Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-19

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

ఆలాపన (1986)

ఆవేశమంతా ఆలాపనేలే

ఉపోద్ఘాతం:

తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన కథనశైలితో, విలక్షణమైన దృశ్యకల్పనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వంశీ. ఈయనను చిత్ర పరిశ్రమలో అందరూ పెద్ద వంశీ అంటారు. ‘శంకరాభరణం’ చిత్రానికీ, ‘సీతాకోకచిలక’ చిత్రానికి సాంకేతిక విభాగంలో పనిచేసి, 1982లో ‘మంచు పల్లకి’ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన వంశీ, ఇప్పటివరకు ఇరవై ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో అధికశాతం చిత్రాలు విజయవంతమై ప్రేక్షకుల ఆదరణను పొందాయి. జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందుకున్న ‘సితార’ తరువాత భానుప్రియతో ఆయన రూపొందించిన ‘అన్వేషణ’ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాల పరంపరలో 1986లో వచ్చిన ‘ఆలాపన’ ఒక ప్రత్యేకమైన ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది.

‘ఆలాపన’ చిత్రంలో నాయకుడు మోహన్ సంగీత ప్రియుడు. అతని మనసులో ఎప్పుడూ ఏదో ఒక రాగం కదలాడుతూనే ఉంటుంది. అతడు కూనిరాగాలను ఆలపిస్తాడు కానీ పాటపాడడు. అలాంటి మోహన్, నాట్యకారిణి అయిన భానుప్రియను చూసినప్పుడు అతనిలోని భావాలు కొత్త స్పందన పొందుతాయి. అప్పటివరకు మనసులోనే సాగిన ఆలాపన, గీతమై ఉబికివస్తుంది. ఆ భావోద్వేగం నుంచి పుట్టిన పాటల్లో ఒక పాట ‘ఆవేశమంతా ఆలాపనేలే’ అనే వేటూరి గీతం.

ఈ సినిమాను, ఈ పాటను అందమైన కొండలు, జలపాతాలు, వనాలు, ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా దృశ్యీకరించారు వంశీ గారు.

ఇళయరాజా సంగీతం, వేటూరి గారి సాహిత్యం, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి గానం, భానుప్రియ గారి నాట్యాభినయం, వంశీ గారి దర్శకత్వం – ఇవన్నీ కలిసి ఈ గీతం ఒక మధురమైన దృశ్యశ్రవణ అనుభూతిగా రూపుదిద్దుకుంది.

వేటూరి గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన పాటల్లో పైకి కనిపించే అర్థంతోనే ఆగిపోలేం. ఒక్కో పదం వెనుక మరో భావం, ఒక్కో వాక్యం వెనుక సాహిత్య సూచన, ఒక్కో పదబంధంలో శ్లేష దాగి ఉంటాయి. ఈ గీతంలోనూ ప్రకృతి వర్ణనతో పాటు సంగీతం, నాట్యం, ప్రణయం, ప్రబంధం కూడా కనిపిస్తాయి.

~

పల్లవి:
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే
ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా..
ఆవేశమంతా ఆలాపనేలే

చరణం 1:
అలపైటలేసే సెలపాట విన్నా
గిరివీణ మీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
జతుల గతుల నాట్యం
అర విరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళమధువులడిగె గానం
నిదురలేచె నాలో హృదయమే.. ॥ఆవేశమంతా॥

చరణం 2:
వనకన్యలాడె తొలిమాసమన్నా
గోధూళితెరలో మలిసంధ్యకన్నా
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం
పురి విడిన నెమలిపింఛం
ఎదను కదిపి నాలో
విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా ॥ఆవేశమంతా॥

~

విశ్లేషణ:

పల్లవి:
“ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో” –

మనసులో ప్రేమ భావం మొదలైతే అది మాటల రూపంలో కన్నా పాటగా ఉబికి రావడానికే ఎక్కువ మక్కువ చూపుతుంది. అందులోనూ ప్రియుడు భావకుడు అయితే చెప్పేదేముంది. అతడి ఆలోచనలు రాగాలవుతాయి, చెప్పాలనుకున్న మాటలన్నీ స్వరాలై గొంతులో కదలాడతాయి. ఇక్కడ నాయకుడి పరిస్థితీ అదే.

ఇన్నాళ్ళూ తనలోనే దాచుకున్న భావావేశం, నాయికను చూడగానే ఆలాపనగా మారింది. ఆవేశం అంటే ఉద్రేకం కాదు అది ఇక్కడ భావావేశం, ప్రేమావేశం. ఆ ఆవేశంలో అతడి గుండె కొట్టుకునే ప్రతి స్పందనా ఇప్పుడు ఒక స్వరంలా వినిపిస్తోంది.

“ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా”

ఆమె రాక అతడి జీవితంలో ఒక కొత్త ఉదయంలా మారింది. ఇంతకాలం ఊహల్లోనే రూపుదిద్దుకున్న సౌందర్యం ఇప్పుడు కళ్ళముందు నిలిచింది. ఆ క్షణం అతడి మనసులోని చీకట్లన్నీ తొలగిపోయి, కొత్త వెలుగు పుట్టినట్లయింది. అందుకే ఆవేశం ఉదయంగా, ఉదయం ఆలాపనగా మారింది.

ఆమె ఉదయిని అయి అతడి జీవితంలోకి రావడంవల్ల అతడి ప్రపంచo ఎంతగా మారిపోగలదో ఈ ఒక్క పాదం చెబుతుంది.

“నాలో జ్వలించే వర్ణాల రచన”

ఆమెను చూసిన క్షణం అతడి మనసులో ఎన్నో ఉదయపు రంగులు వెలిగాయి. ఇక్కడ వేటూరి గారు వర్ణం అంటే కేవలం రంగుగా చెప్పలేదు , సంగీతంలో పలికే గీతాలు, వర్ణాలు అతడిలో ఉదయకాంతిలా జ్వలించే వర్ణాన్ని సంతరించుకుని ఉత్తేజాన్ని ఇస్తున్నాయి అని శ్లేషార్థంలో చెబుతున్నారు.

“నాలో జనించే స్వరాలా..”

ఇప్పటివరకు రంగులుగా కనిపించిన వర్ణాల భావాలే ఇప్పుడు స్వరాలుగా వినిపిస్తున్నాయి. ఒకే ప్రేమానుభూతిని చిత్రకళలోని వర్ణాలుగానూ, సంగీతంలోని స్వరాలుగానూ చూడటం ఎంత అందమైన ఊహ!

ప్రేమ అతడి మనసులో ఉదయపు రంగులను అద్దుతుంటే, అదే మనసు సంగీతకారుడిలా వర్ణాలను , స్వరాలను పలుకుతోంది. ప్రేమ మనిషిలోని కళాకారుడిని ఎలా మేల్కొలుపుతుందో, ఎలా ఉత్తేజపరుస్తుందో ఈ పల్లవి మనకు వినిపిస్తుంది.

చరణం 1:
“అలపైటలేసే సెలపాట విన్నా”

ప్రేమలో పడిన మనసుకు ప్రకృతిలో కనిపించేదంతా ప్రేయసి సౌందర్యానికి ప్రతిబింబమే. ఉప్పొంగే అలలు కదులుతుంటే వాటిలో పైటల సోయగం కనిపిస్తోంది. సెలయేరు గలగలమంటూ ప్రవహిస్తుంటే అది ఏదో మధురమైన పాట పాడుతున్నట్లుగా వినిపిస్తోంది. అలల కదలికకు స్త్రీ సౌందర్య సూచన అయిన “పైట”ను జోడించడం, సెలయేటి ప్రవాహాన్ని “సెలపాట”గా వినిపించడం – పదాల అమరికలోనే ఒక అందమైన దృశ్యాన్ని, ఒక మధురమైన శబ్దాన్ని సృష్టించిన వేటూరి గారి చమత్కారం ఇది.

చుట్టూ ఉన్న అందమైన పచ్చని ప్రకృతి , కొండలు, లోయలు, జలపాతాలు, ప్రకృతి అతడికి కేవలం దృశ్యం కాదు; ప్రేయసిని గుర్తుచేసే సంగీతం.

“గిరివీణమీటే జలపాతమన్నా”

ఇక్కడికి వచ్చేసరికి కవి కల్పన మరో స్థాయికి చేరుతుంది. కొండల మీద నుంచి జాలువారే జలపాతం చేసే గలగల ధ్వని, కొండ అనే వీణను ఎవరో మీటుతున్నట్లుగా వినిపిస్తోంది. గిరులే వీణగా, జలపాతమే ఆ వీణ నుంచి వెలువడే నాదంగా రూపకాలంకరంగా మారిపోయాయి.

అయితే ఈ పాదంలో మరో సాహిత్య సూచన కూడా కనిపిస్తుంది. భట్టుమూర్తి విరచిత *వసుచరిత్ర*లో, పూర్తిగా ప్రకృతి వర్ణన, సంగీత వర్ణన నిండి ఉంటాయి. నాయకుడు ఉపరిచర వసువు అనే మహారాజు కాగా నాయిక గిరిక. ఈ ప్రకృతి వర్ణన చూస్తే వారి ప్రణయ ఘట్టం గుర్తుకు వస్తుంది. ఆ కొండకోనల జలపాతాల నేపథ్యంలో గిరిక వీణ మీటుతూ గానం చేస్తుండగా చూసిన ఉపరిచర వసువు ఆమెను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ ప్రణయ ప్రబంధ స్ఫురణ – “గిరివీణమీటే జలపాతమన్నా” అనే ఈ ప్రకృతి వర్ణనలో అంతర్లీనంగా మేళవించినట్లుగా అనిపిస్తుంది.

“నాలోన సాగే ఆలాపన – రాగాలు తీసే ఆలోచన” –

బయట ప్రకృతి తన సంగీతాన్ని వినిపిస్తుంటే, లోపల అతడి మనసు తనదైన ఆలాపనలో మునిగిపోయింది. అలల శబ్దాలు, జలపాతాల నాదాలు, ప్రేయసి నాట్యంలోని కదలికలు—అన్నీ అతడి ఆలోచనలకు కొత్త రాగాలను అందిస్తున్నాయి. ఆమెను చూస్తున్న కొద్దీ అతడి మనసులో కొత్త స్వరాలు పుడుతున్నాయి. ఇక్కడ ప్రేమికుడి ఆలోచనలే సంగీత సృజనకు మూలమవుతున్నాయి.

“జతుల గతుల నాట్యం – అర విరుల మరుల కావ్యం” –

ఆమె నాట్యం చేస్తున్నప్పుడు తాళానికి అనుగుణంగా పలికే తకిట తకిట ఝo ఝo అనే జతులు, ఆమె అడుగుల్లో కనిపించే లయాత్మక గతులు అతడిని మరో లోకంలోకి తీసుకువెళ్తున్నాయి.

ఆ అడుగుల లయలో అతడికి ఒక కావ్యం కనిపిస్తోంది. “అర విరుల మరుల కావ్యం” అంటూ పూల సౌందర్యాన్నీ, ప్రేమలోని తన్మయత్వాన్నీ ఒకే పదబంధంలో కలిపారు. “విరులు”, “మరులు” అనే పదాల ధ్వని సామీప్యం కూడా ఈ పాదానికి శ్రవణ మాధుర్యాన్ని ఇస్తుంది.

ఆమె నాట్యం అతడికి కేవలం కదలిక కాదు; విరిసిన పూలతో అల్లిన ప్రణయకావ్యం!

“ఎగసి ఎగసి నాలో – గళమధువులడిగె గానం”

ఇంతవరకు మనసులోనే సాగిన ఆలాపన ఇప్పుడు ఉప్పొంగుతోంది. “ఎగసి ఎగసి” అనే పునరుక్తి అతడి భావోద్వేగం క్రమంగా పెరుగుతున్న తీరును వినిపిస్తుంది. ఇన్నాళ్ళూ “గుండె గొంతుకతో కోట్లాడి”నట్లు ఉంది, అందుకే తనలో దాగిన మధురమైన గానo బయటకు పలకలేదు .

ఇప్పుడు గొంతే అడుగుతోంది “గళమధువు” ఒలికించమని.

గళమధువు అనే పదబంధం ఎంత మధురమైనది!

“నిదురలేచె నాలో హృదయమే” –

ఇంతకాలం నిద్రాణంగా ఉన్న హృదయం ఇప్పుడు మేల్కొంది. ఆమె నాట్యం అతడిలోని భావాలను కదిలించింది; ఆ భావాలు ఆలాపనగా మారాయి; ఆ ఆలాపన గానమై బయటకు రావాలని తపిస్తోంది. ప్రేమలో ఒక చూపు ఎంతటి నిశ్శబ్ద హృదయాన్నైనా మేల్కొలపగలదనే భావాన్ని వేటూరి గారు ఎంత సున్నితంగా చెప్పారు! పల్లవిలో మొదలైన ఆవేశం ఇప్పుడు హృదయ మేల్కొలుపుగా పరిణమించింది.

చరణం 2:
“వనకన్యలాడె తొలిమాసమన్నా – గోధూళితెరలో మలిసంధ్యకన్నా”

వసంతం వచ్చిందంటే వనమంతా కొత్త చిగుళ్ళతో, విరిసిన పూలతో కళకళలాడుతుంది. చిరుగాలులకు ఊగే ఆ ప్రకృతి సౌందర్యాన్నే వనకన్య నాట్యంగా ఊహించారు వేటూరి గారు.

కానీ, ఆ అందాన్ని ఆస్వాదించేలోగానే సాయంసంధ్య వచ్చేస్తుంది. చిరు చీకట్లు అలముకుంటాయి, గోవులు ఇంటికి తిరిగివచ్చే వేళ వాటి గిట్టల వల్ల లేచే ధూళి ఆకాశంలో తెరలా పరుచుకుంటుంది. అదే గోధూళి వేళ. ఆ ధూళి తెర వెనుక మలిసంధ్య తన రంగులను పరిచి, ప్రకృతి అందాన్ని కప్పేసినట్టు, విరిసిన ప్రేమను ఆస్వాదించేలోగా ఆ మధురమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించకుండానే కరిగిపోతాయేమో అనే ఆవేదన.

“అందాలు కరిగే ఆవేదన – నాదాల గుడిలో ఆరాధన”

వసంతంలో విరబూసిన ప్రకృతి అందాలను ఆస్వాదించేలోగానే మలిసంధ్య చీకట్లు వాటిని కరిగించేస్తాయి.

అలాగే ప్రేమలోని మధురక్షణాలు కూడా ఆస్వాదించేలోగానే కాలగమనంలో కరిగిపోతాయేమో! ఎన్ని వందల ఏళ్ళు గడిచినా ప్రేమను పూర్తిగా ఆస్వాదించాలనే తపన తీరదు కదా! అన్న ఆలోచన ఆ మధురక్షణాలు కరిగిపోతాయనే తీయని ఆవేదనే అతడి మనసును కదిలిస్తోంది.

ఆ ఆవేదనే ఆలాపనగా మారి గానమవుతోంది. “నాదాల గుడిలో ఆరాధన” అంటూ సంగీతాన్నే దేవాలయంగా, తన గానాన్నే ఆ దేవాలయంలో జరిగే ఆరాధనగా వేటూరి గారు అద్భుతంగా అభివర్ణించారు. ప్రేమలోని ఆవేదన కూడా సంగీతమై పూజగా మారిపోవడం ఎంత అందమైన భావన!

“చిలిపి చినుకు చందం – పురి విడిన నెమలిపింఛం”

చినుకు దూకడంలో ఉండే యవ్వన వేగం , చిలిపితనం ఆమె నాట్యంలో ఉన్నాయి.

“చిలిపి”, “చినుకు” పదాల్లోని “చి” ధ్వని పునరావృతం అనుప్రాసను అందిస్తూ చినుకుల చప్పుడును గుర్తుచేస్తుంది.

వెంటనే “పురి విడిన నెమలిపింఛం” అంటూ వనజల్లుల వేళ పురివిప్పిన నెమలిపింఛంలోని రంగుల విస్తృతిని కళ్ళముందు నిలుపుతారు. అందంగా విడిన ఆ పురి, ఆ రంగుల విస్తృతి నాట్యకారిణి నాట్యంలోని లాస్యాన్ని గుర్తుచేస్తాయి. ప్రకృతిలోని చినుకు, నెమలిపింఛం – రెండూ ఆమె నాట్యంలోని వేగానికీ, శోభకి ప్రతిబింబాలుగా మారాయి.

“ఎదను కదిపి నాలో – విరిపొదలు వెతికె మోహం”–

ఆమె నాట్యం అతడి హృదయాన్ని కదిలించింది. ఆ కదలిక క్రమంగా మోహంగా మారి, విరిసిన పూలపొదల కోసం వెతికేలా శృంగార భావాలను ప్రేరేపిస్తున్నాయి.

ఇక్కడ వెతుకుతున్నది అతడు కాదు – అతడిలో చిగురించిన మోహం! మోహానికి మనిషిలా వెతికే స్వభావాన్ని ఆపాదించడం ద్వారా సజీవీకరణ ఛాయను తీసుకొచ్చారు వేటూరి సుందర రామ్మూర్తి గారు.

పూలు, పరిమళం, ప్రేమ – ఈ మూడింటినీ ఒకే దృశ్యంలో కలిపి శృంగారభావాన్ని వేటూరిగారు ఎంతో సుమాసుకుమారంగా పలికించారు.

“బదులులేని ఏదో పిలుపులా” –

ఇంతకాలం తనలోనే మౌనంగా సాగిన ఆలాపన ఇప్పుడు ప్రేయసి ఎదుట గానమై పలకుతోంది, కానీ ఆమె నుంచి ఆ పిలుపుకు తగిన స్పందన రావడంలేదు, వస్తుందనే నిశ్చయమేమీ లేదు.

ఎదురుగా ఆమె ఉన్నా మనసులోని భావాన్ని చేరవేయలేని ఆ నిస్సహాయత, తన ప్రేమకు బదులు దొరకదేమోననే సందిగ్ధత అతడిని ఆవరిస్తున్నాయి. అందుకే ఆ పిలుపు బదులులేని పిలుపులా మిగిలిపోతోంది.

ప్రేమలోని ఆకాంక్ష, ఎదురుచూపు, చెప్పలేని ఆవేదన – అన్నీ ఈ ఒక్క పాదంలో ఒదిగిపోయాయి. కొన్ని భావాలను పూర్తిగా చెప్పకుండా, “ఏదో పిలుపులా” అని అస్పష్టంగా వదిలేయడంలోనే కవి చేసిన చమత్కారం దాగి ఉంటుంది.

ముగింపు:

ఈ గీతాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ఇది కేవలం ఒక ప్రియుడి ప్రణయావేశ గీతం మాత్రమే కాదని అర్థమవుతుంది. ప్రకృతిలోని అలల కదలికలు అతడికి పైటల సోయగాన్ని గుర్తుచేస్తాయి; జలపాతాల గలగలలు వీణానాదాలవుతాయి; వసంతపు వనాలు వనకన్యలై నాట్యం చేస్తాయి; గోధూళి సంధ్య అందాలను కరిగిస్తూ ఆవేదనల చీకట్లను అలుకుతుంది. ప్రేయసి నాట్యం అతడి మనసులో రాగాలను పుట్టిస్తుంది. ఆ రాగాలు గళం దాటి గానమై ప్రవహిస్తాయి, చివరకు బదులులేని ప్రేమపిలుపుగా మిగులుతాయి.

సాహిత్యాన్ని దృశ్యీకరించే మనసుకి ఇదొక అందమైన పెయింటింగ్.

ఇళయరాజా గారి స్వరాలు ఆ భావాలకు ప్రాణం పోస్తే, బాలసుబ్రహ్మణ్యం గళం వాటికి మాధుర్యాన్ని అద్దింది. భానుప్రియ నాట్యం ఆ సంగీతానికి దృశ్యరూపమైంది. వంశీ దృశ్యకల్పన ఆ అనుభూతిని మన కళ్ళముందు నిలిపింది. వీటన్నింటికీ వేటూరి గారి అక్షరాలు ఒక అందమైన ప్రేమలేఖగా నిలిచాయి.

వేటూరి గారు పదాల్లో నిర్మించిన ప్రకృతి, సంగీత, నాట్య భావచిత్రాలకు ఇళయరాజ గారి స్వరరచన తగిన వాతావరణాన్ని కల్పించడం వల్ల ఈ పాట పుట్టి నలభై ఏళ్ళయినా ఇంకా పచ్చగా ఉంది, నిరంతరం పచ్చగా పరిఢవిల్లుతుంది.

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి గానం ఈ పాటలోని భావాల సున్నితత్వాన్ని, ఉత్సాహాన్ని, మాధుర్యాన్ని సమన్వయపరుస్తుంది. భానుప్రియ గారి నాట్యాభినయం ఈ గీతంలోని లయ, జతులు, ప్రకృతి వర్ణనలకు కళ్ళు తిప్పుకోలేని దృశ్యరూపాన్ని అందిస్తుంది.

వెరసి వంశీ గారి దర్శకత్వంలో సంగీతం, సాహిత్యం, నాట్యం ఒకదానికొకటి అనుబంధంగా నిలిచి పాటను మరపురాని అనుభూతిగా మలిచాయి.

(‘ఆవేశమంతా ఆలాపనేలే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Rs9O1BxTswk)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version