[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన – ‘వేయిపడగలు’లో గిరికా వైభవం! – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ అనే మహావనంలో కాస్త పక్కగా, మిగతా మొక్కలలాగా అందరి దృష్టీ తమ పూల అందచందాల వైపు, వన్నెల వైపూ మరలాలని ఎటువంటి కోరికా లేని, ఉబలాటమూ చూపని ఒక ప్రశాంతమైన తులసి ఉపవనం లాగా అనిపిస్తుంది, ‘గిరిక’ పాత్ర!
సామాన్య మానవుల జీవన సంఘర్షణలూ, జయాపజయాలు, ఈసునసూయలు, రాగద్వేషాలూ ఇత్యాదులు అంటని ఒక ఆధ్యాత్మిక లేక భక్తిభావనా ప్రపంచంలో బ్రతికిన ఒక అసామాన్య, గిరిక.
దేవదాసీ వృత్తిలో ఉన్నవారి ఇంట పుట్టినా ఆ వాసనలేవీ అంటని, సత్త్వభావ గుణనిక, ఈ గిరిక!
దేవదాసీ పదానికి అసలైన భావం ఇదే అని సంపూర్ణంగా నమ్మి, షడారులను జయించి, దైవాంకితమైన సేవికగా జీవించి చూపిన భక్తురాలు. భగవంతుడైన వేణుగోపాలస్వామినే తన భర్తగా ఎంచి, అనన్య భక్తితో, కఠోర సాధనతో- తీవ్రాభినివేశంతో మెలగి ఆ స్వామి లోనే ఐక్యమై పోయిన పూతచరిత!
మనస్సును అచంచల భక్తి ద్వారా,తనువును ప్రాణాయామ నాట్యాల ద్వారా నియంత్రించిన యోగిని! అప్సరోమణుల దివ్యసౌందర్యంతో, గొప్పసాముద్రిక లక్షణాలతో భూలోకంలో ఆ దేవకాంతల వృత్తిలో ఉన్న కుటుంబంలోనే జన్మించినా, ఆ సుడిలో చిక్కుకు పోని స్వతంత్ర! ఎంత స్వతంత్ర అయినా అంత నియతి గల వ్యక్తి!
ఆమె నేర్చిన నాట్యవిద్య అంతా శ్రీ వేణుగోపాలస్వామి వారికి అంకితమైనదే! ఆ స్వామి నుద్దేశించినదే ఆమె సకల భరతనాట్యవిద్యా ప్రదర్శన!
తన సర్వస్వమూ కృష్ణాంకితమని నమ్మి సమర్పించిన భక్తవరేణ్య!
“ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని
……..కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
……..తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
……..చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగాలేని
……..జిహ్వకు ఫలరస సిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?!”
అన్న ఆంధ్రమహాభాగవతంలోని పద్యంలో పోతన గారి రుక్మిణీదేవి తన మనోభావం ఏది అని వివరించిందో, సరిగ్గా ఆ భావానికి సజీవోదాహరణ, ఈ గిరిక!
జన్మ నెత్తినందుకు, ఒకటే పరమ లక్ష్యం.
తన నాట్యం ద్వారా తల్లీనయై, మనోబుధ్ధులనాత్మలో అనుసంధానించి, ఆ వేణుగోపాలునికి కైంకర్యమైపోవటమే, ఆ త్రిజగన్మోహనునిలో ఐక్యమైపోవటమే ఆమె ఏకైక మనోరథం!
ఏ ఇతరములూ పట్టని జీవ సంస్కారానికి తోడు, పరమమైనశక్తి, ఆ భగవంతునిలో, ఆ మహజ్జ్యోతిలో లీనమైపోవాలనే జీవుని వేదన పరాకాష్ఠ దశకు చేరుకున్న సాధకురాలు.
సిధ్ధికై తపిస్తున్న ఆంతర తాపసి, ప్రేమ యోగిని! కృష్ణార్పితచిత్తలు, బృందావన గోపికాంగనకోటితో సమానమైన చిత్తవృత్తి పరిణతి గలది.
ఈ సాధనలో, ఈ ఆంతరంగిక ఆధ్యాత్మిక పయనంలో ఆమెకు గురుస్థానీయుడు, నవలకు నాయకుడని చెప్పుకోదగ్గ ధర్మారావు పాత్ర!
అతని పట్ల ఆమెకు అన్న అనే చనువూ, గురువనే పూజ్యభావమూ, ప్రమాణ భావమూ – రెండూనూ!
ఆమె తపన అంతా తన స్వామిలో ఎంత శీఘ్రంగా ఐక్యం కాగలననే; అతని ప్రయత్నమంతా బహుజన్మాంతరాల పుణ్యార్జితమైన తన సోదరి జీవునివేదనకు ఒక సార్థకత కూర్చే మార్గ నిర్దేశనమే!
ఆమె వేణుగోపాలైక్యచింతనారత! అతను సోదరికి సాధన సిద్ధించే మార్గసూచనాభిలాషి!
ధర్మారావు, లౌకికంగా ఆనాడు తోసుకుని వస్తున్న సాంఘిక, యాంత్రిక, వైజ్ఞానిక, సాంస్కృతిక మార్పు లన్నింటినీ సవిమర్శంగా చూస్తూ, వ్యాఖ్యానిస్తూ, సంసార జీవనం సాధారణ కుటుంబీకుడి లాగా గడుపుతున్న వాడే!
కానీ తన చెల్లి గిరిక విషయం వచ్చేసరికి అతనిలోని ఏదో గురుత్వ ధోరణి ఉద్బుధ్ధమై, ఎంతో ఆర్జవంతో ఆమె సంశయనివారణకూ, ఆధ్యాత్మిక అభ్యున్నతికీ తోడ్పడే అవతారం ఎత్తుతుంది.
వారిద్దరే ఉన్న సన్నివేశాలలో, మరి ఏ ఇతరానికీ తావీయని భావనాలోక, భక్తి లోక సంబంధులైన ఊర్థ్వభూములలోనే వారి మానస సంచారం! అప్పుడు, అతనిది ఒక దేశిక స్థానం, ఆమెది జిజ్ఞాసువైన శిష్యురాలి, సాధకురాలి స్థానం!
బాహ్యంగా ఎంతో చతుర సంభాషణలు చేసి, తోటి స్నేహితులతో కలిసి పోయేవాడుగా తోచి, మోటారు బండీ, ఇంగ్లీషు చదువు, విద్యుద్దీపాలు, పురపాలక సంఘం ఎన్నికలు, ఇన్సూరెన్సూ వంటి శుద్ధ లౌకిక విషయాల్లో తలమునకలుగా మంచి చెడులను బేరీజు వేసే వివేకియైన పౌరుడిగా ధర్మారావు కనబడ్డా — తన అన్నకు, ఈ లౌకికాలను పూర్తిగా దాటిన సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలు క్షుణ్ణంగా తెలుసనని, ఆ సోదరి గిరిక గట్టి ప్రత్యయంగా కనబడుతుంది.
ఇక, అతనికైతే, ఏ విషయంలోనూ ఎట్టి సంశయమూ ఉన్నట్టే తోచదు. తన కోణం నుంచి, అధ్యయన పూర్వకమైన సమాధానాలు, ఖచ్చితమైన తన అభిప్రాయాలూ చెపుతూంటాడు.
బృందావన కృష్ణుడితో మాటలాడి,ఆడి పాడి అలసి,అతను వస్తే వెళ్ళిపోతాడని దిగులు పడుతూ, వెళ్ళిపోతే ఎపుడు మళ్ళీ వస్తాడా అని ఎదురుచూస్తూ తన సర్వములైన ఆలోచనలు అతని చుట్టూనే తిరుగుతూండగా ఇల్లూవాకిలీ విడిచి, అది ఎన్ని జన్మజన్మల అనుబంధమో అన్నట్టు వేణునాదం వస్తున్న దిశలోనే మంత్రవశయై సాగిపోయి, కృష్ణభావనాసాగరంలో మునిగిన అలనాటి గోపికయే గిరికగా తోస్తుంది.
ఈమెకు నాట్యవిద్య ఒక అదనపు నివేదనా సాధనం,తన స్వామికి!
తన భక్తిభావన ఆలంబనగా శ్రీ వేణుగోపాలస్వామికి అంకితమై, ఆ మూర్తిలో కలిసిపోయిన భక్తయోగినిగా చిత్రించారు, విశ్వనాథ.
***
నవలలో మొదటిసారిగా గిరిక పాత్ర పరిచయం, ధర్మారావు దారి వెంట నడస్తుండగా, వెనక నుంచి ఎవరో తనను తాకినట్లనిపించిన సన్నివేశము.
ఈ సందర్భంగా విశ్వనాథ వారు గిరిక పాత్రను వర్ణించిన విధానము ఇది:
“వెనుదిరిగి చూచెను. అతని కన్నుల లోనికి వెన్నెలలు చిమ్మనగ్రోవితో కొట్టినట్లయ్యెను. అవి నవ్వులు.
ఆ నవ్వినది పన్నెండేళ్ల పిల్ల.
దాని ఒడలి పైకి తెలియకుండా మన్మథుడు వచ్చుచున్నాడు..
దాని చెవులు శ్రీకారములై పాంచజన్యము లట్లుండెను.
దాని కన్నులు కమలములు.
దాని నాసిక కౌమోదకి.
దాని భ్రూయుగము శార్జ్ఞము ద్విధావిభక్తమై నట్లుండెను..”
ఆమె విష్ణు భక్తురాలు.
కనుక ఆమె స్వరూపమంతా వైష్ణప్రభగానే వర్ణించటం ఇక్కడ ఔచితీవంతమైన విశేషం.
సర్వ ప్రకృతినీ ఆమె కృష్ణమయంగానే చూస్తుంది కాబట్టే, ఆ భావమే ఆమెలో, ఆమె ప్రత్యణువులో కూడా ప్రతిఫలిస్తుందని వారి భావన!
తన అన్న ధర్మారావుతో కృష్ణాయతచిత్తయైన ఆమె సంభాషణ,సంవాదం అంతా నాట్య విద్యా రహస్యాల మీదనే, భక్తిజ్ఞాన మార్గాల సులభతాసులభత్వాల మీదనే, ఆధ్యాత్మిక సాధనా సోపానాల విషయం లోనే!
ఉదాహరణకు-
ఒకసారి ధర్మారావు, గిరిక ఆలయ వెనుకభాగంలో, సరోవర సోపానాల మీద కూచుని – భగవంతుని చేరటానికి గల మార్గాల గురించి మాట్లాడే సన్నివేశంలో సంభాషణ ఇట్లా సాగుతుంది:
ధర్మారావు: భక్తి వేరు, జ్ఞానము వేరు. జ్ఞానమందరికినీ కలుగదు. భక్తి సులభమైన మార్గము.
గిరిక: శివుడు సేవనీయుడా? విష్ణువు సేవనీయుడా?
ధర్మా: లీలాశుకులు పాడిరి-
సంసారే కిం సారం,కంసారేశ్చరణకమల పరిభజనం,
జ్యోతిః కిమంధకారే యదంధకారే రనుస్మరణమ్!
భక్తి యోగులకు కృష్ణదేవుడు సులభుడు. జ్ఞానయోగులకు శివుడు సేవనీయుడు.
గిరిక: సేవనీయుడందువే? సులభుడు కాడా?
ధర్మా: తల్లీ, జ్ఞానయోగము సులభము కాదు.
గిరిక: భక్తి యనగా నేమి?! జ్ఞానమనగా నేమి?
దీనికీ వివరించి సమాధానం చెప్పిన తరువాత, గిరిక అడుగుతుంది- “అన్నా, భగవంతుడు గోపికల వస్త్రములు నెత్తికొని పోయి ఏ పొన్న చెట్టో యెక్కెను. నా చీర కూడా ఎత్తుకొని పోవును కదా! అయినను నేను గొల్ల కులములో పుట్టలేదు కదా!”
ధర్మా: గోపికలనగా భగవంతుని యందు బధ్ధానురాగులైన స్త్రీమూర్తులని కానీ, గొల్లవారని కాదు. నీవు కూడా గోపికవే. అదె నందనందనుడంతర్హితుండయ్యె, పాటలీతరులార పట్టరమ్మ “యన్నంత ఒడలుతెలియనితనము వచ్చుటయే గోపికా లక్షణము”.
ఆమెకు కృష్ణునిలో లీనమవటమనే విషయం ఏదో సుదూరమైన, కథాగతమైన విషయము కాదు.
తను ఆ వేణుగోపాలస్వామి సొత్తుననే ఆమె దృఢమైన నమ్మకం, ఎప్పటికైనా తాను ఆ ‘స్వంత గూటికి’ చేరుకుంటాననే ఆమె ప్రతయ్యం చిన్ననాటి నుంచీ!
ఇది గిరిక అనే లోకవ్యవహార నామం గల ఆ జీవుని వేదనాసారం!
జన్మజన్మాంతరాల నుంచి కొనితెచ్చుకున్న సంస్కార బలం, విశ్వనాథ వారి దృష్టిలో.
ఇట్లాంటి ఆసక్తికరమైన సంభాషణలు ఈ అన్నా చెల్లెళ్ళ నడుమ అడపాదడపా తటస్థపడుతూనే ఉంటాయి నవలలో కొన్ని సన్నివేశాలలో!
ఒకే తండ్రి బిడ్డలైన ధర్మారావు, గిరికల అన్నా చెల్లెళ్ళ సంబంధం, మరింత బలపడటానికి కారణమైన ఒక సంఘటనను మొదట్లోనే చెప్తారు, రచయిత.
జమీందారు రంగారావూ, దివానూ ఇతర ప్రముఖులూ ఉన్న ఒక సభలో, దేవదాసీ వృత్తిలో తరతరాలుగా ఉన్న గిరిక తల్లి, రత్నగిరి-నాట్యం చేస్తున్న సమయంలో దివాను అడుగుతాడు,”నీ కూతురు రాలేదా” అని!
ఆమె జవాబుగా, “అది రాదు” అంటుంది.
ఎందుకు రాదూ, అని కాసావాడికి పురమాయిస్తాడు, వెళ్ళి రత్నగిరి కూతురు గిరికను తీసుకురమ్మని.
వాడు వెళ్తే ఆ అమ్మాయి ధైర్యంగా “నేను రాను”, ఉంటుంది.
ఆ జవాబు తో తిరిగివచ్చిన వాణ్ణి దివాను మళ్ళీ పంపిస్తాడు, మర్యాదగా రాకపోతే బలవంతంగా తీసుకురమ్మని!
వాడు వెళ్ళి ఈ మాట చెప్తే, ఆమె ఒక్క పరుగున ధర్మారావు ఇంటికి వెళ్ళి అతని వెనక దాక్కుంటుంది.
విషయం తెలుసుకుని, ధర్మారావు వాడితో, ఆమె రాదు పొమ్మని వాడికి ఖండితంగా చెప్తాడు. వాడు వెళ్ళిపోతాడు.
అలనాటి యాజ్ఞసేని ద్రౌపదికి నిండు సభలో పుట్టాల నిచ్చి సంరక్షణ చేసిన శ్రీకృష్ణుడిని ఎట్లా ఆజీవము అన్నగా ఆదరించి వాత్సల్యంతో చేరువైందో, ఆ భావమే గిరికకు ధర్మారావు పట్ల.
ధర్మారా వామెకు, వాత్సల్యానికి అన్న! వివిధ విషయ బోధకూ,సందేహ నివృత్తికీ, గురువు.
విశ్వనాథ, ఈ గిరిక దేవదాసీ కులానికి చెందినా, వారాంగన అనే తేలిక దృష్టి రాకూడదని పలుమార్లు హెచ్చరిక లాంటి వివరణలిస్తారు, పాత్రల ద్వారా.
తన మనసులో గిరిక పట్ల ఉన్న అభిప్రాయం చెపుతూ ధర్మారావు భార్య అరుంధతితో అన్న మాటలు గమనింపదగినవి: “భోగము వారు వేరు. వారాంగనలు వేరు. భోగము వారు భగవంతుని సన్నిధానమున నృత్యగానములు చేయుటకై ఏర్పడినవారు. వారాంగనలు వారిలో కులము చెడినవారు..
ఆమె వేణుగోపాలస్వామి వారియందు తన సర్వస్వము అర్పింప బోవుచున్నది. భగవంతుడామెను స్వీకరించి నాడు.
పడిపోయిన వారి కులము నుధ్ధరించుటకు ఆమె అవతారమెత్తిన మూర్తి!
మనసా చర్వితమైనదే కవిత్వమని, అందుకే సాహిత్యమాలోచనామృతం అన్నారు పెద్దలు” అని చర్చిస్తూ, గిరిక మనస్సుకున్న గాఢత గురించి ధర్మారావు నవలలో ఒకచోట ఇట్లా అంటాడు: “ప్రతి విషయము నెవడు హృదయము దాక తెచ్చుకొనగలుగునో, వాడు రసజ్ఞుడు.
ప్రతి విషయమునందంత శక్తి లేదు. భగవంతు డెంతయైన లోతైన విషయము.
ఆ లోతు మహాపరిపక్వదశయందున్న దేవదాసి( గిరిక) మనస్సునకే తెలియుచున్నది. భాగవతములోని పద్యములను తానే ఆమెకు చెప్పినది. ఆమె వాని యర్థములు హృదయము దాక నెరిగినది. అందుకనియే వానియందు లీనమగుచున్నది.”
గిరిక ఎంత కృష్ణభావనాతత్పరయో విశ్వనాథ అనేక రమ్యమైన విధాలలో చెప్పారు, నవలలో.
గిరిక చేత తన వదినయైన అరుంధతికి ఇయ్యబడ్డ ఒక ఉంగరం గూర్చి,వారిద్దరూ మొదటిసారి కలిసిన సన్నివేశంలో,విశ్వనాథ వారు వ్రాసినది ఇది:
“(అరుంధతి).. ఉంగరము వంక జూచుకొనెను.
ఉంగరము లోనిది నీలపు ఱాయి.. ఉంగరము తమాల వృక్షఛ్ఛాయ వలె, యమునాతరంగము వలె,కపిల శరీర కాంతివలె, యశోదా శిశువు వలె,నల్లని కాంతులు వెదజల్లుచుండెను..”
భగవద్భావనలో నిరంతరమూ లీనమై ఉండే గిరిక చేతి ద్వారా వచ్చిన ఆ ఉంగరము కూడా నీలవర్ణసామ్యమును బట్టే కాదు,రూప విలక్షణత లోనూ కృష్ణవిషయ సంబంధితమై యున్నది అని రచయిత చెప్పినట్లు అనుకోవాలి.
అంతటి గాఢభావన చేసిన కృష్ణప్రేమ యోగిని, ఈ గిరిక అన్నదానికి సూచనగా యిటువంటి రసవంతమైన వర్ణన!
ఆమె శ్రీకృష్ణ దర్శనము కలలోనైనా కాలేదని దిగులు పడి, ఆ విషయం – తన అన్నా, గురువూ అయిన, ధర్మారావుతో చెప్పిన సందర్భంలో, గిరిక పాత్ర వారి మనసులో దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో విశ్వనాథ తేటతెల్లం చేశారు.
కృష్ణ స్మరణలో తన్మయీభావంతో గంటలు, రోజులు గడపటమూ, ఉపవాసాలు ఉండటమూ లాంటివి ఎన్ని చేసినా తన ఆరాధ్య వేణుగోపాలుని రూపు మనసులో అట్లాగే స్థిరంగా నిలవటల్లేదని ఆమె దిగులు.
ధర్మారావు అది అంత సులభం కాదు, మహామునులకే ఏళ్ళ తరబడి చేసిన తపో ఫలితంగా దక్కేదీ, కొందరికి అప్పటికి కూడా దుర్లభమైన విషయంగా ఉండిపోయినదీ, అని చెప్తాడు.
ఓపికగా సాధన సాగించు – అని సలహా ఇచ్చి, నీ మార్గము కష్టతరమైనది, నాకు అనుభవము లేనిది అని కూడా అంటాడు.
ఆమె సాధనలో ఏ ఉచ్చస్థితిలో ఉన్నదో ఒక తిరుగులేని సూచన ఇది!
ఆమెకు భావోద్వేగమూ, కృష్ణ విరహమూ కలిసి తాళలేక అనేక మార్లు ఏడ్చినట్లు కూడా వ్రాస్తారు, రచయిత.
తమ దైవం పట్ల అలనాటి గోపికలూ, రుక్మిణీదేవీ దగ్గర నుంచీ, భక్తులైన మీరా, రామదాసు, త్యాగయ్య, రామకృష్ణులూ వంటి సాధకుల జీవితాలలో కూడా ఇట్లా జరిగినదని చరిత్ర చెపుతున్న విషయమే.
గిరికి పాత్రను ఆ కోవలో నిలబెట్టి చిత్రించారు విశ్వనాథ!
క్షేత్రయ్య పదాలు, నాయికా లక్షణాల గూర్చి తానిచ్చిన పుస్తకాలలో ఉన్నాయి, బాగా చదవమని చెపుతాడు అన్న ధర్మారావు.
భానుమిశ్రుని రసమంజరి స్వయంగా పాఠం చెపుతాడు కూడా.
వాసకసజ్జికా లక్షణములు చెప్పుచుండగా గిరిక “కనుదోయి విప్పారి దివ్య జ్యోతిస్సులు వెలుగు చుండెను”, అంటారు విశ్వనాథ, గిరికను వర్ణిస్తూ!
గిరికకు మాత్రమే, ఏ వేళలో వచ్చినా, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రవేశానికి ఎట్టి అవరోధమూ లేనిది, పూజారులకూ ఆమె భక్తి ఏ స్థాయిదో పరిచితమైనదే కాబట్టి!
ఒకసారి ఆలయ ప్రవేశం చేయగానే, దర్శించిన స్వామి పాదాలను చూసి, ఆమె – “ఈ చరణమ్ములె యిందునిభానన! సనకాదిమునియోగిసరణి నొప్పు, ఈ పాదతలములే యెలనాగ! శ్రుతివధూసీమంతవీథుల చెన్ను మిగులు” అనుకుంటుంది.
అనుకుంటూ వివశయై, స్వామి ఇంకా కరుణించలేదు తనను అనుకొని వెక్కివెక్కి ఏడుస్తుంది.
ఇది చూసిన స్వామికి కూడా కాళ్ళాడలేదు అంటారు చమత్కారంగా, విశ్వనాథ!
మళ్ళీ కాస్త తేరుకుని, “కిటియై కౌగిట జేర్చెను, వటుడై వర్థిలి కొలిచె, వడి కృష్ణుడై యిట పదచిహ్నము లిడె, కిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రీ”, అని భూదేవి భాగ్యాన్ని కొనియాడుతూ, నేల మీదకు ఒరిగిపోతుంది.
ఇవన్నీ కృష్ణభావనలో ఆమె తాదాత్మ్యత ఏ స్థాయిలోదో, కళ్ళకు కట్టించే సన్నివేశాలే!
ఇది అయిన మరునాడు రాణీ రుక్మిణమ్మారావు గారిని చూడటానికి వెళతాడు ధర్మారావు.
అప్పుడామె అన్నమాటలు ఆమె హృదయార్తిని ఎంతగా తెలియచేస్తాయో, గిరిక ఆధ్యాత్మిక సాధనలో ఏ ఎత్తులో ఉన్న వ్యక్తో కూడా చాటి చెప్పేవి.
రాణీ, ధర్మారావు తో అంటుంది: “బాబూ, నీవు గిరికను రక్షించినట్లు నన్ను గూడ రక్షించవలయును”, అని!
ఆ మాటలకు ఆశ్చర్యపోయిన ధర్మారావు,”తల్లీ అది నా చేతిలో ఉన్నదా?నా చేతిలో ఉన్నచో నన్ను నేను రక్షించుకోలేనా? ఎవరి పూర్వజన్మ సంస్కార మెట్టిదో ఆ మార్గమున వారికట్లు నడచును. గిరికకు నేను జేసినదేమియు లేదు. ఆమె దేవదాసీత్వభావమంతయు గూడు కట్టిన మూర్తి.
వందల యేండ్లుగా మన దేశమున నున్న ఈ సంస్థ నశించుపోవు ఈ నాళ్ళలో ఆమె ఒక్కసారిగా తన మాహాత్మ్యమంతయు చూపుటకు వెలసిన మూర్తి..
దేవదాసితో దేవదాసీత్వమే నశించిపోవును..”, అంటాడు.
గిరిక పాత్ర కల్పన వెనుక కవిసమ్రాట్టుల ఆంతర్యము వారే స్పష్టపరిచారు ఈ మాటలలో.
భగవంతునకు త్రికరణశుధ్ధిగా తనను తాను అర్పించుకునే ఒక పరంపరకు, ఒక సంప్రదాయపు ఆఖరిదైన దివ్యజ్యోత్స్న, అభౌమమైన చిత్తదీధితి – గిరిక అని రచయిత ఉద్దేశ్యంగా తెలుస్తుంది.
గిరికను గురించి ఇంకొక మనోహరమైన వర్ణనలో ఇట్లా అంటారు విశ్వనాథ:
“ఆమె దాల్చిన తెల్లని చీర వర్షర్తువు నదుముకొని వచ్చిన శరత్కాలము వలె ఱెల్లు తెల్లదనములు,ఆతప ధావళ్యములు వెల్లివెరిసెను.
ఆమె నడచినది.
మేఘమునకు ముందు పోయిన యింద్రరథము వలె మంజీరధ్వని నినాదముతో, చేలాంచలపతాకలతో ఆమె యింద్రరథమే యనిపించెను…… దేవదాసి సంపూర్ణ యౌవనవతియై యుండెను. ఆమె మహారాజ్ఞి వలె భ్రూనేత్రగోళముల యందు ఠీవియు, శరీరమునందు తగినంత స్థౌల్యము, ఉడుపులయందు నిక్కును గలిగి నేత్రములు కలిగినందుకు చూడదగిన వ్యక్తిగా నుండెను.
ఆమె కన్నులలో భగవంతు డాడుచుండెను.”
పుట్టినది దేవదాసీ కులము లోనే అయినా, గుణగరిష్ఠతలో ఆభిజాత్య భావనలో, ఆత్మాభిమానంలో ఈ గిరిక పాత్రను హుందాతనంలో అలనాటి సత్యభామగానో, యాజ్ఞసేని గానో;
కృష్ణభక్తి విషయంలో ఏ రుక్మిణీదేవినో, గోపికాతతినో, మీరా వంటి భక్తశిఖామణినో దృష్టిలో ఉంచుకొని ఒక అపూర్వదివ్యగుణసంపన్నగా చిత్రించారు విశ్వనాథ, అనిపిస్తుంది, నిశితంగా పరిశీలిస్తే.
రచయిత తానుగా అమితంగా ఇష్టపడి, ఒక ప్రత్యేక గౌరవాదరాలతో తీర్చిదిద్దిన పాత్ర ‘వేయిపడగలు’లో ఈ గిరిక పాత్ర అని అనిపించకనూ మానదు పాఠకులకు.
స్వచ్ఛమైన గాఢశీలతకు, అనన్య భక్తికీ, అమాయకతకూ, సూక్ష్మ వివేచనకూ, కృష్ణైక్యత చెంది జన్మసాఫల్యత సాధించాలంటే ఇంకా ఏమి చేయాలి అనే తీవ్రమైన తపనకూ, నిలువెత్తు ఆదర్శంగా చిత్రీకరించారు ఈ గిరిక పాత్రను.
ఒకచోట సమ్మోహకరమైన వసంతకాల వైభవానికీ, గిరిక మోహనాకారానికి ముడిపెడుతూ వ్రాస్తారు.
“మధువాని తుమ్మెదలు వెన్నెలలో ఉన్మాదగీతములు పాడెను. భక్తిమధువాని దేవదాసి గోపికోన్మత్తగీతలు పఠించెను….. మాధవుడు మహానందమేదుర హృదయజలజాతుడైనట్లు గిరికానన శోభ విజృంభించెను.
…..వసంతకాలమెల్లయు గిరికతో సామ్యమునకు దూకెను”.
ఒకసారి వేణుగోపాలస్వామి గుడిలో సరోవరపు నీటితో కాళ్ళు కడుక్కుని, స్వామికి ప్రదక్షిణ చేసి, కపోత ముద్ర పట్టి అభినయం ఆరంభిస్తుంది గిరిక.
ఈ పాత్రను ఎంత ఇష్టపడి, ఎంత బాహ్యాంతర సౌందర్య ఖనిగా తీర్చిదిద్దారో విశ్వనాథ తెలుస్తుంది, ఈ కింది వర్ణన వలన: “దేవ కురు శిక్షాం దేహి పతి భిక్షాం దీనపరిపాలనాయ స్వీకురు దీక్షాం.. అని ముఖారి రాగము మీద నాగపత్నికా తరంగమును పాడెను.
అని పాడి, తానెంత నీచ జాతి సముత్పన్నయైనను భగవంతుడు సర్వజంతు సముడగుట చేత,అది వేదవిహితము కూడా అగుటవలన తన యందు దయ చూపించ వచ్చునన్నట్లు దీనదృష్టియై భగవంతుని ప్రార్థించెను….. కపోతముద్ర యందు బొటనవ్రేలును, చివరి వ్రేలును వదిలిపెట్టి తక్కిన మూడు వ్రేళ్ళు దగ్గరగా నొక్కి, చివరి వ్రేళ్ళు దూరముగా తీసి,చేతులు దొన్నెల వలె అమర్చి, హస్తములు పార్శ్వ సంగ్రహము చేయుట వలన,
ఆమె చేయి నొక్కులువడ్డ ఎఱ్ఱతామరపూవు వికసించినట్లుండెను.
వదలిన చివరి వ్రేళ్ళు రెండును కలిసి అడుగున ఉన్న పచ్చి రేకొకడు జారినట్లు కనిపించెను.
ఆ చేతుల ముద్దుతనమేమని చెప్పవలయును!
చివురు జొంపము వలె, పవడముల కుప్ప వలె, బంగారు గిన్నె వలె – చేయి చూచిన కొలది హృదయాభిరామ మయ్యెను!….”
ఒక రచయిత తానే ఒక పాత్రయై, అదే సమయంలో తాను సాక్షి కూడా అయి,తన మనోఫలకాన దాని స్వరూప స్వభావాదులు ముద్రింపచేసుకొని, ఒక తన్మయీభావంలో అక్షరీకరించిన వైనం కనబడుతుంది, ఇటువంటి అనేక వర్ణనలున్న ఈ నవలలో.
గుడిలో కూర్చున్నప్పుడు తన అన్న ధర్మారావుతో, నాకు చదువు చెప్పటానికి మాత్రం నీ దగ్గర సమయం లేదా అని కోపగించుకుంటుంది చెల్లెలు గిరిక.
అప్పుడు సమాధానంగా ధర్మారావు అన్న మాటలు పండితుడని అందరిచేత కొనియాడబడే అతని మనసులో ఆ ప్రేమ యోగిని గిరిక పట్ల తన భావం చెప్పినట్లుంటుంది!
“తల్లీ, నీకు నేనేమి చెప్పవలయును? అభినయమేమో నీకు మీ యమ్మగారే చెప్పుచున్నది. అన్ని చదువులకు పర్యవసానమైన చదువు నీకు పుట్టుకతోనే వచ్చినది…..” అని అంటాడు.
ప్రహ్లాదుడు తన తండ్రి రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఏమి చదువులు నేర్చావు నాయనా అంటే “చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ”, అంటాడు, అది గుర్తుకు తెచ్చే సన్నివేశమిది.
మానవజన్మ ఎత్తినందుకు ఏ పరమమైన విద్యామర్మం జీవికి తెలియాలో అది గిరికకు తెలిసింది, పురాకృత సంస్కారం వలన.
ఇంక ఏ ఇతర చదువులు ఆమెకు అవసరం?, అని ధర్మారావు అంచనా, గిరిక ఆధ్యాత్మిక స్థాయిని గురించి!
అనగా విశ్వనాథ వారి దృష్టిలో సిద్ధికి అతి చేరువలో ఉన్న ఒక యోగిని, ఈ గిరిక.
లౌకికాలైన దేవదాసికులం వారింటిలో జన్మా, ఆమె పట్ల సమాజపు దృష్టీ, సాంఘిక కట్టుబాట్లు, రివాజులూ – ఇవన్నిటినీ ఎప్పుడో దాటిపోయిన ఉన్నతమైన స్థితి ఆమెది.
ధర్మారావు దృష్టిలో గురువైన తన కంటే శిష్యురాలైన గిరికయే పై స్థాయిలో ఉన్న వ్యక్తి.
భాగవత పద్యాల అంతరార్థాలు, అభినయముల లోని భేదాలు, ముద్రలు, వాటిలో పతాకముద్ర స్థానము, జ్ఞాన, భక్తి మార్గముల పై చర్చలూ – ఇత్యాది సందర్భాల్లో ధర్మారావు ఆమెకు బోధకుడైనా, అసలైన ఆత్మ విద్యా సాధనలో, ఆధ్యాత్మిక ప్రగతిలో చెల్లెలు గిరిక చాలా ముందున్నది ఆని అతని నిశ్చితాభిప్రాయం.
ఒక సందర్భంలో అడుగుతాడు తన చెల్లెలిని, గురుశిష్యులైన శంకర భగవత్పాదాచార్య గోవిందపాదులలో ఎవరు గొప్ప అని.
ఆమె వెంటనే గురువైన గోవిందపాదులే అని అంటే ధర్మారావు అది కేవలం “లోకదృష్టి” కి అంటాడు.
అనగా గురువైన తన కంటే తనకు ఛాత్రురాలైన గిరికయే ఉన్నతురాలు అని ధర్మారావు స్థిరాభిప్రాయంగా తెలుస్తోంది.
అట్లాగే ఈ నవలలో బహు పాత్రలు సృష్టించిన బ్రహ్మగా విశ్వనాథ అభిప్రాయమూ తెలుస్తున్నది,గిరిక పాత్ర పట్ల!
***
శ్రీవేణుగోపాలస్వామికి కళ్యాణోత్సవాలు పెద్ద జమీందారు కృష్ణమనాయుడు గారి హయాములో క్రమం తప్పకుండ ప్రతి యేడు జరిపినవే, వారి జీవితంలో చివరి అయిదు సంవత్సరాలు తప్ప!
చివరిలో చేయించాలని అనుకొన్నారు కాని, ఆ ఏడాదిలో కళ్యాణాలు జరిగే వేళకు ముందే వారు పరమపదించిన కారణంగా అవి జరగలేదు.
ఆయన పుత్రులు, తరువాత అధికారంలోకి వచ్చిన రంగారావు గారు మొదటినుంచీ ఇటువంటి సంప్రదాయంగా వస్తున్న వాటి పట్ల ఆసక్తీ, శ్రద్ధా లేనివారే!
కాలం గడిచింది, రంగారావుగారి పుత్రులు హరప్పనాయుడు గారి ఆధ్వర్యం నడుస్తున్న తరుణమిది.
వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామికి కొంతకాలంగా ఆగిపోయిన కళ్యాణోత్సవాలు ఎట్లా పునః ప్రారంభించాలా అన్నదే ఇప్పుడు చిన్న జమీందారు హరప్ప ఆలోచన, ఆవేదన.
అవి ఎప్పుడు జరుగుతాయా, తన దేవదాసీత్వ దీక్ష సఫలమయ్యేట్లు ఆ వేణుగోపాల తమాలసుందరస్వామితో ఏకమై ఆయనలో ఎట్లా లీనమైపోవాలా అన్నది గిరిక తపన.
జన్మాంతరాల తపస్సు ఫలించి ఆమె స్మృతిని జాగృత్స్వప్నాల లోనూ వీడని భావన!
ఈ విషయమై తనలో తానే వితర్కించుకుంటూ ఒకసారి ఇట్లా అనుకుంటుంది గిరిక: “ప్రభువునకు కళ్యాణ మెప్పుడో?! ఆ కళ్యాణముల నాడు నేనెట్లుందునో?!
నేను రాధను, గోపికను, రుక్మిణిని, సత్యభామను.
స్వామికి కళ్యాణోత్సవమే జరుగవలయును కాని, ఆయనకు నే నేమి కాను?!
ఆయన కాలి దుమ్ము నగుదును.
ఆ స్వామి హస్తాంగుళులు వేణువును మోసి మోసి అలసియున్ననేమో?! నేనా వేణువును తీసికొని ఆయనకు విశ్రాంతి కల్గించెదను. స్వామి కళ్యాణము నాడు ఆలయము లోనుండి కళ్యాణమంటపము వరకు కదలి వచ్చునా? ఆ యెఱ్ఱని తామర పూవుల వంటి పాదములు కందునేమో?!….. దీనికొక ఉపాయమున్నది. నేను తెల్లని చీరకట్టుకుని పోయి స్వామి అడుగుయుంచిన చోటు నెల్ల వేయుదును. సన్నని తెల్లని వలిపపు చీర మీద స్వామి పాదకాంతులు వ్యాపించును. ఆ వ్యాపించిన కాంతులు చిక్కదనము, పలుచదనముల చేత పాదములు కందినవో కందలేదో తెలిసికొనవచ్చును….. నా హస్తములు స్వామి చరణ పద్మములకు తాకి స్వామి కపోలములు పులకరించునో?! పాడు సిగ్గు నన్ను చూడనీయదు కాబోలు!….. సాత్త్వికగుణరాశియైన స్వామికి తమోగుణ రాశిని నేనెట్లు పనికివత్తును?!….”
ఇట్లా పరిపరివిధాలుగా మధుర భక్తి హృదయంలో పొంగులు వారగా పరవశయై,కృష్ణభావనార్ణవంలో మునిగిపోయి,గిరిక చివరకు భావోద్వేగంతో వెక్కివెక్కి ఏడుస్తుంది కూడా.
అది హృదయాంతరాలలో నుండి పొంగులై వస్తున్న వియోగబాధ, విరహతాపం!
తన స్వస్థానము నుండి పతితమైన ఒక పుణ్యజీవి కరడుగట్టిన వేదనా పర్వతము కరిగి పారినట్లే!
కరిగించే తాపము తన స్వామి నుండి దూరమైనానే బాధలో నుంచి, ఆర్తి లోంచి జనించినదే.
ఇది భగవద్విరహము!
లౌకికంలో ఉన్న ఎవ్వరికీ రమ్మన్నా రానిది,కోట్లలో ఏ ఒకరిలోనో జాగృతమై జ్వలించే పావన జ్వాల!
ఆ పుణ్యప్రకృతులను తమ లక్ష్యం వైపు మరింత వేగంగా నడిపించే గాఢాతిగాఢమైన అనుభూతి.
లోకపు దృష్టికి వెర్రిగా అనిపించినా ఆశ్చర్యం ఏమీ లేని విషయం!
త్రేతలో అలనాడు శబరిలో చూసినది, ఇటీవలి కాలంలో జయదేవాది భక్తకవులలో, మీరా, నారాయణ తీర్థులు, లీలాశుకులు,రామకృష్ణులు వంటి భాగవతు లనుభవించినదీ!
జీవాత్మ పరమాత్మలో ఐక్యము కావాలనే తపనకు పరాకాష్ఠ!
వారికి సఖుడు, బాంధవుడు, నెయ్యము, తండ్రి, జీవనాధారము, జీవనహేతువూ అన్నీ వారు నమ్ముకున్న ఆ భగవత్స్వరూపమే!
ఆ శక్తితోనే వీరందరి సంభాషణలు, అలుకలు, పరి దేవనలు, ఉపాలంభనలు, ప్రశంసలు,శోకాలు, స్తుతులూ- సమస్తమునూ!
గిరికను ఆ కోవలో ఊహించి, చిత్రించారు విశ్వనాథ ఈ నవలారాజంలో!
***
గిరిక సాధనలో ఏ స్థాయిదో చెప్పటానికి ఒక సన్నివేశము వివరించారు రచయిత ఒకచోట..
ముందరి రోజు రాత్రి స్వామి స్వప్న దర్శనం అయిన గిరిక- ధర్మారావు భార్యయైన అరుంధతితో పాటు,ధర్మారావు బాల్య స్నేహితులైన సూర్యపతి,కిరీటుల భార్యలు- రథంతరి,శశిరేఖలతో కలిసి గుడికి వెళ్ళి అక్కడ నృత్యం చేస్తుంది.
స్వామి స్వప్నదర్శనసంయోగానంతరము ఆనందాబ్ధిలో ఓలలాడుతున్న మనస్సుతో చేసిన నృత్యమది.
అప్పటి గిరికను వర్ణిస్తూ విశ్వనాథ అంటారు: “నృత్యరేఖాభిరామయైన దేవదాసి తళుక్కు తళుక్కుమని మెరయు చుండెను…… గంట సేపటికి నృత్య మవసానదశ నందినది….. గిరిక రతీదేవి వోలె శోష పొందెను.
కడచిన రాతిరి స్వప్నగతుడైన స్వామితో ఏకశయ్యాగతయై స్వామిచేత సర్వతః పరిభుక్త స్వయౌవనయైన వేళ నెట్లు రత్యంతస్వేద మనోహర మూర్తియై తా నుండెనో యట్లు నిల్చెను….. ఆమె యప్పటి విలులిత భావము దీపము వెలుగు నుండి చూచుచున్న స్వామికే తెలియవలెను…… దేవదాసి యొడలు దేవదాసికే తెలియదు”.
విశ్వనాథ గిరిక లోని క్రమ పరిణామము, ఆధ్యాత్మిక పరిణతి అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సన్నివేశం ద్వారా.
అంతవరకు చిత్రదర్శనముతోనే సరిపెట్టుకొని వేగిన ఆమె, తపించి తపించి స్వామి నిజరూప దర్శనాని కోసము, – ఇప్పుడు బహు తపస్సులు చేసిన యోగిమునివరులకూ దక్కని స్వప్న సాక్షాత్కారం సంపాదించుకొని ఆయనకు సంపూర్ణంగా తనను తాను అర్పించుకున్న అనుభవమూ సాధించిందని చెప్పారు ఇక్కడ.
ఇక మిగిలినది ఆమె ఆరాధ్యదైవం ఆ శ్రీవేణుగోపాలస్వామిలో సంపూర్ణ ఐక్యతయే.
అదే ఆమె ఆశించిన తురీయఫలం.
దేవదాసీత్వానికి అసలు అర్థమూ,పరమ ప్రయోజనము కూడా అదే,ఆమె దృష్టిలో.
తను భగవంతుని సొత్తు.భగవంతుడైన వేణుగోపాలుడు తనకు స్వంతం.
ఇది భక్తి పరాకాష్ఠ దేశంలో భక్తులు మానసిక స్థితి. ఆమె ఆ స్థాయిలో తపన పడుతున్న పుణ్యమూర్తి! ఆమె స్వామివారి భోగమునకు అర్పితమైన అంగనామణి, భక్త శిఖామణి.
లోకదృష్టికీ, ఆమె తనకు తాను ఏర్పరచుకున్న లక్ష్యానికీ. హస్తిమశకాంతర భేదమున్నది.
అది లోకసామాన్యానికి అర్థం కానిది.
కారణం, లోకంలో ఉంటూనే లోకాతీతమనుకున్నది సాధించిన ఒక భక్తయోగిని అనుభవగాథ కావటమే, ఈ గిరిక జీవితం!
అది ఆమెకే స్వంతం, స్వానుభూత్యైకమానమైన ఆ శాశ్వత దీప దర్శనం!
ఆత్మయోగుల దర్శనానుభవ పరిధిలోనిది.
సామాన్యుల కందనిదీ, తదనుభవం పొందిన వారూ మాటలలో చెప్పలేనిది.
ధర్మారావు మాటల్లో చెప్పాలంటే, “గిరిక గిరికయా, మా తండ్రి సంపూర్ణ మనోరథ మామెయే! గిరికను జూచిన…. నాకు మాత్రము దేవతా స్త్రీల జూచినట్లుండును.”
సాధనా నిశ్శ్రేణిలో పై మెట్టు చేర్చారు గిరికను, ఈ ఘట్టంలో విశ్వనాథ, అని చెప్పటం సముచితంగా ఉంటుంది.
ఇదే భావాన్ని ప్రణయ స్వరూపిణియైన శశిరేఖ పాత్రతో కూడా అనిపిస్తారు విశ్వనాథ, గిరిక అనే ఈ పాత్ర తన మదిలో ఎంతటి విశేషమైన స్థానం మాక్రమించుకున్నదో సూచిస్తూ — “ఆమె కన్నులలో ఏదో దివ్యజ్యోతి కనబడుతున్నది. ఎఱ్ఱనై విప్పారిన ముఖమండలము, దీర్ఘ నాసిక….. ఆమె శరీరాంచలములందు దేవతాత్వము గోచరించుచున్నది. ఆమె నేత్రము లెంతసేపును ఊర్థ్వగతములే కాని ఆమె నేల వంక జూచుట లేదు….”
గిరిక —
ఒక అపురూపమైన కృష్ణభక్త్యవతారము!
భూమి మీదకు మళ్ళీ ఈ కాలంలో అవతరించిన రాధాదేవియో, బృందావన గోపికయో, సాక్షాత్తూ శ్రీ రుక్మిణీదేవియో, విశ్వనాథ దృష్టిలో.
ఒక అపూర్వ మనోజ్ఞమైన అక్షర సృష్టి!
***
గిరికకు శ్రీవేణుగోపాలస్వామితో స్వప్న సమాగమం అయిన తరువాత, ఆమెలో మరింత తన్మయీభావం, “ఒడలు తెలియనితనమూ” హెచ్చి, నిరంతరమూ ఆ స్వామి ధ్యానంలోనే ఉన్నట్టుండటం మొదలౌతుంది.
ఆ స్థితి లోని గిరికను వర్ణిస్తూ రచయిత ఇట్లా అంటారు: “దేవదాసికి నొడలు తెలియుచున్నట్లు లేదు.మోహినీదేవత వలె తనువెల్ల సింగారించుకుని, భ్రూగత దృష్టియై, నడచుచున్న పాదములు రాజహంసలకు కులస్వాములన్నట్లు ప్రకాశించగా…… నిర్గుణుడు సగుణుడూ అయిన భగవంతున కిష్టదైవతము వలె భాసించెను. ఆమె కంటియం దపాంగచలనములు లేవు.
దృష్టి నాసామూలమున కొత్తుకొని, భ్రూమధ్యమున ముడిపడుచుండెను. నడిచినంతమేర తూలిపోవుచున్నదో అన్నట్లుండెను”.
మేరుశిఖరస్థుడైన తన స్వామిని చేరటానికి గిరికకు ఆధ్యాత్మికారోహణలో ఇంకా ఎన్నో సోపానాలున్నట్లు అనిపించదు ఈ స్థితి చదువుతుంటే.
తురీయ లక్ష్యం వైపు అతివేగంగా సాగుతున్న భక్తినారాచం ఈ స్థితిలో గిరిక.
అది అప్రతిహతంగా ముందుకు సాగేదే, ఎట్టి అవరోధాలను సహించేది కాదు! అట్టివాటికి ఏ అవకాశం సహితమూ ఇవ్వని తీవ్రతమమైన భక్త్యాభినివేశ నిశితమది.
వేణుగోపాలుడే స్వయంగా ఎన్నుకున్న గోపికారత్నమే గిరిక!
క్షీరసాగర పరిస్వచ్ఛ తరంగ డోలికలలో తూగేటి సాక్షాచ్ఛ్రీలక్ష్మికి సరి పోలిక!
***
సంప్రదాయవాదీ, ధర్మారావుకు శిష్యుడూ అయిన చిన్న జమీందారు హరప్పనాయడు, పెద్దవాడై క్రమక్రమంగా కోట ఆదాయ వ్యయాల వివరాలు, కింది ఉద్యోగుల అవినీతీ నిర్లక్ష్య వైఖరీ మొదలైనవి గ్రహించి పాలనాయంత్రాంగం సమస్తమూ తన చేతుల్లోకి తీసుకుని, తన అధికారం ఉపయోగించి ప్రజోపయోగకర నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తాడు.
ఇది ఒక కీలకమైన మలుపు, గిరిక జీవిత గమనంలో.
కారణం, ఆ యువ జమీందారు కూడా కొన్నేళ్ళుగా ఆగిపోయిన వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవాలను ఆరంభించాలనే సంకల్పం కలవాడే.
విశ్వనాథ అంటారు, ఈ సందర్భంలో– “హరప్పకు తన యందు తనకు నమ్మకము కుదురువరకు ఆషాఢము వచ్చెను. స్వామి కళ్యాణములు వైశాఖ పూర్ణిమకు జరుగును. పదినెలలాగిన కాని కళ్యాణమునకు వేళ రాదు!….”
గిరిక ఎదురుచూస్తున్న, ఆమె తపస్సు ఫలించబోయే వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవ ఘడియ సమీపిస్తున్న వేళ అది!
***
వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవములు: పూర్వరంగము
ఆగిపోయిన కళ్యాణోత్సవాల కోసం గిరిక ఒక కారణాన ఎదురు చూస్తుంటే, నిర్వహించవలసిన హరప్ప దాదాపు ఇరవై ఏళ్ళుగా తమ ఆరాధ్యదైవం వేణుగోపాలస్వామితో బాంధవ్యం ఎందుకు దూరమైనదా అని మథనపడుతూ కనిపిస్తాడు.
అధికారం, ఆదాయవ్యయ వ్యవహారమంతా ఇప్పుడు తన చేతిలో ఉన్నందున కొన్నేళ్ళ వ్యవధి తరువాత ఆ స్వామి గుళ్ళో అడుగుపెట్టి అతను పులకితుడైపోయి, ఆ ఆలయాంతర్భాగమంతా తన్మయత్వంతో కలయ తిరిగి చూస్తాడు.
“ఆయనకు గాలి గోపురము, ప్రాకారములు…. ధ్వజ స్తంభము, లోని సరస్సు… నానా ప్రసూన వృక్షములు….. వైకుంఠము వలె నుండెను…… ఆయనకు దేవాలయమున తిరుగుచున్నంత సేపును భాగవతము చదువుతున్నట్లు ఉండెను”, అంటారు విశ్వనాథ ఈ సన్నివేశం వర్ణిస్తూ!
అదే సమయంలో ఆ ప్రాంగణంలో అక్కడే ఉన్న గిరిక అవస్థ, ‘యడుగడ్గునకు మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాని’ అన్న పద్యమున కుదాహరణముగ నుండెను. ఆమెకు తన ఒడలు తనకు తెలియుట లేదు.
ఆమె తనలో తాను ఏదో అనుకొంటూ, సఖి హే కేశి మథన ముదారం రమయ మయా సహ మదన మనోరథ భావితయా సవికారం….. అని పాడుకుంటూ తన్మయత్వం భజిస్తుంటుంది.
తన స్వామితో ఐక్యమయ్యే ఘడియ సమీపిస్తోందని అంతరాంతరాలలో తెలిసి, భావ్యాశలు తవ్వుకుంటున్న ఒక భాగవతురాలి స్థితి అది!
ఇక్కడే, హరప్పా ధర్మారావులతో మాట్లాడుతూ, ఇంక కల్యాణాలు జరిగే పదిరోజులే గుడిలోకి వస్తానని చెపుతూ, “స్వామి నాలోనే ఉన్నాడు”, అంటూ పరవశంతో జయదేవుడి శ్లోకం అందుకుంటుంది దశావతార సంబంధియైనది. …వేదానుధ్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే…… అంటూ!
చదివి, మళ్ళీ ఒక తన్మయ స్థితికి వెళ్ళిపోతుంది గిరిక!
బంధువులు మిత్రులూ అందరూ కళ్యాణోత్సవాలు చూడటానికి తనచే ఆహ్వానితులై వచ్చిన వేళ, ధర్మారావు కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అన్న మాటలు, అతనికి గిరిక పట్ల గల వాత్సల్యంతో కూడిన గౌరవ భావము తెల్ల మౌతుంది.
ధర్మారావు చేత ఇక్కడ ఇట్లా అనిపిస్తారు విశ్వనాథ, గిరిక పాత్రను తన మదిలో ఏ విధంగా కల్పన చేసుకున్నారో చెబుతున్నారా అన్న విధంగా: “ఈ కళ్యాణములు ఆమె కొరకే నిర్ణయించినాము. ఆమె పన్నెండేండ్ల నుండి కళ్యాణములు కళ్యాణములని కలవరించుచున్నది….. మా గిరిక స్వామికి కడుంగడు ప్రియురాలు.
పూర్వకాలపు భారతదేశమున నున్న దేవదాసీత్వ భావమంతయు నామెలో నున్నది…..
గిరిక రసాకృతి.
మా ఆశయములకు నచ్చిన మూర్తి…..
ఆమె మహా విద్వాంసురాలు.
ఆ విద్వత్తు లోకమునకు తెలియునో తెలియదో…?!”.
గిరిక అంతరాంతరము తెలిసిన వ్యక్తి చెప్పిన మాటలు!
భావుకుడైన నాయకుడు ధర్మారావు చేత విశ్వనాథ వారు గిరికి పాత్ర గురించి పల్కించినవి.
ద్రౌపదీదేవిని ఎంత వాత్సల్యపూర్ణ వచనికలతో, రమ్యాతిరమ్యంగా వ్యాసుల వారు వర్ణించారో,అట్టి పద్ధతిలో విశ్వనాథ,ఈ గిరికా పాత్రవర్ణనము చేసినట్లు కనిపిస్తుంది,ఒక పుత్రిక పట్ల ఉండే సమార్ద్రభావంతో!
“శారదోత్పల పత్రాక్ష్యా, శారదోత్పల గంధయా, శారదోత్పల సేవిన్యా, రూపేణ శ్రీ సమానయా”…
ఇటువంటి లక్ష్మీ సమానురాలు…. అని ద్యూతసమయంలో ధర్మరాజు చేత పలికించారు, వ్యాసులవారు, ద్రౌపది గురించి.
ఇంకా అనేక సన్నివేశాల్లో కూడా ద్రౌపదీదేవిని – ఆమె ఆభిజాత్య సౌశీల్యాలనూ ఆకాశమంత ఎత్తున స్థాపిస్తూ వ్రాశారు భారతేతిహాసంలో ఆయా ఘట్టాలు పరికిస్తే!
అదే విధమైన ప్రత్యేకాభిమానము గిరిక పాత్ర చిత్రణలో విశ్వనాథ చూపెట్టారనిపిస్తుంది ఈ బృహన్నవలలో – ఆ గుణ వర్ణనలో,
ఆ ఆభిజాత్యప్రదర్శనలో, ఆ స్వచ్ఛశీలతలో, ఆ అనుపమాన సౌందర్య విషయంలో!
***
కళ్యాణాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయిస్తారు హరప్పనాయుడు చిన్న జమీందారు గారు.
సర్వ ఆధ్వర్యమూ వారిదే ఇపుడు. వారికి అమాత్యశేఖరులు, ధర్మారాయనింగారు.
హరప్ప కృష్ణరాయలవారు అనుకుంటే, ధర్మారావు అప్పాజీ తిమ్మరుసే.
అంతటిదీ, వారిద్దరి అవినాభావబంధమూ, దైవం మీది విశ్వాసమూ, కల్యాణాలు ఘనాతిఘనంగా, పూర్వవైభవం అందరికీ గుర్తతెచ్చే విధంగాన జరిపించాలనే ఆ పూనికా!
విశ్వనాథ వారి మాటల్లోనే ఆ ఏర్పాట్ల వివరాలు. ఇవి:
“స్వామి దేవాలయము ముందు పెద్దపెద్ద పందిళ్ళు వేయిబడెను. ఏనుగంబారి పందిళ్ళ లో నడవ వచ్చును. ప్రక్కలన్నియు మూయబడెను. ఖద్దరు తానులతో చాందినీ లమర్పబడెను .పైని చాందినీకి నీత గొలలు, మామిడి పూతలు వ్రేలాడకట్టబడెను. అరటిచెట్లు కొట్టుకొని వచ్చి స్తంభముల కమర్చిరి. గొలలతో పూవులతో నున్న ఆ యరటిచెట్లు వాలిపోకుండ స్తంభములు నాధారము చేసికొనెను. లేత తాటి గొలలు కొట్టుకొని వచ్చి స్తంభములు కంటగట్టిరి.ఈతమట్టలు తెచ్చి స్వస్తికాకృతిగ మూయబడిన పందిరి పక్కలయందు వేసిన గుడ్డ మీద యతికించిరి. మామిడి తోరణములు కట్టిరి. పచ్చి పూవు, పచ్చి యాకు, పండిన పండు, పచ్చని కాయతోడనే పందిరి విరాజిల్లెను…. మేళములు వచ్చెను…..”
శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు:
వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు, గిరికానృత్య విశేషాలు, వెన్నెలలను శ్రీమహావిష్ణువు దశావతారాలతో అనుసంధానించి చేసిన విపుల వర్ణనలూ, తురీయఘట్టంగా గిరిక ఆ స్వామిలో జనులందరూ చూస్తుండగా జ్యోతిస్స్వరూపయై లీనమవటమూ – ఇవన్నీ అపూర్వరమణీయంగా చిత్రించారు విశ్వనాథ.
ఈ ఉత్సవాలను వర్ణించే ఈ నవలలోని ఇరవై తొమ్మిదో అధ్యాయం, ఒక సాహిత్య తపస్వి మహత్సాధనా ఫలంగా అనిపిస్తుంది.
గిరిక నాట్యకళా నైపుణి,హరి దశావతారాలలో ఆమె వివిధ ముద్రలు పట్టటంలో వెలయించిన విశేషాలు,నాయికాభేద లక్షణాలు,ఒక్కొక్క ఆవతారాభినయాంతంలో ఆమె వేణుగోపాలస్వామికి ఆధ్యాత్మిక భూమికలో చేరువైన విధానమూ – ఈ రచనాకారుడి వాజ్ఞ్మయ తపో సారమే అక్షారాకృతి ఎత్తివచ్చి కూచున్నదా, అని తలచేట్టుగా ప్రకాశిస్తాయి.
ఈ దీర్ఘ నృత్యోత్సవాల వీక్షకుడిగా జమీందారైన హరప్పనాయడి సంస్కారము, ఆయన మదిలో తారాడిన భావాలు, మంత్రి స్థానంలో ఉన్న ధర్మారావు లోని నాట్యకళా మర్మజ్ఞతా, గిరిక తల్లియైన రత్నగిరి మాతృవాత్సల్యమూ, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఆమె చూపిన చొరవా –
ఈ సమస్తమూ పఠిత కూడా ఒక ప్రాచీన దేవాలయ ప్రాంగణంలో జరిగే ఉత్సవాలలో పాల్గొన్న అనుభూతి పొంది ఆ రసానంద మనుభవించే స్థితికి, స్థాయి కీ తీసుకువెళతారు విశ్వనాథ,అత్యంత ప్రతిభావంతంగా–
మధ్యమధ్యలో ఔచితీపోషకాలుగా సాగే వర్ణనలు, తన సహజ కావ్య శైలిలో సాగిస్తూనే!
ప్రధాన పాత్ర యైన గిరికాదేవి భక్తి పారవశ్యాన్నీ, నృత్యనివేదననూ, ఆమె తనుహృద్భాషల సఖ్యతనూ, తన స్వామియైన వేణుగోపాలునికి క్రమక్రమంగా దగ్గరౌతున్న పరిణామాన్ని ప్రధాన కథగా నడుపుతూనే!
ఈ ఘట్టమంతా ఒక అద్భుతావిష్టమైన రచనా సంవిధానంతో నిర్వహించారు, రచయిత–
మధురభక్తి అనే వెన్నెల ఉరవడిలో సాగే ఈ కృష్ణార్పితచిత్త, గిరికా నామక గోపికారమణి నర్తనయజ్ఞాన్నీ, తన ప్రాణాధినాథుడైన వేణుగోపాలునిలో ఆమె ఐక్యత చెందే అపూర్వ సన్నివేశాన్ని.
ఆ గిరికా హృదయాన్ని, ఆమె భక్తి భావాన్ని తాను స్వయంగా మనసా అనుభవించి – శ్రీనారాయణతీర్థ తరంగ రత్నాలతో, జయదేవ అష్టపదీ మణులతో, క్షేత్రయ్య పద చంపకాల గుబాళింపుతో; మృఛ్ఛకటికాది నాటక శ్లోకమాణిక్యాలతో, వేద ఋక్కుల అనర్ఘవజ్ర సమలంకరణలతో, పలు నాట్యభంగిమలతో, పతాక, శిఖరిణీ, లాంగూలాది ముద్రల ప్రస్తావనలతో —
ఈ ఘట్టం సమస్తాన్నీ నడిపిన తీరు, నాన్యతోదర్శనీయమూ, అఖండ ప్రతిభాసమన్వితమూ అని చెప్పక తప్పదు.
***
ఉత్సవారంభ సందర్భంలో ఆ అష్టమి నాటి వెన్నెలలు, ఆ నర్తనాంగణ వివరాలూ, నృత్యప్రదర్శనా సుసజ్జిత అయిన గిరికాదేవి వర్ణన, ఒక రసలోక విహారియై ఈ విధంగా చేస్తారు విశ్వనాథ:
ఆ నాటి వెన్నెలలను నృసింహవికటాట్టహాసభాసమానములుగ, వామనమూర్తి యజ్ఞోపవీత పరిస్వఛ్ఛ ప్రభాపరిపోషకాల వలె, శ్రీరామచంద్రయశోవిరాజమానమ్ముల వలె విధవిధాలుగా వర్ణించిన తరువాత విశ్వనాథ అంటారు: “….వెన్నెలలు వేణుగోపాలయాంతర్భాగమున కుందేళ్ళు ప్రాకినట్లు, తెలినాగుబాములు మలకలై నడచినట్లు, షోడశసహస్రగోపికాసితాపాంగఛ్ఛటలు చిటచిట కదలినటులు, వేగుచుక్క తో లేచి కవ్వమున చిలికిన పాలు వెన్న పెరుగులు కవ్వమునకు తాకకుండ దొంగిలించిన కుమారకృష్ణుని హస్తస్పృష్టముఖమునందలి తెల్లని కాంతులు, నవ్వులతో కలిసిపోయి చకచ్చకితములైనటుల- విరిసెను, ప్రకాశించెను, కాంతులు మలచికొనెను, ప్రవాహము కట్టెను, చల్లనయ్యెను. హృదయబాధా నివారకము లయ్యెను. పన్నెండేండ్లు దాటి పరువెత్తి వచ్చిన భగవంతుని ప్రసాదము వలె నలుదెసల పారాడెను.”
రాబోయే గిరికా నర్తన రాకాసౌందర్యానికి ఈ తారాధిపుడి జ్యోత్స్నలు, దివి తానై దిద్దిన వేయికళలని వారి అభిప్రాయమేమో!
ఆ నాట్యప్రధాన ఉత్సవాలకు నాంది వాక్యాలు విశ్వనాథ మాటల్లో:
“రాతిరి జాము పొద్దుపోయినది. గజ్జియలు కిణకిణలాడెను.తాళములు గణగణలాడెను. అప్పుడే బోనమంటించిన మద్దెల బొంయి బొంయి మనెను.
ఆలయమునకు ప్రాగ్దిశ యందున్న యశ్వత్థవృక్షాగ్రమున రెండు పైడి గంటలు కిలకిల గూసెను.
దేవదాసి సర్వాలంకారభూషితయై రంగమున నిలుచున్నది.”
మొదటి రోజు మత్స్యావతార లీల.
ఈమె అభిసారిక.
ఆలయదైవతమైన ఆ వేణుగోపాలస్వామి తన ఆద్యవతారము స్మృతికి వచ్చి ఉత్సుకతతో వీక్షిస్తున్న వారిలో ప్రథముడు!
ఈ సన్నివేశంలో గిరిక రూపరేఖా విలాస వర్ణన చేస్తూ, విశ్వనాథ:
“ఆమె మత్స్య కుటుంబిని వలె నున్నది.
ఆమె కెట్టయెదరుగా ముఖమండపమునందు స్వామికి మత్స్యావతార అలంకారము చేసిరి….. గర్భగుడిలో బంగారు మైమఱువుతో తన ప్రథమావతారస్మ్రృతిచేతను వలె యర్థనిమీలితాక్షుడై గోచరించుచుండెను.
దేవదాసి కన్నులు నాలుగు చేపలు వలె దీర్ఘములై కంటితుదలు మూడు గీతలు గీయబడిన నాము చేత మత్స్యాక్రృతి విడంబించెను….. ఆమె నఖశిఖపర్యంతము మత్స్య స్త్రీ వలె గోచరించెను.”
ఒక ఘట్టాన్ని అందునా నాట్య సన్నివేశాన్ని విశ్వనాథ దర్శించి వర్ణించిన తీరు అద్వితీయంగా కనబడుతుంది, వారి ప్రత్యణు పరిశీలనా దృష్టిని చాటి చెపుతూ!
గిరిక రూపును కూడా ఇక్కడ పూర్తిగా వర్ణించారు రచయిత, అందానికి ప్రధానంగా పేరుగాంచిన కుటుంబములో పుట్టిన ఆమెకు కృష్ణభక్తి ఎటువంటి నిండుదనాన్ని ఇచ్చిందో సూచిస్తూ!
“నమస్కరించిన దేవదాసిని స్వామి చూచుకొనెను. ఆమె యందు భగవంతుని కనురాగమే కలిగెను. ఆమె సౌందర్యము రంభాద్యప్సరఃకాంతా శిరస్తాడనపటువై యుండెను…. ముప్పది యేండ్ల నడివయస్సులో ఆమె మన్మథుని పట్టపుగుఱ్ఱమువలె… మూర్తీభవించిన వయస్సు వలె ఉండెను…. అర్థనిమీలిత నేత్రములయందు, తన్మనోగత సౌకుమార్యము,ఠీవి,రసజ్ఞత గోచరించు చుండెను…..
నాతి స్థూల, నాతిక్రృశ,నాత్యుచ్చ, నాతివామన, సర్వరసాధిదేవత వలె ప్రకాశించెను.
…ఆమె వర్షాభిసారికానృత్య మారంభించెను. భగవంతుని యందు తాను నిత్యభిసారికయైనట్లు పాదవిన్యాసము చేత స్ఫురింపచేసెను.”
ఇట్లా భోగప్పశాస్త్రి, రత్నగిరి మధ్య మధ్య సన్నివేశ సంచాలకులుగా, చమత్కారాలతో,రస సంపోషక సంభాషణలతో ఈ మత్స్యావతార ప్రదర్శన శుభంకరంగా సమాపనమౌతుంది.
“దేవదాసి లజ్జామంథర దృగంతములతో మత్స్యావతారము వంక జూచెను…..” కర్తరీ ముఖమున కడకన్ను జోడించి తన భావమంతయు స్వామికి చూరయిచ్చెను.
దేనికి భయపడని నేను, స్వామి సన్నిధిలో వారి మాటకు కంపించే స్థితికి వస్తానేమో అని దేవదాసి సందేహాస్పద అయితే –
నటుడు భోగప్పశాస్త్రి, ముగ్థావస్థకు సహజమైన బేలతనములను దాటి, మధ్యవై, తగిన పరిణతి నంది ప్రగల్భావస్థకు చేరుతావులే, స్వామిని చేరే సమయానికి అని ఆశ్వాసిస్తాడు!
గిరిక స్వామి సామీప్యతను భావన చేసి, లజ్జావనతయై, “నా జన్మము సఫలమాయె.” అని పాడి తన్మయత్వ స్థితిని చేరుకోగా, తల్లి రత్నగిరి ఆమెను నెమ్మదిగా మత్స్యావతార మూర్తి దగ్గరకు తీసుకుని వెళుతుంది.
హరప్పా, ధర్మారావు లతో సహా సభాస్తారులందరూ ఆ నృత్యప్రదర్శనా నైపుణికి, ఆ సన్నివేశంలో గిరిక అభినయ గాఢతకు ఏదో వేరే లోకానికి వెళ్ళినట్లు అనుభూతి చెందుతారు.
“హరప్ప దృష్టి యందు నిశ్చలత,ధర్మారావు దేహము నందు నిశ్చైతన్యము, సభికులందు నిస్తబ్ధత ఒక్కసారిగ గోచరించెను”, అంటారు విశ్వనాథ, ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెపుతూ!
“ఆది మత్స్య మూర్తి నీటిలో త్రవ్వుకొనిపోవునప్పటి ధ్వని వలె, మృదంగ, తాళ వేణువీణాదుల ధ్వనియంతయు కలిసి యొక్కమహాశ్రుతియందు లగ్నమై యాలయ ముఖ మంటపమున బోరుకొలిపెను” అంటారు రచయిత, ఒక భౌతిక నాదప్రపంచం, ఆది మూలమైన మహధ్ధ్వనిలో లయమైన వాతావరణాన్ని కనుల ముందు ఉంచుతూ, పఠిత శ్రోత్రింద్రియాలకు ఆ నాదానుభవస్ఫూర్తి కలిగేటట్లు!
నటుడు భోగప్ప గిరిక వంటి భక్తురాలిని ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపోతాడు.
ఆమె లోని భావరసపుష్టికీ, శాస్త్రజ్ఞతకూ ప్రణమిల్లుతాడు మనసా!
నృత్యము జరిగిన యావత్సమయమూ ఆమె దృష్టి తన స్వామి మీద నుండి మరలకపోవటమూ అతను గమనిస్తాడు..
మంగళాచరణము వేళకే ఆమె లౌకిక పరిధులు మీరి వేణుగోపాలార్పిత సర్వేంద్రియయైనదని గ్రహించి, అతను తానొక్కడే ఆ మంగళాచరణ ప్రక్రియ పూర్తి చేస్తాడు.
ఈమె సాధారణ నర్తకి కాదని, ఏదో అలౌకిక భక్తిభావ వశ్యయై నేరుగా ఆ కృష్ణస్వామితో భావాంబరవీథిలో చరిస్తోందని గ్రహించి ఆమె పట్ల అపారగౌరవ భావం పెంచుకుంటాడు విద్యాపారగుడైన శాస్త్రి!
తన్మయీభావంలో స్పృహ మరచిన గిరికకు శైత్యోపచారాలు చేస్తారు.
ఆమె మేల్కొని, నీటిలోకి దిగి మత్స్యావతార స్వామిని చేతితో తాకి, పూర్తిగా స్వస్థురాలౌతుంది.
సాధారణ సభికులందరు ఇళ్ళకు వెళ్ళిపోతారు.
హరప్ప ధర్మారావులు గిరికను సమీపించగా హరప్ప, “సముద్రము లీదిన చేపకు తోడిచేప యైన గిరికకు నమస్కారము” అంటాడు.
ఆమె భగవంతుని వంకనే చూస్తూ, శిరఃకంపము చేస్తుంది.
రాబోయే కూర్మవతారానికి చెల్లెలికి సంకేతం, నాట్యవిద్యామర్మజ్ఞుడైన అన్న ధర్మారావు ఈ విధంగా చేశాడని వ్రాస్తారు విశ్వనాథ:
“…ధర్మారావు దక్షిణ వామ హస్తముల చేత నర్థచంద్ర హస్తములు చేసి బోర్లించి వామహస్తముపై దక్షిణ హస్తముంచి,కూర్మ హస్తాకృతి రెండు బొటనవ్రేళ్ళ నల్లలాడించెను.”
ఆ తరువాత –
“దేవదాసి యింటికి బోయి వేషమూడదీసి, స్నానము చేసి కృష్ణదేవుని విగ్రహము నెదుట కూర్చుండి బధ్ధపద్మాసనయై మరల మంత్ర పునశ్చరణ మారంభించెను. …దేవదాసి కూర్చుండి ధ్యానము చేయుచు మత్స్యావతారమును దూరము చేసి, యన్న గారి యాజ్ఞానుసారముగ కూర్మావతారమును ధ్యానము చేయ నారంభించెను.”
గిరిక సాధకురాలు, భక్తురాలు. ధ్యానమూ, ప్రాణాయామమూ నిత్య కర్తవ్యాలుగా, విధిగా ఆచరించిన వ్యక్తి.
ఆమె ఏకాగ్రతా శక్తీ, నిశ్చల బుధ్ధీ ఆమెను నిలబెట్టిన సాధన సామగ్రి, ఈ పదిరోజుల నర్తన సవనంలో!
త్రికరణముల ఆమె నమ్మిన దేశికవరుడు, ధర్మారావు!
అతని సంకేతమే ఆమెకు దిశా నిర్దేశక సమమైనది, తదుపరి కార్యక్రమంలోకి అడుగిడి సాగించటానికి.
“కొంత సేపు కూర్చుండి కుడ్యమున వ్రేలాడుచున్న కూర్మావతార పటమును దెచ్చి యెదుట నుంచుకొని…. తన్ను తాను కూర్మముగ భావించుకొనుచు…” – ఇట్లా మత్స్యావతార సంలీనయైన మనస్సును కూర్మావతారపు దెసగా మార్చటానికి భావించి భావించి గట్టి ప్రయత్నం చేస్తుంది దేవదాసి.
కొంతసేపటికి ఆ క్షీర సాగరం, హరి కూర్మావతారమై మంథరపర్వతం ఎత్తుతున్న ఆ సన్నివేశం, కవ్వపు త్రాడైన వాసుకిని దేవదానవ గణాలు లాగటమూ – ఇత్యాదులు ఆ సాధకురాలి భావనా యవనిక మీద స్పష్టంగా కనబడ నారంభిస్తాయి.
ఏ అవతారమైనా, ఆమె మనోవీథిలో అవన్నీ తన స్వామియైన వేణుగోపాలుని లీలలే!
ఆమె భావనలో కూర్మ స్వామి నిలిచిపోగా, రాత్రి ప్రథమ యామము దాటిన తరువాత రెండవ రోజు నృత్యారంభమౌతుంది.
“కూర్మ హస్తము తో ఆమె రంగమున కవతరించెను.
….యామి హే! క మిహ శరణమ్!
సఖీజన వచన వంచితాహమ్! అని విప్రలబ్థ నిరూపణము సాగించెను…”
ఇక్కడ ఎంత సేపటికీ తన విభుని కానరాని విప్రలబ్థ ఆమె!
గిరిక చేత క్షీర సాగరం తోటీ, దాని పయః బిందువులతోటీ, తరగలతోటీ మాట్లాడిస్తారు విశ్వనాథ, నాయకుడి ప్రతీక్షలో ఉన్న్న ఒక నాయికది ఒక అలౌకిక భావనాజగతి అని సూచిస్తూ!
“చెల్లీ! క్షీరసాగర బిందుచ్ఛటా! అన్నా, క్షీరసాగర తరంగా!
బంధూ! పయో మాధుర్యమా! తల్లీ! క్షీరసాగరపు వెలుగా!
దయచూడుడు. నల్లనివాడు, శంఖచక్రగదాపద్మములు నాల్గు చేతుల దాల్చినవాడు,…. అతడిచ్చటికి వచ్చి పోలేదు కదా?!వచ్చి మీతో నేమైన చెప్పి వెళ్ళెనా”అని యేడువ నారంభించెను…”
నటుడు భోగప్పశాస్త్రీ, ధర్మారావూ ఆమెను చేరి పలుకరించగా ఆమె కొంత ఆ తన్మయీభావము నుండి బయటపడుతుంది.
అప్పటికి తెలతెలవారుతుండటం గమనించి తెర తీస్తారు ఆలయంలో.
“స్వామి అలంకారము ప్రత్యక్షమయ్యెను. భోగప్పగారు గిరిక మొగముపై పన్నీరు చల్లి – అడుగో,స్వామి నీకై కనిపించినాడు, లెమ్మనెను. ఆమె లేచి చూచెను….. దేవదాసి నేత్రపర్వముగ చూసెను.
నటుడారంభించెను.
క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవధృత కఛ్ఛపరూప జయ జగదీశ హరే!
…ఎర్రని చీరతోడి దేవదాసి తాను గూడు వెలుతురు వలె గానిపించెను….”
హరప్పా ధర్మారావులూ, స్త్రీజనమూ ఆమె దగ్గరకు వెళ్తారు.
హరప్ప, “స్వామి తోడి కూర్మమవై మంథర పర్వతము మోసిన తాబేటి పడుచునకు, నీకు నమస్కారము”, అనెను.
…ధర్మారావు వరాహహస్తము పట్టెను….. ధర్మారావు హస్తము వెంటనే భోగప్ప చూచెను….. ఎదురుగా స్వామి, సర్వగుణాలంకారశోభితుడు.
ఇంతటితో రెండవరోజు ముగించి వరాహావతార ప్రసక్తి ఆరంభిస్తారు రచయిత!
***
“దేవదాసి యింటికి పోయి, స్నానము చేసి, పాలకడలినుండి బయటకు వచ్చి సముద్రకథావిస్మృతి ఘటించుకొని, మరల వరాహ రూపమును ధ్యానించుచండెను.
ఆ నాడు శుక్ల పక్ష దశమి. వెన్నెలలు నేత్రపర్వముగ పరచుకొనెను.
భోగప్ప ఎత్తుకొనుటయే జయదేవుల వారి
“వసతిదశనే శిఖరే ధరణీ తవ లగ్న
శశిని కలంక కలేవ నిమగ్న…”, అని మంగళాచరణము చేసెను.
“గిరిక పాదములు వెండిగజ్జియలతో కిణకిణలాడెను”
ఆమె “జయజయరమానాథ” తరంగము నారంభిస్తుంది..
నాటరాగముతో సభాస్తారుల హృదయాలలో ఉత్సాహపు తరగలు పొంగుతాయి..
ఈనాడు ఆమె స్వాధీనపతిక.
నాయికా నాయకుల పరస్పర కోపాలు, బతిమాలించుకోవటాలు, అనునయాలు, ఆలింగనాలు, భ్రూవిలాసచాలనాలు – శృంగారరస సంపూర్ణకళగా సాగుతుంది ఆనాటి అభినయం, వరాహమూర్తి నాయకుడై!
భోగప్పశాస్త్రి ఆమె సర్వాభినయానికీ ఆశ్చర్యపోతాడు.
విశ్వనాథ మాటల్లో, “ఆమె యభినయ మొక్కక్కరి కొక్కక్క రీతిగా నుండెను. హరప్పనాయనికి సర్వమది లక్ష్మీనారాయణుల సంభోగశృంగారము వలె నుండెను. ధర్మారావునకు, దేవదాసి సాధనలో చాలా సున్నితమైన సోపానము మీద నున్నట్లనిపించెను. భోగప్ప శాస్త్రికి కొంత శాంతాభినయ మనిపించెను. కొంతసేపు భక్త్యావేశమనిపించెను.”
ఇంతలో చంద్రుడు దేవాలయము వెనుకకు పోయెను.
గిరిక రత్యవసానవేళా మహానంద సూచకముగ “కురుయదునందన చందన శిశిర తరేణ……” జయదేవుల అష్టపది గానము చేసెను.
అర్చకుడు కుంభహారతి తెచ్చి సభాసదులకు జూపించెను. గిరికతో, హరప్ప, “ వరాహమూర్తితో భూదేవతవైన నీకు నమస్కారము”, అనెను.
“ధర్మారావు స్వామి అలంకారము వద్ద మోకరించి యున్న గిరికను పిలిచి యెడమచేత సింహముఖహస్తమును, కుడిచేతి పతాకహస్తమును పట్టెను”, అ ని విశ్వనాథ వారి ముక్తాయింపు ఈ సందర్భంలో.
భోగప్పశాస్త్రి అప్రయత్నముగ, భాగవతాంతర్గత పద్యము నందుకొంటాడు, నరసింహావతార ఆరంభానికి నాంది సూచనగా!
“అడవులసంకటస్థలుల నాజిముఖంబుల నగ్నికీలలం…. దిక్కగు గాక శ్రీనృసింహుడు సురశత్రుయూధుడు……”,
***
నాడు ఏకాదశి.
రాత్రి రెండు జాములు దాటిన సమయం.
“ఏకాదశి యని సర్వ దేవతలునూ దేవాలయాగ్రభాగమున వాయువీథులలో వచ్చి నిలిచిరి. సభలో వాసకసజ్జికా నాట్యము గణగణలాడెను. దేవదాసి కొద్దిగా చమురు పోసి దీపము వెలిగించు చుండెను. చెలికత్తె లెరిగిపోదురేమో యని లజ్జా ముగ్థాననయై ముగ్థానాయిక వలె సజ్జీకరణమంతయు వారికి తెలియరాకుండ చేయుచుండెను.”
గిరిక పూలు గుచ్చుతూనే నటుడైన భోగప్పశాస్త్త్రిని ప్రశ్నిస్తుంది,…
“నీవు శ్రీకృష్ణస్వామి నెరుగుదువా,ఆయన ఈనాడు వత్తుననియె గదా?!” అని!
దానికి నటుడు, “…..ఆయన ప్రహ్లాదుని రక్షించుటకు వెళ్ళినారు. ఇంతవరకు రాలేదు” యని సమాధానమిస్తాడు.
నటుడు, “ఒకవేళ స్వామి రాకపోయినచో”, అంటాడు..
దేవదాసి సందంశ హస్తముతో, “చెలీ, నేడు స్వామియే రాకున్న, నా ప్రాణములు బలి యిచ్చెద” ననెను.
అంతలో తెర తొలగింపబడగా శ్రీనృసింహావతారాలంకారము కనిపించెను….
స్వామి విగ్రహము పెద్ద సింహపు తలకాయతో నమర్పబడియుండెను.”
నీరాజన మిచ్చి, “కరుణయావలోకయ మాం శ్రీనృసింహ శూరాసురసంహార శోభనాద్రి శ్రీ న్రృసింహ….” తో ఈ అవతారాన్ని ముగిస్తారు విశ్వనాథ.
తరువాతవి అయిన వామన పరశురామ అవతారాలను క్లుప్తంగా ముగిస్తారు, సముచిత వర్ణనలతో.
“అంతలో తెల్లవార వచ్చెను. దేవదాసి స్వామి వద్ద నుండి వామనావతార హస్తమును, పరశురామావతార హస్తమును బూని-
ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన…
క్షత్రియ రుధిర మయే జగదపగతపాపం,స్నపయసి పయసి శమిత భవ తాపం…”
అని నృత్యము చేసెను.
తెల్లవారెను.
“ధర్మారావు కుడిచేత కపిత్థ హస్తమును, ఎడమ చేత శిఖర హస్తమును గ్రిందుమీదులుగా చేసి రామావతార హస్తమును ప్రదర్శించెను.”
***
తరువాతది అయిన రామావతార ఘట్టంలో విశ్వనాథ పాఠకులను ఒక రసలోక విహారం చేయిస్తారు.
సీతారామ కళ్యాణ సన్నివేశ సందర్భంగా, ఆ తరువాత వ్రాసిన వాక్యాలతో!
ఇంటికి వెళ్ళి, దేవదాసి స్నానానంతరము మళ్ళీ ధ్యాన నిష్ఠ అవుతుంది.
ఆమెకు గత ఐదు దినాలుగా వరుస ఉపవాసాలే, ఆ ఉత్సవాల సంరంభంలో!
ఆ రోజే, ద్వాదశినాడు ఆహారము తీసుకోవటం, అంత వ్యవధి తరువాత.. నిద్రలేమి వలన అలసట కూడా తెలియవస్తుంది ఆమె ముఖంలో.
అయినా, అభ్యస్తమైన విద్య కాబట్టి, ఆమె నడక కూడా, ఏదో నాట్యపు సొగసుతో కన్పడుతుంది, ఒక అవ్యక్తమైన సౌందర్యరేఖావిలాసంగా!
భజన బృందాలతో, వేద పాఠాలతో, ఉపనిషద్వ్యాఖ్యానాలతో దేవాలయాంగణమంతా కోలాహలంగా ఉంటుంది.
దేవాలయ ముఖమంటపమంతా రామాయణ ఘట్టాల అలంకారాలు అమరుస్తారు..
పొద్దు గ్రుంకగనే నాడు నాట్య మారంభమౌతుంది.
వెన్నెలల ప్రసన్నతతో పాటు గిరిక వదనంలో, హృదయంలో ఏదో ప్రశాంతపూర్ణత వచ్చినట్లౌతుంది.
ఎదలో నివసించే పీతాభసన్నిభమైన భగవద్దీప మూలస్థానానికి తాను దగ్గరౌతున్నానని సూచన అందిన ఘడియయేమో ఆమెకు అది!
మేడపై నుంచి సీతాదేవి, రాముణ్ణి చూసి అవ్యక్తమధురమైన తన్మయీభావం పొందటాన్ని అభినయించటంతో ఆరంభమౌతుంది, ఈ రామావతార ఘట్టం, గిరిక ప్రథమదర్శన రతి భేదాన్ని అభినయించగా!
ఏదో తత్తరపాటు, ఎదురుచూపు, ఇంతలో కింద నుండి ధనుర్భంగమైన మహాధ్వని!
కళ్యాణ సంభారాలన్నీ రావటమూ, లక్ష్మీదేవిగా, సీతగా భావించుకొన్న ఆమె లజ్జామనోహరమైన ఆకృతిగా కనిపిస్తుందప్పుడు.
నఖశిఖపర్యంతమూ ఒక అతిలోక సుందరాకృతియై భాసిస్తుంది ఆమె,తన స్వామికి దగ్గరయ్యే ఘడియ సమీపించినట్లు భావనలు ఇబ్బడిముబ్బడి చేయగా!.
విశ్వనాథ వారి మాటల్లో: “సీతారామచంద్రసంయోగవేళ దేవదాసి తన్మయాకృతి దాల్చెను….. వెన్నెల మెదిపి చేసిన విగ్రహమన్నట్లు అవనతశిరోభేదము ప్రకటించుచు సిగ్గుల బరిణ యయ్యెను.
గిరిక మొగమున ఏదో అమృతరేఖ తాండవించి చూపఱకు హృదయము నందు చెప్పరాని యొకానొక భక్తిభావ ముదయించెను.
రాతిరి రెండు జాములాయెను. ఆనాటి నృత్యము విచిత్రమై, యింద్రియాతీతమై, యతీత మనోవికారమై, శాంతమై, మహా సమైక్యభావ మొకడు స్ఫురింపజేసెను.
వికార రహితమయిన మనస్సు పరమాత్మయందు లీనమైనట్లు….. నిశ్శ్రేయహేతువైనట్లు ఆ నాటి నృత్యము సర్వ జనులకు నాధ్యాత్మికద్రృష్టియే కల్పించెను…”
శ్రీవేణుగోపాలస్వామితో జరుగబోయే గిరికా సాయుజ్య కైవల్యానికి ఒక నాందిగా ఈ వాక్యాలు వ్రాశారనుకోవాలి రచయిత ఇక్కడ.
గిరిక సాధనా శిఖరము చేరిన సంకేతమది.
ఒక ప్రణయిని జన్మజన్మల తపస్సు ఫలించబోయే పావనతరుణ సూచ్యప్రాయమైనవి, ఈ పైన పేర్కొన్న రసాత్మకాలైన విశ్వనాథ వాక్యాలు.
ఇదే భావనను కొనసాగిస్తూ, ఆ నాటి నృత్యాంతవేళా పరివ్యాప్త ప్రశాంతతను, కళ్ళకు కట్టిస్తారు తన యీ వాక్యాలతో విశ్వనాథ:
“శబ్దమంతయు నాకాశమున లీనమై, సృష్టి యుపసంహరించుకొనుచున్నట్లు కనిపించెను.
సర్వ నేత్రములును గిరికామూర్తి యందు బధ్ధమై,సర్వజీవలోకము చేతను పరిసేవ్యమానమైన
వైకుంఠదేవుని వైభవము వలె గిరికయు, చుట్టునున్న సభయు భాసించెను.
సభ యంతయు గిరికామయమైపోయెను.
….ఈ మహానందతరంగము పెరిగి పెరిగి. ఆకాశము దాటి పెరిగి యా పై నుండి యొక్కసారి గిరిక విరుచుకుని పడెను”
లేచి కలగుండువడుచున్న సభాజనులను కూర్చుండ నియమించి, ధర్మారావు గిరిక వద్దకు పోయి…… “తల్లీ!” యనెను. ఆమె కనులెత్తి చూచెను. ఆయన రెండు మృగశీర్ష హస్తములు చేసి భుజశిరస్సల సమీపమున ఎదురెదురుగా పట్టెను.”
శ్రీకృష్ణావతారహస్తమది, గిరికకు అన్నగారి నుండి ఆ సంకేతము. చాలు, ఆమె లేచి నిలబడి ‘కృష్ణం కలయ సఖి సుందరం….’ అంటూ ఆరంభిస్తుంది, రసావతారుడైన శ్రీకృష్ణస్వామి అవతార విశేషాల అభినయాన్ని!
***
హరప్ప రామావతారము చూసిన తరువాత, ఇవి యేమి కళ్యాణములు, ఇది ఏమి నృత్యము అనుకొన్నట్లే; ఇవి యేమి కళ్యాణవర్ణనములు, ఇది ఏమి నృత్యవిన్యాసవర్ణనము, ఇది యేమి రచనావైశారద్యము అని పాఠకులు కూడా అనుకోవలసినదే.
విశ్వనాథ సత్యనారాయణ గారి సాహస్రముఖీనమైన ప్రతిభ, వర్ణనా నైపుణి, ఊహాశాలిత అణువణువునా – కొన్నిచోట్ల తాండవమై, ఇంకొన్ని తావుల మనోహర లాస్యమై దర్శనమిచ్చే తటిల్లతా సమమైన కావ్యశకలమీ, ఇరవైతొమ్మిదవ అధ్యాయము, వేయి పడగలలో!
ఒక అక్షరాపరంజి కలశము! ఒక అక్షరామృత మహత్కోశము!
శ్రీ బాలక్రృష్ణ లీలావిలాసాలకు పోతన గారి భాగవత దశమస్కంధ మెంతో, ఈ బృహద్గ్రంథమైన ‘వేయిపడగలు’లో ఈ అధ్యాయపు చివరిదైన కృష్ణవతార లీలా విలాస నాట్యసంరంభం కూడా అంత ప్రశస్తమైనది.
విశ్వనాథ సృష్టించిన ఆభిజాత్యమూర్తి, ధర్మబుధ్ధీ, ఆ హరప్పనాయని మాటలలో:
“ఓహో! యిది యేమి నృత్యము! ఇది యేమి స్వామి! ఇతడేమి ధర్మారావు?! నేను కళ్యాణములన్న వట్టి ఉత్సవము లనుకొంటిని. ఓహో ఇవి ఉత్సవములు కావు.
ఇది ఏదో సృష్టి వ్యాఖ్యానము. రస స్వరూప నిర్ణయము. వేదార్థ బోధనము…..”
***
కృష్ణావతారము
(ధర్మారావు)… “తల్లీ” యనెను. ఆమె కనులెత్తి చూచెను.
ఇంక మూన్నాళ్ళు నృత్యమున్నదనెను. ఆమె లేచి నిలుచుండెను.
శ్రీకృష్ణవతారహస్తము గోచరించ ఆమె లేచి నిలచుండి.-
కృష్ణం కలయ సఖి సుందరం…..అని నృత్యము చేసెను.”‘
ఈ యవతారమూర్తి దక్షిణ నాయకుడు కాబట్టి, అన్య స్త్రీతో ఉండి వచ్చిన కృష్ణుడి పై కోపం నటిస్తూ, రాధిక వేషంలో ఖండిత నాయికగా ఆరంభిస్తుంది, గిరిక.
దూరినంత సేపూ దూరి,అంతలోనే మెత్తబడుతుంది ప్రియుణ్ణి అన్ని మాటలన్నందుకు!
కానీ గడుసు నాయకుడు వచ్చి,”ప్రియే చారుశీలే…. దేహిముఖకమలమధుపానం” అనీ,
“తవమసి మమ జీవనం,తవమసి మమభవజలధిరత్నం” అనగానే కాస్త మెత్తబడుతుంది.
మళ్ళీ అంతలోనే ఆయన చేసిన ప్రేమకలాపాల వలన మళ్ళీ కినుక పూని నిష్ఠురోక్తులాడుతుంది.
ఈసారి ఆయన కోపంతో విసవిసా వెళ్ళిపోతాడు.
మళ్ళీ ఈమె మోహాతిరేకాలు, దీర్ఘ నిశ్వాసాలు, అంతటి వాడిని ఉపాలంభించానే అని విచారించటాలు!
చివరకు నటుడు నీవు ప్రగల్భగా ఉండలేవు, ఎప్పటికీ మధ్యవే, ప్రాయికంగా బేలవే, ఇంక మర్చిపో అతనిని!
అయినా అట్లాంటి వాడు ఉంటేనేం, లేకపోతేనేం?! అని అనగానే గిరిక ప్రియుడి దూషణ సహించలేక మూర్ఛ పోతుంది.
చాలా పొద్దుపోయినదని గుర్తించి, నటుడూ, చెలికత్తే, సంచాలకుడూ అన్నీ తానే అయిన భోగప్పశాస్త్రి, “సరేనమ్మా నీవు చింతించవద్దు,. నీ స్వామిని నేనే ఈ పొదరింట దాచి ఉంచాను చూడు, వెళ్ళి”, అంటాడు.
సరిగ్గా అప్పుడు తెర తీయగానే పొదరింటిలో నక్కి కూర్చున్న అలంకారంతో వేణుధరుడైన గోపాలస్వామి దర్శనం అవుతుంది ఆమెకు.
కుంభ హారతి ఎత్తుతారు, గీత నివేదనతో.
తరువాత స్వామికి ఊరేగింపు, గజవాహనం మీద!
మరునాడు చతుర్దశి.
మళ్ళీ గగన రంగాన కౌముదీవైభవం, శ్రీవేణుగోపాల దేవాలయాంగణంలో గిరికా నృత్యవైభవం! అనన్య సామాన్యమైన కృష్ణ భక్తిసౌరభం!
ఆ రాత్రి ఆమె ఒక పరిదీన వదనంతో, శోకవిషాదమూర్తిగ నిరలంకారగా, రంగ ప్రవేశం చేస్తుంది, ప్రోషితభర్తృకయై!
“మధురాపురి లోనే ఉండిపోయాడు నీ స్వామి తిరిగి బృందావనం వచ్చే జాడే కనబడదు.
కంస వధార్థం వెళ్ళినవాడు, నీకిచ్చిన బాసలన్నీ మరచినట్లేనా?!
నేనా అంత దూరాభారం సహించి వెళ్ళి కొనితేలేను,
నువ్వు ఆశ వదులోకోవలసినదేనేమో ఇక,” అంటాడు భోగప్పశాస్త్రి, గిరికతో.
గిరిక ఒక్కసారి విషణ్ణయై, స్వామి లేని, తిరిగిరాని ఈ బ్రతుకే వ్యర్థం అని అనేస్తుంది.
దానికి నటుడు “అది కాదమ్మా మొదట్లోనే చివరి దాకా పోతున్నావు, ఆయన నిన్ను తన ప్రేమనేత్రాలతో చూస్తూనే ఉండి ఉంటాడులే”, అని అననుయ వాక్యాలు పలుకుతాడు.
కానీ అంతలోనే ప్రేమ ఉప్పొంగి, గిరిక ఎంతటి వాడనుకున్నారు నా స్వామి?! నా కోసం ఎవరు మధురకి వెళ్ళి తెస్తారు ఆయనను అని, ఆయన సౌందర్యం, గొప్పతనం వర్ణించి చెప్పటం ఆరంభిస్తుంది. ఆయన బాల్య లీలలు, మాయా రాక్షసుల ప్రాణాలు తీసిన వైనాలు వివరంగా చెప్తుంది.
కాళియాహి చుట్టలు చుట్టేసింది అంటే, నటుడు అయ్యో కాటు ఎంత ప్రమాదకారి అని అంటాడు.
గిరిక నా స్వామి సకల మహిమలు కల సకలేశ్వరుడే తెలుసా అని గర్వంగా వక్కాణిస్తుంది.
సర్వసమర్థుడు మా శ్రీక్రృష్ణ స్వామి అని తన ప్రత్యయాన్ని వెలిబుచ్చుతూ!.
పైగా అప్పుడు “మేమందరమూ” కూడా నీలాగే కళవళబడ్డాము అని కూడా అంటుంది నటుడితో.
నటుడు వేసిన ప్రశ్నకు ఆమె ఇచ్చే జవాబులో విశ్వనాథ ప్రేమయోగినియైన ఆ నాటి గోపికారమణియే గిరిక అని ఆమె మాటల్లోనే చెప్పించారు.
నటుడి ప్రశ్న:”మేమందరము”, ననగా యెవరెవరేమి?
గిరిక: గోపికలము.
అది ఏ అవస్థయైనా ఆమెకు ఉన్నది ఆ కృష్ణదేవుని మీద, అకళంక భక్తియే, పూర్ణానురాగమే అని చెప్పకనే చెప్తుంది ఈ సమాధానం!
నిజానికి, గిరిక అలనాటి ద్వాపరలోని బృందావనయోగిని గోపికయే అని ధర్మారావు చేతనే నవలలో ఒకచోట అనిపిస్తారు విశ్వనాథ, వాచ్యంగానే!
“అదె నందనందనుడంతర్హితుండాయె పాటలీతరులార పట్టరమ్మ యన్నంత ఒడలు తెలియనితనము వచ్చుటయే గోపికా లక్షణము.నీవును గోపికవే”, అన్నది ధర్మారావు తీర్మానం!
ఆ లక్షణం దేహంలో ప్రత్యణువున, మనసులో ప్రతి భావములో నింపుకొన్న గోపికారమణిగానే చిత్రించారు ఈ నవలలో, గిరిక పాత్రను రచయిత.
నటుడు, గిరికా నీవు ధన్యచరితవు, “విశ్వేశుపై నీకజస్ర పటుధ్యానము నిల్చె….” అని, నీకై నాతో సందేశం పంపించాడు, వినవమ్మా నీ స్వామి మాటలే ఇవి”, అని, ఇట్లా అంటాడు:
“నాకు మీ వియోగము లేదు. భూతములందు పంచభూతము లెట్లున్నవో, నేను మనః ప్రాణబుధ్ధీంద్రియ గుణముల నట్లాశ్రయించి యుంటిని. ఆత్మమాయానుభావముచేత భూతేంద్రియగుణాత్మత కలిగి యాత్మ యందాత్మ చేత నన్ను నేను సృజించుచున్నాను, చంపుచున్నాను, పాలించు చున్నాను.ఆత్మజ్ఞానమయుడను, సిధ్ధుడను….”
ఆ మాటలూ, కృష్ణస్వామి ఇంకా ఆ శ్రేయోదూత ద్వారా చెప్పించిన సాంఖ్యసారమూ విని గిరిక ఇట్లా పాడుతూ, అభినయం చేస్తుంది పరవశయై – కృష్ణపారమ్యతాబ్ధిలో ఓలలాడుతూ!
“పరమిహ పశ్యతి పూరుషం స్వీకృతమాయికమానుషం
నిజపరభేదరహితదృశమక్షరమీక్షణకృతభువనవిభుం….”
ఎదురుగా ఉన్న సత్యాసమేతుడైన స్వామి సంతోషిస్తాడు.
కానీ అంతలోనే తన సహజ భక్తి ప్రపత్తితో, నటుడితో “అయితే నీకు మా స్వామి క్షేమ సమాచారం తెలిసే ఉంటుంది, ఆయన కుశలమేనా, మధుర వీడి ఎప్పుడు రాబోతున్నాడిక్కడికి, అయ్యో మేమెట్లా తట్టుకోవటం, ఈ వియోగబాధ” అని ప్రాకృత స్థితికి వచ్చేస్తుంది.
ఇంతలో కుంభహారతి పట్టటం, స్వామి గరుడవాహనం మీద ఊరేగింపుకై వెళ్ళటం జరుగుతాయి.
***
హరప్పా, ధర్మారావు రత్నగిరి ఇంటికి పరామర్శ కోసం వెళ్ళినపుడు ధర్మారావు అన్న మాటలు గిరిక ఆధ్యాత్మిక స్థాయిని స్పష్టం చేస్తాయి.
ఈ కళ్యాణోత్సవాలలో ఆమె చూపిన భక్తి పారవశ్యమూ, ఆ తన్మయీభావము, తన అచ్చపు నెలవు చేరుకోవటానికై ఆ జీవుని వేదన, నిశితంగా గమనించిన ఒక దేశికుని మాటలే ఇవి యనవచ్చును.
ఆ సందర్భంలో ధర్మారావుతో విశ్వనాథ గిరిక గురించి అనిపించిన మాటలు ఇవి:
“ఆమె తపస్సు ఫలించినది. రాత్రి యొకానొక దివ్య తేజస్సు కనిపించి, ‘నీ తపస్సు పూర్తియైనది,’ యని చెప్పెను!”
రాజైన హరప్ప నాయడు, ధర్మారావు కుటుంబమూ, వారి స్నేహితులూ, గిరిక విషయము తెలిసిన వారి బంధువు లందరూ, ఆమెను పరామర్శించి వెళ్తారు.
ఆమె ఒక యోగిని, తపస్సాధన సిద్ధి దశకు చేరుకున్న మహాభక్తురాలు అనే స్థిరాభిప్రాయం వారందరికీ ఆ పాటికే ఏర్పడి ఉండటమే కారణం అని చెప్పుకోవాలి ఈ సందర్భంలో, ఆ పరామర్శలకు!
“పున్నమి నాటి వెన్నెలలలో నాల్గు దిక్కులు కలకలలాడెను.
దక్షిణ మంటపమున పార్వతీనాగేశ్వరస్వాములను, వామ మంటపమున సత్యభామా వేణుగోపాల స్వాములును కొలువై యున్నారు. ఊరేగింపైనది…. ఇంక వారికి వివాహములు చేయవలెను. రాత్రి రెండుజాములైనది.
పందిరిలో కాగడాల వెలుతురే కాని వెన్నెల లేదు.”
వీణామృదంగాదుల శుభస్వనాలతో గిరికా నృత్య మారంభమమౌతుంది.
ఆ రోజు ఆమె ఏదో దేవతాకళతో ఉన్నట్టు, ఆమె సౌందర్యం మిగతా అన్ని రోజుల కంటే ఇనుమడించినట్టూ కనిపిస్తుంది వీక్షకులందరికీ.
ఉపవాసాలు చేసి కొంత కృశించియున్నా లావణ్యం మాత్రం పెరిగినట్లు కనబడుతుంది.
వాలుజడ వేసుకొని.
నుదుటను నిలువు బొట్టు, కన్నులకు కాటుక, బుగ్గను చుక్క,చెక్కిళ్ళ గంధపు పూత, నల్లని చీరలో ఆమె సౌందర్యాధిదేవతయై కనిపిస్తుంది చూపరులకు, ఆ ఉత్సవ వేదిక మీద!
ఆమె సుకుమారమైన పాదాలకు వెండి గజ్జెలు దాల్చి, మందారారుణిమల పారాణి అలంకారంతో ఉంటుంది.
“ఆమె యడుగు వేసినంత మేఱ యెఱ్ఱతామరలు మొలుచుచుండెను… రంగస్థల మంతయు మృదూరు సంచారము చేత కదళీవన భ్రాంతి కల్పించుచుండెను.
….దృష్టి సాగినంత మేర నీరజాతములు, మల్లెలు, మొల్లలు,గేదంగిపూలు పునః పునః ప్రభూతము లగుచుండెను.
ఆమె కంఠస్వరము… సృష్టిలో నున్న నానామధుర ధ్వనులను పర్యాయములుగా ప్రదర్శించెను.”
ఇవీ ఒక తన్మయీభావంలో ఉన్న గిరికను గూర్చి, అంతటి కవితా తన్మయీభావంలోనూ ఉన్న విశ్వనాథ వారన్న మాటలు!
ఆమె కృష్ణ వియోగబాధాసహయైన గోపికావతారమే ఆ క్షణంలో!
మొక్కలనడుగుతుంది, పూల నడుగుతుంది,తన ప్రియుని జాడ చెప్పమని!
ఆయన ఆనవాళ్ళు ఇవీ –
నల్లని వాడు, పద్మనయనాలసుందరుడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నిత్యస్మేరాననుడు, మీ పొదల మాటున దాగి లేడు కదా, చెప్పండమ్మా అని పరవశయై అడుగుతుంది, లవంగ లుంగ సారంగాది వృక్షాదులను!
సర్వ ప్రకృతీ, ఆమెకు కృష్ణమయమే!
ప్రాణాప్రాణ వివేచన కూడా లేదు ఆ పారవశ్యంలో, కనబడ్డ ప్రతిదానినీ, ప్రతి వారినీ అడగటమే, స్వామి జాడ తెలిస్తే చెప్పమని!
శతాబ్దులుగా వింటూ వస్తున్న ఆ భాగవతాంర్గత గోపికాభామినుల మానసికావస్థ నాడు గిరికా నృత్యంలో, ఆ వేణుగోపాలోత్సవ మంటపంలో కనులారా చూస్తారు ప్రేక్షకులందరూ!
“దేవదాసి నృత్యము… మహారణ్యము నందలి తరుశాఖ లొండొంటిని రాచుకుని మొరసినట్లు,
జలతరంగిణి నినదించినట్లు,
లాస్యతాండవముల చేత విజృంభించెను.
అచ్చట స్వామికి కళ్యాణము జరుగుచుండెను. వైఖానసులు మంత్రము చదువు చుండిరి.
….వివాహశుభవాద్యములు మ్రోగుచుండెను.
జన మందరు నిశ్చలదృష్టులై చూచుచుండిరి.
వేలకొలది జనమున్న యాయెడ నిర్జనమైన ప్రదేశము వలె నుండెను.”
గిరిక: “స్వామీ!నీ కొరకై ముప్పది యేండ్ల నుండి తపమాచరించుచుంటిని. నేడు దర్శనమిత్తునని చెప్పితివి.
స్వప్నము నందు, చిత్రము నందు దేవాలయము నందే కాని నీ జ్యోతిర్మయాకారమును,నీ సచ్చిదానంద స్వరూపమును నేను నిమీలిత దృష్టినై చూచుకొన్నది లేదు.
నీవు నా ప్రాణములకు ఉచ్చు వేసితివేమో తెలియదు. ప్రాణములు నాకు లెక్కలేదు. ఇవి నీ సన్నిధానమున నా చిన్ననాడే యుంచబడినవి.
దర్శనమిచ్చెదవో యీయవో యీనాడు తెలియవలెను.” అని బహిరంగంగా తన అంతిమ నిశ్చయం చెప్పేస్తుంది.
ఒక భక్తురాలి, ఒక ఆరాధకురాలి అలవికాని ఆంతర వేదన కనిపిస్తుంది ఈ మాటల్లో.
పూర్ణ శరణాగతి ఎంత స్పష్టమో ఆ మాటల్లో, అంత చనువూ, స్వతంత్రతా, “మా స్వామి వద్ద నాకు జంకెందుకు గొంకెందుకూ, జనార్దనుడు సర్వ భావగ్రాహి కాదూ”, అనే ఎరుక మిళితమై యున్న, ఆత్మప్రత్యయభరమైన పలుకులు!
భగవంతుని పైన యెడతెగని, యెదలోతుల నుండి ఉబికి వచ్చే ప్రేమకు తార్కాణమీ వైఖరి.
భక్తవతంసుల మధురమైన ఆవేదన అది. జననాంతర మూలము లున్నది. భవబంధవిఛ్ఛేదక పటువైనది.
సిధ్ధికి సిధ్ధము సుమా, ఈ ప్రాణి అని సమయమాసన్న మైనపుడు ఆ పరమాత్మయే జీవుని చేత పలికించే పలుకులు.
అవి, సంసారసాగరతారణచణ దివ్య ప్రేరణలు, మహిమాన్విత మహాపోత సమానాలు.
తాను బృందా భూమిలో తిరుగాడుతున్న, గోపాలదేవుని వెదుకుతున్న గోపికయే ఆమె భావనలో.
కృష్ణ పదాంకిత శంఖచక్రపద్మముద్ర లామెకు అక్కడ కనిపిస్తాయి.
ఈ భూమి ఎంత పవిత్రమైనదో ఈ చిహ్నాలు —
వేదశిఖరాలకు దక్కని గౌరవచిహ్నాలు – దాల్చడానికి అని ధరిత్రిని మెచ్ఛుకుంటుంది, నీదెంత పుణ్యమమ్మా యని!
ఆమె లౌకిక స్థాయి దాటిన ఒక మహానందాన్వేషి!
నందకుమార నిత్యధ్యానమగ్న!
పంచేద్రియాలూ, మనస్సూ ఐక్యత చెంది, తదితర సర్వభావశూన్యయై పంజరం వీడటానికి సిద్ధపడుతున్న జ్ఞానకీరమే!
ఆ తన్మయావస్థలో,ఆ గోవిందలీలామననగాఢతలో తానే కృష్ణుడై పోయి, ఆ యదుకిశోర లీలలు,వేదిక మీద అభినయించి ఆచరించటం ఆరంభిస్తుంది గిరిక!
అది ఒక ప్రేమోన్మాద మనదగిన, భౌతికావరణలను మీరిపోయిన ఆధ్యాత్మిక ఆవేదన యొక్క సహస్రముఖీనత!
దానికి హద్దులు లేవు,అది ఒక మహోద్ధృతమైన కడలి పొంగు!
తృణావర్తుడిని వెంబడిస్తున్నాని కొంత దూరము పరుగెత్తి వెనుకకు మరలుతుంది.
నేను విశ్వాత్మను,లోకాలన్నీ నాలోనే ఉన్నాయని తల్లికి, తన నోరు తెరిచి చూపిస్తుంది.
గోపీజనపాలకులారా రండి,ఈ గోవర్ధనగిరి వద్ద ఉండండి,ఆ ఇంద్రుడి పని నేను చూస్తాను అని వ్రేలితో కొండ ఎత్తినట్లు చూపుతుంది.
వ్యత్యస్తపాదయై వేణువు పూరిస్తున్నాను అంటుంది.
గోపికలారా రండి మీకు తత్త్వబోధ చేస్తాను అని మళ్ళీ తనే వారిని ఇళ్ళకు వెళ్ళిపొమ్మంటుంది, ఇట్లా అర్థరాత్రి వేళ నా వద్దకు రావటం మీకు గౌరవం కాదంటుంది.
ఇంతలో భావతీవ్రత వలన “కృష్ణా కృష్ణా రక్షింపుము రక్షింపుము” అంటూ మూర్ఛ పోతుంది.
మళ్ళీ ఇంతలో లేచి,
“ఏడీ నా నీలమోహనుడు, జలధరశ్యాముడు, నా ప్రాణవల్లీత్రాత కనిపించడే”, అని నలుదిక్కులా కలయ చూస్తుంది.
చూపరులంతా దిగ్భ్రమతో ఇది నృత్యప్రదర్శనమా, లేక ఈమె నిజంగానే ద్వాపర నాటి వ్రజభూమిలో పరితపించిన గోపికాంగనా అని ఆశ్చర్యపోయే అంతటి సన్నివేశ కల్పన!
రెండు కళ్యాణాలూ యథావిధిగా జరుగుతుంటాయి. మంత్రపఠన ధ్వని తప్ప పందిరిలో అంతమంది జనమున్నా ఇంకే శబ్దమూ లేదు. మంత్రముగ్ధులైనట్లు, నృత్యకళావీక్షణార్పిత చిత్తులైనట్లూ, ఏదో లోకాతీత విషయం మొదటిసారి దర్శిస్తున్నట్లూ, వింత యైనదీ అద్భుతమని అనిపిస్తూన్న అనుభూతితో చూస్తుంటారు యావన్మందీ!
వేణుగోపాలస్వామి కూడా పరిణయమాడుతున్న సత్యా దేవిని చూడక, గిరికానర్తన వీక్షణోత్సుకుడై ఉన్నాడా అనిపించే సన్నివేశం!
రాగరంజితమూర్తియై తోచసాగాడు, శ్యామలాంగ మనోహర శ్రీవేణుగోపాలుడు!
గిరిక ఇంకా స్వామి పాదవర్ణనతో సాగిపోయింది.
ఇవిగో ఆ లక్ష్మీదేవికి ప్రియమైన పదపద్మాలు, నారదాదులు మొక్కిన పాదాలు, బ్రహ్మాదులు ఏ పదరజాన్ని తమ శిరస్సుల మీద జల్లుకుంటారో ఆ పాదాలు అంటూ!
ఇదిగో ఇక్కడే స్వామి మునివేళ్ళ మీద నుంచొని ఆ పూలు కోసినది, ఆ చిహ్నాలు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి, ఇవిగో అంటూ నర్తన మారంభిస్తుంది.
అయ్యో ఎంత నొప్పి పుట్టిందో ఈ బృందావని ఎత్తుపల్లాల నేలలో నడిచినప్పుడు నా స్వామి పాదాలకు, అని తను ఎంతో నొచ్చుకుంటుంది!
ఆ శరీర భాగమంతా నొప్పి పోయేట్టు నా ప్రాణాలతో తుడిచి సపర్యలు చేసుకుంటానంటూ భావవివశయై అనుకొంటుంది.
ఆ పదాలను లాలించి ముద్దుపెట్టుకుంటుంది, భక్తిభావంతో!
ఇంతలో అయ్యో, ఏవీ ఈ క్షణం నా చేతులతో తాకిన పాదాలు కనిపించలేదు, మళ్ళీ నా కనుబ్రామి మాయమైపోయాడు నా వేణుగోపాలుడు.
ఇంక నేను చేయగలిగిందేమీ లేదు, మరణమే శరణ్యం అని చీర కొంగుతో కంఠానికి బిగించి ఉరివేసుకోవాలని చూస్తుంది.
కంగారుపడి, రత్నగిరి ఆమెను వారించడానికి వెళుతుంది, భోగప్పశాస్త్రి తొందర పెట్టగా!
రత్నగిరి “స్వామి వస్తానని మాట ఇచ్చాడు కదమ్మా, తప్పక వస్తాడు”, అని ఆమెను ఆ ప్రయత్నం నుంచి వారింపచూస్తుంది.
చూస్తున్న ప్రజలందరికీ అది నృత్యప్రదర్శన లాగా కాక యథార్థంగా జరుగుతున్న సంఘటనే అనిపించటం మొదలౌతుంది.
కళ్యాణం పూర్తి అయి, స్వామిని పార్థసారథి వేషంలో రథముపై తెచ్చి యుంచుతారు.
గిరిక మళ్ళీ “మాధవం దర్శయ రేమందార మాధవం దర్శయ” అని పాడుతూ నృత్యారంభం చేస్తుంది.
తన స్వామి ఆనవాళ్ళు – నవ్వురాజిల్లెడి మోమూ, కమలాయత నయనాలూ, అమృతవాక్కులూ, చింతామణి గారు ఉరమూ,మెరుగు చామనచాయ మేనూ-అని చెప్పి సర్వ వృక్షజాతులనూ పేరుపేరున అడుగుతుంది మీకు తెలిసే ఉంటుంది నా స్వామి జాడ- చెప్పమని!
చివరకు “ఓ బృందావనమా! నీకు నమస్కారం. నీలోనే దాచుకున్నట్టున్నావు స్వామిని, నీయందు స్వామి పదచిహ్నాలు ఉన్నాయి కాబట్టి, ఆయన ఇక్కడకు వచ్చాడన్నది రూఢి, నీకు తెలిసే ఉంటుంది చెప్పవమ్మా” అని ప్రాథేయపడుతుంది.
ఇంతలో ఒక నామాల కోతి జనం మధ్యలోకి దూరుతుంది, ఎట్లాగో!
దాంతో జనం కాస్తా లేచి నుంచుని కంగారుగా కదలటం ఆరంభమౌతుంది. ఎవరిదీ కోతి అనే ప్రశ్నలతో పాటు, పార్థసారథికమైన వాహనం మీద వానర పతాకమే కదా, అని సమాధానమూ రావటంతో, జనం సర్దుకుంటారు.
ఈ సందడిలో కూడా,”మాధవం దర్శయ రేమందార మాధవం దర్శయ” అన్నది అఖండంగా మారుమ్రోగుతూనే ఉంటుంది గిరిక నృత్యంతో పాటు!
గిరిక ఆ మహా తన్మయత్వంలో మూర్ఛ పోతుంది మళ్ళీ.
ఈ సారి తల్లి రత్నగిరి ఎంత ఉపచారాలు చేసినా ఆమెకు స్మృతి రాదు.
ఇది చూసి ధర్మారావు “కుంభ హారతి వెలిగించండి”, అనగానే హారతి వెలిగిస్తారు.
మళ్ళీ మధురనాదంతో భోగప్పశాస్త్రి, “మాధవం దర్శయ రేమందార మాధవం దర్శయ” అని ఆలపిస్తాడు.
ఆశ్చర్యకరంగా, వెంటనే గిరికకు స్మృతి వచ్చి, లేచి నిలబడుతుంది.
ఆ మహాఖండహారతిలో ఆమెకు హారకుండలకేయూర భూషితుడు, శంఖచక్రగదాపద్మహస్తుడూ, రవిచంద్రనయనుడూ, వైజయంతీమాలాలంకృతుడూ,హిరణ్యరోచిస్సులతో వెలిగి పోతున్న, సహస్ర శీర్ష సహస్రబాహు విశ్వంభర మూర్తి దర్శనం కలుగుతుంది.
ఆ దివ్య దర్శనానికి నమస్కరిస్తూ నిలుచున్న ఆమెకు, ఆగకుండా కనుల నుండి బాష్పధారలు కురుస్తాయి.
ఆమె పడి పోతుందేమో అని రత్నగిరి పట్టుకుని ఉంటుంది.
విశ్వనాథ వారి మాటల్లోనే, “ఆ మహామూర్తి ఆమె నేత్రమండలమంతయు నిండెను.క్రమక్రమముగా నేత్రేంద్రియము స్వగుణమును పరిత్యజించెను….
ఆ మూర్తి యామెలో ప్రవేశించెను. …క్రమక్రమముగా పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము సర్వము నిండా ఆ మూర్తి నిండి పోయెను.ఆమె సర్వప్రకృతి తన్మూర్తిమయమయ్యెను.
రత్నగిరి చేతిలో నున్న యామెనఖశిఖపర్యంతము చల్లనైనట్లు తోచెను…..
భోగప్పశాస్త్రి “మాధవం దర్శయ.. హే మందార” యని పాడుతుండగనే…… ఒక్కసారి కాగడా లన్నియు గుప్పుమని ఆరిపోయెను..
కుంభహారతి మధ్య నుండెను.
ఒక ప్రక్క వేణుగోపాలస్వామి పార్థసారథి విగ్రహాలూ, మరియొక ప్రక్క దేవదాసియు-
ఆ వెలుగుచేత అటు భగవంతుడును,
ఇటు దేవదాసియు ప్రకాశించిరి.
తక్కిన పందిరంతయు అంధకారమయ్యెను.
ఎవ్వరికిని నేత్రములు కన్పించుటలేదు.
హే మందార మాధవం దర్శయ
రేరే మందార సంతానకల్పకపారిజాతచందన
రేరే మందారనందన
రేరే చంపక నాగ పున్నాగశ్రీపూగపపనసనారికేళరసాల
మాధవం దర్శయ” యని మ్రోగుచునే యుండెను.
ఆమె ఆ దేవదేవునిలో ఓ తేజోరూపమై కలసిపోయెను.
***
ఇదీ కవిసమ్రాట్టులు విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ అనబడే కావ్య స్థాయి గల నవలలో చూపిన గిరికా నామక దేవదాసి చరితావైభవమూ, శ్రీవేణుగోపాలస్వామిలో లీనమై, ఆమె సాయుజ్య కైవల్యం పొంది, ఐక్యమై పోయిన కథాకథనమూ!
***
పురాణాల్లోని గిరిజా కళ్యాణ ఘట్టం లోకతారణ కారణమయ్యింది, తారకాసుర వధతో,వీర స్కందకుమార జననంతో.
అది లోకోత్తర కుమారసంభవం.
విశ్వనాథ వారి హృదయ సౌకుమార్యం రూపుకట్టినదే ఈ గిరికా వైభవం,మృదు పద సమ్మోహక లాస్యం!
ఇది భక్తిభావనల మంగళతోరణం!
వేయిపడగల ఈ అక్షర భవ్యమందిర సహస్రాధిక స్తంభాలలో, ఆధ్యాత్మిక వాసనాభరితమైన ధ్వజస్తంభ సన్నిభమైనది ఈ గిరిక అనేబడే దేవదాసి పాత్ర.
మెడలు పైకి సారించి, కళ్ళు పెద్దవి చేసికొని,ఆ భక్తికిరణప్రసారానికి చేయి కొంచెం అడ్డుపెట్టుకుని చూడవలసిన ఎత్తైనదీ, గుణౌన్నత్యమూ కలదీ, ఆ ధ్వజస్తంభం!
దీని చూపు పురాసంస్కార బలిమి వలన సదా ఊర్థ్వదిశగానే!
అనగా తన ఆరాధ్యదైవమూ, పతిగా భావించిన శ్రీవేణుగోపాలస్వామి పైననే!
ఆ స్వామి కరుణాపాంగ దృక్కుల కోసమే ఆమె సాధన, ఆమె తపస్సు, ఆమె నాట్యకళావైదుష్యము, సమస్తమూ!
దేవతారాధనకై విరిసిన భక్తి పారిజాతమిది. స్వామిలో లీనమైపోవడానికి పరితపించిన అలనాటి గోపికామణి తన్మయీభావ మిది.
కృష్ణసర్వస్వమే ఈ జగతి, ఆమె దృష్టిలో. ఆ స్వామి కర్పించని తనుమనధనములు నిరర్థకము లీమె పరిగణనలో.
శ్రీవేణుగోపాలస్వామికై జననాంతరముల మీద ప్రోగు పడిన ఈ జీవుని విరహవేదన, మానసిక సాధన అంతా, గిరికగా ఆ దేవదాసి కులములో జన్మ నెత్తిన వేళ పండినది.
పండి, పక్వమై ఇహ వాసనా పూర్ణక్షయమై, ఆమె ఆ కృష్ణనామక చిదానంద చైతన్యాలయంలో లయించి పోయింది.
ఇది ఈ కాలానికి ఒక అబ్బురం కల్గించే పాత్రకల్పనయే.
కల్పించిన దానికి తగిన ప్రాణమిచ్చి పాఠక హృదయావర్జకం చేయటం లోనే విశ్వనాథ వారి సహస్రధారా నిశిత సుదర్శన సమమైన ప్రతిభ!
విశ్వనాథ లాలనగా పెంచి పోషించిన నవమల్లికావల్లరి గిరిక!
దాని భావకుసుమాలను ఏ ఇతరములు స్పృశించకుండా, అవి ఏ దాడుల బారినా పడకుండా ఏ ప్రబల మారుతాలూ ఆ కోమలవల్లిని కూల్చివేయకుండా దడి కట్టి, పందిరి వేసి – సహస్రాధికాలుగా అపూర్వ పరిమళ భరిత కుందవిరులను పూయించి, చూసిచూసి ఆనందించి, భక్తిశ్రద్ధలతో మాలకట్టి – చివరకు శ్రీ వేణుగోపాలస్వామి కంఠసీమలో అలంకరించి మురిసిపోయారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, వేయి రేకులూ విప్పారిన భక్తి సౌగంధికమే, ‘వేయిపడగలు’, లోని ఈ గిరిక!
పరమ సద్గుణ మహద్గుణనిక!
(సమాప్తం)
