Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-8

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

రెండు జెళ్ల సీత:

1. కొబ్బరి నీళ్ళ జలకాలాడి..

ఉపోద్ఘాతం:

హాస్యబ్రహ్మ జంధ్యాల గారి విశిష్ట వినోదాత్మక, సందేశాత్మక చిత్రం ‘రెండు జెళ్ల సీత’ (1983)లో, రమేష్ నాయుడు గారి చలాకీ స్వరకల్పనకు, వేటూరి సుందరరామమూర్తి గారి అపూర్వమైన పాత్రచిత్రణకు అద్దం పట్టే హాస్యగీతం ‘కొబ్బరి నీళ్ళ జలకాలాడి..’.

కథా నేపథ్యం:

నలుగురు కుర్రాళ్ళు కలిసి తమతో ఉండే ఒక అమాయకపు తిండిపోతు మిత్రుడికి ప్రేమ పాఠాలు, పాటలు, నటన నేర్పించి, అతడిని ఒక అమ్మాయితో ప్రేమలోకి దించడానికి ఎన్నో తంటాలు పడతారు. పార్కులో ఆ అమ్మాయిని కలుసుకున్నప్పుడు ఆమె నిజమైన ప్రేమతో పాడుతున్నా.. ఈ కుర్రాడు మాత్రం నేర్చుకున్న ప్రేమపాటను మధ్యలోనే మరచిపోయి, తన నైజమైన తిండిపోతు బుద్ధిని బయటపెడుతుంటాడు. మిత్రులు పొదల వెనుక నుండి బెదిరిస్తే మళ్లీ శృంగార భావంలోకి వస్తుంటాడు.

ఇక్కడ వేటూరి గారు కేవలం ప్రేమగీతాన్ని రాయలేదు; ప్రేమకవిత్వం పాడుతున్న ఒక తిండిపోతు మనిషి అంతరంగాన్ని రాశారు! “శ్రీకాకుళే మహాక్షేత్రే, గుండేరే మహానదీ..” అనే ప్రసిద్ధ సంస్కృత శ్లోక నిర్మాణ వరుసను అనుకరిస్తూ “మాగాయ మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి..” అనే ఊరగాయ పద్య ప్రయోగం చేయడం ఈ పాటలోని వేటూరి గారి శబ్దచమత్కారానికి, కవితా వైచిత్రికి పరాకాష్ఠ.

~

సాహిత్యం – విశ్లేషణ:

పల్లవి:

అతడు: కొబ్బరి నీళ్ళ జలకాలాడి..
ఆమె: ఊఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁహూఁ.
అతడు: కోనసీమ కోక గట్టి..
ఆమె: ఆహా.. ఆహా.. ఆహా.
అతడు: పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తావా..
ముద్దు తీర్చే సందిటి కొస్తావా.. ఆ..
ఆమె: కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. కోనసీమ కోక గట్టి..
పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తాలే.. ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే..ఏ..

చరణం 1:

ఆమె: ఆకాశ వీణల్లో నేను.. అనురాగమే పాడుకుంటా
అతడు: గొంగూర పచ్చట్లో నేను.. ఉల్లిపాయే నంజుకుంటా.. స్స్.. నీరుల్లిపాయే నంజుకుంటా..
ఆమె: ఆకాశ వీణల్లో నేను.. అనురాగమే పాడుకుంటా
అతడు: శృంగార వీధుల్లో నేను.. రసనాట్యమే ఆడుకుంటా.. ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా
ఆమె: మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా..
అతడు: వదిలేస్తే వంకాయ వండించుకుంటా..
..ఆహ్.. I am sorry.. “వంకాయ వంటి కూరయు.. పంకజముఖి సీత వంటి భార్యామణి” అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట..
॥కొబ్బరి నీళ్ల జలకాలాడి॥

చరణం 2:

ఆమె: అమ్మవారి ఎదుట నేనూ.. ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా
అతడు: అమ్మతో చెప్పి నేనూ.. ఊ.. అప్పచ్చులే తెచ్చుకుంటా..
ఆమె: అమ్మవారి ఎదుట నేనూ.. ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా
అతడు: అసుర సంధ్యవేళ నేనూ.. ఊ.. ఆలయంలో వేచి వుంటా.. నీ హారతే అందుకుంటా
మాగాయలోన పెరుగేసుకుంటా.
ఆమె: వదిలెస్తే నా దారి నే చూసుకుంటా..
అతడు: హ్మ్.. చూడండి.. “మాగాయ మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి.. అది వేస్తే అడ్డ విస్తరి.. మానిన్యా మహాసుందరి..” అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట..
॥కొబ్బరి నీళ్ల జలకాలాడి॥
♤

పల్లవిలోనే వేటూరి గారు కోనసీమ గ్రామీణ శోభను, తెలుగుతనాన్ని ఆవిష్కరిస్తారు.

పన్నీటి జలకాలు కాక కొబ్బరి నీటి జలకాలు ఆడాలి అనడం కొబ్బరి చెట్లు బాగా పండే గోదారి సీమని , గోదారి నదిని కళ్ళ ముందు నిలబెడుతుంది, ఎంతో మాగాణి ఉన్న ఆ ధనవంతుల బిడ్డ గోదారి నీటితో కాక కొబ్బరి నీళ్లతో స్నానం చేయాలి అనుకోవడం ఆమె రాచరికపు భావాలకి ప్రతీక.

కోనసీమ కోక – పచ్చని పొలాలను కోనసీమ కోకలాగా చుట్టుకుంది. నాయిక పచ్చని కోక కూడా కోనసీమ లాగ ఉన్నది.

పొద్దుటెండ తిలకాలెట్టి – ఆడపిల్ల నుదుట దిద్దుకునే ఎఱ్ఱని తిలకం, ఆకాశంలాంటి విశాలమైన నుదుటి మీద సూర్యోదయంలా ఉన్నది.

ముద్ద పసుపు- సాయంత్రం సూర్యాస్తమయం వేళ సూర్యుడు పసుపు ముద్దలా ఉన్న సందెవేళ ఆమె అతడి సందిటికి వచ్చి ముద్దు తీరుస్తా అంటోంది.

ఈ పదచిత్రాలు అన్నీ ఒక పల్లెటూరి మంగళస్వరూపాన్ని కనులముందు తెస్తాయి. ఉదయించే పొద్దుటి ఎండను నుదుటి తిలకంగా, పసుపును మంగళప్రదమైన సౌభాగ్య చిహ్నంగా ఊహించడం ప్రౌఢమైన రూపకాలంకార శోభను చిలకరిస్తుంది.

చరణం 1:

మొదటి చరణంలో పాట ఆకాశం నుండి నేలదాకా వచ్చి అద్భుతమైన పాత్రోచిత భాషాలంకారంగా, హాస్యంగా మారుతుంది!

“ఆకాశ వీణల్లో నేను అనురాగమే పడుకుంటా” అంటుంది నాయిక, తన ప్రేమ ప్రపంచం ఆకాశమంత భావుకతతో నిండిపోయి రూపకాలంకారంగా మారి ఆకాశాన్ని వీణగా చేసుకొని ‘అనురాగం’ పాడుతుంటే.. నాయకుడు మాత్రం ‘గొంగూర పచ్చట్లో ఉల్లిపాయ’ నంజుకుంటానంటాడు!

నాయిక ప్రణయం, శృంగారం అని మాట్లాడుతుంటే.. నాయకుడు గొంగూర, ఉల్లిపాయ, వంకాయ అని మాట్లాడటం ఇక్కడ విరుద్ధ భావాలంకారం. ఈ పరస్పర విరుద్ధ భావనల వల్లనే హాస్యరసం నిష్పన్నమవుతుంది.

నాయిక “మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా” అంటే.. తిండిపోతు నాయకుడు “నువ్వు వదిలేస్తే వంకాయ వండించుకుంటా!” అని అంటాడు. మిత్రులు తలంటి పోయగానే సమర్థించుకుంటూ చాటుపద్య భాగమైన “వంకాయ వంటి కూరయు.. పంకజముఖి సీత వంటి భార్యామణి” అని తెచ్చిపెట్టుకున్న పాండిత్యంతో తన తిండిపోతుతనాన్ని కప్పిపుచ్చుకోవడం హాస్యానికి పరాకాష్ఠ.

చరణం 2:

నాయిక ప్రేమను వివాహ సంకల్పం వరకు తీసుకెళ్తూ.. అమ్మవారి ఎదుట పవిత్రమైన కుంకుమ దిద్దుకుంటానంటే, ఇతడు మాత్రం “అమ్మతో చెప్పి అప్పచ్చులే తెచ్చుకుంటా” అని పసితనపు అమాయక తిండి ధ్యాసను ప్రకటిస్తాడు.

మరుక్షణమే మిత్రుల హెచ్చరికతో “అసుర సంధ్యవేళ ఆలయంలో హారతి అందుకుంటా” అని ప్రణయ రసంలోకి వెళ్ళిపోతూనే, వెంటనే “మాగాయలో పెరుగేసుకుంటా” అని అసలు నైజానికి వచ్చేస్తాడు. ఆపై “శ్రీకాకుళే మహాక్షేత్రే..” శ్లోక పద్ధతిలో మాగాయ – పెరుగు – విస్తరి వంటి లౌకిక తిండి పదార్థాలను కలిపి శ్లోకంలా వల్లెవేస్తూ, చివరికి “మానిన్యా మహాసుందరి” అని ప్రేయసిని సంబోధిస్తాడు.

సాధారణ మాగాయని “మహాపచ్చడి” అని, పెరుగును “మహత్తరి” అని పరమ పవిత్రం చేస్తూ శ్లోక రీతిని అనుకరించడం ద్వారా ఇక్కడ ఉపమా, అతిశయోక్తితో హాస్య అనుకరణ, అదే Parody.. ప్రస్ఫుటమవుతాయి.

మొత్తానికి బాల్యపు ఛాయలు పోని, ఇంకా ప్రేమకీ పెళ్లికి సిద్ధంగా లేని ఒక తిండిపోతు కుర్రాడిని ప్రేమలోకి దింపడానికి స్నేహితులు పడే తంటాలు, ఆ కుర్రవాడి తిండిపోతుతనం, తెచ్చిపెట్టుకున్న ప్రేమ, అరువు తెచుకున్న పాండిత్యం వెరసి వేటూరి గారి కలం పండించిన చిరస్థాయి హాస్య గీతం ఇది.

రమేష్ నాయుడు గారి చలాకీ స్వరాలకు, బాలు – జానకి గార్ల గాత్ర నాటకీయత తోడై ఈ పాటను మరువలేని గీతంగా మార్చాయి. బాలు గారి గాత్రంలో ప్రతిధ్వనించే తడబాటు, మిత్రుల భయానికి అది శృంగారంలోకి మారే క్రమం, ఆపై పాటను ఆస్వాదిస్తూ జానకి గారు ఇచ్చే చిలిపి స్పందనలు సాహిత్యానికి మరింత ఊపిరి ఊదాయి.

ముగింపు:

“కొబ్బరి నీళ్ళ జలకాలాడి..” పాటలో వేటూరి సుందరరామమూర్తి గారు ప్రేమను రాయలేదు.. ప్రేమకవిత్వం నేర్చుకుంటున్న ఒక అమాయకపు తిండిపోతు అంతరంగానికి అక్షర రూపమిచ్చారు.

ఆకాశం-అనురాగం పక్కనే గొంగూర-ఉల్లిపాయ, శృంగారం పక్కనే వంకాయ, ఆలయం-హారతి పక్కనే అప్పచ్చి, చివరకు సంస్కృత శ్లోక గంభీరత మధ్య మాగాయ ప్రవేశించడం వేటూరి గారి అసమాన సృజనాత్మకతకు తార్కాణం. ఒక మహాకవి తలుచుకుంటే విజ్ఞానాన్ని, పాండిత్యాన్నే కాదు.. ఆ పాండిత్యంతోనే పొట్టచెక్కలయ్యే హాస్యాన్ని కూడా ఎలా పండించవచ్చో నిరూపించిన అజరామర గీతం ఇది.

(‘కొబ్బరి నీళ్ళ జలకాలాడి’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=PPhHh2N_Jmc)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version