Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-2

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

ముద్ద మందారం:

2. ముద్దుకే ముద్దొచ్చే మందారం

ఉపోద్ఘాతం:

తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో దర్శకులు జంధ్యాల, సంగీత దర్శకులు రమేశ్ నాయుడు, కవికులాలంకార శ్రీవేటూరి సుందరరామమూర్తి, SP బాలసుబ్రహ్మణ్యం గార్ల కలయిక ఒక సువర్ణ అధ్యాయం. 1981 లో విడుదల అయిన ‘ముద్దమందారం’ చిత్రంలోని ఈ శీర్షికా గీతం కేవలం నాయిక సౌందర్య వర్ణన మాత్రమే కాదు, ప్రకృతిని నాయికతో ముడిపెడుతూ సాగిన ఒక దృశ్య కావ్య సంకీర్తనం. జంధ్యాల గారు సినిమా సందర్భం చెప్పి, “మీ అభిరుచి మేరకు సందర్భానికి తగ్గ గీతం అందించండి” అని వేటూరి వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారు. అందుకే వారి కలయికలో వచ్చిన గీతాలన్నీ ప్రత్యేకమైన తెలుగుదనంతో అలరారేవి.

‘ముద్దమందారం’ చిత్రంలో ఈ గీతం వచ్చే సందర్భం.. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న మొగ్గలాంటి ఒక చదువురాని పువ్వులమ్ముకునే పిల్ల కోమలత్వాన్ని, ఆమెలోని అమాయకపు రూపాన్ని చూసి ప్రేమించిన యువకుడు పాడుకునే పాట ఇది. అమాయకమైన తెలుగింటి ఆడపిల్లను దృష్టిలో ఉంచుకుని వేటూరి గారు అల్లిన ఈ పదహారణాల తెలుగు పడుచు వర్ణన ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయే ఒక పూతేనియ జల్లుగా తీపి జ్ఞాపకాలను పంచుతూనే ఉంటుంది.

~

గీత సాహిత్యం- విశ్లేషణ:

పల్లవి:
మందారం.. ముద్దుమందారం
మందారం.. ముద్దమందారం
ముద్దుకే ముద్దొచ్చే.. మువ్వకే నవ్వొచ్చే
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం


ముద్దమందారం ముగ్ధ శృంగారం
ముద్దమందారం ముగ్ధ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్ధ శృంగారం

చరణం 1:

అడుగులా అష్టపదులా.. నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా.. నడకలా జీవనదులా
పరువాల పరవళ్లు.. పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు
కన్నెపిల్లా కాదు.. కలల కాణాచి
కలువ కన్నులా.. కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం

చరణం 2:

పలుకులా రా చిలకలా.. అలకలా ప్రేమ మొలకలా?
పలుకులా రా చిలకలా.. అలకలా ప్రేమ మొలకలా?
మలి సంజె వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్లు
మల్లెపువ్వా కాదు.. మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్ధ శృంగారం
ముద్దమందారం ముగ్ధ శృంగారం
//ముద్దుకే ముద్దొచ్చే మందారం//

విశ్లేషణ:

పాట ప్రారంభమే ఒక లలితమైన భావనతో మొదలవుతుంది. మందార పువ్వు సహజంగానే ఎంతో మృదువుగా ఉండి, ఎఱ్ఱని రంగుతో ఆకర్షిస్తూ నిండుగా కనిపిస్తుంది. ఇక్కడ నాయికను ‘ముద్దమందారం’ అనడంలో ఆమె అమాయకత్వం, సౌకుమార్యం, నిండుదనం కనిపిస్తాయి. సినిమాకి ‘ముద్దమందారం’ అనే పేరు పెట్టడంలో జంధ్యాల గారి ఉద్దేశం కూడా అదే. అమ్మాయి ముద్దమందారంలా, ముగ్ధ మనోహరంగా, మన అచ్చ తెలుగు పెరటిలోని పూల మొక్కలా, అమాయకంగా ఉన్న భావన కలగాలనేదే ఆయన ఉద్దేశం.

ఇక పాటలోకి వస్తే పూలు అమ్ముకునే ఆ చదువురాని అమాయకపు 16 ఏళ్ల పిల్ల ఎంత అందంగా ఉందంటే, లోకంలో అందాలన్నింటికీ ప్రాతిపదిక అయిన ‘ముద్దు’ అనే అపురూపమైన భావనకే ఆమెను చూస్తే ముద్దొచ్చేలా ఉందట.

అందుకే “ముద్దుకే ముద్దొచ్చే మందారం” అన్నారు.

‘మువ్వల్లే నవ్వింది సింగారం’ అనడంలో వేటూరి గారు శబ్దానికి, సౌందర్యానికి మధ్య ఒక అద్భుతమైన లయను కుదిర్చారు. ఆమె రూపం, కట్టుబొట్టు, ఆమె అలంకరణ – అందం అన్నీ కూడా కాలిమువ్వలు ఘల్లు ఘల్లుమంటూ ఉరకలు వేసినట్టు అల్లరిగా, ఉత్సాహంగా నవ్వుతూ తుళ్ళిపడుతున్నాయి. ఇది ఇప్పుడిప్పుడే ఉరికి వస్తున్న ఆమె యవ్వనానికి నిలువెత్తు ప్రతీక.

‘ముగ్ధ శృంగారం’ – ముగ్ధ శృంగారం అనే ప్రయోగంలో వేటూరి గారి శైలి శిఖరాగ్రానికి చేరింది. పువ్వులమ్ముకునే ఆ పిల్లకు లోకజ్ఞానం గానీ, కపటత్వం గానీ తెలియదు. ఎటువంటి కల్మషం లేని, ఆ ఉరకలెత్తే యవ్వనపు లేతదనంతో కూడిన పవిత్రమైన అందాన్నే కవి ‘ముగ్ధ శృంగారం’ అని ఎంతో హుందాతనంతో కీర్తించారు.

చరణం 1:

“అడుగులా అష్టపదులా నడకలా జీవ నదులా” అంటూ అలతి అలతి పదాలతో ఉపమాలంకారాన్ని వాడి, ఈ పాటకు ఇంపైన అందాన్ని ఇనుమడింపజేశారు వేటూరి వారు.

ఆ పూలమ్మి సుకుమారంగా నెమ్మదిగా , మువ్వల సవ్వడి చేస్తూ నడిచే దారుల్లో, వేసే ప్రతి అడుగులో జయదేవుని ‘అష్టపదులు’ లయాత్మకంగా, సంగీత భరితంగా ధ్వనిస్తున్నాయిట. చదువే రాని పిల్లకి అష్టపదులు ఏమి తెలుసు..?! ఆమెకి తెలియదు, ఆ ప్రకృతే ఆమెకు ఇచ్చిన దైవికమైన సౌందర్యం అది. అతడు చదువుకున్నాడు కనుక భావుకత ఉన్నవాడు కనుక ఆమె అడుగులను కూడా కవితాత్మకంగా చదివాడు. అందుకే అడుగులా అష్టపదులా అన్న ఆనందాశ్చర్యాలు కలిగాయి.

‘నడకలా జీవ నదులా?’ – ఆమె గలగల నడక ఎప్పటికీ వట్టిపోని ఒక ‘జీవనది’ లాగా నిరంతర ఉత్సాహంతో, చైతన్యంతో ప్రవహిస్తోందని తలపోస్తున్నాడు. కుదురుగా నిలకడగా ఉండే వయసా అది?

‘పరువాల పరవళ్లు.. పరికిణీ కుచ్చిళ్లూ’ – అన్నప్పుడు, మొగ్గలాంటి ఆ పిల్లలో ఇప్పుడిప్పుడే ఉరకలు వేస్తూ పొంగిపొర్లే యవ్వనపు వేగాన్ని ప్రతిబింబిస్తూనే, ఆ వేగాన్ని పద్ధతిగా అదుపు చేస్తున్నట్లున్న ఆమె పరికిణి కుచ్చిళ్ళు నాయిక యొక్క సాంప్రదాయబద్ధమైన హుందాతనాన్ని సూచిస్తాయి. అది కదా 16 అణాల తెలుగు పిల్ల లక్షణం.

‘విరి వాలు జడ కుచ్చుల సందళ్లు’ – పూల అమ్ముకునే పిల్లకి పూలకు ఏమి కొదవ? రోజు పూవులను వాలు జడలో తురుముకోగలదు. ఆమె పూలు పెట్టుకోవడమే కాదు, ఆమె అల్లుకున్న పొడవైన నల్లని వాలుజడ అటు ఇటు కదులుతూ, జడ చివరన ఉన్న కుచ్చులు ఒకదానికొకటి తగులుతూ చేసే అల్లరిని ‘విరి వాలుజడ కుచ్చుల సందళ్లు’ అని కవి ఎంతో చమత్కారంగా చిత్రించారు. ఆమె వయసే కాదు ఆమె జడగంటలు కూడా అల్లరివే. వాలు జడ, జడకుచ్చులు, జడగంటలు అన్నీ తెలుగువారికి నిన్నటి సరంజామా అయిపోవడo ఎంత శోచనీయం.

‘కన్నెపిల్లా కాదు.. కలల కాణాచి’ – అంటూ పొగిడే ఈ రూపకాలంకారం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరిస్తుంది. ఆమె కేవలం ఒక మామూలు కన్నె పిల్ల కాదు. అనంతమైన ఊహలకు, సుందర స్వప్నాలకు నిలయం అని, ఆమెని చూసినప్పటి నుండి అతడికి కలలు వెల్లువెత్తుతున్నాయి అని అర్థం. అందుకే ఆమె కలలకు ఆలవాలం అని అతడు వర్ణిస్తున్నాడు.

‘కలువ కన్నులా? కలల దోబూచి’ – అలాంటి నాయిక కళ్లు కలువ రేకుల్లా విచ్చుకుని నల్లగా, అందంగా ఉంటూనే, ఆ కళ్లల్లో నిరంతరం ఏవో కొత్త కలలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ‘కలువ కన్నులా.. కలల దోబూచి’ అనే పంక్తి ద్వారా మనసుకు హత్తుకునేలా చెప్పారు . పువ్వుల అమ్ముకునే పిల్లని ఎన్ని పువ్వులతో వర్ణించారో వేటూరి గారు.

చరణం 2:

‘పలుకులా.. రా చిలకలా..
అలకలా.. ప్రేమ మొలకలా?’

ఏదో చదువు రాని పిల్ల కదా గయ్యాళి మాటలు, కాకి కూతలు లేవు. ఆమె అమ్మే పూలకి మల్లేనే ఆమె మాట తీరు, ఆమె మనసు సున్నితం. అందుకే ఆ కొమ్మ మాటలు రాచిలక సన్నని స్వరం పలికే ముద్దు పలుకుల్లా ఎంతో కమ్మగా, వినసొంపుగా ఉన్నాయి.

పైగా ఆమె అప్పుడప్పుడు చూపే చిన్నపాటి కోపాలు అలకలు వారి మధ్య దూరాన్ని పెంచేవి కావు, ఆ అలకలే వారి ప్రేమను మరింతగా చిగురింపజేసే మొలకల వంటివి.

అందుకే “పలుకులా రాచిలకలా – అలకలా ప్రేమ మొలకలా?” అంటూ వృత్త్యానుప్రాస వాడి పాటకి చక్కని నడకను ఇచ్చారు వేటూరి గారు.

‘మలి సంజె వెలుగుల్లో నారింజ రంగుల్లో కురిసేటి పగడాల వడగళ్లు’ అనే పంక్తులలో ఎంతటి ఉత్ప్రేక్ష? ఇక్కడ కవి ఒక అపురూపమైన దృశ్య అలంకారాన్ని సృష్టించారు. ఇది మహాద్భుతమైన భావన.

సూర్యుడు అస్తమించే సాయంత్రపు వేళ ఆకాశమంతా నారింజ రంగును పులుముకున్నప్పుడు, ఆ వెచ్చని కాంతిలో ఆకాశం నుండి కురిసే వడగళ్లు తెల్లగా కాకుండా ఎర్రటి పగడాల్లా మెరుస్తున్నాయట; నాయిక ముఖంలోని సిగ్గు ఆ సంధ్య వెలుగుల్లా ఉంటే, ఆమె చిరునవ్వు ఆ పగడపు వడగళ్ల మెరుపులా ఉంది అనడం ఎంత గొప్ప పోలిక. ప్రకృతి సౌందర్యాన్ని ఆమెలో అణువణువునా చూస్తున్నాడు ప్రేమలో పడి భావుకుడు అయిన నాయకుడు.

చివరగా, ‘మల్లెపువ్వా కాదు.. మరుల మారాణి’ అంటూ పూలు అమ్ముకునే ఆమె.. మల్లెపూల కంటే ఎంతో సుకుమారి అని, చూసేవారి మనసులో మరులను రేకెత్తించి, వారి హృదయాలపై ఏకచ్ఛత్రాధిపత్యం సాధించే ఒక మహారాణి అని శృంగార రసాన్ని పలికించారు.

‘బంతిపువ్వా పసుపు తాను పారాణి’ – బంతిపువ్వుకు ఉండే నిండైన పసుపు రంగును నాయిక శరీర ఛాయతో.. పోల్చారు. ఆ అపురూపమైన పసుపు వర్ణమే ఆమెకు విడిగా అవసరం లేని ఒక సహజ సిద్ధమైన శుభప్రదమైన అలంకారంగా, పారాణిగా మారి శోభిస్తోందని చెప్పడం ద్వారా, ఆ పిల్లకు బాహ్య అలంకారాలు అవసరం లేదని, ఆమె రూపమే ఒక అలంకారమని కవి ఈ గీతాన్ని పరిపూర్ణం చేశారు.

ముగింపు:

వేటూరి గారి కలం నుండి జాలువారిన ఈ ‘ముద్దమందారం’ పాట తెలుగు సినీ సాహిత్యంలో ఒక మైలురాయి. లౌకికమైన శృంగార వర్ణనను కూడా ఎక్కడా శ్రుతి మించకుండా, అమాయకత్వపు లేతదనంతో ముడిపెడుతూ, అత్యంత పవిత్రమైన కావ్య రసంగా మార్చడం ఒక్క వేటూరి గారికే చెల్లింది. ప్రతి పదంలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా, చదువుతుంటే మనసులోనే ఒక లయాత్మకమైన సంగీతం వినిపించేలా సాగే ఈ పాట తరాలు మారినా తరిగిపోని ఒక మధుర సౌందర్య నిధి. పాట అంతటా మందారం-సింగారం-శృంగారం, కుచ్చిళ్లూ-సందళ్లు, కాణాచి-దోబూచి, మారాణి-పారాణి అంటూ తేలికైన, అందమైన పదాలతో అంత్యానుప్రాస నడిపారు. ఇది రమేశ్ నాయుడు గారి సంగీతానికి, బాలు గారి గాత్రానికి లయాత్మకమైన నడకను ఒనగూర్చింది.

అన్నిటికన్నా ముఖ్యంగా మనం మరచిపోతున్న అసలైన తెలుగుదనం, అసలైన తెలుగు ఆడపిల్ల సౌందర్యం, ఆపాదమస్తకం అసలైన ముగ్ధమనోహర రూపం కళ్ళకు కట్టేలా వర్ణించిన ఈ గీతం ఒక సంపూర్ణమైన అమలిన శృంగార భావ గీతం మాత్రమే కాదు, విన్నప్పుడల్లా మనసుపై వీచే లేత పిల్ల తెమ్మెర నృత్యం.

(‘ముద్దమందారం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=rDfaSwJVfWQ)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version