[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]
నాలుగు స్తంభాలాట:
1. చినుకులా రాలి
ఉపోద్ఘాతం:
హాస్య నవలలను, చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టయిన జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన విశిష్ట ప్రేమకావ్యం ‘నాలుగు స్తంభాలాట’ (1982). రాజన్-నాగేంద్ర గార్ల మధురమైన స్వరకల్పనలో, వేటూరి సుందరరామమూర్తి గారి అమృతంపు కలం నుండి జాలువారిన సార్వకాలీన అపురూప గీతం ‘చినుకులా రాలి’. ఎన్ని తరాల తరువాత అయినా, కొత్తగా ప్రేమలో పడ్డ జంటకి ఈ పాట ఒక Anthem లాగా మిగిలిపోతుంది.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గార్ల గాత్రంలో ప్రవహించిన ఈ పాట కేవలం ఒక ప్రణయ గీతం మాత్రమే కాదు.. పైకి అపారమైన అనురాగం కనిపించినా, అంతర్లీనంగా రానున్న వియోగాన్ని, విధి చేతిలో దెబ్బతినబోయే ప్రేమికుల విషాద భవిష్యత్తును ముందుగానే హెచ్చరించే ఒక తాత్త్విక కావ్య పాఠం.
~
సాహిత్యం:
పల్లవి:
అతడు: చినుకులా రాలి.. నదులుగా సాగి..
వరదలై పోయి.. కడలిగా పొంగు..
నీ ప్రేమ.. నా ప్రేమ… నీ పేరే నా ప్రేమ..
నదివి నీవు.. కడలి నేను..
మరచిపోబోకుమా.. మమత నీవే సుమా..
ఆమె: చినుకులా రాలి.. నదులుగా సాగి..
వరదలై పోయి.. కడలిగా పొంగు..
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ..
చరణం 1:
అతడు: ఆకులు రాలే.. వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే..
కుంకుమ పూసే.. వేకువ నీవై.. తేవాలి ఓదార్పులే..
ఆమె: ప్రేమలు కోరే జన్మలలోనే.. నే వేచి ఉంటానులే..
జన్మలు తాకే ప్రేమను నేనై.. నే వెల్లువౌతానులే..
అతడు: ఆ చల్లనే చాలులే..
ఆమె: హిమములా రాలి.. సుమములై పూసి..
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు..
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ..
శిశిరమైనా.. శిథిలమైనా.. విడిచిపోబోకుమా.. విరహమైపోకుమా..
చరణం 2:
ఆమె: తొలకరి కోసం తొడిమను నేనై.. అల్లాడుతున్నానులే..
పులకరమూదే పువ్వుల కోసం.. వేసారుతున్నానులే..
అతడు: నింగికి నేల.. అంటిసలాడే.. ఆ పొద్దు రావాలిలే..
నిన్నటి నీవై.. రేపటి నీడై.. నా ముద్దు తీరాలిలే..
ఆమె: ఆ తీరాలు చేరాలిలే..
అతడు: మౌనమై వెలసి.. గానమై పిలిచి..
కలలతో అలసి.. గగనమై ఎగసే..
నీ ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ..
భువనమైనా.. గగనమైనా..
ప్రేమమయమే సుమా..
ప్రేమ మనమే సుమా..
(ముగింపు పల్లవి):
ఆమె: చినుకులా రాలి..
అతడు: నదులుగా సాగి..
ఆమె: వరదలై పోయి..
అతడు: కడలిగా పొంగు..
ఇద్దరూ: నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ..
~
విశ్లేషణ :
“చినుకులా రాలి.. నదులుగా సాగి.. వరదలై పోయి.. కడలిగా పొంగు..” – వేటూరి గారు ప్రేమని ప్రకృతితో పోలుస్తూ అది ఎలా మొదలయ్యి, ఎలా ప్రవహించి, ఎలా విస్తరించి ఉప్పొంగుతుందో చెప్పారు. అసలు ప్రకృతిలో ప్రేమ లేనిది ఎక్కడ? ప్రకృతి నుండి పుట్టిన మానవుడి స్పందనకీ, ప్రకృతి అందాలకి, మారే ఋతువులకీ , కొండ కోనలకీ జలపాతాలకీ ప్రకృతిలోని ప్రతీ అణువుకీ మానవుడి మనసులో ఉప్పొంగే ప్రేమకి లంకె ఉంటూనే ఉంటుంది. అందుకే తరచుగా ప్రకృతితో ప్రేమకి పోలిక చూపిస్తారు వేటూరి గారు.
చినుకుగా మొదలైన కథ సముద్రంలో కలిసే దాకా సాగి, మళ్ళీ ఆవిరై, మేఘమై, మళ్ళీ చినుకుగా కురుస్తుంది. ప్రేమ కూడా ఇలా తిరిగి తిరిగి పుడుతూనే ఉంటుంది ఈ లోకంలో.
ప్రేమ అనేది ఆకాశం నుంచి పడే చిన్న వర్షపు చినుకులా ప్రారంభమై, నదిలా ప్రవహించి, చివరికి ప్రవాహమై మహా సముద్రంలో సంగమించినట్లుగా.. తమ ప్రేమ కూడా పరిపూర్ణమైన వివాహ బంధం అనే కడలిలా పొంగిపోవాలని ఇద్దరూ ఆశిస్తారు.
పాటలో చినుకు నదిగా మారి సముద్రంలో కలిసినట్లు చూపించారు కానీ, కథలో మాత్రం వారి ప్రేమ చిన్న చినుకులాగే రాలిపోయి, విధి విసిరిన సుడిగుండంలో కొట్టుకుపోయి సముద్రం అనే వివాహ బంధందాకా చేరకుండానే ఆవిరైపోతుంది.
“నదివి నీవు.. కడలి నేను.. మరచిపోబోకుమా.. మమత నీవే సుమా..” – ‘నువ్వు నా వైపు పారే నదివి, నిన్ను నాలో కలుపుకునే కడలిని నేను, నన్ను మరచిపోకు’ అని నాయకుడు వేడుకుంటాడు.
నది సముద్రంలో కలవడమే ప్రకృతి ధర్మం, కానీ ఇక్కడ ఆ నది కడలిని చేరనే లేదు. ‘మరచిపోబోకుమా’ అన్న జంటకి.. పరిస్థితులు బలవంతంగా వేరు చేసి మరచిపోయేలా నిర్బంధించి, వియోగం వైపు నెట్టివేస్తాయి.
చరణం 1:
“ఆకులు రాలే.. వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే.. వేకువ నీవై.. తేవాలి ఓదార్పులే..” – ఆమెకోసం ఎదురుచూస్తూ విరహంతో నిట్టూరుస్తూ ఉన్నాడు ప్రేమికుడు. ప్రేమ వసంత ఋతువులా విరబూసింది అని పాడటం నిత్యం వినేదే కానీ ఆ వసంతంలో కూడా వడగాలులు ఉంటాయనీ, ప్రేమలో కూడా విరహాలు నిట్టూర్పులు ఉంటాయని, అవి ఆకులనీ, ఆశల్నీ రాల్చివేస్తాయని కొత్త కోణాన్ని చూపించారు వేటూరి గారు.
మరి ఆ విరహ వేదన తీరడానికి ఆమె సరికొత్త ఉదయంలా, ‘కుంకుమ’లా మెరిసే శుభ వేకువలా వచ్చి తనను ఓదార్చాలని నాయకుడు కోరుకుంటాడు. కుంకుమ అనేది వివాహ బంధాన్ని సూచిస్తుంది. అతడి జీవితంలోకి సరికొత్త సూర్యోదయంలా, అతడి భార్యగా ఆమె రావాలని అతడి ఆకాంక్ష.
నాటకీయంగా ఆమె కుంకుమ, ఆ పెళ్లికళ వేరొకరి సొంతమవుతాయి. అతను కోరుకున్న ‘ఓదార్పు’ దక్కకపోగా, అతని జీవితంలో ఆ వేసవి నిట్టూర్పులే శాశ్వతమవుతాయి.
“ప్రేమలు కోరే జన్మలలోనే.. నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై.. నే వెల్లువౌతానులే..” – ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా నీ ప్రేమ కోసం వేచి ఉంటానని, నీ జీవితాన్ని తాకే ప్రేమ వెల్లువలా మారుతానని నాయిక అంటుంది.
“శిశిరమైనా.. శిథిలమైనా.. విడిచిపోబోకుమా.. విరహమైపోకుమా..” – వేటూరి గారు ఏ ఉద్దేశంతో ఈ ఆగామి సూచకం వ్రాసారో ఈ వాక్యాలు చెబుతాయి మన జీవితం వసంతం కాక ‘శిశిరం’ అయి రాలిపోయినా, మన బంధం ‘శిథిలం’ అయిపోయినా, నన్ను విడిచిపోకు అని వేడుకుంటారు.
నిజంగానే వారి జీవితాలు శిశిరమై, ప్రేమ గోపురం శిథిలమైపోయి.. ఇద్దరూ విరహ వేదనతో విడిపోతారు. వారు వద్దనుకున్న ప్రతీది (శిథిలం, విరహం) వారి జీవితాల్లో నిజమవుతుంది.
చరణం 2:
“తొలకరి కోసం తొడిమను నేనై.. అల్లాడుతున్నానులే పులకరమూదే పువ్వుల కోసం.. వేసారుతున్నానులే..” – మొదటి వర్షపు బొట్టు, అదే తొలకరి.. దాని కోసం చెట్టు తొడిమ వేచి చూసినట్లు, ప్రియుడి స్పర్శ అనే పులకరింత కోసం నాయిక అల్లాడిపోతోంది. ఆమె అతడి జీవితంలో వసంత ఋతువు, కానీ ఆమె విరబూయడానికి అతడే ఆమెకు తొలకరి వర్షం.
“నింగికి నెల.. అంటిసలాడే.. ఆ పొద్దు రావాలిలే నిన్నటి నీవై.. రేపటి నీడై.. నా ముద్దు తీరాలిలే..” – నింగి-నేల ఒకదానినొకటి తాకుతున్నట్లు కనిపించే క్షితిజంలాగా.. దూరం నుండి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టుగా, ధనవంతుడు అయిన అతడు, పేద పిల్ల అయిన ఆమె ఒక్కటయ్యే ఆ శుభ దినం రావాలని, ఆశ తీరాలని నాయకుడు ఆరాటపడతాడు.
‘నింగి, నేల’ ఎప్పటికీ కలవవు! అది కేవలం భ్రమ. వేటూరి గారు ఈ ప్రయోగం ద్వారా వారి కలయిక అసాధ్యమని సూచనప్రాయంగా చెప్పారు. ఎంత ఆశపడినా ఆ ‘తీరాలు’ వారు ఎప్పటికీ చేరలేరు.
“మౌనమై మెరిసి.. గానమై పిలిచి.. కలలతో అలసి.. గగనమై ఎగసే..” – మన ప్రేమ సూర్యోదయంలా మౌనంగా మెరుస్తూ ప్రారంభం అయి, భూపాల గానమై ఒకరికి ఒకరం ఆహ్వానం పలికి, ఎన్నెన్నో ప్రేమ కలలు కని, ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని పాడుకుంటారు.
పాట ముగిసేసరికి వారి ప్రేమ ఆకాశంలో తారాడే మేఘంలా మిగిలిపోతుందే తప్ప.. నేలమీద నిజమయ్యే దాంపత్యంగా మారదు. భువనమైనా, గగనమైనా మనమే అనుకున్న ప్రేమికులు.. కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు.
ఏది ఏమైనప్పటికీ, ఎన్నో మలుపులు తిరిగి, త్యాగాలు చవిచూసి, చివరికి ప్రేమికులు ఇద్దరూ వివాహం చేసుకుంటారు.. అది శుభ పరిణామం.
ముగింపు:
వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్య ప్రతిభకు ఈ ‘చినుకులా రాలి’ గీతం ఒక శిఖరాగ్ర ఉదాహరణ. ప్రేమికులు పరస్పరం పాడుకునే అత్యంత మధురమైన ప్రణయ గీతంగా పైకి కనిపిస్తున్నప్పటికీ..
“కడలిగా పొంగు, శిశిరమైనా – శిథిలమైనా, విరహమైపోకుమా, నింగికి నెల అంటిసలాడే” వంటి శబ్దాల ద్వారా అద్భుతమైన తెలుగు తీపిని, అద్భుతమైన ఉపమానాలని అందించటమే కాక రాబోయే విషాదపు ముగింపును, విధి ఆడే విపరీత క్రీడను ముందే ఆవిష్కరించారు. ఈ పాటలో ప్రేమనీ ప్రకృతితో ముడిపెట్టి చెప్పటమే కాదు, ప్రతీ చరణం కింద పల్లవి మారిపోతూ ఉండటం గమనిస్తే వేటూరి గారి కలం, ఒకే సందర్భానికి ఒకే రాగానికి ఎన్ని రంగుల సాహితీ సుమాలని పూయించగలదో కానవస్తుంది.
రాజన్-నాగేంద్రల శ్రావ్యమైన ఈ అమర సంగీతం, బాలు-సుశీలల ఆత్మీయ గాత్రం.. ఈ పాటను తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భావోద్వేగభరితమైన ఐకానిక్ గీతంగా, తరతరాల యువ ప్రేమికులకు నిత్య స్మరణీయ గీతంగా నిలిపాయి..
(‘చినుకులా రాలి’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=V49SnY8zrls)
(మళ్ళీ కలుద్దాం)
డా. మాధురి ఇంగువ ప్రముఖ తెలుగు రచయిత్రి, ఆధ్యాత్మిక పరిశోధకురాలు, విశ్లేషకురాలు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న వీరు, తెలుగు సాహిత్యంపై, ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, తెలుగు సినీ గేయాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి పాటలపై ‘వేటూరి గీతామృతం’, ‘వజ్రకుండం’, ‘మధు ప్రణీతం’ వంటి పుస్తకాలను రచించారు. గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం గ్రహీత.
