Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విచిత్రమైన ముళ్ళబల్లి

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

ప్రకృతి వివిధ ప్రదేశాలలో విభిన్న భౌగోళిక పరిస్థితుల కనుగుణంగా మారుతూ వుంటుంది, అలాగే ఆయా ప్రదేశాలలో జీవించే జంతువుల జీవన విధానంలో కూడా తేడాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎడారులలో జీవించే జంతువుల శరీర అవయవాలు ఆ వాతావరణానికి తగినరీతిలో అమరి ఉంటాయి.

మన ఇళ్ళలో గోడల మీద బల్లులు తిరుగుతూ వుంటాయి. వాటి చర్మం సుకుమారంగా వుంటుంది. దొరికిన పురుగులు, కీటకాలను తిని జీవిస్తూ వుంటాయి.

కాని ఎడారులలో నివసించే ఒక బల్లి చర్మపు పొర గట్టిగా వుంటుంది. దీని పొర మీద దట్టంగా కఠినంగా, శంఖాకారంలో ముళ్ళుంటాయి. అందుకే దీనిని ముళ్ళబల్లి అంటారు. ఇవి ఆస్ట్రేలియా ఎడారులలో జీవిస్తాయి. సుమారు 8 అంగుళాల పొడవుండే ఈ బల్లులు జీవిత కాలం 20 సంవత్సరాలు, మామూలుగా మానవులలో మగవారి శరీరం పెద్దదిగా, ఆడవారి శరీరం చిన్నదిగా వుంటుంది. కాని ఆడబల్లుల పరిమాణం పెద్దదిగా వుంటుంది.

దీని నాలుక పొడవుగా, జిగటతో నిండివుంటుంది. ఈ నాలుకను చాపి ఆహారాన్ని తీసుకుంటుంది. స్పినిఫెక్స్ గడ్డి భూములలో జీవించే వీటి ముఖ్య ఆహారం చీమలు..

మన ఒక భోజనంలో రకరకాల పదార్థాలను తింటాం కాని ఇది ఏం చేస్తుందో తెలుసా? ఒక భోజనంలో 600-2500 చీమలను తింటుంది. ఇది దీని ఒక ప్రత్యేకత,

మానవ చర్మపు రంధ్రాల పొరలు దిగువ భాగంలోకి శరీరమంతా కలపబడి ఉంటాయి కాని ఈ ముళ్ళబల్లి సూక్ష్మరంధ్రాల పొరలు శరీర భాగాల్లోకి కలపబడవు. నోటి కొసలలోని దవడ సంచులలోకి కలపబడి ఉంటాయి. ఇలా ఉండడం వలన వీటికి ప్రత్యేకమయిన ఉపయోగముంది. అదే దీనిలోని మరో ప్రత్యేకత.

ఈ బల్లి చర్మం మీద పడిన నీటి బొట్లని, గాలిలోని తేమ, మంచు బిందువులతో సహా వెంటనే చర్మం పీల్చుతుంది. ఈ తేమ ద్వారా లభించిన నీరు దవడ సంచులలోకి చేరుతుంది. బల్లి దవడలను కదిపినప్పుడల్లా దవడ సంచులలోకి నీటి బిందువులు చేరతాయి. ఈ విధంగా దీని దాహం తీరుతుంది.

ఇలా గాలిలోని తేమ నుంచి నీటిని సంపాదించి, దాహాన్ని తీర్చుకోవడమే దీని ప్రత్యేకత. నీరు లభించని ఎడారులలో జీవించే జంతువులకి నీరు నిలువ ఉంచుకోవడానికి సహాయపడే ఇటువంటి అమరికలు సృష్టి విచిత్రం. ఆ జంతువులకి వరం.

Exit mobile version