Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెయ్యి అబద్ధాలాడైనా..

[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘వెయ్యి అబద్ధాలాడైనా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రవరాజు గుమ్మంలో కూర్చున్నాడు. ఉదయమే పరంధామయ్య వచ్చాడు. “రండి సార్ పరంధామయ్యగారు” పిలిచాడు అరవరాజు.

“మర్యాదలక్కరలేదు మీ నాయనని పిలు” అన్నాడు ఆయన కటువుగా.

ఇంతలో అరవరాజు తండ్రి గురుమూర్తి వచ్చాడు.

“ఏమయ్య అప్పుతీర్చవా, ఇప్పటికే పాతిక వేలయ్యింది?  అన్నాడు కోపంగా పరంధామయ్య.

“అయ్యా తమరు నాకు ఇచ్చింది పది ఏలే కదండి పాతికంటరేమిటి” అన్నాడు అతను కంగారుగా.

“వడ్డి ఎవడు కడతాడు నీ బాబా?” అన్నాడు ఆయన మరింత కోపంగా.

వెంటనే అరవరాజు ముందుకి వచ్చి “సార్ పోయిన ఆయన బాబేం వస్తాడండి వడ్డి కట్టడానికి?” అన్నాడు సౌమ్యంగా.

“లేపోతే నువ్వు కట్టు” అని అరిచాడు పరంధామయ్య.

“అలాగెనండి తప్పకుండా అయితే చిన్న యిన్నపం” అన్నాడు అరవరాజు.

“ఏంటది?” మరింత కటువుగా అన్నాడు ఆయన.

“మాకు దుబాయి నించి డబ్బు రావాల. యుద్దం కదండి లేటైయినాది. ఓ వారంలో వత్తదండి. అప్పుడు తమ అప్పు తీర్చేత్తానండి” అన్నాడు అరవరాజు.

“అదేం కుదరదు. రేపీలోగా ఇవ్వకపోతే దావా చేసేత్తను. మీ ఇల్లు ఏలం వెయించేత్తను”అన్నాడు కోపంగా.

“అలాంటారా, ఓ ఇషయం మనవి సేత్తాను యినుకోండి. దావా అంటే అది తేలేటప్పటికి ఎవరుంటారో తెలియదు. ఆ ప్లీడరుగారు కూడా బాగనే లాగుతారు. చివరాఖరుకి మీకు మేం ఇవ్వవలసిన బాకీ కంటా ఖర్చు అదికం అయిపోతందండి. బాగా ఆలోసించండి. రేపు మీ ఇంటికి వత్తానండి” అన్నాడు అరవరాజు సౌమ్యంగా.

ఆ మరనాడు అరవరాజు పరంధామయ్య గారింటికి వెళ్ళాడు.

“ఎవయింది డబ్బు తెచ్చినావా?” గట్టిగా అడిగాడు ఆయన.

“సారు తవరు కోర్టుకెల్తానని అన్నారుగా, దాని యిసయం తెలుసుకొందామని వచ్చానండి. తవరు కోర్టుకెల్తె ప్రస్తుతం డబ్బు అవసరం లేదని దుబాయికి ఫోన్చేద్దాం అనుకొంటన్నానండి” అన్నాడు వినయంగా. పరంధామయయ్య గారిలో కంగారు పెరిగింది. ఉదయం లాయరు దగ్గరకెల్తే ఆయన చావుకబురు చల్లగా చెప్పాడు – ఆ నోటు కాలదోషం పట్టిపోయిందని దావాకి పనికిరాదని.

ఆయన కంగారుగా లేచి, “ఇదిగో బాబు మీ నాయన చాలా మంచోడు, అంచేత దావా సేయదల్చుకోలేదు, వీలు సూసుకొని దుబాయి డబ్బు రాగానే బాకీ కట్టేయి” అన్నాడు చాలా సౌమ్యంగా.

“అలాగేనండి” అని వెనక్కి తిరగబోయి అక్కడున్న అబ్బాయిని చూసి “మీ అబ్బాయి గారాండి” అని అడిగాడు.

“అవును” అన్నాడాయన.

“ఐతే అబ్బాయిగార్కి పెళ్ళి అయిందాండి” అని అడిగాడు అరవరాజు.

“లేదండి, నాకసలు పెళ్ళి కాదండి, ఇదిగో ఈ పీనాసి బాబు ఉండగా నాకు పెళ్ళికాదండి, ఎవళ్ళోచ్చినా ఏభై లక్షలు కట్నం కావాలని అడుగుతున్నాడండి. దాంతో ఆళ్ళు పారిపోతన్నారండి” అన్నాడా అబ్బాయి కోపంగా.

“అవును నా కాడ ఆస్తుంది, డబ్బుంది. అంచేత కట్నం ఇవ్వవలసిందే” అన్నాడు పరంధామయ్య.

“నిజమేనండి. ఆ మాత్రం కట్నంతీసుకోవడం తప్పులేదండి, కానైతే మరో ఇషయం కూడా మీరు ఆలోసించాలండి. అదేంటంటే ఏభైయేలు కట్నం ఇచ్చేవాడు తమ ఇల్లు పరిసరాలు తమని చూత్తారు కదండి, మరైతే ఇవి ఇలాగే ఉంటే ఆళ్ళమ్మాయి ఎంత సుఖపడతదో ఆలోసిత్తారు కదండి, అందుకని యిఅన్ని మార్చియాలండి, ముందు ఇల్లు బాగు సేయించలండి, ఆ తరవాత మీరు ఆ మాసిపోయి వాసనోత్తన్న బట్టలు మార్చలండి. ఇల శానా మార్చలండి. లేపోతే ఆ వచ్చినోడు అదే దారిని పారిపోతాడండి, ఇంక అబ్బాయికి పెళ్ళుండదండి, మీకు కింత కాలు సెయ్య వంగాక కాంత గంజి కాచిఇచ్చే దిక్కూ ఉండదండి, అదలా ఉంచండి, అసలు సంగతి సెప్పటం మరసిపోయాను, మీకు లా గురవయ్యగారు తెలుసు కదండి” అన్నాడు అరవరాజు.

“ఆ తెలుసు. చాలా పెద్దమనిషి సమయాని బాకీ ఇంటికట్టుకొచ్చి ఇచ్చేసేవాడు” అన్నాడు పరంధామయ్య.

“సరే పాపం ఆయనకి కాలు తీసేసినారండి” అన్నాడు అరవరాజు.

“అదేం పాపం, ఏవయింది” అడిగాడు ఆయన.

“అంటే మనూరికి జమిందారుగారు కాపరం వచ్చారండి తెలుసా” అడిగాడు అరవరాజు.

“తెలుసు, ఐతే” అని ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య.

“ఆయనకి ఒక్కడే కొడుకండి. చాలా గారబంగా పెంచుతున్నారండి, ఆయనకి ఓ కారు కూడా కొనిచ్చారండి, ఆయన సుభ్రంగా మందు కొట్టేసి కారు నడుపుతాడుటండి.  అదెలా నడుత్తిదో తెల్దండి.  పాపం ఆ మధ్య మన గురవయ్యగారు సైకిలు మీద పొలం యెడతనారంటండి. అక్కడికీ ఆయన పాపం రోడ్డు పక్కమ్మటే యల్తన్నారంటండి. అంతే. జమిందారు గారి అబ్బాయిగారు కారెట్టి గుద్దించేసారండి. కారు సెక్రం మన గురవయ్యగారి కాలు మీద నించి పొయిందండి. పాపం కాలు నరాలన్నీ నుజ్జయిపోయాటండి. అందుకని కాలు మోకాలు దాకా తీసేసినారండి. అదండి సంగతి” అన్నాడు అరవరాజు.

“అది నాకెందుకు చెపుత్తున్నావు” అడిగాడు పరంధామయ్య

“అంటే మీరు ఓ టైమూ పాడు లేకుండా ఎండకొండ కాకుండా రోడ్డుకడ్డంగా పడి నడిచి పోతుంటారు కదండి, మీ టైం బాగోక అదే సమయానికే అలా ఆయన కారుమీద కాని బైటకి వచ్చారనుకొండి అంతే మీ అదృట్టం బాగుంటే కాలు మీంచే పోతదండి కారు. ఒకేల మధ్యన పడ్డారనుకోండి అంతే పరలోకమే” అన్నాడు అరవరాజు.

“అలా యందుకు జరుగుద్ది” అని సాగతీసాడు పరంధామయ్య.

“ఏం యందుకు జరగదు, అలా చాలామందికి అయింది. ఇద్దరుముగ్గురు అతను చెప్పినట్లు అవుటైపోయారు” అని అన్నాడు ఆయన కొడుకు.

“ఇప్పడెలా ఆ టైంకి వెళ్ళకపోతే వడ్డీలు కట్టెవాళ్ళు దొరకరు” అన్నాడు పరంధామయ్య.

“సరే నీ ఇష్టం నీ జాతకం ప్రకారం కాలు కాని ప్రాణం కాని పోయే పరిస్దితి ఉంది అనుకొంటా” అన్నాడు ఆయన కొడుకు.

ఓ అడుగు ముందకెడద్దామనే లోపల గుమ్మంలో అరవరాజు కనిపించాడు.

“ఏంటి పరంధామయ్యగారు భైటకెల్తన్నారా” అడిగాడు అరవరాజు.

“అవును” అన్నాడు ఆయన.

“అంటే జమిందారుగారబ్బాయి కారు బైటకు తీసారంట. మా బావ పరిగెత్తుకొచ్చి చెప్పాడు” అన్నాడు.

“ఐతే నాకేం భయం, నేవెడతా” మరో అడుగు ముందకి వేసాడు. వెంటనే వెన్నులో దడపుట్టింది గురవయ్య గారు గుర్తొచ్చారు, గబగబా లోపలకి పరిగెత్తి గదిలో దూరి తలుపేసుకొన్నాడు. అది చూసి అరవరాజు పరంధామయ్యగారబ్బాయి నవ్వుకొన్నారు.

“మీ నాయన భయపడతనాడు, ఇదే అకాసం, మెత్తగ ఉన్నప్పుడే వంగతీయల” అన్నాడు అరవరాజు.

పరంధామయ్యకి ఆకలేసింది “అరె బాబా ఆకలేత్తందిరా” అని అరిచాడు, జవాబు రాలేదు. నెమ్మదిగా తలుపు తీసుకొని బైటకొచ్చాడు, హాల్లో ఎవరు లేరు, ‘ఎలాగ ఏదో తినకపోతే ప్రాణం పోయేలా ఉంది’ అనుకొంటు బైటకి వచ్చాడు.

అంతవరకు పక్కన నుంచున్న కొడుకు బైటకి వచ్చాడు “ఎందుకు” అని అడిగాడు.

“అదేరా బాబా ఆకలి ఏత్తందిరా” అన్నడు ఆయన.

“ఇప్పుడూలా ఎటు కాని యాల పోని ఏదైనా చేసుకొంటావా” అని అడిగాడు అతను.

“లేదురా ఏం చేసుకోలేను, నీరసంగా ఉంది” అన్నాడు ఆయన.

“మరేం బాధ పడకండి అయ్యా. నేను మా ఇంటి నించి కేరేజి తెచ్చాను, తినండి” అన్నాడు అప్పుడే వచ్చిన అరవరాజు.

పరంధామయ్య గబగబా వచ్చి ఆవురావురుమంటూ అంతా లాగించేసాడు.

“అయ్య అదేంటీ, అబ్బాయికి లేకుండా తినేసారు” అని అడిగాడు అరవరాజు.

“బలే రుచిగా ఉందయ్య. అందకే లాగించేసాను. ఎప్పుడో మా ఆవిడ ఉన్నరోజుల్లో తిన్నానయ్య ఇలాంటి తిండి” అన్నాడు పరంధామయ్య.

“ఇదంతా నీ భార్యే చేసిందా” అడిగాడు ఆయన.

“అవునండి” అన్నాడు అరవరాజు.

“బలే రుచిగా ఉందయ్య” అన్నాడు.

“అందుకే బాబుకి పెళ్ళి సేయమని సెపుతంట, కోడలు కళకళలాడుతు తిరగుతుంటే ఎంత బాగుంటదండి, అయనా మీకా వయసు పెరిగిపోతంది, బాగా ఆలోసించుకోండి” అనేసి వెళ్ళి పోయాడు అరవాలరాజు.

ఆ రాత్రంత మధ్యాహ్నం చేసిన భోజనమే గుర్తు వస్తోంది. రాత్రంతా కోడలు ఇంట్లో తిరుగుతున్నట్లు భోజనం వండి పిలుస్తన్నట్లు కలలు రావడంతో “అమ్మాయి వంట చాలా బాగుందమ్మా, చాలా రుచిగా ఉంది” అని పలవరించడం మొదలెట్టాడు.

అక్కడే ఉన్న ఆయన కొడుకు, కలగచేసుకొని “నాయనా అతిగ కలవరించకు. నాకింకా పెళ్ళికాలేదు, నీకు కోడలేడనించివచ్చింది” అని అరిచాడు.

ఇంతలో అరవరాజు వచ్చాడు. “ఏంటి బాబు గట్టిగా అరత్తన్నావు” అని అడిగాడు.

“అదా మీరు రెండ్రోజులు కేరేజీ తెచ్చి తినిపించారు, అది బాగా రుచి మరిగాడు, అదీకాక కోడలు పిల్లుంటే ఇలాగే తినచ్చని ఊరించారు, దాంతో ఈయనకి కోడలపిచ్చట్టుకొంది” అన్నాడు అతను.

“అయితే నా ప్లాను పనిచేసింది. ఇంక మీ నాయన నీ పెళ్ళి యావలో పడిపోతాడు” అన్నాడు అరవరాజు.

పరంధామయ్యకి ఆత్రుత ఎక్కువై పోయింది. “ఏవయ్యా అరవరాజు, మా వాడి పెళ్ళి ప్రయత్నాలు చేస్తన్నావా” అడిగాడు.

“అయ్యా మీరలా కంగారు పడితే ఎలాగ. ముందు మీరు ఇల్లు బాగు చేయించాల, సున్నాలెయ్యాల”, అన్నాడు అరవరాజు.

“అలాగంటావా, సరే ఐతే ఆ పనేదో నువ్వే చూడు, నే పిలిస్తే ఎవడురాడు డబ్బులు ఇవ్వనేమోనని” అన్నాడు ఆయన.

ఆ మరునాడే అరవరాజు పని చేయించడం మొదలుపెట్టాడు. వారంలో పరంధామయ్యగారిల్లు స్వరూపం మారిపోయింది. పరంధామయ్య వేషం మారిపోయింది. మంచి బట్టలు కట్టుకొని హాల్లో కొత్త కుర్చిలో కూర్చున్నాడు.

మళ్ళా వారం తిరిగేనాటికి కొత్త కోడలు వచ్చేసింది. పరంధామయ్యగారిలో మార్పొచ్చింది, బాకీదారులందర్ని పిలిచి పత్రాలన్ని ఇచ్చేసాడు.

ఇప్పటికీ జమిందారు గారి అబ్బాయికి కారు లేదన్నసంగతి, సోమరాజు కాలు తీయలేదన్న సంగతి పరంధామయ్యకి తెలియదు, ఎందుకంటే ఆయన భైటకి వెళ్ళడం లేదు జమిందారిగారబ్బాయి కారుకి భయపడి.

Exit mobile version