Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విభిన్న శతకాలు – పరిచయాలు-6

[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]

‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.

***

1. అనంత పద్మనాభేశ్వర శతకము:

ఆత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్ ‘అనంతా! పద్మనాభేశ్వరా!’ అన్న మకుటంతో రచించిన శతకం ‘అనంత పద్మనాభేశ్వర శతకం’ ఈ పద్యాలను ప్రౌఢ కవిత్వంగా భావించవచ్చు. ప్రతి పద్య పఠనం ఒక అనుభవం. ఓ వైపు తాత్వికత, మరో వైపు లోతైన ఆలోచనలు, ఇంకో వైపు సర్వం విస్మరించే భక్తి, ఆ పై ప్రౌఢ పద ప్రయోగాలు, మరో వైపు దైవాన్ని నిలదీసి ప్రశ్నించే తెగువ.. ఇవన్నీ కలసి ఒక అపూర్వ పఠనానుభవాన్ని మిగిల్చి ఆనంద సాగరాల ప్రయాణింప చేస్తుందీ శతకం.

ఘన ఫేనాభిధ మందహసయుత సంఘర్షోర్మి విభ్రాంతి గుం
ఫన సర్వాంబుధి కూలగమ్యగతి, తన్మాయార్ధ సంకేతమై
క్షణ మాత్ర ప్రవిలోక్య రూప సుమహా చైతన్య సంజ్జేయమో
యవ వార్ధక నిజమూర్తి నిల్పితి యనంతా! పద్మనాభేశ్వరా!

~

కర్మంబుల్ భువి సల్పుచున్నపుడు నే గర్తన్ స్వయం శక్తిచే
నోర్మిన్ జేసితి నన్నదత్ఫలంబు బాయున్ బాప పుణ్యబులై
చర్మంబంటగ నాత్మసాక్షినయి, యీ జన్మంబు నందీయుమా
ధర్మంబుల్ నెఱవేర్పు జ్ఞానము ననంతా! పద్మనాభేశ్వరా!

***

అనంత పద్మనాభేశ్వేర శతకము
అత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్
పేజీలు: 36
వెల: ₹ 50 /-
ప్రతులకు:
507, వైజాగ్ ప్రొఫైల్స్ రెసిడెన్సీ
NH-5, పంజాబ్ హోటల్ జంక్షన్,
శివాలయం ఎదురుగా,
ఐ.ఇ. పోస్ట్, విశాఖపట్టణం-530007
ఫోన్: 9441716197

 

 

 


2. శ్రీ విఘ్ననాథ శతకము:

కొరిడె విశ్వనాథ శర్మ ‘విశ్వనాథ! శర్మవరద! విఘ్ననాథ! అన్న మకుటంతో రచించిన శతకం ‘శ్రీ విఘ్ననాథ శతకము’. తేటగీతిలో తేటగా ఉండే పద్యాలతో, చక్కనైన భావాలను పొదిగి సరళమైన పదాలతో, సుస్పష్టమైన భావంతో ఆనందం కలిగిస్తాయి పద్యాలు.

~

నీకు ముగ్ధరూపమునిచ్చె నీశ పత్ని
మోము నిచ్చెను గజ మాతృమూర్తి నీకు
తల్లులిద్దరి సుతువీవె ధరణిలోన
విశ్వనాథ! శర్మ వరద! విఘ్ననాథ!

~

మేఘములు లేక జల్లేల మేదిని బడు
చెట్టు లేకయ ఫలమేల చేరు భువిని?
నీదు దయలేక నేనెట్లు నిలుతు నిలను?
విశ్వనాథా! శర్మ వరద! విఘ్ననాథ!

***

శ్రీ విఘ్ననాథ శతకము
కొరిడె విశ్వనాథ శర్మ
పేజీలు: 36
వెల: ₹ 50/-
ప్రతులకు:
10-150, విజయ భూషణము
శ్రీమఠం వద్ద, గోలివాడ
ధర్మపురి – 505425
జగిత్యాల జిల్లా (తెలంగాణ)
ఫోన్: 9849608311

 

 

 


3. శ్రీ కపిలేశ్వర శతకము:

శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ దశక విభజనగా కపిలేశ్వర తీర్ధ ఘనతను చాటి చెప్పిన శతకం ‘శ్రీ కపిలేశ్వర శతకం’. ఈ శతకం ‘మత్తకోకిల ఛందం’లో ఉంది. ఈ శతకం పద్యగతిలో ప్రవహించే నదిలా లయబద్ధంగా సాగింది. ఈ శతకం ఉపోద్ఘాతము, స్తలపురాణము, కపిల తీర్థ వర్ణన, ఉత్సవ వైభవము, శివతాండవము, శివ భాష, ఆది దంపతుల సరసల్లాపము, జిజ్ఞాస, ఆకృతి సాక్షాకృతి, శివార్పణము అన్న పది విభాగాలలో సాగింది. పద్యాలకు భావాన్ని కూడా పొందుపరచారు.

~

మత్తకోకిల నృత్తమందు సమంచితం బగు మిశ్రగ
త్సుత్త మధ్వనులన్ వహించి నటోత్సుకుండగ బూను –మ
చ్చిత్త వేదిక బద్య వృత్తము జేర్చు నన్నిక నన్ను ద్వ
న్నృత్తమందొక సాధనం బగు రీతి శ్రీ కపిలేశ్వరా!

~

కాపిలస్తతి రంజనా! జన కల్మష వ్రజ భంజనా!
శ్రీ పతి ద్రుషిణాను మిశ్రత్ చల్మయాకృతి భాజనా!
కాపి లోదక దివ్యమజ్జన! కను తాండవ యౌజనా
దీపి వాఖిల దేవతా జగతీజనా! కపిలేశ్వరా!

***

శ్రీ కపిలేశ్వర శతకము
శతావధాని ఉప్పల ధడియం భరత శర్మ
పేజీలు: 66
వెల: ₹ 200/-
ప్రతులకు:
6-7-544, రెండవ అంతస్తు
కృష్ణప్రియ అపార్ట్‌మెంట్స్
హరేకృష్ణ రోడ్డు, తిరుపతి అర్బన్ -517507
ఫోన్: 9182855546

 

 

 


4. శిష్య శతకము:

డా. కడిమెళ్ల వరప్రసాద్ ‘శిష్య’ మకుటుంతో వ్రాసిన శతకం ‘శిష్య శతకం’. ఈ శతకం మంచి చెప్తుంది. సరళంగా సులభంగా ఉన్నాయి పద్యాలు. ప్రాచుర్యంలో ఉన్న ఇతర శతకాల లాగా ఈ శతకంలోని పద్యాలు కూడా సులభంగా బోధపడతాయి. పద్యాలతో పాటు అర్థాలను కూడా పొందుపరచటం ముదావహం.

~

దాసుడనని పల్కుచునే
మోసము గావించువాడు పుడమికి బరువై
క్లేశములకు బాత్రమై
గాసిలు నపకీర్తి గొనును గదరా శిష్యా!

~

ఇలలో గలలో నిన్నె
తలచెడి తొలి హితుల వీడి తాత్కాలిక మి
త్రులకై యఱ్ఱులు చాచిన
ఫలమందదు తుదకు గూలబడెదవు శిష్యా!

***

శిష్య శతకము
డా. కడిమెళ్ల వరప్రసాద్
పేజీలు: 28
వెల: ₹ 30/-
ప్రతులకు:
ఫోన్: 9908572598

 

 

 

 

 


5. రాఘవ శతకము:

పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ‘రాఘవా!’ మకుటంతో రచించిన శతకం ‘రాఘవ శతకం’. ఈ శతకంలో పుల్లెల శ్రీరామచంద్రుడు గారి లోకజ్ఞత్వము, ఊహా శక్తి, అనుభవ తీవ్రత, ఉక్తి వైచిత్రి పరమ రమణీయంగా ఆవిష్కృతమయ్యాయి.

వర్తమాన లోక ప్రవృత్తిని, రాజకీయాలతో కలుషితమైన జీవనాన్ని, ప్రాచీన సంప్రదాయాలను తిరస్కరించి, విస్మరించిన పద్ధతులను వ్యంగ్యంగా నిరూపిస్తాయీ శతకంలోని పద్యాలు.

~

యోగ్యతయున్న దా యనెడు యోచన యుండదు, సద్గుణాది సౌ
భాగ్య మదెట్టులున్నదను భావమె తోచదు, న్యాయ దృష్టి యా
మృగ్యము పాపమీ ప్రభులు మెల్లగదా జెవినిల్లు కట్టి దౌ
ర్భాగ్యపు మాటలాడు శరుబారిని జిక్కి నశింత్రు రాఘవా!

~

మొదటకి కార్యకర్త నతి ముఖ్యునిగా గోనియాడవలె
న్బిదప సభాధినాథు నతి నేర్పున జేసి మరెవ్వరేని యా
సదసున నున్న వారి నొక చాటు వాచోన్వితి మెచ్చగా వలెం
బడపడి యేమి వాగినన్ వక్తృ శాఖామణి కాడె రాఘవా!

***

రాఘవ శతకము
పుల్లెల శ్రీరామచంద్రుడు
పేజీలు: 28
వెల: ₹ 25/-
ప్రతులకు: 3-259,
దత్తసాయి నగర్,
ఎలిమెటరీ స్కూలు వెనుక,
మాధవపట్నం
సామర్లకోట (మం)
కాకినాడ జిల్లా
ఫోన్: 9346676049

Exit mobile version