Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘వేయిపడగలు – ఒక పరిశీలన’ శ్రీ శేషేంద్రశర్మ సాహిత్య లేఖ

[సెప్టెంబరు 10, 2025 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా, ఈ ఆదివారం నుంచి, 07 సెప్టెంబర్ 2025 ఆదివారం వరకు – విశ్వనాథ సత్యనారాయణ గారిపై ప్రతి వారం ఒక ప్రత్యేక వ్యాసాన్ని అందించనున్నాము.]

[ముదిగొండ వీరభద్రయ్య గారి ‘వేయిపడగలు-ఒక పరిశీలన’ పుస్తకాన్ని చదివాక మహాకవి శేషేంద్రశర్మ గారు రాసిన లేఖను ఇక్కడ అచ్చుచేస్తున్నాము. సాహితీ ప్రియులకు పనికివచ్చే అనేక అంశాలు ఇందులో ఉండటంచేత ఈ లేఖను  ప్రచురిస్తున్నాము. (సంపాదకుడు)]

విద్వన్మిత్రులు శ్రీ వీరభద్రయ్యగారికి నమస్కారములు.

మీరు దయతో పంపిన ‘వేయిపడగలు ఒక పరిశీలన’ అందింది. చాలా కృతజ్ఞుడ్ని. గ్రంథం చదవడం ముగించాను. విశ్వనాథవారి ‘వేయిపడగలు’ భారతీయ సాహిత్యం అనే హిమాలయ శిఖరాల శ్రేణిలో ఒక మహత్తర శిఖరం. ఒక మహత్తర శిఖరమే కాదు మన దేశ సంస్కృతిని చిత్రించే మహాభారతం లాంటి మరొక మహాభారతం. విశ్వనాథ వేదవ్యాసుడే. అసలు విశ్వనాథవారి సాహిత్య సృష్టి చక్రం వేయిపడగలు అనే ఇరుసు మీదనే తిరుగుతోంది. ఆయన అన్య కృతులన్నీ దాని చుట్టూ ఉండగా వేయిపడగలు కేంద్రంలో ఉంటుంది. ఇందులో కవిత్వము నవల అనే ప్రక్రియా భేదానికి తావులేదు.

శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ

విశ్వనాథ కావ్య వస్తువులైన ఆర్థిక సామాజిక విలువలతో నేను సంపూర్ణతః ఏకీభవించను. నాకు సమ్మతమైన విలువలు, నా వర్తమాన దేశ కాలాలకు చెందినవి. కనుక అవే నా కావ్యకృతుల్లో ప్రతిబింబితం అవుతాయి: అవి విశాల అర్థంలో మార్క్సిస్టు దృక్పథ భరితమైన విలువలు అనాలి. అవి నా కావ్యతకు ప్రేరణ పదార్ధాలు: నా జీవనానుభూతులకు నిప్పంటించే అగ్గిపుల్లలు. కానీ ఇక్కడ చెప్పదలిచిందేమిటంటే అవి నా కావ్యతకు కీలక హేతువులు కావు: కీలక హేతువు వాటికి పునాదిగా ఉన్న మానవత వస్తువు. దాన్ని కాలం ఉత్తరోత్తర క్రమంగా విశాలాతి విశాల ప్రవాహంగా రూపొందిస్తూ పోతుంది. కానీ పరిణామ రూపాలు ఇలా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మానవ హృదయగతమైన అభిప్రాయం. అలాగే కవి హృదయం మాత్రం మానవత విషయంలో తత్త్వం ఎప్పుడూ ఒక్కటే. దాన్నే కరుణ అన్నారు. అది లేక కావ్యసృష్టి లేదు. పాఠకుడు గానీ నేటి విమర్శకుడు గానీ ఒక కృతిలో దాని కోసమే వెతకాలి.

సాహిత్య మర్మజ్ఞతా శూన్యులైన వారు, విమర్శకమ్మన్యులు, విశ్వనాథను ఆయన దేశ కాల సందర్భంలో పెట్టి పరిశీలించక, తద్భిన్న ప్రమాణాలతో కొలుస్తారు. విశ్వనాథ తన తరానికి దేశ జీవనానికి కావ్య రూపం ఇచ్చాడు [కథ కూడా కావ్యమే]. వర్తమాన కాలీన చేతన ఆయనలో లేదు. అది వ్యర్థం. వర్తమానత వేరు, తరం వేరు. కానీ కావ్యవస్తు విచార సందర్భంలో కవి యొక్క దేశకాల నిర్బంధాల్ని ప్రభావాల్ని దృష్టిలో ఉంచుకుని ఆ కవి కృతిని విలువ కట్టాలి. ఆ విధంగా చూస్తే వేయిపడగల్లో కావ్య వస్తువు ప్రాచీన విలువల్ని సమర్థిస్తుందని పేర్కొనడం దోషదూషిత మైన విమర్శ. వస్తువుకు సంబంధించిన సామాజిక విలువల విషయంలో రాయప్రోలు కృష్ణశాస్త్రి ప్రభృతులైన ఆయన సమకాలీన రచయితలు ఆయన కంటే భిన్నులు కారు. కనుక కావ్యవస్తు విషయంలో సామాన్యతః ఆయన సమకాలికులైన రచయితలందరూ సమానులే. అందుచేత ఆయన్నే ప్రత్యేకంగా విడదీసి ఒక నేరారోపణకు గురిచేయడం న్యాయ సమ్మతం కాదు. అది నన్నయ భట్టును నీవు నీ తరాన్ని నీ కృతిలో ఎందుకు ప్రతిబింబించావు అని అడిగినట్లవుతుంది. లేదా నీవు నీ ఆగామి యుగాల చేతనని ఎందుకు ప్రతిబింబింపలేదు అని ఆక్షేపించినట్లవుతుంది.

ఉన్నత గురజాడ లాంటి కృతికర్తలు దూరదృక్కులు, దేశ కాలాధి గత చక్షుస్కులు, అవడం సాహిత్యక్షలో ఒక గొప్ప విశేషం. కానీ ఆ లక్షణాలు లేకపోవడం ఒక కావ్య కృతి యొక్క సాహిత్యతా విలువని తగ్గించదు.

సాహిత్యంలో సర్వమానవీయ భావనా ప్రపంచానికీ ఆధార భూతమైన మానవత ప్రతిబింబితం అయిందా లేదా అనే విషయం ప్రధానం. వర్తమానతకు చెందిన సామాజికాది విలువలు పరిణామ క్రమగ్రస్తమైనవి: వాటిని అధిగమించిన మానవత శాశ్వత వస్తువు. ఏనాటి విలువలైనా సరే, కావ్య వస్తువులో నుంచి మానవతను పిండి కవి తన వాక్యాలకు త్రాగిస్తాడు. అన్ని కాలాల్లో దేశాల్లో కవి చేసే పనే ఇది. ఆ ప్రక్రియ మూలంగానే ఒక రచన కావ్యత పొందుతుంది. ఉదా: ధర్మవ్యాధుడి కథ: కానీ ఆ కథ వర్ణ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది అనే విమర్శ అల్పస్థాయికి చెందినది; కానీ ఆ కథ మానవుడిలో కర్మ ఫలత శిఖరస్థ ధర్మమని చెపుతుందనే విమర్శ ఉత్కృష్టస్థాయికి చెందిన విమర్శ. ఒక కవి భవిష్యత్కాలీన విలువల్ని ప్రతిబింబించాడా లేదా అనే విషయం కావ్యతా వివేచనలో కీలక విషయం కాదు. కవి కేవలం ‘కాలజ్ఞాన వచనాలు’ రాసే యోగీశ్వరుడు గాని గ్రహవిషయ వస్తువ్యస్తములైన పంచాంగాలు రాసే సిద్ధాంతి గానీ కాదు. ఒక అడుగు ముందుకు వెళ్ళి చెపితే మానవతా ద్రవ్యం కావ్యత్వ సృజనలో మిళితం అయిందా లేదా అనేది కూడా కీలక విషయం కాదు. కానీ కీలక విషయతుల్య స్థానంలో ఉంటుంది, అనే సాహిత్య సూత్రం మాత్రం ముఖ్యం. మానవత్వ ద్రవ్య వివర్జితమైన కావ్యం వాసనలేని పువ్వు బుధవర్గములేని పురంబు అన్నట్లవుతుంది.

డా. ముదిగొండ వీరభద్రయ్య

ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే విశ్వనాథని ఆయన దేశ కాల సందర్భంలో వుంచి మూల్యాంకన చేసే సాహిత్య సంస్కృతి తెలుగు క్షేత్రంలో ఉదయించాలని నా ఆశయం. మార్క్స్ ప్రభృతులు షేక్‌స్పియర్ ఆది కవుల్ని మెచ్చుకున్నప్పుడు వాళ్ళ సాహిత్య సంస్కారం ఇదే. టాల్‌స్టాయ్ ఎంతో మతాంధుడు, కానీ ఆయన్ని లెనిన్ ఎంతో మెచ్చుకున్నాడు. ఏ కారణాల చేత మెచ్చుకున్నాడో వాటిని నేటి విమర్శకుడు గమనించాలి. మీ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. ఇలాంటి కృతులు కొన్ని వస్తూ ఉండకపోతే మహానుభావులైన వారు చేసిన ఉత్కృష్ట సృష్టి దుష్టుల వక్ర ప్రచారగ్రస్తమైపోయే ప్రమాదం తప్పదు.

విశ్వనాథ భారతీయ సాహిత్యంలో జూలియన్ సీజర్ లాంటివాడు. టాల్‌స్టాయ్ దివంగతుడైనప్పుడు ఒక విమర్శకుడు “ఒక మహారణ్యంలో మహావృక్షమైన ఒక చెట్టు పడిపోయినప్పుడు ఆ శబ్దం వందలాది మైళ్ళు ధ్వనించినట్లు టాల్‌స్టాయ్ అనే మహాపురుడి మృతి శతాబ్దాల వరకు వినిపిస్తూ ఉంటుంది.” అన్న మాటలు విశ్వనాథకు అక్షరాలా వర్తిస్తాయి.

ఆయన నా గురువు కావడం నాకెంత గర్వకారణమో చెప్పడానికి నా దగ్గర ఉన్న భాష చాలదు.

గుంటూరు శేషేంద్రశర్మ

Exit mobile version