Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-17

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

చంటబ్బాయి (1986):

2. నేను నీకై పుట్టినానని

ఉపోద్ఘాతం:

జంధ్యాల గారి చంటబ్బాయి చిత్రంలోని “నేను నీకై పుట్టినానని” పాట కేవలం ప్రేమను ఆకర్షణగా మాత్రమే పలికించకుండా పరస్పర అంకితభావం, ఆరాధన, ప్రకటించే గీతం.

గతంలో జేమ్స్ పాండ్ అలియాస్ పాండురంగారావు తన ప్రేయసి జ్వాల చిరునామా కోసం డిటెక్టివ్ తెలివితేటలతో ప్రకృతిని ప్రశ్నిస్తూ అన్వేషిస్తాడు. ఆమెను కనుగొని ప్రేమలో పడ్డాక, పార్కులో కలిసిన ఈ ప్రేమికులు తమ వృత్తుల ప్రభావం లేని స్వచ్ఛమైన ప్రణయగీతాన్ని ఆలపిస్తారు. పూర్తి హాస్యరస ప్రధానంగా సాగే చిత్రంలో ఇంతటి గంభీరమైన ప్రణయ సాహిత్యం కలిగిన గీతానికి ఆస్కారం ఇవ్వడం, జంధ్యాల – వేటూరి గార్ల ఉన్నతమైన అభిరుచికి అద్దం పడుతోంది.

వేటూరి గారు ఈ పాటలో ప్రేమను తెలుగు అక్షరాల సౌందర్యంతో, వేదాక్షరాల పవిత్రతతో, గుడి దీపాల వెలుగుతో, ఓంకారంతో అనుసంధానించిన విధానం సినిమా పాట స్థాయిని అమలిన శృంగారకావ్య స్థాయికి పెంచింది అనిపిస్తుంది.

ముఖ్యంగా “శ్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే” అనే పాదాన్ని ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి. ఆ పాదం వేటూరి గారికి తెలుగు భాషపై ఉన్న ప్రేమను, అక్షరాల ఆకృతిలోనూ కవిత్వాన్ని దర్శించగల ఊహాశక్తిని మరోసారి తెలియజేస్తుంది.

చక్రవర్తి గారి సంగీతం, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు, పి. సుశీల గారి గానం ఈ గీతంలోని భావాలకు మాధుర్యాన్ని చేకూర్చాయి.

సాహిత్యం:

పల్లవి:
నేను నీకై పుట్టినానని
నిన్ను పొందక మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే.. ప్రేమ.. ఊపిరే ప్రేమ!

చరణం 1:
ఆమె:
నిన్ను చూడకా నిదురపోనీ.. రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే.. మౌన మంత్రాలు
అతడు:
నిన్ను తాకక నిలవలేని.. పంచ ప్రాణాలూ
కౌగిలింతల గర్భగుడిలో మూగ దీపాలు
ఆమె:
ప్రేమ మహిమ తెలుప తరమా..
అతడు:
ప్రేమే జీవన మధురిమ! ॥నేను నీకై పుట్టినానని॥

చరణం 2:
అతడు:
శ్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఆమె:
‘ఓం’ అనే వేదాక్షరం లా నీవు ఎదురైతే
గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా
అతడు:
ప్రేమ మహిమ తెలుప తరమా..
ఆమె:
ప్రేమే జీవన మధురిమ! ॥నేను నీకై పుట్టినానని॥

~

విశ్లేషణ:

పల్లవి:

“నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని”

తన జన్మకు అర్థం ప్రేయసేనని నాయకుడు ప్రకటిస్తున్నాడు. ఇది ప్రేమలోని సంపూర్ణ అంకితభావాన్ని తెలిజేస్తున్న అతిశయోక్తి. నిజంగా ఒక వ్యక్తి మరొకరి కోసమే పుట్టాడని అక్షరార్థంలో చెప్పడం కాదు; తన జీవితంలో ప్రేయసికి ఉన్న ప్రాధాన్యాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి చెప్పడం. ప్రేమను జీవితలక్ష్యంగా భావించే అంకితభావమిది. పైగా ప్రేయసిని పొందకుండా జీవితం నిష్ఫలమవుతుందనే భావాన్ని నాయకుడు స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాడు.

“పుట్టినానని–మట్టికానని” అనే పదాల చివరి ధ్వనుల్లో అంత్యప్రాస కూడా అర్థవంతమై ఉండటమే కాక శ్రవణమాధుర్యాన్ని కూడా కలిగిస్తోంది.

“మట్టి” అనే పదం జీవితం ముగిసిన తరువాత మట్టిలో కలిసిపోవడాన్ని గసూచించటమే కాదు ప్రేయసిని పొందకపోతే తన ఉనికికే అర్థం లేదని భావోద్వేగంతో చెప్పడం. అతిశయోక్తి అయినా స్వభావోక్తిలా వినిపిస్తుంది.

“చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో”

ప్రేమలోని భావోద్వేగం కన్నీటి చెమ్మగా కళ్ళలో కనిపిస్తోంది. అతడి కళ్ళు అంతరంగంలోని ప్రేమకు బాహ్య రూపాలు. ఆ దృశ్యరూపంలో లక్షణాత్మక వ్యక్తీకరణ ఉంది. ప్రేమలోని సున్నితత్వాన్ని కవి ప్రత్యక్షంగా “నేను నీ ప్రేమలో తలమునకలై భావోద్వేగానికి లోనయ్యాను” అని చెప్పకుండా, కళ్ళలోని చెమ్మ ద్వారా నర్మగర్భంగా తెలియజేయడమే కవిత్వం.

చేయి పట్టడం అనేది ప్రేమలో దగ్గరవడానికే కాకుండా, వివాహానికి, ఒకరి జీవితంలో మరొకరు భాగస్వాములు కావడానికి ప్రతీక. కాబట్టి ఇది ప్రతీకాత్మక ప్రయోగం. “చెమ్మగిల్లే కనులు–చేయి పట్టే మనసు” అనే ని రెండు భౌతికమైన వ్యక్తీకరణల లాగా కనిపించినా ఆత్మానుగతమైన ప్రణయ భావాన్ని వ్యక్తపరిచే ఆరాధనాత్మకమైన అంకితభావాలే.

“చేసుకున్న బాసలో ఊసులే.. ప్రేమ”

“బాస” అంటే మాట ఇచ్చుకోవడం; “ఊసులు” అంటే ప్రేమికుల మధ్య సాగే మధుర సంభాషణలు. ఒకరికి ఒకరు ఇచ్చుకున్న మాటల్లోనూ, ఆ మాటల చుట్టూ అల్లుకున్న సంభాషణల్లోనూ ప్రేమ మాత్రమే ఉందని కవి చెబుతున్నారు.

“బాసలు”, “ఊసులు” అనే పదాల ధ్వనిసామ్యం శ్రవణానందాన్ని కలిగిస్తుంది. ప్రేమను నేరుగా నిర్వచించకుండా, దాని వ్యక్తీకరణలైన ప్రమాణాలు, సంభాషణల ద్వారా చూపించడం భావసూచకమైన పద్ధతి. ప్రతీ ప్రేమ జంట మధ్య ఉండే మధురమైన సహజమైన అభివ్యక్తి ఈ బాసలు ఊసులు.

“ఊపిరే ప్రేమ!”

ప్రేమను ఊపిరితో సమానంగా చూపించే రూపక అలంకారం. జీవనానికి ఊపిరి అవసరo ఎంత ఉందో, ఈ ప్రేమికుల జీవితానికి ప్రేమ అంతే అత్యవసరమని కవి చెబుతున్నారు.

“ప్రేమ ఊపిరిలాంటిది” అని పోలిక చెప్పకుండా, “ఊపిరే ప్రేమ” అని నేరుగా అభేదాన్ని స్థాపించడం రూపకానికి ప్రధాన లక్షణం. ఈ చిన్న పాదంలోనే పాట మొత్తం ప్రతిపాదించే భావం సంక్షిప్తంగా వ్యక్తమవుతుంది.

చరణం 1:

“నిన్ను చూడక నిదురపోనీ.. రెండు నేత్రాలు”

ప్రియుడిని చూడనిదే నిద్రపోలేని కళ్ళుగా తన నేత్రాలను నాయిక వర్ణిస్తోంది. కళ్ళు నిద్రపోవాలా వద్దా అని నిర్ణయించుకునే వ్యక్తుల్లా చూపబడటంలో మానవీకరణ లక్షణం ఉంది. నిజానికి నిద్రలేని కళ్ళ వెనుక ఉన్నది ప్రియుడిని చూడాలనే మనసు. ఆ అంతరంగపు ఆరాటాన్ని కళ్ళకు ఆపాదించి చెప్పడం ఈ పాదంలోని కవితాత్మకత. ఒక్కరోజైనా అతడిని చూడకపోతే దిగులుతో ఆమెకు నిద్రపట్టనoత తీవ్రమైంది ఆమె ప్రేమ.

“కలల హారతి నీకు పట్టే.. మౌన మంత్రాలు”

హారతి సాధారణంగా భక్తితో దేవుడికి సమర్పించే వెలుగు. ఇక్కడ ప్రియుడి గురించి కనే కలలే అతనికి సమర్పించే ఆరాధనాత్మక హారతిగా మారాయి. కలలు నిజంగా హారతి పట్టవు; కానీ కలల ద్వారా ప్రియుడిని ఆరాధించే భావాన్ని కవి దృశ్యరూపంలో చూపి రూపకాత్మక ప్రయోగం చేశారు. ఆమె అతడిని దేవుడిలా ఆరాధిస్తోంది.

“మౌన మంత్రాలు”లో మాటలేని ప్రేమభావాలను మంత్రాలతో పోల్చారు. మంత్రం పవిత్రమైన ధ్వని; మౌనం మాటలేని స్థితి. ఈ రెండింటిని కలపడం ద్వారా పలకని భావాలకూ ఆధ్యాత్మిక శక్తి ఉందని సూచించారు. దక్షిణామూర్తి మౌనంగానే సనక సనందాదులకు వేద ఙ్ఞానం అందించారు. శబ్దలకన్నా లోతైన భావప్రకటన మౌనంలోనే ఇమిడి ఉంటుంది. ప్రేమలో మౌనం ఆత్మలను అనుసంధానం చేస్తుంది.

“మౌన మంత్రాలు” అనే పదబంధం విరుద్ధ స్వభావాలున్న రెండు భావాలను కలిపిన కవితాత్మక ప్రయోగం. ఈ విరోధాభాస పదబంధoలో ప్రధాన సౌందర్యం “ప్రేమను నిశ్శబ్ద ఆరాధనగా” రూపకీకరించడంలో ఉంది.

“నిన్ను తాకక నిలవలేని.. పంచ ప్రాణాలూ” అంటాడు ప్రియుడు.

పంచప్రాణాలు అనేవి జీవశక్తికి సూచకం. ప్రేయసిని స్పృశించాలనే కోరికను తన పంచప్రాణాల కోరికగా అతడు అతిశయోక్తితో వ్యక్తం చేస్తున్నాడు. పైగా “పంచప్రాణాలు” అనడం వల్ల ప్రేమ కేవలం ఒక క్షణికమైన కోరిక కాదని, తన ఉనికిలోని ప్రతి అంశాన్నీ ఆవరించిందని చెప్పకనే చెబుతున్నాడు. ఆమె అతడిని నిత్యం చూడాలి అనుకుంటే అతడు ఆమెని నిత్యం స్పర్శించాలి అనుకుంటాడు…ఒకరికన్నా తీవ్రంగా మరొకరు ప్రేమించుకుంటూ ఉన్నారని మనకి ఈ అభివ్యక్తి ద్వారా అవగతం అవుతుంది.

“కౌగిలింతల గర్భగుడిలో మూగ దీపాలు”

ఈ పాదంలో రూపక వైభవం విశేషంగా కనిపిస్తుంది. ప్రేమికుల కౌగిలిని గర్భగుడిగా, వారి మౌనమైన అనుభూతులను మూగ దీపాలుగా ఊహించారు వేటూరి గారు. గర్భగుడి పవిత్రమైన అంతరాలయం; దీపం ఆరాధనకు సాధనం. ఈ రెండు ఆధ్యాత్మిక ప్రతీకలను ప్రేమికుల కౌగిలికి అన్వయించడం ద్వారా శారీరక సమీపతను శృంగారంగా కాక ఆత్మీయమైన, పవిత్రమైన ఆరాధనాత్మక అనుభూతిగా మలిచారు వేటూరి గారు.

ఇక్కడ “కౌగిలింతలే గర్భగుడి” అని నేరుగా చెప్పడం రూపకం; “మూగ దీపాలు” కూడా మౌనమైన ప్రేమానుభూతులకు రూపకమే. ఒకే పాదంలో రెండు రూపకాలు పరస్పరం సహకరిస్తున్నాయి.

“మూగ” పదం నిశబ్ద స్థితిని, “దీపాలు” కాంతిని సూచిస్తాయి. తమ మధ్య మాటలు కరువైననా తమ కౌగిలి గుడిలో ప్రేమ దీపం వెలుగుతూనే ఉంటుందనే పవిత్రమైన, దైవిక భావం ఈ చిత్రణలో అంతర్లీనంగా ఉంది. ప్రేమని దైవంగా భావిస్తే కలిగే పారవశ్యం ఇది.

“ప్రేమ మహిమ తెలుప తరమా..
ప్రేమే జీవన మధురిమ!”

ప్రేమ గొప్పతనాన్ని పూర్తిగా వివరించడం సాధ్యమేనా? దేవుడి గురించి మాటల్లో చెప్పడం సాధ్యమేనా? ఇది ప్రశ్నార్థక ప్రయోగం ద్వారా భావాన్ని బలపరిచే అలంకారిక ప్రశ్న. సమాధానం కోసం అడిగిన ప్రశ్న కంటే, దైవంలాంటి ప్రేమ మహిమ మాటలకు అందనిదని అనుభూతి అని చెప్పడమే దీని ఉద్దేశం.

ప్రేమను నిర్వచించలేని అనుభూతిగా చూపడం భావాతిశయోక్తికి . ప్రేమను జీవితపు మాధుర్యంగా నేరుగా ప్రతిష్ఠించడం రూపకం. “ప్రేమ జీవన మధురిమ వంటిది” అని చెప్పకుండా, ప్రేమే జీవన మధురిమ అని అభేదాన్ని స్థాపించారు. “ప్రేమ మహిమ తెలుప తరమా” అనే ప్రశ్నకు “ప్రేమే జీవన మధురిమ” అనే పాదం సమాధానంగా నిలుస్తుంది.

చరణం 2:

“శ్రీ అనే తెలుగక్షరం లా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా”

ఈ పాటకే మకుటాయమానమైన పాదం అందించారు వేటూరి గారు. ఆయనకు తెలుగుభాష పైగల అభిమానానికి మరో అద్భుతమైన నిదర్శనం ఈ వాక్య ప్రయోగం.

ప్రేయసిని చంద్రుడితోనో, పువ్వుతోనో పోల్చకుండా, తెలుగక్షరమైన “శ్రీ”తో పోల్చడం ఆయన ఊహాశక్తిలోని వైశిష్ట్యం. ఈ ఉపమాలంకారాన్ని విశ్లేషిస్తే “శ్రీ” అనే అక్షరం శుభం, మంగళం, సంపద, గౌరవాల వంటి ఎన్నో శుభకరమైన భావాలను సూచిస్తుంది. పేరుకి ముందు “శ్రీ” అని చేర్చడం మనకు గౌరవసూచకం; శుభకార్యాల్లోనూ శ్రీ అనే అక్షరానికి విశిష్టమైన స్థానం ఉంది.

నిలిచి ఉన్న ప్రేయసిని “పొన్న చెట్టు నీడలో రాధలా ఉన్నావు” వంటి ప్రయోగాలతో కాకుండా “శ్రీ” అక్షరంతో పోల్చడం కేవలం భాషాభిమానం, ఆమె మంగళకరమైన ఆకృతిని మాత్రమే సూచించటం కాదు; ఆమె రూపంలోని శ్రీకరాన్ని మంగళత్వాన్ని, సౌందర్య నిధిని తెలియజేస్తూ, అతడి జీవితానికి ఆమె ప్రేమ… శ్రీకారం అయింది అన్న భావన కూడా ఉంది.

అంతే కాదు, “శ్రీ” అనే అక్షరంలోని వంపులు, మెలికలు, గీతల అమరికలో ఒక నాట్యభంగిమ ఉంది. ఒక నాట్యకళాకారిణి అందమైన భంగిమలో నిలిచినప్పుడు శరీర వంపుల్లో, చేతుల అమరికలో కనిపించే లావణ్యంలా, “శ్రీ” అక్షర ఆకృతిలోనూ ఒక సుందరమైన చలనం ఉంది. ఆ అక్షరంలాగే ప్రేయసి వయ్యారంగా నిలిచి ఉందని చెప్పడం నవీనమైన ప్రయోగం

ఈ ఉపమానానికి రెండు అంతర్లీనమైన అర్థాలు ఉన్నాయి: ఒకటి అక్షరపు ఆకారసౌందర్యం; మరొకటి “శ్రీ” అనే పదంలోని మంగళార్థం.

మన భాషకు చెందిన ఒక దివ్యమైన అక్షరాన్నే ప్రేయసి అందాన్ని ప్రతిబింబించే కవితా ప్రతీకగా మలచడం వేటూరి గారి ప్రత్యేకమైన ఊహాశక్తి. ఇక్కడ ఉపమాలంకారంతో పాటు, “శ్రీ” అనే పదానికి సంబంధించిన సాంస్కృతిక భావాలూ కలసి పాట యొక్క అర్థాన్ని విస్తరింపజేస్తున్నాయి.

“క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా”

ప్రేయసి “శ్రీ” అక్షరంలా నిలిస్తే, తాను ఆమెకు వెలుగునిచ్చే ప్రమిదనవుతానని నాయకుడు చెబుతున్నాడు.

“వెలుగులా” అనే ఉపమాలంకారo, తనను ప్రమిదగా భావించడంలో రూపకాత్మకత ఉండటం విశేషం.

అతడు ప్రేయసి అందాన్ని మరింత ప్రకాశింపజేసే వెలుగుగా తాను ఉంటాను అనడంలేదు. నీవు శ్రీ అనే సర్వమంగళ రూపిణిగా ఉంటే నేను నీ పాదాల దగ్గర ఆరాధించే మట్టి ప్రమిదనై ఉంటా అంటూ తన ఆ ప్రియుడు, ఆ ఆరాధకుడు తన అంకిత భావాన్ని త్రికరణ శుద్ధిగా తెలియజేస్తున్నాడు.

“శ్రీ” అక్షరం శుభత్వానికి ప్రతీక; ప్రమిద దీపారాధనకు ప్రతీక. ఈ రెండింటిని ఒకే భావచిత్రంలో కలపడం ద్వారా ప్రేయసి మంగళ స్వరూపాన్ని, నాయకుడి ఆరాధనను పరస్పరపూరకంగా చూపించారు. ఇది ప్రేమలోని ఆత్మార్పణ భావాన్ని తెలియజేస్తుంది.

“ఓం అనే వేదాక్షరం లా నీవు ఎదురైతే”

ఇక్కడ ఆమె తన ప్రియుడిని “ఓం” అనే ప్రణవాక్షర ఉపమావాచకంతో పోలుస్తుంది. “ఓం” అనేది ఆధ్యాత్మికతలో మహోన్నతమైన, పవిత్రమైన ప్రణవ నాదం. ప్రియుడిని ఓం అనే అక్షరంతో పోల్చడం ద్వారా, తన దృష్టిలో అతను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో ఆమె వ్యక్తం చేస్తుంది.

“శ్రీ”కారంతో ప్రేయసినీ, “ఓం”కారంతో ప్రియుడినీ పోల్చబడటం గమనించదగిన అంశం. ఒకటి మంగళత్వాన్ని, మరొకటి ఆధ్యాత్మిక పరిపూర్ణతను సూచించే పవిత్రాక్షరం. ఈ రెండు అక్షరాల ద్వారా ప్రేమికులు పరస్పరం ఒకరినొకరు అలౌకికంగా ఆరాధించే స్థాయికి చేరుకున్నారని కవి సూచిస్తున్నారు. వారే పరవశించి శివ పార్వతులై అర్ధనారీశ్వర అనుభూతిని పొందుతున్నారు.

“గానమై నిన్నాలపించే.. ప్రణవమై ఉంటా”

అంటూ ప్రియుడిని ప్రణవాక్షరంతో పోల్చిన ప్రేయసి, తాను గానమై ఓంకార నాదమై అతన్ని ఆలపిస్తానంటుంది. తన ప్రేమను మాటలకన్నా ఉన్నతంగా సంగీతంగా, మంత్రధ్వనిగా సమర్పించాలనే అంకితభావం వ్యక్తమవుతుంది.

“శ్రీ” అనే అక్షరానికి నాయకుడు ప్రమిదగా ఉంటానంటే, “ఓం” అనే ప్రణవానికి నాయకురాలు గానమవుతానంటుంది. ఈ రెండు పాదాల్లో పరస్పరపూరకమైన భావనిర్మాణం ఉంది. ఒకరితో ఒకరు ఒకరిలో ఒకరు ఇమిడిపోయిన అద్వైత స్థితి అది.

“ప్రేమ మహిమ తెలుప తరమా.. ప్రేమే జీవన మధురిమ”

ఇంత చెప్పినా ఇంకా చెప్పేందుకు చాలా మిగిలిపోయింది. ప్రేమను గురించీ దైవాన్ని గురించీ మాటల్లో పూర్తిగా నిర్వచించలేరు ఎవ్వరూనూ. ప్రేమ అనేది జీవితాన్ని మధురంగా మార్చే ఒక అనుభూతి అని గుర్తించగడంలోనే ఇమిడి ఉంది ప్రేమ సారం అంతా అనే భావాన్ని పలికిస్తున్నాయి ఈ పంక్తులు.

ముగింపు:

“నేను నీకై పుట్టినానని” పాటలోని అమలిన శృంగార భావ కవిత్వం, అలాగే వేటూరి గారు ప్రయోగించిన అలంకారాలు కేవలం పదాల అలంకరణగా నిలవవు; అవి ప్రేమికుల అంతరంగాన్ని అలౌకిక స్థాయికి పరిణితి చెందిన ప్రేమను, భావగర్భితంగా వ్యక్తం చేసే సాధనాలుగా మారాయి.

“ఊపిరే ప్రేమ”, “ప్రేమే జీవన మధురిమ” వంటి రూపకాలు ప్రేమను జీవితానికి సమానంగా నిలబెడతాయి.

“కలల హారతి”, “మౌన మంత్రాలు”, “కౌగిలింతల గర్భగుడిలో మూగ దీపాలు” అనే రూపకాలు ప్రేమలోని ఆరాధనాభావాన్ని వ్యక్తం చేస్తాయి.

“శ్రీ” కారం “ఓం” కారం అనే పవిత్ర అక్షరాలతో ప్రేమికులను పరస్పరం పోల్చడం ఉపమాలంకారానికి తెలుగు భాషా సౌందర్యాన్ని ప్రతీకగా నిలబడమేకాక ఆధ్యాత్మిక భావాలతో అనుసంధానిoచి ప్రేమ, ఆరాధనల స్థాయిని పెంచారు వేటూరి గారు.

జంధ్యాల గారు సృష్టించిన పాండు రంగారావు జ్వాల పాత్రలు ప్రేమలో పడిన తరువాత వారి వృత్తుల ప్రభావం లేకుండా, పరస్పర ప్రేమను మాత్రమే పరవశంతో , అంకితభావంతో ఆలపించే గీతంగా ఇది నిలుస్తుంది.

వేటూరి గారు ప్రేమను అక్షరంగా, వెలుగుగా, గానంగా, ఊపిరిగా మలిచారు. చక్రవర్తి గారి సంగీతం, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు, పి. సుశీల గారి గానం ఈ భావాలకు పరమ మాధుర్యాన్ని జోడించాయి. ప్రేమను భాషా సౌందర్యంతో, ఆధ్యాత్మిక ప్రతీకలతో, కవితా అలంకారాలతో మేళవించిన ఈ పాట వేటూరి గారి సృజనాత్మకతకు ఉన్నత స్థాయి ఉదాహరణగా శాశ్వతంగా నిలిచిపోతుంది.

(‘నేను నీకై పుట్టినానని’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=3AiTxv2FdqA)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version