[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]
అన్వేషణ (1985)
- దర్శకత్వం: వంశీ
- సంగీతం: ఇళయరాజా
- రచన: వేటూరి సుందర రామ్మూర్తి
- గానం:ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
కీరవాణి.. కీరవాణి..
ఉపోద్ఘాతం:
ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలకన్నా తీయగా పలికేది సంగీతం. ఒక్క చల్లని చూపు, ఒక మెత్తని చిరునవ్వు వీటికి తోడుగా ఒక అమృతగీతం చాలు ప్రేమ ప్రఫుల్లమవడానికి. మనసులోని భావాలను మాటలకన్నా మధురంగా పలికించగలిగేది శక్తి సంగీతానికి ఉంది కదా. అలాంటి సంగీతాన్నే ప్రేమకు వారధిగా చేసుకున్న అపురూపమైన గీతం అన్వేషణ చిత్రంలోని ‘కీరవాణి’ గీతం.
వంశీగారి దర్శకత్వంలో 1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో ఒక థ్రిల్లర్ సినిమా. అడవిలో వరుసగా జరుగుతున్న హత్యల చుట్టూ ఆ కథ సాగుతుంది. కార్తీక్ పోషించిన ‘మురళి’ పాత్ర ఒక రహస్య పోలీసు అధికారి పాత్ర. భానుప్రియ పోషించిన హేమ పాత్ర పక్షుల కిలకిలారావాలకు, సంగీతానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధించే, Ornithologist పాత్ర.
హేమకు కీరవాణి రాగమంటే ఎంతో ఇష్టం. ఆ సంగతి తెలుసుకున్న మురళి, ఆమె మనసులోకి ప్రవేశించి, హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తన అసలు గుర్తింపును దాచిపెట్టి, సంగీతాభిమానిగా పరిచయం చేసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఆమె ఇష్టపడే కీరవాణి రాగాన్ని నేర్చుకుని, ఆ రాగంతోనే ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఈ నేపథ్యంలో వచ్చే పాటను కేవలం ప్రేమగీతంగా మాత్రమే చూడలేం. ఇందులో మురళి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడా, లేక తన పరిశోధనలో భాగంగా హేమను ఆకర్షిస్తున్నాడా అన్నది కథాపరమైన ఆసక్తి. కానీ పాటలోని భావప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, ఆ ప్రశ్న జ్ఞాపకం రాదు. అక్కడ మిగిలేది ఒక రాగం, రెండు మనసులు, వాటి మధ్య నెమ్మదిగా చిగురించే అనురాగం.
వేటూరి గారు ఈ గీతంలో కీరవాణి రాగాన్ని ఒక సంగీత స్వరూపంగానే కాకుండా, ప్రేమకు ప్రతీకగా కూడా మలిచారు.
~
సాహిత్యం:
పల్లవి:
అతడు:
కీరవాణి.. కీరవాణి..
చిలకలకొలికిరో పాడవేమే!
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు
విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి ॥కీరవాణి॥
చరణం 1:
అతడు:
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
ఆమె:
నీ గగనాలలో, నే చిరుతారనై
నీ అధరాలలో, నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే
కీరవాణి.. కీరవాణి..
చిలకలా కలకలా పాడలేదు.. వలపులే తెలుపగా
ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ
కీరవాణి.. కీరవాణి..
చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
చరణం 2:
అతడు:
నీ కన్నుల నీలమై.. నీ నవ్వుల వెన్నెలై
సంపెంగల గాలినై తారాడనా నీడనై
ఆమె:
నీ కవనాలలో నే తొలిప్రాసనై
నీ జవనాలలో జాజులవాసనై
యదలో యదలే కదిలే
పడుచుల మనసుల
పంజర శుకముల పలుకులు తెలియకనే
కీరవాణి.. కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
అతడు:
విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.. కీరవాణి..
చిలకల కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
విశ్లేషణ:
“కీరవాణి.. కీరవాణి..
చిలకలకొలికిరో పాడవేమే!
వలపులే తెలుపగా”
కీరవాణి అనేది ఒక రాగం పేరు. అంతే కాదు చిలకపలుకుల్లా పలికే స్త్రీ అని అర్థం కూడా ఉంది.
చిలకలకొలికిరో అంటూ ఆమెను సంబోధిస్తూనే చిలక పలుకుల్లా మధురమైన ప్రేమ పాటను కీరవాణి రాగంలో పాడమని అతడు అడుగుతున్నాడు. మాటల్లో చెప్పలేని ప్రేమను పాటలో చెప్పమని అతని ఆహ్వానం.
సంగీతం తెలిసినవాడికి స్వరాలు భావాలను మోసుకెళ్ళే సాధనాలు. కానీ ప్రేమ తెలిసినవాడికి మనసే ఒక సంగీత వాద్యం. ఈ రెండింటినీ కలిపిన అందమైన పిలుపు ఇది.
“విరబూసిన ఆశలు.. విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన.. ఋతువుల తడిసిన మధురసవాణి”
– పూలు విరబూసే వసంతకాలంలా ప్రేమ కూడా మనసులో విరబూసి, తేనెలు చల్లుతున్నాయి.
అలరులు కురిసిన – పూల వర్షం కురిసి తడిసిన ఋతువుల మాధుర్యాన్ని ఆమె స్వరంలో వినాలన్నది అతడి అభిలాష.
ఈ పల్లవిలో వేటూరి గారి ‘మధురసవాణి’ అనే పదబంధం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మధురసం అంటే తేనె, మనసులో ప్రేమ పూలు వికసించగా, గొంతులో తేనెల వాణి పలికించమని ఆ ప్రియుడి విన్నపం.
ప్రేమను ప్రచోదనం చేసే ప్రకృతిలోని పూలు, తేనెల తీపి, ఋతువుల అందం, అన్నీ కలసివచ్చిన వేళ ఆమె అందమైన కీరవాణి రాగంలో ప్రేమను తెలుపుతూ ఆలపించాలని రసజ్ఞతగల ప్రియుడు పిలుపునిస్తున్నాడు.
మొదటి చరణంలో అతడు అంటాడు
“ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా” – అంటూ అతడు ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. పూలలాగా సుకుమారoగా అందంగా, లేత పూల పరిమళంగా, తన జీవితం అనే తోటలోకి తొలి వసంతంగా మారి తన దారిలో నడిచి రమ్మంటాడు.
ఇక్కడ “నా తోటలో చైత్రమై” అన్న ప్రయోగం ఎంతో హృద్యమైనది. తోటకు పూలు జీవాన్ని ఇస్తాయి; చైత్రమాసం కొత్త చిగురులకు, కొత్త ఆశలకు సంకేతం. తన జీవితంలోకి ఆమె ప్రేమను తీసుకువస్తే అది ఒక కొత్త వసంతం అవుతుందని మురళి చెబుతున్నాడు.
దీనికి హేమ ఇచ్చే సమాధానంగా
“నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై”
అనే రెండు పంక్తుల్లోనే ఆమె మనసులోని అనురాగం వ్యక్తమవుతుంది. అతని ఆకాశం అంత హృదయంలో ఒక చిన్న నక్షత్రంగా ఉండాలనుకుంటోంది. అతని పెదవులపై చిరునవ్వుగా కలకాలం అతడి ఆనందంలో నిలవాలనుకుంటోంది. మురళి ఆమెను తన తోటలో చైత్రంగా ఊహిస్తే, హేమ అతని ఆకాశంలో తారగా, అతని పెదవుల్లో నవ్వుగా తనను తాను ఊహించుకుంటోంది.
అతడు ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆమె అతని జీవితంలో ఒక అందమైన భాగమైపోవాలని కోరుకుంటోంది. ప్రేమలోని పరస్పర భావన ఈ రెండు పంక్తుల్లో ఎంతో సహజంగా పలికింది.
అయితే హేమకు సంగీతంలో శిక్షణ లేదు. ఆమెకు కీరవాణి రాగం అంటే ఇష్టం ఉండవచ్చు; కానీ ఆ రాగంలోని స్వరగతులు, గమకాలు, లయవిన్యాసాలు తెలిసిన గాయని కాదు. అందుకే ఆమె తన ఆశక్తతను ఇలా వ్యక్తం చేస్తుంది:
“స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే”
సలలిత= అందమైన
కలరుతు= చక్కని ధ్వని
స్వరనుత= స్వరాలతో స్తుతింపబడిన
గతియుత గమకము= గమకాల నడక
తెలియకనే= తెలియదు.
ఒక రాగాన్ని అందంగా ఆలపించాలంటే స్వరజ్ఞానం మాత్రమే సరిపోదు; దానికి తగిన లయ, గమకాల పరిజ్ఞానం కూడా అవసరం. హేమకు ఆ సంగీత పరిభాష తెలియదు, శృతిలయ గమకాల నడక తెలియదు.
అందుకే ఆమె మాటల్లో ఒక సున్నితమైన సంకోచం కనిపిస్తుంది. మురళి తన కోసం కీరవాణిలో పాడుతుంటే, తాను మాత్రం అతనిలా పాడలేనని, స్వరాలు గమకాలు తెలియవని చెబుతోంది.
కానీ ఆ సంకోచం వెనుక ప్రేమను దాచలేకపోతోంది.
“కీరవాణి.. కీరవాణి..
చిలకలా కలకలా పాడలేదు.. వలపులే తెలుపగా”
అంటూ తన ప్రేమని చెప్పకనే చెబుతోంది. ఆమె చెప్పే మాటల్లో అమాయకత్వం ఉంది. చిలకలా కలకలమంటూ, అతడు అడిగే కీరవాణి రాగంలో పాడే నేర్పులేదని అంగీకరిస్తోంది. ఇక్కడే పాటలోని అసలు మాధుర్యం ఉంది. అతడు సంగీతం ద్వారా ప్రేమను పలికిస్తే, ఆమె ప్రేమ ద్వారా సంగీతాన్ని అనుభూతి చెందుతోంది.
“ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ”
అనే పంక్తుల్లో హేమ స్వరంలోని సిగ్గు, మృదుత్వం ప్రతిధ్వనిస్తాయి.
ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల – నేలపై నిశబ్దంగా రాలిన (పారిజాత) పువ్వులు పరచుకున్న ప్రదేశాల్లో కూడా ఏ అలికిడి చేయని పరిమళం పరుచుకుని ఉంటుంది. అలాంటి నిశ్శబ్దమైన ప్రేమ పారిజాతాలా పరిమళాల పిలుపులా (కీరవాణిలో ఆలపించలేని) తన స్వరం ఉందని ఆమె చెబుతోంది.
సాధారణంగా ఏ పూవులైనా నేల మీద రాలితే అవి పూజకు, జడలకు ఆమోదయోగ్యం కాదు కానీ పారిజాత పువ్వులు మాత్రం నేల మీద రాలిన వాటినే ఏరుకోవాలి. ఇక్కడ కవి ఇలరాలిన పువ్వులు అంటూ పారిజాత పువ్వులను గురించి సూచనప్రాయంగా చెప్పారు. (ఇల రాలినా కూడా) పారిజాతం పువ్వులు వన్నె చెడవు, వాసన తగ్గవు, చలికాలంలో వెచ్చదనాన్ని ఎండాకాలంలో చల్లదనాన్ని ఇస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాంటి చిరంజీవిత్వం ఉన్న ఇల పారిజాతాల పరిమళంలాంటిది ఆమె ప్రేమ అని హేమ చెబుతోంది
“అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి” అనే ప్రయోగం ఎంతో సున్నితమైనది. ఆమె మంజులవాణి అయినప్పటికీ, ఇప్పుడు అలిగి మౌనంగా ఉంది. ఎవరిమీద అలిగి మౌనంగా ఉంది? అలికిడి ఎరుగని పిలుపుల మీద! అంటే తనకు చెప్పకుండా, అనుమతి లేకుండా తన మనసులోకి ప్రవేశించిన ప్రేమపిలుపు మీద అలిగి, ఆ ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక, ఆ మంజులవాణి మౌనం అయ్యింది.
ఈ గీతంలో ‘కీరవాణి’, ‘మంజులవాణి’, ‘ఇల రాలిన పూలు’ వంటి పదప్రయోగాల ద్వారా వేటూరి గారు నర్మగర్భంగా ఒక దివ్యలోకపు సంగీత సౌందర్యాన్ని ఆవిష్కరించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా, ఇక్కడ ప్రస్తావించిన కీరవాణి రాగానికి, బ్రహ్మ–సరస్వతుల దివ్యలోకంతో, అక్కడి గంధర్వ సంగీత సంప్రదాయంతో ఒక అంతర్లీనమైన అనుసంధానం ఉన్నట్లు గోచరిస్తోంది. పారిజాత పుష్పాల నర్మగర్భ ప్రస్తావన, మంజులవాణి అనే సంబోధన, కీరవాణి రాగం – ఈ మూడింటినీ కలిపి చూస్తే, భూలోకంలోని ప్రేమగీతంలోనే దేవలోకపు సంగీత మాధుర్యాన్ని సున్నితంగా ప్రతిధ్వనింపజేసిన వేటూరి కవిత్వ చాతుర్యం కనిపిస్తుంది.
గమనిస్తే ప్రేమలోని ప్రతి భావమూ గట్టిగా, ప్రస్పుటంగా పైకి ప్రకటించబడదు. కొన్ని భావాలు నిశ్శబ్దంగానే వ్యక్తమవుతాయి. కొన్ని పిలుపులు వినిపించకపోయినా మనసుకు చేరుతాయి. అటువంటి మృదువైన స్వరాన్ని ‘మంజులవాణి’గా వేటూరి గారు చిత్రించారు.
తర్వాత రెండో చరణoలో మురళి తన ప్రేమభావాన్ని మరింత విస్తరింపజేస్తాడు.
“నీ కన్నుల నీలమై.. నీ నవ్వుల వెన్నెలై
సంపెంగల గాలినై తారాడనా నీడనై”
-ఆమె కన్నుల్లోని నీలిమగా, ఆమె నవ్వులోని వెన్నెలగా, సంపెంగ వంటి ఆమె ముక్కు మోసుకొచ్చే పరిమళాల గాలిగా, ఆమెతోనే సదా ఉండే నీడగా మారాలని కోరుకుంటున్నాడు.
ఒక భావుకుడు అయిన ప్రేమికుడు ప్రేయసి జీవితంలోకి ప్రవేశించాలనే కోరికను ఇంతకంటే అందంగా ఎలా చెప్పగలడు? కన్నుల్లో నీలం, నవ్వులో వెన్నెల, గాలిలో సంపెంగల పరిమళం, వెంట నడిచే నీడ – ఇవన్నీ ఆమెతో విడదీయరాని అనుబంధాన్ని సూచించే రూపకాలు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ తన ఉనికి కూడా ఉండాలన్న ప్రేమికుడి ఆకాంక్ష ఇందులో వ్యక్తమవుతుంది.
అయితే అది ప్రేమ మాత్రమేనా?? కానేకాదు ఆమె నీడలా ఉండి హత్యా ఉదంతాల దర్యాప్తు చేయాలని కూడా ఒక రహస్య పోలీసుగా అతడు కోరుకోవడం అందులోని శ్లేష.
మురళి ప్రేమకు హేమ ఇచ్చే సమాధానం మరోసారి కవిత్వపు అందాన్ని సంతరించుకుంటుంది.
“నీ కవనాలలో నే తొలిప్రాసనై
నీ జవనాలలో జాజులవాసనై”
అతని తొలి ప్రేమకవిత్వంలో తానే తొలిప్రాస కావాలని, చివరి దాకా ఉండాలని, అతని యౌవన వసంతంలో జాజిపూల పరిమళంగా నిలవాలని కోరుకుంటోంది.
ఇక్కడ ‘తొలిప్రాస’ అనే పదం ఎంతో అందమైనది. అతడి కవిత్వంలో ఆమె ప్రాసగా భాగమవ్వాలనుకోవడం అంటే అతని ప్రతి భావంలోనూ తన ఉనికి ఉండాలని, అతడి ప్రతి అడుగులో ఆమె అడుగు వేసి తోడఅవ్వాలని హేమ కోరుకుంటోంది. ఆ తర్వాత కాలంలో అతడు చేసే దర్యాప్తులో ఆమె కూడా భాగస్వామ్యమై అతడికి నిజంగానే సహకారమందిస్తుంది.
ఈ చరణంలో ‘జాజులవాసనై’ అన్న ప్రయోగం ప్రేమలోని మృదుత్వాన్ని, పరవశాన్ని మరింత పెంచుతుంది. అతని తొలి వయసుకి, జీవితానికి తాను ఒక ఇగిరిపోని పరిమళంలా తోడవ్వాలని ఆమె కోరిక. తొలి ఋతువులాంటిదే తొలి వయసు.. తొలి ఋతువులో విరబూసే పూలలో జాజూలు ముఖ్యమైనవి. ప్రేమను ఉద్దీపనం చేసే సాధకాలు కూడా జాజిపూలే. అందుకే అతడి తొలి వయసులో ఆమె జాజిపూల తావిలా ముడిపడి ఉంటా అంటుంది.
ప్రబంధాల వర్ణనల ప్రకారం, వయసులో ఉన్న యువతీ యువకులు అత్తరు అద్దకాల అవసరం లేకుండానే పరిమళిస్తారు, ప్రేమలో పడినప్పుడు, పరస్పరం కలుసుకున్నప్పుడు ఆ పరిమళం మరింత గుబాళిస్తుంది. అందుకే అతడి తొలి వయసులో జాజుల వాసన గుప్పుమనడం ప్రబంధస్థాయి వర్ణన.
“యదలో యదలే కదిలే
పడుచుల మనసుల
పంజర శుకముల పలుకులు తెలియకనే”
అనే భావప్రకటనలో ప్రేమ వల్ల కలిగే అంతర్మథనం కనిపిస్తుంది. ఒకరి మనసులో మరొకరి మనసు కదలడం, రెండు హృదయాలు ఒకే భావంతో స్పందించడం ఇందులోని అంతరార్థం. ఈ స్పందనకు పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. మనసులో కలిగే చిన్న కదలికే ప్రేమకు సాక్ష్యమవుతుంది.
ప్రేమలో పడ్డ పడుచులు, మనసు అనే పంజరాలలలో చిక్కున్న చిలకల్లాంటి వారు. ఆ చిలకల పలుకులు తనకు తెలియవని చెబుతోంది. పక్షుల మీద పరిశోధన చేస్తున్నప్పటికీ పాపo తానెప్పుడూ ప్రేమలో పడలేదు చిలకల కులుకుతూ మాట్లాడలేదుగా మరి. అందుకే వ్యక్తపరచడానికి సంఘర్షణ పడుతోoది.
పాట పైకి ఎంత భావ ప్రణయ గీతంగా కనిపిస్తున్నా, అతడు పోలీసులా ఆమె వెనుక వెనకే ఉంటాను అనడం, ఆమె తనకేమీ తెలియదు అనే అమాయకత్వాన్ని నిరూపించుకోవడం నర్మగర్భంగా కనిపిస్తూనే ఉంటుంది. అదే వేటూరి గారి చమత్కారం.
పక్షుల మీద పరిశోధన చేస్తున్నా పంజరంలోని చిలకలు పలికే పలుకుల్లాంటి చిలిపి మాటలు తనకు అలవాటు లేవు, వల వేసి ఆకర్షించే తెలివి లేదు అంటున్నప్పుడే తెలియాలి పోలీస్ ప్రేమికుడికి ఆమె అమాయకురాలని, అది ఆమె నిరపరాధి అని అందించే హింట్ అని.
అయితే ఆ అమ్మాయికి కవ్విస్తూ అచ్చికబుచ్చికలు ఆడటం తెలియకపోయినా, తన మనసులో ప్రేమ ఉంది, ఆమెకు ప్రేమను వ్యక్తం చేసే చిలిపి భాష, కీరవాణి రాగం పలకడం తెలియకపోవచ్చు, కానీ ఆమె హృదయం మాత్రం మురళి ప్రేమకు స్పందిస్తోంది. ఈ అమాయకత్వమే హేమ పాత్రకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.
ఇక్కడ మరోసారి “చిలకలా కలకలా పాడలేదు” అనే భావం ఆమె మళ్ళీ చెబుతుంది, పల్లవి పునరావృతమవుతుంది. పాట ప్రారంభంలో మురళి చిలకల తీపి పలుకుల్లా కీరవాణి రాగంలో పాడమని కోరాడు. ఇప్పుడు హేమ తనకు అలాంటి పలుకులు తెలియవని చెబుతోంది. ఈ పునరావృతం ఇద్దరి మధ్య సాగుతున్న సంభాషణకు ఒక కొనసాగింపు.
మురళి పలికే పంక్తుల్లో ఆహ్వానం, ఆకర్షణ, ప్రేమ ప్రకటనా ఉంటే, హేమ పలికే పంక్తుల్లో సిగ్గు, అమాయకత్వం, ప్రతిస్పందన, ఆత్మీయత కనిపిస్తాయి. ఇద్దరి భావప్రకటనలు వేర్వేరుగా ఉన్నా, వాటిని కలిపే ప్రేమసంగీతం ఒక్కటే.
ముగింపు:
ఈ గీతంలో, వేటూరి గారు దైవికమైన సంగీత పరిభాషను, ఇలలోని ప్రకృతి సౌందర్యంతో మేళవించారు. కీరవాణి రాగం, చిలకల పలుకులు, పూల పరిమళాలు, చైత్రమాసం, ఆకాశంలోని తార, నవ్వుల్లోని వెన్నెల, జాజిపూల వాసన – ఇవన్నీ తమ ప్రేమలోకంలో భాగమవుతాయి, అద్భుతమైన ప్రణయ భావకవిత్వాన్ని చిలకరిస్తాయి.
కీరవాణి రాగాన్ని ఇష్టపడే అమ్మాయిని ఆకట్టుకోవడానికి ఆ రాగాన్నే నేర్చుకుని పాడే అబ్బాయి కథలోని ఒక చిన్న సంఘటనగా ఈ పాట మొదలవుతుంది. కానీ వేటూరి గారి కలం దాన్ని ఒక అందమైన ప్రేమ సంభాషణగా తీర్చిదిద్దింది.
మురళి తన ప్రేమను ప్రకృతి ఉపమానాలతో, సంగీతపు మాధుర్యంతో వ్యక్తం చేస్తే, హేమ తనకు సంగీత పరిజ్ఞానం లేదని, పక్షుల మీద పరిశోధన చేస్తున్నా వాటిలా చిలిపిగా పలకడం రాదు అని చెబుతూనే హృదయంలోని అనురాగాన్ని కవితాత్మకంగా వెల్లడిస్తుంది.
అలా ఒక రాగం ఇద్దరి మధ్య ప్రేమకు వారధిగా నిలుస్తుంది. పాట ముగిసినా ఆ రాగం మన మనసులో మోగుతూనే ఉంటుంది. అందుకే ‘కీరవాణి’ గీతం కేవలం ఒక మధురమైన యుగళగీతం కాదు; రాగం ప్రేమగా మారి, ప్రేమే ఒక మధురస్వరంగా వినిపించిన వేటూరి గీతామృతంలోని అపురూపమైన, అజరామరమైన మధుగీతం.
(‘కీరవాణి.. కీరవాణి..’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=PxCir5fLis0)
(మళ్ళీ కలుద్దాం)
డా. మాధురి ఇంగువ ప్రముఖ తెలుగు రచయిత్రి, ఆధ్యాత్మిక పరిశోధకురాలు, విశ్లేషకురాలు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న వీరు, తెలుగు సాహిత్యంపై, ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, తెలుగు సినీ గేయాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి పాటలపై ‘వేటూరి గీతామృతం’, ‘వజ్రకుండం’, ‘మధు ప్రణీతం’ వంటి పుస్తకాలను రచించారు. గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం గ్రహీత.
