Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-18

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

రెండు రెళ్ళు ఆరు (1985)

1. కాస్తందుకో

సాహిత్యం:

పల్లవి:
అతడు:
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ ‘ధర’ కాస్తందుకో
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో
ఆమె:
ఆ ఆ ఆ
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి దస్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో

చరణం 1:
అతడు:
చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు (2)
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా?
ఆమె:
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు (2)
వరదల్లె పొంగునా కడలింట చేరునా?
అతడు:
శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే
ఆమె:
కాస్తందుకో.. దరఖాస్తందుకో..
భామ ధరఖాస్తందుకో

చరణం 2 :
ఆమె:
చలిగాలి దరఖాస్తు తొలి యీడు వినకుంటే (2)
చెలి జంట చేరునా చెలిమల్లే మారునా?
అతడు:
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు (2)
ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
ఆమె:
దరి చేరి కూడా దరఖాస్తులేలా?
అతడు:
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ దరఖాస్తందుకో
ఆమె:
దగ్గర చేరి దస్తతు చేసి.. ప్రేయసి కౌగిలి అందుకో
అతడు:
కాస్తందుకో.. దరఖాస్తందుకో ప్రేమ ‘ధర’ కాస్తందుకో

~

ఉపోద్ఘాతం:

ప్రేమను వ్యక్తం చేయడానికి పూలగుత్తులు ఇవ్వొచ్చు, ప్రేమలేఖలు రాయొచ్చు, మనసులోని మాటను సిగ్గుపడుతూ కూడా చెప్పొచ్చు. కానీ వేటూరి గారి చిలిపి కలం, ప్రేమను దరఖాస్తుగా మార్చేసి, దాన్ని ఆమోదించడానికి ముద్దులను లంచంగా ఇవ్వజూపితే? ఆ దరఖాస్తును ఆమోదించాల్సిన ప్రేయసి కూడా తప్పించుకుంటూ, మధ్యలో ఇంకొకరి చిత్రపటాన్ని చూసి మురిసిపోతున్నట్టు నటిస్తే? ప్రేమలోని ఈ చిలిపి తగాదాలకు మాటలు కూర్చాలంటే వేటూరి గారి కలమే కావాలి!

‘రెండు రెళ్ళు ఆరు’ చిత్రంలోని ఈ పాటలో వేటూరి గారు ప్రేమను గంభీరమైన భావోద్వేగంగా కాకుండా, ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే సరదా వాదనగా మలిచారు. ఇందులో నాయకుడు తన ప్రేయసిని ఉడికించటానికి బొమ్మని సృష్టించి దానికి తన ప్రేమ దరఖాస్తును ఇస్తుంటే, నాయిక కూడా అతన్ని ఆటపట్టిస్తూ మరో చిత్రపటాన్ని చూసి పాట పాడుతుంది. వీళ్ళ మధ్య మాటల చమత్కారాలకు వేటూరి గారు ఎంచుకున్న ఆయుధం ఒక్కటే – దరఖాస్తు!

దరఖాస్తు, ధర, ముద్ర, సంతకం, ఆమోదం, లంచం వంటి వ్యవహారిక పదాలకు ప్రేమను జతచేస్తూ, వాటి సాధారణ అర్థాలను తలకిందులు చేసి నవ్వులు పూయించారు. ప్రకృతిలోని గాలి, మబ్బు, వాన, సెలయేరు, నెలవంక కూడా ఈ ప్రేమ వ్యవహారంలో. దరఖాస్తుకు పెట్టుకున్నాయి. పైకి చూస్తే ఇది చిలిపి ప్రేమగీతం. లోతుగా ఆస్వాదిస్తే ప్రతి పంక్తిలోనూ పదాల గారడీ, భావాల అల్లరి, శృంగారపు సున్నితమైన చిలిపితనం కనిపిస్తాయి.

విశ్లేషణ:

“కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ ‘ధర’ కాస్తందుకో”

ప్రేమలో పడ్డవాడు ప్రేయసిని ఎలా ఒప్పించాలి? ప్రేమిస్తున్నానని చెప్పి చూస్తాడు. ఆమె స్పందించకపోతే బతిమాలుతాడు, బహుమతులు ఇస్తాడు. అయినా పని జరగకపోతే? మన నాయకుడు మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రేమనే దరఖాస్తుగా మార్చేశాడు! ప్రియుడి పోస్ట్ కోసం ఆమెకు దరఖాస్తు పెట్టుకున్నాడు.

ప్రేమ ‘ధర’ కాస్తందుకో – అంటే ప్రేమ ముద్దును పుచ్చుకోమని నాయకుడు అడుగుతున్నాడు.

“దరఖాస్తు” అనే పదానికి జతగా “ధర – కాస్త” పదాలను తీసుకురావడం వల్ల పదఛ్ఛేద ధ్వని సౌందర్యం పుట్టడమే కాదు ఆ దరఖాస్తు పదమే ఈ పాటకు అసలైన మకుటం కూడా అయ్యింది.

“ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో”

దరఖాస్తు పెట్టిన తరువాత దానిపై ఆమోద ముద్ర పడాలి. అప్పుడు పని ముందుకు కదులుతుంది. మరి ప్రేమ దరఖాస్తుపై ఏ ముద్ర వేయాలి? సిరాతో వేసే ముద్ర కాదు, ముద్దులతో వేసే ముద్ర!

“ముద్దరవేసి” అనే ప్రయోగంలోనే వేటూరి గారి చిలిపితనం దాగి ఉంది. “ముద్ర” అనే పదానికి “ముద్దు”ని జతచేసి, ఒకే పదంలో రెండూ ధ్వనించేలా “ముద్దర” అనడం గొప్ప సమయస్ఫూర్తి. ప్రేమను కూడా ఒక ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియగా ఆయన చిలిపిగా మార్చేశారు.

పైగా ముద్దు ఇక్కడ కేవలం ఆప్యాయతకు గుర్తు కాదు; ప్రేమ దరఖాస్తు ఆమోదం పొందిందని తెలిపే ముద్ర కూడా! ఇది రూపకాలంకార చమత్కారం.

అయితే నాయకుడి అంతిమ లక్ష్యం ముద్ర వేయించుకోవడం మాత్రమే కాదు. “ప్రేయసి కౌగిలి అందుకో”వడం కూడా! దరఖాస్తు నుంచి ముద్రకు, ముద్ర నుంచి కౌగిలికి – ప్రేమికుడి ఆలోచనలు ఎంత వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయో ! ప్రేయసి ఇంకా అంగీకారం తెలపకముందే, ఇతగాడు మాత్రం చివరి ఫలితాన్ని కూడా నిర్ణయించేసుకున్నాడు!

ఆమె “కాస్తందుకో.. దరఖాస్తందుకో.. భామ ధరఖాస్తందుకో” అంటుంది.

ఇంతవరకు నాయకుడు బొమ్మతో తన ప్రేమ దరఖాస్తును ఆమోదించమని అడుగుతుంటే, ఇప్పుడు నాయిక అదే మాటలను అందిపుచ్చుకుని అతడిని ఆటపట్టిస్తోంది. “ప్రేమ దరఖాస్తు” అన్న అతడి మాటను “భామ దరఖాస్తు”గా మార్చి, అతడి ప్రేమపూర్వక ప్రయత్నాన్నే వెక్కిరింతతో తిరిగి అతడికి వినిపిస్తుంది. తొలుత అతడు ఆమెను ముద్దు అడగగానే అలిగినట్టు నటించింది అందుకే అతడు మాయాజాలoతో ఒక బొమ్మను సృష్టించి ప్రేయసిగా భావించి, ప్రేమ దరఖాస్తు పెట్టాడు.

ఇప్పుడు ఆమె తన చిలిపితనాన్ని కొనసాగిస్తుంది. అతడిని ఉడికించటానికి ఆనాటి యువతను ఉర్రూతలు ఊపిన నటుడు, మోడల్ కబీర్ బేడీ హోర్డింగ్ వద్దకు వెళ్ళి అతడికి ప్రేమ దరఖాస్తు పెట్టుకుంటుంది. పైగా అతడిని ఆటోగ్రాఫ్ చేసి కౌగిలి ఇమ్మని “దగ్గర చేరి దస్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో” అంటుంది కావాలని నాయకుడిని ఉడికించటానికి.

ఇక్కడ హాస్యం కేవలం పదాల మార్పులోనే లేదు; నాయకుడు మొదలుపెట్టిన ఆటలో నాయిక కూడా సమానంగా పాల్గొని, అతడినే ఆటపట్టించడం వల్ల ఆ సన్నివేశం మరింత సరదాగా మారుతుంది.

“దగ్గర చేరి దస్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో” అనటం మహా కొంటెతనం. ఆమె దరఖాస్తు పెట్టడమే కాదు, “దస్తతు చేసి” అంటోంది. అంటే దరఖాస్తు మీద ఆమోద ముద్ర తెలిపే సంతకమే కాదు ఆ అందగాడి ఆటోగ్రాప్ కూడా అడుగుతోంది. “దస్తతు” అంటే దస్ఖత్‌కి రూపాంతరం, అదే మన తెలుగు సంతకం.

చరణం1:

“చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా?”

ఇవాళ నాయకుడు ప్రియుడి పోస్ట్ కోసం దరఖాస్తు పెట్టడం చరిత్రలో ఏమీ మొదటిసారి కాదు, గమనిస్తే ప్రకృతి కూడా ప్రేమ దరఖాస్తులు ఎన్నో పెడుతూ ఉంటుంది అంటున్నారు కవిగారు.

చిరుగాలి దరఖాస్తు పెట్టకపోతే నల్లనిమబ్బు ఎలా సిగ్గుతో మెరుపు నవ్వులు మెరిపిస్తుంది? ఎలా ప్రేమ చినుకులు వర్షిస్తుంది? ఇది ప్రకృతిలో ఉన్నదే తప్ప కొత్తదేమీ కాదు అంటున్నాడు నాయకుడు.

చిరుగాలి మెల్లగా వీచడం, అవి తగిలిన నల్లనిమబ్బులు వర్షించటం మనకు తెలిసిన ప్రకృతి దృశ్యాలు. కానీ వాటి మధ్య ప్రేమబంధాన్ని చూపి ఆ ప్రేమకు అనుమతి కోరే దరఖాస్తుతో ముడిపెట్టగానే ఆ దృశ్యం హాస్యశృంగారంగా మారిపోయింది.

చల్లనిగాలి వర్షించటానికి సిద్ధంగా ఉన్న మబ్బును చేరినట్టే, ఆ ప్రేమికుడు కూడా ప్రేమించటానికి సిద్ధంగా ఉన్న ప్రేయసిని చేరాలనే కోరికను ఈ సూచన ప్రతిబింబిస్తుంది.

“జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
వరదల్లె పొంగునా కడలింట చేరునా?” అంటుంది ఆమె.

ఇక్కడ ప్రకృతి కార్యాలయంలో మరో దరఖాస్తు చేరింది!

జడివాన కురవకపోతే సెలయేరు ఎలా ఏర్పడుతుంది? జడివానకు సెలయేరు మీద అంత ప్రేమ ఉంటే ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలన్నమాట. ఇది కవి గారి సరదా ఊహ.

జడివాన ప్రేమ దరఖాస్తు పెట్టుకుంటేనే కదా సెలయేరు ప్రేమతో వరదలా పొంగి సముద్రo అనే అత్తారింటికి చేరుతుంది.

ఈ పంక్తిని ప్రేమకు అన్వయిస్తే, మనసులో మొదలైన చిన్న స్పందన అదుపులేని ప్రవాహంలా మారి అతడి కౌగిలిని చేరుతుందన్న అన్వయం కుదురుతుంది. ప్రకృతి బింబం ద్వారా భావోద్వేగాన్ని విస్తరించడం వేటూరి గారి కవిత్వంలోని సొగసు.

“శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే” అంటాడు అతడు.

ఇంతవరకు గాలి, మబ్బు, వానల దరఖాస్తులు చూశాం. ఇప్పుడు నాయకుడు తన ప్రేమ దరఖాస్తుకు ఆమోదం కూడా ప్రకటించేస్తున్నాడు! తన దరఖాస్తు అందుకుని ఆమె “శుభమస్తు” అంటే చాలు ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. సూటిగా చెప్పకపోయినా నర్మగర్భంగా చెప్పినా చాలు అని అతడి ఉద్దేశం.

చరణం 2:

“చలిగాలి దరఖాస్తు తొలి యీడు వినకుంటే
చెలి జంట చేరునా చెలిమల్లే మారునా?”

చలిగాలి పెట్టుకున్న ప్రేమ దరఖాస్తు, ఆ చలిగాలి తాకితే కలిగే అనుభూతినీ గ్రహిస్తే యౌవనంలో మొదలయ్యే ప్రేమకు శ్రీకారం చుట్టినట్టే. మరి చలిగాలి దరఖాస్తును సమీక్షించకపోతే ఎలా?

ప్రేమికులు దగ్గరైతేనే చెలిమి పెరుగుతుంది. కానీ ఆ దగ్గరితనం ఎలా మొదలవుతుంది? ఒకరి స్పందనకు మరొకరు ప్రతిస్పందించినప్పుడే!

ఇంత సేపూ సూటిగా విషయం చెప్పకుండా ప్రకృతి దరఖాస్తుల గురించి చెప్పిన కవి, ఇప్పుడు నెమ్మదిగా అసలు విషయానికి వచ్చి ప్రేమికులు ఒకరికొకరు దగ్గరవటం గురించి ప్రస్తావించారు.

ఆమె “చలిగాలి దరఖాస్తు తొలి యీడు వినకుంటే
చెలి జంట చేరునా చెలిమల్లే మారునా?”  అంటుంది.

 “నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు
ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?”  అంటున్నాడు.

ఈ పాట మొత్తానికి కలికితురాయి వంటి అత్యంత చిలిపి పంక్తి ఇది! వేటూరి గారు ఆకాశాన్ని ప్రేయసి చెక్కిళ్ళుగా భావిస్తూ చెక్కిళ్ళపై ప్రియుడి గోటి ముద్రలను నెలవంకగా పిలుస్తున్నారు. అద్భుతమైన కావ్యాలంకార స్థాయి ఇది.

నెలవంక అంటే ఇక్కడ కేవలం ఆకాశంలో కనిపించే చంద్రవంక కాదు; ప్రేమలోని సాన్నిహిత్యానికి గుర్తుగా ఆమె చెక్కిళ్ళపై అతడు వేసిన అర్ధచంద్రాకారపు గోటి గుర్తు కూడా! ఈ శ్లేష ఈ పాటకే వెన్నెలద్దింది.

వర్ణనలు విప్పి చెప్పకుండా, ఆకారసామ్యం ద్వారా శృంగారాన్ని చిలిపిగా పండించడం వేటూరి గారి గారడీ.

ఒకవైపు ఆకాశంలోని చంద్రవంక అమ్మాయి చెక్కిళ్ళకు దరఖాస్తు పెట్టడం అన్న అసాధ్యమైన ఊహ నవ్విస్తుంది. మరోవైపు చెక్కిళ్ళపై నెలవంక ఆకారపు గోటి గుర్తుల ప్రస్తావన ప్రేమికుల శృంగార సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. హాస్యం, శృంగారం రెండూ ఒకే పదబంధంలో కలిసిపోవడం వేటూరికే సాధ్యం.

చెక్కిళ్ళు ఎరుపెక్కడం అంటే సిగ్గుతోనో, ప్రేమలోని ఉద్వేగంతోనో ఎర్రబడటం. కానీ వేటూరి గారు అక్కడితో ఆగకుండా “ఎన్నెల్లు పండునా?” అని అడుగుతున్నారు. సాధారణంగా పంటలు పండుతాయి. ఇక్కడ ప్రేమలో శృంగారంలో గోటి గిచ్చుళ్ళ నెలవంకలతో, వెన్నెలే జీవితమై హాయిగా పండుతుందన్న ఊహ అత్యంత గొప్ప భావుకత.

“దరి చేరి కూడా దరఖాస్తులేలా?”

ఇది వేటూరి గారి గారడీలో మరో వెన్నెల ముత్యం. ఇంత సేపూ దరఖాస్తు పెట్టాలని, దానికి ముద్ర వేయాలని, సంతకం చేయాలని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తించినట్టున్నాడు.

ప్రేయసి తనకు దగ్గరగానే ఉన్నప్పుడు ఇంకా దరఖాస్తులెందుకు? సముఖాన రాయబారం ఎందుకు? దగ్గరితనం ఏర్పడిన తరువాత కూడా ప్రేమకు అనుమతి ఎందుకు?

ఈ పాటను మరింత ఆస్వాదించడానికి దాని చిత్రీకరణను కూడా గుర్తుచేసుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర మాయాజాల విన్యాసాలతో నాయికను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆమెను ముద్దు పెట్టుకోబోతే తోసేస్తుంది. నాయకుడు వెంటనే ఒక బొమ్మను తయారుచేసి, దానికే ప్రేమ ప్రతిపాదన చేస్తున్నట్లుగా, ముద్దుల ముద్రలు వేస్తున్నట్టుగా పాట పాడటం మొదలుపెడతాడు.

నాయిక ఏమన్నా తక్కువ తిన్నదా? అప్పటి నటుడు, మోడల్ అయిన కబీర్ బేడీ హోర్డింగ్ దగ్గరకు వెళ్లి ఆయనకు ముద్దివ్వబోతున్నట్లుగా నటిస్తుంది. నాయకుడు తన ప్రేమ దరఖాస్తుకు ముద్దు ముద్ర వేయించుకోవాలని చూస్తుంటే, నాయిక మాత్రం మరో వ్యక్తి చిత్రపటాన్ని చూపిస్తూ నాయకుడిని ఆటపట్టిస్తుంది. ఇక్కడ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన కోపం కాదు; ఒకరినొకరు ఆటపట్టించుకునే ప్రేమికుల సరదా.

చివరికి బొమ్మను పక్కనపెట్టి ఇద్దరూ ఆలింగనం చేసుకోవడంతో కథ కంచికి వెళ్ళి కళ్యాణ మండపం దాకా కూడా వెళ్ళాలని కోరుకుంటుంది.

నాయకుడు కోరుకున్న ప్రేమ దరఖాస్తుకు చివరికి ఆమోదముద్ర పడినట్టే!

ముగింపు:

ప్రేమను దరఖాస్తుగా, ముద్దును ముద్రగా, సాన్నిహిత్యాన్ని సంతకంగా, నెలవంకను ప్రియుడి గోటి ముద్రలుగా చూపించి వేటూరి గారు ఒక చిలిపి ప్రేమగీతాన్ని చమత్కారాల గీతంగా మలిచారు.

“ప్రేమ ధర కాస్తందుకో” అనే విన్నపం నుంచి, “దరి చేరి కూడా దరఖాస్తులేలా?” అనే చమత్కారం వరకు ప్రతి ప్రయోగం ప్రేమికుల మధ్య నడిచే అల్లరిని మరింత రుచికరంగా మారుస్తుంది.

ప్రకృతిలోని చిరుగాలి, కరిమబ్బు, జడివాన, సెలయేరు, నెలవంకలను కూడా ఈ ప్రేమ వ్యవహారంలో భాగం చేయడం వల్ల పాటకు దృశ్యాత్మకత వచ్చింది. ఉపమానం, రూపక, మానవీకరణ, శ్లేష వంటి కవితా లక్షణాలు పాట స్థాయిని పెంచాయి.

రాజన్-నాగేంద్ర గారి సంగీతం, ఎస్. జానకి గారు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి గానం ఈ గీతంలోని చిలిపి భావాలకు మరింత ఆకర్షణను జోడించాయి. వేటూరి గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రేమను చెప్పడానికి కొత్త పదాలు అలవోకగా అద్దడమే కాదు; అందరికీ తెలిసిన సాధారణ పదాలకే కొత్త అర్థాలు ఇచ్చి నవ్వించగలగడం. ఈ పాటలో దరఖాస్తు ఒక కాగితం కాదు, ప్రేమికుడి మనసు. దానికి కావలసిన ఆమోద ముద్ర ఇంకేదో కాదు – ప్రేయసి ముద్దు, ఆమె కౌగిలి!

ప్రేమలోని ఈ అల్లరిని అంతే వినోదభరితంగా దృశ్యీకరించిన జంధ్యాల గారి ప్రతిభ చిరస్మరణీయం.

(‘కాస్తందుకో.. దరఖాస్తందుకో’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=ZOmh7OGNyow)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version