Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-5

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

మల్లెపందిరి:

2. కదిలే కోరికవో

ఉపోద్ఘాతం:

హాస్యబ్రహ్మ జంధ్యాలగారి చిత్రాలలో వేటూరి వారి సాహిత్య పరిమళాలు ఆస్వాదిస్తున్నాము. జంధ్యాలగారి చిత్రాలలోని హాస్యం ఎప్పుడూ చవకబారుతనానికి తావివ్వకుండా, జీవితంలోని మాధుర్యాన్ని, మనుషుల మధ్య అనుబంధాలను ఎంతో ఆహ్లాదకరంగా ఆవిష్కరిస్తుంది.

అటువంటి జంధ్యాల గారి ఆణిముత్యం ‘మల్లెపందిరి’ (1981).. చిత్రంలోని కళ్యాణ గీతం గతవారం విశ్లేషించుకున్నాం. ఇప్పుడు అదే చిత్రం నుండి మల్లెల పరిమళంలాంటి స్వచ్ఛమైన భావాలతో, ఆహ్లాదకరమైన తెలుగుదనంతో నవ్విస్తూనే కవ్వించే గీతం గురించి చర్చించుకుందాము. మల్లెపందిరి చిత్రంలో ‘కదిలే కోరికవో’ గీతం ఒక ప్రత్యేకమైన భావ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది.

ఇంతకుముందు మనం విశ్లేషించిన ‘తొలిచూపు తోరణమాయే’ గీతం తొలి పరిచయం నుండి వివాహ బంధం వరకు సాగిన ఒక అందమైన ప్రయాణాన్ని చిత్రిస్తే, ‘కదిలే కోరికవో..’ అనే గీతం ప్రేమలోని ఆరాధనను, ఊహలను, ప్రేయసి పట్ల ప్రేమికుడి సౌందర్య దర్శనాన్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది.

సంగీత దర్శకులు రమేశ్ నాయుడు గారి మధురమైన స్వరకల్పనకు, వేటూరి సుందరరామమూర్తి గారి కవితా వైభవం తోడై, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకిగార్ల మధుర గాత్రాల్లో ఈ పాట ఒక మధురమైన ప్రేమ సంభాషణగా నిలిచిపోయింది.

వేటూరిగారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రేమను కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య భావంగా మాత్రమే చూడరు. ప్రకృతి, సంస్కృతి, భక్తి, కవిత్వం అన్నింటినీ కలిపి ప్రేమను ఒక అందమైన అనుభూతిగా మలుస్తారు. ఈ గీతం అందుకు చక్కని ఉదాహరణ.

~

సాహిత్యం – విశ్లేషణ

పల్లవి:
అతడు: కదిలే కోరికవో..
ఆమె: హా
అతడు: కథలో నాయికవో..
ఆమె: అహా
అతడు: కవితా కన్యకవో..
ఆమె: ఆహా
అతడు: భువిలో తారకవో..
ఆమె: ఆహా
అతడు: ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం
ఆమె: ల ల లలల.. హ హ హ వలచే గోపికని..
అతడు: హా
ఆమె: కొలిచే రాధికని..
అతడు: ఒహో
ఆమె: మనసే కానుకని..
అతడు: ఆహా
ఆమె: మురిసే బాలికని..
అతడు: ఓహో
ఆమె: ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం

చరణం 1:
అతడు: జాజిమల్లి వానజల్లులోనా..
జలకాలాడే జాణ సింగారాలే నావిగా …
ఆమె: లా ల లా
అతడు: సందె గాలి తావి చిందుల్లోనా..
అందాలన్ని ముద్దమందారాలై నావిగా …
ఆమె: హా హా హా
అతడు: ఏ వంక లేని వంకజాబిల్లి
నా వంక రావే నడిచే రంగవల్లి
ఆమె: అందుకో కమ్మని ఆమని ప్రేమని
॥కదిలే కోరికవో॥

చరణం 2:
ఆమె: కోనసీమ కొత్త కోక గట్టి..
గోదారమ్మ పొంగే కొంగు చుట్టి..
లీలగా..
అతడు: హా హా హా
ఆమె: కోయిలమ్మ ఇంటి కూనలమ్మ
గొంతు దాటి కొత్త పాట పాడి
తియ్యగా..
అతడు: లా ల లా
ఆమె: నీవంకే వాలేనింక రాచిలక
చిలకమ్మ కోరే గూడె గోరింక
అతడు: పంచుకో గూడుని గువ్వని గుండెని..
ఆమె: వలచే గోపికని..
కొలిచే రాధికని..
మనసే కానుకని..
మురిసే బాలికని..

పాట ప్రారంభమే వేటూరి గారి అద్భుతమైన ఊహాశక్తికి అద్దం పడుతుంది. సాధారణంగా ఒక ప్రేమికుడు తన ప్రేయసిని అందంగా ఉందని వర్ణిస్తాడు. కానీ వేటూరి గారి కలంలో ఆమె కేవలం అందమైన అమ్మాయి కాదు. ఆమె ఒక కదిలే కోరిక, ఒక కథలో నాయిక, ఒక కవితా కన్యక, ఒక భువిలో తారక.

‘కదిలే కోరికవో’ అనే ప్రయోగంలోనే కవి గొప్పతనం కనిపిస్తుంది. కోరిక అనేది మనసులో ఉండే ఒక భావం. దానికి సాధారణంగా రూపం ఉండదు, కదలిక ఉండదు. కానీ ప్రేయసి రూపంలో ఆ కోరికకు జీవం వచ్చిందని కవి చెబుతున్నారు.

‘కథలో నాయికవో’ – ప్రతి మనిషి జీవితం ఒక కథ అయితే, ఆ కథలో ప్రధాన పాత్ర తన ప్రేయసిదే అని ప్రేమికుడు భావిస్తున్నాడు.

‘కవితా కన్యకవో’ – కవి ఊహల్లో పుట్టే అందమైన భావానికి రూపం ఇస్తే అది కవిత. అలాంటి కవితకు జీవం పోసిన రూపమే ఆమె అని చెప్పడం వేటూరి గారి కవితా దృష్టి.

‘భువిలో తారకవో’ – చీకటిలో దారి చూపే నక్షత్రంలా, జీవితంలో వెలుగునిచ్చే వ్యక్తిగా ప్రేయసిని చూడటం. అంతేకాదు ‘తరింప చేసేది తారక’. ఆమె అతడి జీవితాన్ని తరింపజేసేదిగా భావిస్తున్నాడు.

నాలుగు పంక్తుల్లో నాలుగు భిన్నమైన రూపకాలను ఉపయోగించి ఒకే వ్యక్తి పట్ల ఉన్న అపారమైన ఆరాధనను చూపించడం వేటూరి గారి భావ వైభవం.

ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం:

ఇది కేవలం ప్రేయసికి పలికిన ఆహ్వానం కాదు. తన జీవితంలోకి ప్రేమ అనే కొత్త వెలుగు ప్రవేశించడాన్ని ఆహ్వానిస్తున్న ఒక హృదయపు పలుకరింపు. ఇక్కడ ‘స్వాగతం’ అనే పదం ఎంతో ప్రత్యేకమైనది. ప్రేమను పొందాలని కోరుకోవడం మాత్రమే కాదు, ప్రేమను గౌరవంగా ఆహ్వానించడం అనే సంస్కారం ఇందులో కనిపిస్తుంది.

ఆమె:
వలచే గోపికని..
కొలిచే రాధికని..
మనసే కానుకని..
మురిసే బాలికని..

ఇక్కడ నాయిక తన ప్రేమను తనదైన మృదుత్వంతో వ్యక్తం చేస్తుంది. ‘గోపిక’ అంటే కృష్ణుని కోసం పరితపించే స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక.

‘రాధిక’ అంటే ప్రేమలోని సంపూర్ణమైన ఆరాధనకు ప్రతీక.

వేటూరి గారు ప్రేమను కేవలం ఆకర్షణగా చూపించలేదు. అందులో భక్తి భావాన్ని కూడా మేళవించారు. గోపికల ప్రేమలో ఉన్న తపన, రాధిక ప్రేమలో ఉన్న ఆత్మీయత – ఈ రెండూ కలిసినప్పుడే పరిపూర్ణమైన ప్రేమ అవుతుంది.

‘మనసే కానుకని’ అనే ప్రయోగం ఎంతో అందమైనది. మనసు కానుకగా ఇస్తా అనటంలేదు, నేనే నిష్కల్మషమైన మనసుని, నన్ను నేనే కానుకగా ఇస్తా అంటోంది. ప్రేమలో ఇవ్వగలిగే గొప్ప కానుక ఆస్తులు కాదు, అలంకారాలు కాదు – స్వచ్ఛమైన మనసు.

చరణం-1:

“జాజిమల్లి వానజల్లులోనా..
జలకాలాడే జాణ సింగారాలే నావిగా..”

జాజిమల్లి అనగానే తెలుగిళ్ళముంగిట పూల పరిమళం, స్త్రీ సౌందర్యం గుర్తుకు వస్తాయి.వేటూరి గారు ప్రేయసి అందాన్ని కేవలం నగలు,అలంకారాలతో వర్ణించలేదు. ప్రకృతిలోని అత్యంత సున్నితమైన వస్తువులతో పోల్చారు..జాజిమల్లి పువ్వు సౌందర్యానికి మాత్రమే కాదు, సున్నితత్వానికి, పరిమళానికి ప్రతీక.

మామూలు వానజల్లులో కాదు, ఆమె అతడి కళ్ళకి సుకుమార సౌందర్య రాశిగా కనిపిస్తోంది, అందుకే ఆమె జాజిమల్లె పూలలో తడిసి జలకాలాడే జాణగా, ఆ జాణసింగారాలు అతడికి సొంతం అయినట్టుగా భావించి అతడు ప్రేమలో తడిసిన ముద్ద అవుతున్నాడు. ప్రకృతి పూల వర్షం కురిపిస్తుంటే, ప్రేమికుడి ఊహల్లో ఆమె అందం ఆ వానలో మరింతగా వికసిస్తోంది.

“సందె గాలి తావి చిందులోనా..
అందాలన్ని ముద్ద మందారాలై నావిగా..”

సాయంత్రపు గాలి, మందార పూలు – ఇవన్నీ ప్రేమ వాతావరణాన్ని సృష్టించే ప్రకృతి చిత్రాలు. వేటూరి గారి కవిత్వంలో ప్రకృతి ఎప్పుడూ కేవలం నేపథ్యం కాదు. అది కూడా భావాలకు స్పందించే ఒక పాత్ర. ఆమె పువ్వులాగా ఎంత సుకుమారి అంటే సందెగాలి తాకిడిలో ఆమె అందాలు మందారాలై ఎఱ్ఱగా కంది వికసిస్తున్నాయని చెప్పడం ఒక అందమైన ఉత్ప్రేక్ష.

“ఏ వంక లేని వంక జాబిల్లి
నా వంక రావే నడిచే రంగవల్లి”

ఈ పాటలోని అత్యంత అద్భుతమైన ప్రయోగాలలో ఇది ఒకటి. చంద్రుడికి మచ్చ ఉంటుంది. కానీ ప్రేయసిని “ఏ వంక లేని జాబిల్లి” అంటున్నారు. అంటే ఆమె అందం సంపూర్ణమైనది, లోపరహితమైనది. పైగా నెలవంక అనే పదాన్ని కవులు విరివిగా వాడతారు కానీ వేటూరి గారు ఇక్కడ వంకజాబిల్లి అన్నారు, అంటే యవ్వనంలో ఉన్న అర్థ చంద్రుడు. ఎంత చక్కటి తెలుగు?

ఇక “నడిచే రంగవల్లి” అనే ప్రయోగం వేటూరి గారి తెలుగు ఇంటి సంస్కృతి పట్ల ఉన్న అనుబంధానికి నిదర్శనం. తెలుగు ఇళ్ళ ముంగిట వేసే రంగవల్లి శుభానికి, వేడుకలకు, అందానికి, ఆహ్వానానికి సంకేతం. అలాంటి రంగవల్లి స్వయంగా నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా తన ప్రేయసిని ఊహించాడు కవి. ఏ వంక, ఏ వంకర, ఏ మచ్చ లేని జాబిల్లిలా, యవ్వనంలో ఉన్న నెలవంకలా నువ్వు నా వాకిట్లోకి పండుగ నాటి రంగుల ముగ్గులా నడచి రా అని ప్రేయసిని ఆహ్వానిస్తున్నాడు ప్రియుడు. అందులో ఒక మర్యాద, ఒక గౌరవం, ఒక స్వచ్ఛమైన ప్రేమ నిండి ఉంది.

చరణం-2:

“కోనసీమ కొత్త కోక గట్టి..
గోదారమ్మ పొంగే కొంగు చుట్టి..”

ఈ చరణంలో వేటూరి గారి ప్రాంతీయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తుంది. కోనసీమ అనగానే పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు, గోదావరి అందాలు గుర్తుకు వస్తాయి. “కొత్త కోక” అనేది తెలుగింటి ఆడపడుచు సౌందర్యానికి ప్రతీక. అంటే ఆమె పచ్చని కోక కట్టింది, ఆ పచ్చని సౌందర్యం ఎప్పటికీ పరిఢవిల్లుతూనే ఉంటుంది.

“గోదారమ్మ పొంగే కొంగు చుట్టి” అనే ప్రయోగంలో గోదావరిని ఒక స్త్రీగా ఊహించారు. ప్రకృతికి స్త్రీ రూపం ఇవ్వడం తెలుగు సాహిత్యంలో చిరకాల సంప్రదాయం. వేటూరి వారి చాలా పాటల్లో నదుల స్మరణ కనిపిస్తుంది. అదొక గొప్ప సంస్కారం. ఇక్కడ తేట తేట గోదావరినది పొంగును ఆమె యవ్వనపు తాజా పొంగుతో పోలుస్తున్నారు.

“కోయిలమ్మ ఇంటి కూనలమ్మ
గొంతు దాటి కొత్త పాట పాడి
తియ్యగా..”

కోయిల పాట ఎప్పుడూ వసంతానికి, కొత్త అనుభూతికి ప్రతీక. ప్రేమలో పడిన మనసుకు ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది. కొత్త పాట వినిపిస్తుంది. అందుకే వేటూరి గారు కోయిల గొంతులోని మాధుర్యాన్ని ప్రేమ అనుభూతికి ప్రతీకగా ఉపయోగించారు. ఇక్కడ కూనలమ్మ పదం వినగానే తెలుగింటి ఆరుద్ర గారి కూనలమ్మ గుర్తుకు రాకమానదు.

“నీవంకే వాలేనింక రాచిలక
చిలకమ్మ కోరే గూడె గోరింక”

చిలక, గోరింక వంటి పక్షులు తెలుగు జానపద సాహిత్యంలో ఆత్మీయతకు, జంట అనుబంధానికి ప్రతీకలు. ప్రేమవైపు ఆకర్షితమవుతున్న మనసును రాచిలకతో పోల్చడం ద్వారా ప్రేమలోని ప్రకృతి సహజమైన ఆకర్షణను ఎంతో సున్నితంగా చెప్పారు. ప్రేమ రామచిలక గోరింక వైపు వస్తోంది, గోరింక నుండి గూడు మేడ ఆస్తులు ఏమీ కోరుకోవట్లేదు, అతడి సహచర్యమే ఆమెకి గూడు. అతడి నీడ అయినా ఆమెకు అద్దాల మేడే. ఆమెకు కేవలం ప్రేమ ఉంటే చాలు.

ముగింపు:

“కదిలే కోరికవో..” గీతం కేవలం ఒక ప్రేమగీతం కాదు. ఇది ప్రేమను ఒక అందమైన కళగా, ఒక కవిత్వంగా, ఒక ప్రకృతి అనుభూతిగా దర్శించిన వేటూరి గారి సాహిత్య సృష్టి.

ఈ గీతంలో

జాజిమల్లి పరిమళం ఉంది,

మందారాల అందం ఉంది,

జాబిల్లి వెన్నెల ఉంది,

రంగవల్లి శుభలక్షణం ఉంది,

కోనసీమ పచ్చదనం ఉంది,

గోదావరి ప్రవాహం ఉంది. ఇవన్నీ కలసి ఒక స్వచ్ఛమైన తెలుగు ప్రేమ చిత్రపటాన్ని సృష్టించాయి.

జంధ్యాల గారి సున్నితమైన భావ ప్రపంచం, రమేశ్ నాయుడు గారి మధుర స్వరాలు, వేటూరి గారి పద వైభవం, బాలు – జానకి గార్ల అమృత గాత్రాలు కలసి ఈ పాటను చిరస్మరణీయంగా నిలిపాయి.

ప్రేయసిని ఒక వ్యక్తిగా కాకుండా, ఒక కవితగా, ఒక ప్రకృతిగా, ఒక వెలుగుగా చూసిన ప్రేమికుడి హృదయాన్ని ఆవిష్కరించిన ఈ గీతం – వేటూరి మధుర గీతాలలో ఒక మల్లెపువ్వులాంటి మధురమైన జ్ఞాపకం.

ప్రేమకు భాష అవసరం లేదని, ప్రకృతిలోని ప్రతి అందమైన వస్తువూ ప్రేమను పలకగలదని నిరూపించిన ఈ గీతం తెలుగు మనసులలో ఎప్పటికీ పరిమళిస్తూనే ఉంటుంది.

(‘కదిలే కోరికవో’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=0OX2P1TQ4tI)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version