలిసి ఉండవచ్చని ఊహిస్తాడు. ఇక్కడ ‘తావు’ అనే పదాన్ని ‘చోటు’ ‘సువాసన’ అనే యమకార్థాలలో వాడటం అద్భుతం.

సాధారణ డిటెక్టివ్ భూతద్దంతో ఆనవాళ్ళను వెతుకుతాడు. ఈ ప్రేమిక డిటెక్టివ్ మాత్రం సువాసనను కూడా ఆనవాలుగా తీసుకుంటాడు.

“ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ”

ప్రాణికి ఆశ సహజం. అతడికి ఆమె ప్రాణం. కనుక ఆమె జాడ చెప్పకపోయినా అతడి ప్రాణం ఆమె వద్దకు దానంతట అదే పరుగులు తీస్తుంది అంటాడు. పాదాలకు గమ్యం ఎటో ఒకరు చెప్పాలా? చిన్న సంకేతం కనిపించినా అక్కడికి ఉత్సాహంగా పరుగెడతాయి. ప్రకృతి మాత్రమే కాదు అతని ప్రాణం కూడా అన్వేషణలో క్లూ ఇచ్చే సాక్షిగా మారిపోయింది.

“వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా!”

అని చివరికి కొంచెం అలకతో, విసిగి వేసారి, సరదాగా ప్రేయసినే ప్రశ్నిస్తాడు. ఇంత వెతికినా దొరకవా? నీ చిరునామా నువ్వే చెప్పరాదా? అంటూ బ్రతిమాలుతాడు.

రెండో చరణంలో మాత్రం నాయకుడి అన్వేషణను మరింత అంతర్ముఖం చేశారు వేటూరి వారు.

“ఈ నిశీధి వీధిలో బాటసారినై”

అతడు కేవలం రాత్రి చీకట్లో రహదారి పైన నడిచే బాటసారి మాత్రమే కాదు. అతనికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆమె ఎక్కడుందో తెలియదు. ఏ దారిలో వెతకాలో తెలియదు. ముందుకు నడిపించే ఆధారం లేదు. బయట నిశీధి; లోపల కూడా జాడ తెలియకపోవడం అనే చీకటి. అజ్ఞానం అనే చీకటిలో, ఎటువంటి ఆశాకిరణం లేకుండా నడుస్తున్న బాటసారి అతడు.

అతని పరిస్థితిని తరువాతి పాదం మరింత విశాలంగా చెబుతుంది –

“ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై”

..“బ్రహ్మచారి” అంటే కేవలం పెళ్ళి కాని పురుషుడు అనే అర్థంలో వేటూరి గారు వ్రాయలేదు. భారతీయ సంప్రదాయంలో బ్రహ్మచారి అంటే విద్యను, జ్ఞానాన్ని అన్వేషించే వాడని అర్థం.

వేటూరి గారు ఆ పదంలోని ఆ సాంస్కృతిక విస్తృతిని తీసుకుని, దాన్ని ఈ డిటెక్టివ్ అన్వేషణకు జోడించారు. ఈ విశాల ప్రపంచమంతా తనకు ఒక అన్వేషణా క్షేత్రం. లక్ష్యం ఒక్కటే – తన ప్రేయసి చిరునామా తెలుసుకోవడం. బ్రహ్మజ్ఞానం కోసం అన్వేషించే బ్రహ్మచారి లాగా, ఈ డిటెక్టివ్ నాయకుడు తన ప్రేయసి చిరునామా కోసం అన్వేషిస్తున్నాడు. బ్రహ్మచారి పదానికి ఉన్న గంభీరమైన సంప్రదాయార్థాన్ని, పాత్రలోని హాస్యాన్ని కలిపిన వేటూరి వారి చమత్కారం ఇది.

ఇక్కడ జంధ్యాల గారి దృశ్యచమత్కారం మరింత నవ్వు పుట్టిస్తుంది. ‘బ్రహ్మచారినై’ అన్న వెంటనే తెరపై తోపుడుబండిపై ముదురు బెండకాయలు అమ్ముతున్న వ్యక్తిని చూపించడం మాటను అక్షరార్థంలో పట్టుకుని చేసిన చిలిపి దృశ్యవ్యాఖ్యానం. పాటలో వేటూరి గారి పదానికి ఉన్న అర్థం ఒకటైతే జంధ్యాల గారు దాన్ని దృశ్యంలో మరో అర్థం చూపించి నవ్వులు పండించారు. ఇదే జంధ్యాల గారి హాస్యానికి ప్రత్యేకమైన శైలి.

“నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో
నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో”

అంటాడు నాయకుడు. ఇక్కడే ఈ నాయకుడు కేవలం డిటెక్టివ్ కాదని తెలుస్తుంది. అతడు ఆమె ఆరాధకుడు కూడా. ఆమెను చూడాలనే కోరిక అతని కళ్ళలో ఉంది. ఆమె సన్నిధిని పొందాలనే కల అతని జీవితాన్ని నడిపిస్తోంది. అతని అన్వేషణకు డిటెక్టివ్ మెదడు తోడైంది; కానీ ఆ అన్వేషణకు అసలు ప్రేరణ ప్రేమ.

అందుకే పాటలోని ప్రతి దశలో ఈ రెండు ప్రవాహాలు కలిసి నడుస్తాయి. చిరునామా కోసం వెతకడం డిటెక్టివ్ పని; నక్షత్రాలను అడగడం ప్రేమికుడి ఊహ; జాజిమల్లి సువాసనను క్లూగా మార్చుకోవడం డిటెక్టివ్ ప్రియుడి ఆలోచన; ప్రేయసిని జాబిలిగా, తారకగా భావించడం ప్రేమికుడి ఆరాధన.

చివరికి-

“వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా!”

అని మళ్లీ అదే వేడుకోలు వినిపిస్తాడు. ఇక్కడ పునరావృతం కేవలం ప్రాస కోసం కాదు; అతని అన్వేషణ ఇంకా పూర్తికాలేదనే భావాన్ని కూడా బలపరుస్తుంది. పాట చివర్లో పల్లవి తిరిగి వచ్చినప్పుడు జంధ్యాల గారి దృశ్యహాస్యం మరోసారి మెరుస్తుంది.

“ఉత్తరాన లేవంది ధ్రువనక్షత్రం” అన్నప్పుడు ఉత్తరాలు/లేఖలను చూపించడం – ‘ఉత్తరం’ అనే పదాన్ని మరో అర్థంలో పట్టుకున్న దృశ్యచమత్కారం.

“దక్షిణాన లేవంది మలయపర్వతం” అన్నప్పుడు మలయపర్వతంలా భారీ పొట్టతో ఉన్న కాపలాదారుడు ‘దక్షిణ’ తీసుకుంటూ కనిపించడం – ‘దక్షిణ’ అంటే దక్షిణదిక్కు మాత్రమే కాదు, కానుక లేదా లంచం అనే అర్థంలో కూడా తెలుగు వారు వాడుతారు అనే చమత్కారాన్ని దృశ్యరూపంగా మలచడం జంధ్యాల మార్క్ హాస్యం.

ఇలా పాటలో వేటూరివారు పదాలతో చమత్కారాలు చేస్తే జంధ్యాల వారు కెమెరాతో చమత్కారాలు జోడించారు.

‘ఉత్తరాన లేవంది’ అనే ఈ గీతాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిన అందమైన అంశం – పాత్రకు తగిన భాష. భావుకత కలిగిన వర్ణనలన్నీ డిటెక్టివ్ గారి అన్వేషణా సామాగ్రిగా మారిపోతాయి. ఇక్కడ జంధ్యాల గారు సృష్టించిన కామెడీ డిటెక్టివ్ పాత్రను వేటూరి గారు తన పాండిత్యంతో ముంచెత్తలేదు; ఆ పాండిత్యాన్ని పాత్ర స్వభావంలో కలిపేశారు. అందుకే ధ్రువనక్షత్రం, మలయపర్వతం, తారక, చుక్కపాప, వెన్నెలమ్మ, జాజిమల్లి, బ్రహ్మచారి వంటి పదాలు వచ్చినా పాట పాండిత్య ప్రదర్శనగా అనిపించదు. అవన్నీ ఒక అమ్మాయి చిరునామా కోసం తిరుగుతున్న డిటెక్టివ్ మనసులో పుట్టిన ఆలోచనల్లా సహజంగా ప్రవహిస్తాయి.

వేటూరి సుందర రామ్మూర్తి గారి గీతరచనలో కనిపించే అసలు ప్రజ్ఞ ఇక్కడే. పాత్రను సృష్టించింది జంధ్యాలగారు; ఆ పాత్రకు తగిన ఆలోచనా భాషను ఇచ్చింది వేటూరిగారు; ఆ భాషకు హావభావాల రూపం ఇచ్చింది చిరంజీవిగారు. ఈ ముగ్గురూ కలిసినప్పుడు పాట ఒకేసారి హాస్య ప్రేమ భావకవిత్వంగా మారింది.

ఇక బాలుడి గాత్రమాధుర్యం గురించి చెప్పనలవి కాదు. అదొక తేనెధార, తెల్లని తెలుగు పంచదార.

ముగింపు:

ఒక డిటెక్టివ్‌కి ‘చిరునామా’ అనేది కేసును ఛేదించే ఆధారం. ఒక ప్రేమికుడికి చిరునామా అనేది ప్రియురాలి సన్నిధికి చేర్చే మార్గం. వేటూరిగారు ఈ రెండింటినీ ఒకటిగా చేశారు. ఉత్తరాన ధ్రువనక్షత్రం నుంచి దక్షిణాన మలయపర్వతం వరకు వెతికిన అతడు, ఆకాశంలోని చుక్కలను అడిగి, గాలిలో జాజిమల్లి సువాసనను వెంబడించి, నిశీధి వీధుల్లో బాటసారిగా తిరిగి, బ్రహ్మచారిగా లక్ష్య సాధన పైన దృష్టి పెట్టి చివరికి తన ప్రేయసి చిరునామా సాధిస్తాడు.

అందుకే ఈ పాటను ఒక అందమైన వాక్యంలో చెప్పాలంటే – ఒక డిటెక్టివ్ తన ప్రేయసి ఇంటిని వెతికిన కథ కాదు; తన ప్రేమకు చిరునామా కనిపెట్టడానికి డిటెక్టివ్ బుద్ధినే సాధనంగా చేసుకున్న ఒక ఆరాధకుడి కవితా అన్వేషణ.

అదే ‘ఉత్తరాన లేవంది ధ్రువనక్షత్రం’ గీతానికి ప్రత్యేకమైన వేటూరివారి ముద్ర.

(‘ఉత్తరాన లేవంది ధ్రువనక్షత్రం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=9oR2J84ivFM)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version