Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-3

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

ముద్ద మందారం:

3. నీలాలు కారేనా

ముద్దమందారం సినిమా అనగానే ఏతరం ప్రేక్షకులకైనా మొదట గుర్తుకొచ్చే గీతం ‘నీలాలు కారేనా కాలాలు ఆగేనా!’ అనే కరుణరసభరితమైన గీతం.

సిరిసంపదల మధ్య పెరిగిన ఒక యువకుడు, కేవలం ప్రేమించిన పిల్లకు తోడుగా నిలవడం కోసం సర్వస్వాన్ని వదులుకుని, ఆమె కన్నీళ్లలో తను కరిగిపోతూ పాడే ఈ ‘సాంత్వన గీతం’ తెలుగు సినీ చరిత్రలోనే ఒక అపురూపమైన ప్రేమ ప్రతీక. తొలి గీతంలో పూలమ్మే పిల్ల ముగ్ధ మనోహర రూపాన్ని ‘మందారం ముద్ద మందారం’ అంటూ ఆరాధించిన ఆ ధనవంతుల అబ్బాయి, ఈ గీతానికి వచ్చేసరికి ఆమె చేయి పట్టి ఇల్లు వదిలి వచ్చేస్తాడు. ఆస్తిపాస్తులు పోయి, చిల్లిగవ్వ లేక, ఒక చిన్న గదిలో కాపురం పెట్టి, బతుకు బండిని లాగడానికి ఎన్నో కష్టాలు పడుతూ నలిగిపోతున్న వేళ.. కన్నీరు మున్నీరవుతున్న తన సహధర్మచారిణి కన్నీళ్లు తుడుస్తూ, భర్తగా ఆమెకు ధైర్యాన్ని, ఓదార్పును ఇస్తూ పాడే అనురాగ గీతం ఇది. పేదరికంపై ప్రేమ సాధించిన విజయ పతాకం ఈ పాట.

~

గీత సాహిత్యం

పల్లవి:
నీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

చరణం 1:
సూరీడు, నెలరేడు సిరిగల దొరలే కారులే,
పూరిగుడిసెల్లో, పేదమనస్సులో
వెలిగేటి దీపాలులే!
ఆ నింగి, ఈ నేల కొనగల సిరులే లేవులే,
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో
నిరుపేద లోగిళ్ళులే
॥నీలాలు కారేనా॥

చరణం 2:
ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో,
కలికి వెన్నెల్లో
కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే, ఒదిగి పోతుంటే
కడతేరి పోవాలిలే
॥నీలాలు కారేనా॥

విశ్లేషణ:

పల్లవి:
పాట ప్రారంభమే ఒక అద్భుతమైన ఆత్మీయతతో మొదలవుతుంది. రోజూ పూలు అమ్ముకునే ఆ పిల్లకు ‘పూలడోల’ అవుతాను అంటాడు భర్త. అందుకే ఆమె బాధను చూసి, “నీవు హాయిగా విశ్రమించడానికి, నీ కష్టాలన్నీ మర్చిపోవడానికి ఈ నీ భర్తే ఒక ‘పూలడోల’ కాదా?” అంటూ కవి ఇక్కడ నాయిక ప్రపంచానికి అన్వయించి అద్భుతమైన రూపకాలంకారాన్ని ప్రయోగించారు.

“నీలాలు కారేనా, కాలాలు మారేనా” – పసి పిల్లలు ఏడిస్తే తల్లి “ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారూ! నీలాలు కారితేనే చూడలేను” అని సముదాయిస్తూ పాడేది పాతరోజుల్లో.

భార్యని చంటిపిల్లలా లాలిస్తున్న భర్త కూడా “నీలాల లాంటి నీ కళ్ల నుండి కన్నీళ్లు కారాలా? రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఈ కష్టాల కాలాలు తప్పక మారుతాయి కదా” అని తల్లిలా ఓదారుస్తున్నాడు.

“నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా” అన్నప్పుడు, భార్య పడుతున్న వేదనను తను పంచుకుంటూ, ఒక తల్లిలా ఆమెకు లాలిపాడడానికైనా నేనున్నాను కదా అనే భర్త బాధ్యత, అనురాగం కనిపిస్తాయి.

“జాజిపూచే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా” – రాత్రి వేళ జాజిపూలు వికసించి తన పరిమళాలతో స్వాంతన చేకూర్చే ఆ నిశ్శబ్ద సమయంలో, ఆకాశాన జాబిల్లి చల్లని వెన్నెలలు పంచే వేళ కష్టాలు మరిచి హాయిగా అతడి గుండెపై తలవాల్చమని పిలిచే ఆత్మీయత, బాలు గారి గాత్రంలో కలసి నిజంగానే స్వాంతన చేకూరుస్తుంది.

చరణం 1:

“సూరీడు, నెలరేడు – సిరిగల దొరలే కారులే – పూరి గుడిసెల్లో పేదమనసుల్లో వెలిగేటి దీపాలులే” అంటూ కవి లోకంలోని గొప్ప ధనవంతులను ఆకాశంలోని సూర్యచంద్రులతో పోలుస్తూనే, ఒక అద్భుతమైన జీవన సత్యాన్ని ఆవిష్కరించారు. సూర్యుడు, చంద్రుడు ఎంత ఎత్తున ఉన్నా, వారు చిల్లులు పడ్డ పై కప్పు గల పేదల పూరి గుడిసెల్లో బందీలు కావలసిందే.

పూర్వం పెళ్ళిళ్ళ పేరయ్యలు ఇలానే “వాళ్ళకేం అండి.. ఇంట్లో సూర్యుణ్ణి చంద్రుణ్ణి కట్టేశారు” అని చెప్పేవారుట.. దీని మీద ఒక కార్టూన్ కూడా ఉండేది, పేరయ్య మాటలు నమ్మి ఓహో ఎత్తైన మేడలుగల సిరిగల సంబంధం అనుకుని పెళ్ళికి ఒప్పుకుంటే, తరువాత వారిది పూరి గుడిసె అని సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షం అన్నీ నేరుగా ఇంట్లోకి వస్తాయని తెలిసి నివ్వెరపోతారు.

ఇక్కడ అలాగే ఆకాశంలో తిరిగే సూర్యుడు చంద్రులు ఆకాశంలో ఉన్నంత మాత్రాన గొప్పవారు ఏమీ కాదు, వారి నిష్కల్మషమైన మనస్సుల్లో నిరంతరం వెలిగే ప్రేమ, అనురాగం అనే దీపాలు ఆ సూర్యచంద్రుల కంటే గొప్పవి అంటూ ఊరడిస్తున్నాడు భర్త.

“ఆ నింగి, ఈ నేల – కొనగల సిరులే లేవులే” – ప్రపంచంలోని ఏ ధనవంతుడూ ఆకాశాన్ని, నేలను డబ్బుతో కొనలేడు. మహా అయితే పిడికెడు నేల కొనుగోలు చేయగలడు. కానీ అనంతమైన ప్రకృతి సంపద, అది అందించే సాంత్వన అందరికీ సమానమే.

“కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో – నిరుపేద లోగిళ్ళులే” అంటూ కవి ఇక్కడ వైరుధ్య చమత్కారాన్ని, విరోధాభాసాలంకారాన్ని పండించారు. డబ్బు ఉన్న ‘కలిమి’ లోనూ, ఏమీ లేని ‘లేమి’ లోనూ ఒకరి కోసం ఒకరు కరిగిపోయే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందని, అలాంటి ప్రేమ ఉన్నప్పుడే ఆ నిరుపేద లోగిళ్లు స్వర్గాలవుతాయని ప్రేమలోని ఔన్నత్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.

చరణం 2:

“ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో, కలికి వెన్నెల్లో – కలల కన్నుల్లో కలతారిపోవాలిలే” – పగలు పడిన కష్టాలు, బాధలు అన్నీ సాయంత్రపు చల్లని గాలిలో కొట్టుకుపోవాలని, ఈ చల్లని వెన్నెల్లో ఆమె లేత కళ్లలోని కలతలు, దిగుళ్ళు పూర్తిగా ఆరిపోవాలని ఆకాంక్షిస్తున్నాడు. డబ్బు లేకపోయినా అడుగడుగునా ఆ ప్రకృతి ఈ ప్రేమ ఆమెకు స్వాంతన చేకూర్చాలని పాలిస్తున్నాడు. అతడు సిరి సంపదల్లో ఉన్నప్పుడు ప్రేమించిన ప్రేమ, కాలక్షేపం ప్రేమ కాదని, కష్టాలలో కూడా అంతే బలంగా ఆమెకి తోడుగా నిలబడిందని నిరూపించే వాక్యాలు ఇవి.

“ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో, ఒడిలో నీవుంటే ఒదిగి పోతుంటే – కడతేరి పోవాలిలే” – ఆకాశం ఒడిలో నక్షత్రాలు ఒదిగి తళతళలాడే ఆ నిశీధి రాత్రిలో, నా ఒడిలో నువ్వు చేరి, నా గుండెల్లో ఒదిగిపోతుంటే.. బతుకులోని కష్టాలన్నీ దాటి మన జన్మ కడతేరిపోవాలి, ధన్యమవ్వాలి అని కోరుకుంటున్నాడు.

వేటూరి సుందర రామమూర్తి గారు ఇక్కడ వాడిన ‘తేలి-మరిచే’, ‘వెన్నెల్లో-కన్నుల్లో’, ‘తేరి-మెరిసే’, ‘ఒడిలో-ఒదిగి’ అనే పదబంధాలు పాటకు అద్భుతమైన వృత్త్యానుప్రాస, అంత్యానుప్రాసల శబ్ద సౌందర్యాన్ని అద్దాయి. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ఈ చరణం పాడుతుంటే ఆ కష్టాలలోని తీయదనం శ్రోత గుండెలను తడుపుతుంది. ఇక్కడ వేటూరి గారు అరుదైన ఒక పదప్రయోగం చేశారు. అదే ‘తేరి’. తేరిపారా చూడటం, (జబ్బు నుండి) తేరుకొనడం, వంటి పదాలలోని తేరి శబ్దం ఎక్కువగా కళింగ మాండలికంలో కనిపిస్తుంది. సినిమా కథ విశాఖపట్నంలో జరగడంతో ఈ భాష-పద ప్రయోగం చేసి ఉండవచ్చు వేటూరి గారు. దీని అర్థం సుస్పష్టంగా. సాయం సంధ్య వేళ నక్షత్రాలు కొద్దికొద్దిగా కనిపిస్తాయి.. చీకటి దట్టంగా అలముకున్నాకే నక్షత్రాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, “ఆ తారలే తేరి తళతళ మెరిసే వేళలో” అనడంలో బాగా చీకటి పడి నక్షత్రాలన్నీ స్పష్టంగా తేరిపారా కనిపించే వేళ అని అర్థం. ఎంత చక్కటి తెలుగుపదాన్ని ఎంత అలవోకగా పలికించారు వేటూరి వారు?

ముగింపు:

వేటూరి గారి కలం నుండి జాలువారిన ఈ ‘పూలడోల’ గీతం లౌకికమైన ఆస్తుల కంటే హృదయాల అనురాగమే గొప్పదని నిరూపించిన అమలిన శృంగార, కరుణ రసాల మేళవింపు. పాట అంతటా కారేనా-మారేనా, పంచుకోనా-పాడలేనా, కారులే-దీపాలులే, లేవులే-లోగిళ్ళులే అంటూ సాగిన అంత్యానుప్రాసలు రమేశ్ నాయుడు గారి స్వరాల ఊయలలో లయబద్ధంగా సాగి బాలుగారి గాత్రంలో సుతిమెత్తగా ప్రవహించింది. ధనం లేకపోయినా, మనసు నిండా ప్రేమ ఉంటే పూరిగుడిసైనా పూలడోలగా మారుతుందని చాటిచెప్పిన ఈ గీతం, ఎన్ని తరాలు మారినా తెలుగువారి గుండెల్లో ఓదార్పునిచ్చే ఒక మధుర క్షీరధార..

(‘నీలాలు కారేనా కాలాలు ఆగేనా!’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Bt5wbOL8syE)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version