[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]
మల్లెపందిరి:
1. తొలిచూపు తోరణమాయే
ఉపోద్ఘాతం:
హాస్య బ్రహ్మ జంధ్యాల గారి చిత్రాలు అనగానే గుర్తుకొచ్చేది నవ్వుల జల్లు, ఆ నవ్వుల వెనుక దాగిన సున్నితమైన మానవీయత. ఆయన సినిమాల్లో హాస్యం కేవలం వినోదం కోసం కాకుండా, జీవితంలోని మాధుర్యాన్ని, సంబంధాల్లోని ఆత్మీయతను, తెలుగుదనంలోని సహజమైన అందాన్ని ఆవిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది.
అటువంటి జంధ్యాల గారి ఆహ్లాదకరమైన, కుటుంబకథా చిత్రం ‘మల్లెపందిరి’ (1981). ఈ చిత్రంలోని ప్రతి గీతం ఒక ప్రత్యేకమైన భావసౌందర్యాన్ని కలిగి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ‘తొలిచూపు తోరణమాయే’ అనే గీతం అప్పట్లో ‘వివిధ భారతి’లో నిరతం మారుమ్రోగుతూ శ్రోతల హృదయాలను అలరించేది. గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన గీతంగా ఈ పాటకు ప్రత్యేక స్థానం ఉంది.
సంగీత దర్శకులు రమేశ్ నాయుడు గారి మధురస్వరాలపై, వేటూరి సుందరరామమూర్తి గారి అక్షర విన్యాసం ఈ గీతాన్ని ఒక సాధారణ ప్రేమగీతం స్థాయి నుండి అచ్చ తెలుగు వివాహ సంస్కృతిని యథాతథంగా కళ్ళముందు నిలిపే దృశ్య కావ్యం అనబడే స్థాయికి తీసుకెళ్లింది.
పెళ్లిచూపులలో మొదలైన ఒక తొలి పరిచయం, వివాహ బంధంగా మారి, దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టే వరకూ మన సంప్రదాయ తెలుగు ఇంటి వాతావరణాన్ని, ఆనందాన్ని, సిగ్గును, చిలిపితనాన్ని, అనురాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమాలో వేటూరి సుందర రామమూర్తి గారు ‘ప్రేమ గురు’ పాత్రలో కనిపించి నవ్వించడం అభిమానులకు ప్రత్యేక వరం.
~
సాహిత్యం – విశ్లేషణ
పల్లవి:
ఆమె:
తొలిచూపు తోరణమాయే కళ్యాణకారణమాయే
సన్నజాజితీవెలలోనే సన్నాయివీణలు పలికే
అతడు:
తొలిచూపు తో..‘రణ’మాయే
ఆమె:
ఉమ్మ్?? రాముని తోక..??
అతడు:
సారీ.. నాకు అచ్చ తెలుగు అంతగా రాదు..
అంటే.. అంటే.. మిగతా భాషల్లో పండితుడిని కాదనుకోండి..
ఆమె:
అహహా తొలిచూపు తోరణమాయే కళ్యాణకారణమాయే
సన్నజాజి తీవెలలోనే.. సన్నాయివీణలు పలికే
అతడు:
తొలిచూపు తోరణమాయే కళ్యాణకారణమాయే
చరణం 1:
అతడు:
పగడాల పెదవులతోనే బిడియాలు కలబడుతుంటే
ఆమె:
వగలమారిచెక్కిలి మీద పగటి చుక్క పకపకమంటే
అతడు:
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
ఆమె:
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
అతడు:
కనుచూపుశుభలేఖలుగా..
కనుచూపుశుభలేఖలుగా.. కళ్యాణరేఖలు మెరిసే..
॥తొలిచూపు తోరణమాయే..॥
చరణం 2:
ఆమె:
మనము పసుపు కుంకుమలై
మనువు గడప దాటుతువుంటే
అతడు:
కలిసి.. బొట్టు కాటుకులై
కాపురాన అడుగిడుతుంటే
ఆమె:
సిరిగా శ్రీహరిగా.. కలిసే లాహిరిలో..
అతడు:
సిరిగా శ్రీహరిగా.. కలిసే లాహిరిలో…
ఆమె:
నయనాలుప్రియవచనాలై…
నయనాలుప్రియవచనాలై అనురాగమే వినిపించే.
॥తొలిచూపు తోరణమాయే..॥
~
పాట ప్రారంభమే ఎంతో అద్భుతమైన ధ్వని, భావ సమన్వయంతో మొదలవుతుంది.
“తొలి చూపు తోరణమాయే-కళ్యాణ కారణమాయే:”
‘తొలి చూపు’ అనేది సాధారణంగా ఒక క్షణ కాల పరిచయం మాత్రమే. కానీ వేటూరి గారి కలంలో అది ఒక తోరణమయ్యింది. తెలుగు సంప్రదాయంలో ఇంటి గుమ్మానికి కట్టే తోరణం కేవలం అలంకారం కాదు. అది శుభానికి, ఆహ్వానానికి, కొత్త ప్రారంభానికి సంకేతం. విశేషించి అమ్మాయి కనురెప్పలు తోరణాలకు ప్రతీకలు. కనురెప్పలు ఎత్తి పెళ్ళిచూపుల్లో అతడిని చూడడం అనేది తన ఇంటికి తోరణాలు కట్టి అతడికి స్వాగతం పలకడం వంటిది.
ఇక్కడ ‘చూపు’కు ‘తోరణం’కు మధ్య ఒక భావ సంబంధాన్ని సృష్టించడం రూపకాలంకార వైభవం.
“సన్నజాజి తీవెలలోనే సన్నాయి వీణలు పలికే”:
ఈ పంక్తిలో వేటూరి గారు ప్రకృతిని కూడా వివాహ వేడుకలో భాగస్వామిని చేశారు. ఒక శుభకార్యానికి ప్రకృతి కూడా దీవెనలు అందిస్తోంది అని అర్థం. సన్నజాజి తీగలు గాలికి కదలడం కేవలం ప్రకృతి కదలిక కాదు. ఆ పూల పరిమళంలోనే పెళ్లి మంటపంలోని సన్నాయి నాదాలు, వీణా స్వరాలు వినిపిస్తున్నాయని భావించడం ఒక అందమైన ఉత్ప్రేక్షాలంకారం. సన్నని పొడవైన కాడ ఉండే సన్నజాజి పూలను సన్నని పొడవైన నాదస్వరంతో పోల్చడం, ఆ పూలు గాలికి సుతారంగా ఊగడాన్ని, లలితమైన సన్నాయి నాదంతో పోల్చడం, ప్రబంధ స్థాయి ఉత్ప్రేక్ష.
ఆ తరువాతి పాదాలలో వేటూరి – జంధ్యాల గార్ల చమత్కార కలయిక చూడవచ్చు.
అతడు: “తొలిచూపు తో ‘రణ’మాయే..”
పాటలో ఒక అనూహ్యమైన హాస్యపు జల్లు ఇది.
నాయిక “తోరణమాయే” అని శుభభావంతో పాడుతుంటే, నాయకుడు ఆ పదాన్ని విడదీసి “తో- రణమాయే” అంటూ తొలి చూపుతోనే యుద్ధం మొదలైందని అర్థం చేసుకుంటాడు.
ఇది కేవలం అనుచిత పద విభాగం కాదు, ఇది వేటూరి గారి శబ్దచమత్కారం, జంధ్యాలగారి హాస్య శైలి కలిసిన అద్భుతమైన సందర్భం.
నాయిక వెంటనే “ఉమ్మ్?? రాముని తోక..” అంటూ మందలించడం కూడా తెలుగు ఇంటి చిలిపి సంభాషణను గుర్తుకు తెస్తుంది.
ఇక్కడ “రాముని తోక” అనే ప్రయోగం వెనుక ఒక పాత తెలుగు భాషా చమత్కారం ఉంది.
“రామునితో కపివరుండిట్లనియె” అనే వాక్యాన్ని భాష తెలియని వ్యక్తి తప్పుగా విభజించి “రాముని తోక.. పివరుండు..” అని చదివాడనే హాస్యపు ఉదాహరణను పూర్వం చెప్పుకునేవారు. వేటూరి గారు ఇలాంటి భాషా చమత్కారాన్ని పాటలో సహజంగా మిళితం చేశారు.
అతడు: “సారీ… నాకు అచ్చ తెలుగు అంతగా రాదు.. అంటే.. అంటే మిగతా భాషల్లో పండితుడిని కాదనుకోండి” అంటూ తన అమాయకత్వాన్ని ఒప్పుకోవడం జంధ్యాల మార్కు హాస్యానికి పరాకాష్ఠ. ఇక్కడ నాయకుడిని కవి ఎగతాళి చేయలేదు. పైగా అతని అమాయకత్వాన్ని ప్రేమించదగిన లక్షణంగా చూపించారు.
చరణం-1:
“పగడాల పెదవులతోనే బిడియాలు కలబడుతుంటే”
పెళ్లికూతురి పెదవులను ఎఱ్ఱని పగడాలతో పోల్చడం తెలుగు కవిత్వంలో చిరపరిచితమైన ఉపమానం.
..కానీ వేటూరి గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన కేవలం అందాన్ని వర్ణించరు. ఆ అందంలో దాగిన భావాన్ని కూడా చూపిస్తారు. పెదవులపై చిరునవ్వు ఒకవైపు, పెళ్లికూతురి ఎఱ్ఱని సిగ్గు మరోవైపు, ఏవి ఎక్కువ ఎఱుపెక్కుతున్నాయో తెలియని స్థాయిలో పోటీ పడుతున్నాయని “బిడియాలు కలబడుతుంటే” అంటారు వేటూరి గారు. నాయిక యొక్క బాహ్య సౌందర్యాన్ని ఆమె అంతరంగ స్థితితో పోల్చడం చక్కని భావుకత.
“వగలమారి చెక్కిలి మీద పగటి చుక్క పకపకమంటే”
ఇది పాటలోని అత్యంత అందమైన ఊహాచిత్రాలలో ఒకటి.
చెక్కిలిపై మెరిసే పెళ్ళి చుక్కను పగటి వేళ కనిపించే వేగు చుక్కతో పోల్చడం అద్భుతమైన ఉత్ప్రేక్ష. విశేషించి వేగుచుక్క మొలిచిందoటే రాత్రి అయిపోయి, కొత్త వేకువ వస్తున్నదని అర్థం.
ఈ గీతంలో పెళ్ళికూతురు కూడా కళ్యాణంతో నూతన జీవితంలోకి అడుగుపెడుతోంది. ఆమె జీవితంలో రాబోయే ఆ సరికొత్త కాంతికి, సంతోషానికి ప్రతీకగా, ఆమెబుగ్గన ఉన్న పెళ్ళి చుక్క పకపకమంటూ ఆనందంగా నవ్వే వేగుచుక్కగా తళుకులీనుతూ కొత్తజీవితాన్నిస్వాగతిస్తోంది అని అర్థం. ఇదే వేటూరి గారి రసరమ్యమైన కల్పనా శక్తి.
“శివమై అనుభవమై.. శుభమై సుందరమై”
ఈ నాలుగు పదాల్లోనే ఒక సంపూర్ణ దాంపత్య జీవిత ఆశీర్వాదం ఉంది.
శివం అంటే మంగళం.
అనుభవం అంటే జీవిత ప్రయాణం.
శుభం అంటే భవ్యం.
సుందరం అంటే ఆనందం.
వివాహ బంధం కేవలం ఒక సంఘటన కాదు, జీవితాంతం కొనసాగే ఒక పవిత్రమైన అనుభవమని కవి చెబుతున్నారు. ఇది కదా నేటి తరం తెలుసుకొని నూరేళ్ళు పాటించవలసింది.
“కనుచూపు శుభలేఖలుగా.. కళ్యాణ రేఖలు మెరిసే”
ఇది వేటూరి గారి అపూర్వమైన రూపక సృష్టి. సాధారణంగా పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంపుతారు. తొలి శుభలేఖ ఆడ పెళ్ళివారు మగ పెళ్ళివారికి, మగ పెళ్లివారు ఆడపెళ్ళివారికి అందించాలి. కానీ ఇక్కడ వధూవరులు ఒకరి కనుచూపులే ఒకరికొకరు ఇచ్చుకునే శుభలేఖలుగా మారాయి. అంటే మాటలు అవసరం లేని రసప్లావితమైన అనుబంధం అది. ఇక్కడ ధ్వని సిద్ధాంతం అద్భుతంగా కనిపిస్తుంది.
చరణం-2:
“మనము పసుపు కుంకుమలై.. మనువు గడప దాటుతువుంటే”
తెలుగు వివాహ సంస్కృతికి, ముత్తైదువ భాగ్యలకి ప్రతీకలైన పసుపు, కుంకుమలను వేటూరి గారు ప్రేమకు ప్రతీకలుగా, కాబోయే భార్యాభర్తలుగా మంగళప్రదంగా ఉపయోగించారు. పసుపు శుభానికి, కుంకుమ సౌభాగ్యానికి సంకేతాలు. అలాగే రెండు జీవితాలు కలిసిపోవడాన్ని ఈ రెండు పదాలతో ఎంతో సున్నితంగా చెప్పారు.
భార్యభర్తలన్నవాళ్లు పసుపు కుంకుమలుగా, శివపార్వతులుగా కలిసి పోవడం కోసమే కదా వివాహం జరిపించేది. ఆ అద్వైత భావం మనసా – వాచా – కర్మణా మన(సు)లో స్థిరపడితే ఆ వివాహ బంధానికి తిరుగు ఉండదు.
“కలిసి బొట్టు కాటుకులై కాపురాన అడుగిడుతుంటే”
బొట్టు, కాటుక – ఇవి విడిగా ఉన్నట్టే ఉన్నా, కలిసినప్పుడే ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. అలాగే భార్యాభర్తలు కూడా పరస్పర పూరకాలని ఈ ఉపమానం చెబుతుంది. ఇది కేవలం శృంగార భావం కాదు. ఇది అన్యోన్య దాంపత్య తత్వం.
పెళ్లయిన తరువాత పసుపు, కుంకుమ బొట్టు, కాటుక, గాజులూ, పూలు అనే ఐదు ఇల్లాలి ముత్తైదువతనానికి సూచికలు, అవన్నీ భర్త సౌభాగ్యానికి ప్రతీకలు. అందుకే భార్య భర్తలది విడదీయరాని అన్యోన్యమైన అనుబంధం.
“సిరిగా శ్రీహరిగా.. కలిసే లాహిరిలో”
..ఇక్కడ వేటూరి గారు దంపతుల కలయికను లక్ష్మీనారాయణుల పవిత్ర బంధంతో పోల్చారు. ‘సిరి’ అంటే లక్ష్మి. ‘శ్రీహరి’ అంటే విష్ణువు. పెళ్లిలో కూడా పెళ్లికూతురుని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి పద్మం వంటి బుట్టలో ఆమెను మంటపానికి తీసుకువస్తారు, పెళ్లి కొడుకుని విష్ణుమూర్తిగా భావించి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. ఈ పాటలో నవ వధూవరులను శివపార్వతులుగానే కాదు లక్ష్మీ విష్ణుమూర్తులుగా కూడా కలకాలం కలిసి మెలిసి జీవించమంటున్నారు వేటూరి గారు.
అలా అనడంలో భక్తిరసం, శృంగార రసం రెండూ కలిసిన ఒక అపూర్వమైన దాంపత్యమాధుర్యం కనిపిస్తుంది.
“నయనాలు ప్రియవచనాలై.. అనురాగమే వినిపించే”
ప్రేమలో ఉన్న ఇద్దరికీ మాటలు అవసరం ఉండవు. కళ్లే మాట్లాడతాయి. నయనాలు పలికే ఆ మౌన భాషనే వేటూరి గారు ‘ప్రియవచనాలు’ అన్నారు. ఇది శృంగార రసంలోని అత్యున్నత స్థాయి – మౌనంలో వ్యక్తమయ్యే అనురాగం. భక్తిలో కూడా ఒక దశకు చేరిన తరువాత మంత్రాలతో, పూజలతో అవసరం ఉండదు. మౌనంగానే దేవుడితో కళ్ళ ద్వారా సంభాషించి ఆర్తిని, మోక్షాభిలాషను వ్యక్త పరుస్తాడు పరమ భక్తుడు, అసలు జీవాత్మ ఎవరో పరమాత్మ ఎవరో తెలియని అద్వైత స్థితిలో కలిసి కరిగిపోతాడు.
అందుకే ప్రేమ దైవ స్వరూపం, భార్య భర్తల ఆత్మానుగతమైన ప్రేమానుబంధం, అద్వైత స్థితిని నేర్పి, ఆ సంసారం ఇరువురికీ మోక్షాన్ని ఇవ్వాలి.
ముగింపు:
అద్భుతమైన ఈ కళ్యాణ గీతం అంతటా వేటూరి గారు శబ్ద సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
తోరణమాయే – కారణమాయే
కలబడుతుంటే – పకపకమంటే
శుభలేఖలుగా – రేఖలు మెరిసే
కుంకుమలై – కాటుకులై
వంటి ప్రయోగాలలో అంత్యానుప్రాస, వృత్త్యానుప్రాసలు పాటకు సంగీతాత్మకమైన నడకను ఇచ్చాయి. రమేశ్ నాయుడు గారి మధురమైన స్వరాల్లో ఈ పదాలు మరింత జీవం పొందాయి.
ఈ గీతం కేవలం ఒక ప్రేమగీతమో, పెళ్ళి పాటో కాదు. ఇది తెలుగు వివాహ సంస్కృతికి అద్దం పట్టిన ఒక లలిత దృశ్య కావ్యం. నేటి కాలంలో, ఎన్నెన్నో పరాయి సంస్కృతుల కలబోతతో తెలుగింటి వివాహాలు జరుగుతున్న. కానీ , అచ్చమైన సంప్రదాయబద్ధమైన తెలుగింటి పెళ్ళి అంటే ఎలా ఉంటుందో సమగ్రంగా చూపించిన డాక్యుమెంట్ ఈ పాట. భావి తరాలవారికి ఇదొక అమూల్యమైన సంపద కాబోతోంది.
జంధ్యాల గారి చిలిపి హాస్యం, రమేశ్ నాయుడు గారి మధుర స్వరకల్పన, వేటూరి గారి పద వైభవం, బాలు-జానకి గార్ల అమృత గాత్రాలు కలసి ఈ పాటను చిరస్మరణీయంగా మార్చాయి.
తొలి చూపు నుండి కళ్యాణ తోరణం వరకు, ప్రేమ నుండి వివాహం వరకు, పరిచయం నుండి అనుబంధం వరకు ఒక అందమైన ప్రయాణాన్ని కవి ఈ గీతంలో చిత్రించారు. పెళ్ళి పందిట్లో పదుగురెదుట నవదంపతులు నిశబ్దంగా శృంగారాన్ని పలికించవచ్చని, అదీ ఎంతో పవిత్రంగా, హుందాగా పలికించవచ్చని నిరూపించిన ఈ గీతం విన్న ప్రతిసారి తెలుగు మనసులపై సన్నజాజి పూల జల్లు కురవాలి, తరతరాలపాటు పెళ్లి పందిట్లో ఈ గీతం మోగుతూనే ఉండాలి.
(‘తొలిచూపు తోరణమాయే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=etWlIu8YCB8)
(మళ్ళీ కలుద్దాం)
డా. మాధురి ఇంగువ ప్రముఖ తెలుగు రచయిత్రి, ఆధ్యాత్మిక పరిశోధకురాలు, విశ్లేషకురాలు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న వీరు, తెలుగు సాహిత్యంపై, ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, తెలుగు సినీ గేయాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి పాటలపై ‘వేటూరి గీతామృతం’, ‘వజ్రకుండం’, ‘మధు ప్రణీతం’ వంటి పుస్తకాలను రచించారు. గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం గ్రహీత.
