[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]
‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.
***
1. అమ్మ శతకము
బేతపుడి ఇందుమతి రచించిన ‘అమ్మ శతకము’ చక్కటి పద్యాలకు చిక్కటి ఉదాహరణ. చక్కటి పదాల పోహళింపు, ఉదాత్త భావాల నిగారింపుతో ఇంపయిన పద్యాలతో శిశువు స్థాయి నుంచి ఎదుగుదల వరుకూ అమ్మ పోషించే వివిధ దశలను ప్రదర్శిస్తుందీ శతకము.
దేవుడు నిల్చి నికేదురు దెల్పుమ నీ మది కాంక్షలన్నచో
పోలమ దేవి యెల్లపుడు కాళిక మాదిరి బిడ్డలందరిన్
త్రోవను జూపి వారలకు తోడుగ నీవిక నుండమా సదా
లేవిక కోర్కెలంచనుచు లెస్సగ పల్కుచు నుండునమ్మయే.
ఈ పద్యాలు కేవలం మనుషులలో ‘అమ్మ’ గురించి మాత్రమే కాక పశుపక్షాదులలోని మాతృ భావనను కూడా హృద్యంగా తెలుపుతాయి.
రెక్కల మాటున దాచుకొని రేపగలున్ కనిబెట్టి పిల్లలన్
ముక్కున దెచ్చి గింజలను ముద్దు పెట్టచు కూత పెట్టుచున్
చక్కగ నింగినందెగర చూచుచు రెక్కలు సాగిపోవగన్
మక్కువ తోడ నేర్పుచును మంతన జేసిడి పిట్ట యమ్మయ్.
ఇలా అతి చక్కని పద్యాల ద్వారా ‘అమ్మ’ ఉత్కృష్టతను, ఔన్యత్యాన్ని, దైవ సమానత్వాన్ని చాటి చెప్పాయీ శతకంలో పద్యాలు నూటికి నూరు శాతం!
~
బేతపూడి ఇందుమతి
పేజీలు: 28
వెల: అమూల్యం
ప్రతులకు:
బి. సారాభాయ్
92, దుర్గా నిలయం
బాలాజీ ఎన్‍క్లేవ్
కళ్యాణపురి, ఉప్పల్
హైదరాబాదు-39
ఫోన్: 9989009001
2. శంకర శతకము
‘శంకర’ అనే మకుటంతో గన్నవరపు వేంకట నరసిహ సుబ్రహ్మణ్య శర్మ రచించిన మహాక్కరల శతకము ఈ శతకం. ఈ శతకంలో చారిత్రిక నేపథ్యాన్ని, స్థల విశేషాలను, క్షేత్ర మహాత్యాలను పొందుపరచారు కవి. అంతే కాదు పద్యాల వివరణ కూడా ఇచ్చారు. పంచభూత శివ క్షేత్రాలను పద్యాలలో దర్శింప చేశారు.
శివుడు లింగపు రూపాన కనరాడు చిత్రముగ చిదంబరము నందునన్
భవుని యావాస లింపపు మర్మము పట్టజాలన్ నుడి వెదరు జనుల్
భువిని వాడెడి నానుడిగా పేరు పొందగను చిదంబర రహస్యమై
సువిధముగ పూజ చేతును భక్తితో చూడుము దయతోడ నను శంకరా!
ఇది చిదంబర క్షేత్రానికి సంబంధించిన పద్యాలో ఒక పద్యం.
ద్వాదశ జ్యోతిర్లింగాలను వర్ణించే పద్యాలలో శ్రీశైల క్షేత్రానికి సంబంధించిన ఒక పద్యం –
నల్లమల కాననముల శ్రీశైలమున నభవుడు దయతోడ నెలవయ్యె
మల్లికారుజునిగ జనులు పూజింప మనసిజ మర్దనిచట భక్తితో
మల్లికల పూజ చంద్రమతి సలుప మల్లికార్జునుడను పేరొందితే
మల్లెపూవుల పూజ చేయగ మము మంచిగ కరుణ చూడుము శంకరా!
భక్తి భావం అణువణువునా నింపుకున్న ఈ శతకం పద్య ప్రియులకు, భక్తులకు ఆనందం కలిగిస్తుంది.
~
గన్నవరపు వేంకట నరసింహ సుబ్రహ్మణ్య శర్మ
పేజీలు: 40
వెల: 50/- రూపాయలు
ప్రతులకు:
గన్నవరపు వేంకట నరసింహ సుబ్రహ్మణ్య శర్మ
కమలానగర్ (ఇసిఐఎల్ పోస్ట్)
అయ్యప్ప స్వామి గుడి వద్ద
హైదరాబాద్ – 62
ఫోన్: 9492052179
3. శ్రీరామ శతకము
శ్రీమతి తుమ్మలపల్లి జయలక్ష్మి రచించిన మంచి ధారతో సాగిన శతకము ‘శ్రీరామ శతకము’. ఈ పద్యాలు ‘శ్రీరామ’ మకుటంతో ఆరంభమవుతాయి.
శ్రీరామ! నీ నామము –
నోరారగ నను దినంబు – నుతియించిద – సం
సారాంబుధి దాటించెడి –
దారిం జూపింపుమయ్య – దశరథ రామా!
“ఆది మకుటమము ‘శ్రీరామ’ అనే మంగళకరమైన ‘మ’ గణంగా కనిపిస్తుంది కానీ ఇవి కందపద్యాలు. మొదటి రెండు గురువులతో గగ గా గైకొని మిగిలిన గురువు గగ గాని ‘భ’ గణంగా గాని మార్చుకుని ప్రణాళికతో వ్రాసారు అని తోపిల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ ముందుమాటలో ఛందో విశేషాలను వివరించారు.
శ్రీరామ! నీ మందిర-
మూరురను వెలసియుండె – నుర్వీతలమున్!
నోరారగ కీర్తింపగ –
భారము నీ పైన వేసి – పదిలంబుండన్!
చక్కని భావాలతో పద ప్రయోగాలతో ఆనందం గొలిపే శతకం ఇది.
~
పేజీలు: 28
వెల: 100/- రూపాయలు
ప్రతులకు:
విల్లా 16,
ప్రణీత్ ప్రణవ్ వ్యాలీ
బ్యాన్ సైడ్ ఆఫ్ సిల్వర్ ఓక్స్ స్కూల్
బాచుపల్లి,
మేడ్చల్ – మల్కాజగిరి జిల్లా
హైదరాబాదు – 500090
ఫోన్: 8008009954
4. శ్రీ శారదాంబ శతకము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) రచించిన ‘శారదాంబ’ మకుటం కలిగిన శతకం ఇది. స్రగ్విణి, కంద, ఆటవెలది వృత్తాలలో రచించిన ఈ శతకం శారదాంబకు సంబంధించిన విశేషాలు పొందుపరచుకున్నది.
శంకరా చార్యులిచట పంకజాసన వగు
నీక పీఠమొసగె! నీడ నిమ్ము
మాకు శరణు పోష! మత్స్య నయన యని
సన్నుతింతుమమ్మ శారదాంబ!
శారదంబ దివ్యధామ వర్ణన పద్యాములలో ఒకటి ఇది.
కలము పట్టినంత కదులు వరము నిమ్ము
కవనములను వ్రాసి కమల నయన!
తృప్తి పొందెదను మదిని నీదు నుతులతో
సన్నుతింతుమమ్మ శారదాంబ!
ప్రతి కవి, రచయిత ప్రార్థన ఇది.
అలకించి మాదు అంతరంగములను
నాదుకోనవె తల్లి హంసయాన!
హారతిదియే గొనుమ! భారతీ! యని నిన్ను
సన్నుతింతుమమ్మ శారదాంబ!
ఆ దేవి కరుణ వల్ల సాధ్యమయిన సృజనను ఆమెకే అంకితమివ్వటం, హారతిగా అర్పించటం చక్కని ఆలోచన.
~
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
పేజీలు: 25
వెల: 50/- రూపాయలు
ప్రతులకు:
2-60/13.
జిబిఆర్ కాలనీ,
గుర్రంగూడ
హైదరాబాదు – 501510
ఫోన్: 9963998955
5. శ్రీ పార్వతీపతి శతకము
భమిడిపాటి కాళిదాసు రచించిన ‘పార్వతిపతీ’ శతకము ఇది. భక్తి ప్రధానమైన రచన ఇది.
భక్తుడి ఆర్తి, ప్రార్థన, జీవిత సత్యాలను తమలో పొదుగుకున్న పద్యాలివి. ప్రతి పద్యానికి తాత్పర్యాన్ని జత చేయటం బాగుంది. పద్యాన్ని అర్థం చేసుకోవటంలో సామాన్య పాఠకుడికి తోడ్పడుతుంది.
చందన చంద్రఖండముల చందమునొప్పెడు దివ్యగాత్ర! ఋ
గ్వందిత! విశ్వనాథ భవ బంధము లెల్లను ద్రెంచు వాడవో
యిందు శిరోవిభూష! నగజేంద్రుని నందన ప్రాణనాథ! యో
సుందర! సూర్యసోమ సురసుందరి పూజిత! పార్వతీపతీ!!
ఇలాంటి ప్రౌఢ పదాలతో భక్తి వైరాగ్య భావాలు ఉప్పతిల్లగ రచించిన చక్కని శతకము ఇది.
~
భమిడిపాటి కాళిదాసు
పేజీలు: 40
వెల: భక్తి ప్రపత్తులు
ప్రతులకు:
శ్రీసాయిదత్త సౌధం
F/7, చదువుల వారి వీధి
అనకాపల్లి 531001
ఫోన్: 9440977794

