ఓ పది రోజుల నుండి శాంత కొంచెం ఉదాసీనంగా ఉంటోంది. ఈ మధ్యనే ఇంట్లో పెద్ద వేడుక, హడావుడి పూర్తయినాయి. అమెరికా నుండి కొడుకు, కోడలు, మనవడిని ఎత్తుకుని వచ్చేరు. పసివానికి నామకరణం తన తల్లిదండ్రులు దగ్గర వాళ్ల స్వగృహంలో జరిపించాలని వాళ్ల అబ్బాయి వచ్చాడు.
మనవడిని చూసి మహదానందం శాంతకు, గోపాలంగారికి ఇంతా అంతా కాదు. దేవుడు ఎంత కరుణామయుడు! ఎంత అనుగ్రహించేడు! కుమారుడికి పెళ్లి అయి రెండు సంవత్సరాలయిపోతున్నది. మనవడిని ఎత్తు కోవాలనే ఆరాటం శాంతకు పెరిగిపోయింది అంతకంతకు.
తనకయితే మొదట ఇద్దరు అమ్మాయిలే. ఆఖరున నాలుగేళ్ల తరువాత బాబు. కొడుకు పుట్టిన ఆనందమునకే పొంగిపోయింది శాంత గోపాలంగారి సంతోషానికి పట్టపగ్గాలే లేకపోయినాయి.
ఇంకేం! ఇప్పుడు తనకు మొట్టమొదట మనవడు పుట్టేడు. మరి గోపాలంగారు చిన్నపిల్లవానిలాగ ఇల్లంతా తిరిగేసి, కనపడ్డ వారందరిని పిలిచి “మాకు మనవడోయ్ -ఏమనుకున్నావ్!!!” అంటూ సంబరపడిపోయేరు. ఫోను వచ్చిన గంటలో బట్టలు మార్చుకుని, జోళ్ళు వేసుకుని తయారైయేరు. “శాంత! అంతా ఆ ఏడుకొండలవాడి దయ. మనం పురిటి శుద్ధి అవగానే స్వామిని దర్శించుకోడానికి తిరుపతి వెళ్తున్నాము. ఇప్పుడే టికెట్లు రిజర్వేషన్ చేయించుకొని వస్తాను” అని స్టేషనుకు బయల్దేరారు. స్వామివారి దర్శనానికి, సేవకు కూడా ఏర్పాట్లు చేసుకొన్నారు.
అలా శాంతా, గోపాలంగార్లకు ఆనందం కలగడంతో ఆశ్చర్యమేముంది? తమలాగ ఏళ్ల తరబడి వేచి చూడకుండా, వంశోద్దారకుడు – మనవడు మొదటివాడు పుట్టేడు కదా!
సరే రెండు రోజుల క్రితం అబ్బాయి, కోడలు అమెరికాకు తిరుగు ప్రయాణమై వెళ్ళేరు. మనవడితో ముచ్చట్లు, ఇంటికి వచ్చిన ముఖ్యమైన బంధువులు, ఇద్దరు అమ్మాయిలు, అల్లుళ్లు, మనుమలు వచ్చి వెళ్లడం ఈ తాకిడికి, ఇప్పుడే శాంత అలసటనుండి కొంచము తేరుకుంటున్నది.
“పదిహేను రోజులు అయిపోయాయి. మాట మంతీ లేదు. ఈ స్నేహితురాలు శాంత! మరీ ఇంత అన్యాయమమా” అని వనజకు చికాకు, కోపము వచ్చేయి. అవును మరి శాంత, వనజ చిన్నప్పటినుండి మంచి స్నేహితులు, కలిసి స్కూల్లోను, కాలేజిలోను చదువుకున్నారు. వనజ బి.యస్.సి. అవగానే ఎం.యస్.సి. కూడా పూర్తి చేసింది. ఆ రోజులలో కొత్తగా వుమెన్స్ కాలేజీలు వచ్చాయి. ఫస్టు క్లాస్‌లో పాస్ అయిన వనజకు ప్రక్కనే ఉన్న పట్టణంలో ఒక కాలేజీ పెట్టేరు. బోటనీ డిపార్టుమెంటులో లెక్చరర్ గా పోస్టు వచ్చింది. వనజ చేరిపోయింది. తర్వాత పెళ్లి అయినా, పై చదువు కొనసాగించింది. పి.హెచ్.డి. పూర్తిచేసుకుని ఆ డిపార్ట్‌మెంట్‌కు అధినేతగా ప్రమోషన్ పొందింది. తర్వాత ఆ కాలేజికి ప్రిన్సిపాల్ గా పనిచేసి ఈ మద్యనే రిటైరయింది.
ఇక శాంత విషయానికి వస్తే బి.యస్.సి. పూర్తి అవగానే వివాహం అయిపొయింది. భర్త, వుదోగ్యం, సంసారం ఈ హడావుడిలో పడిపోయింది. గోపాలంగారు ఇంజినీరు పెద్ద నగరాల్లోను, అదీ ప్రయివేటు రంగంలో ఉదోగ్యం, పిల్లలు. ఇలా శాంత గృహిణిగా బాధ్యతలు నిర్వహించుకుంటూ గడిపింది.
“శాంత.. ఎన్నాళ్లయిందే మీ ఇంట్లో ముచ్చట లయ్యేయికదా! వారందరు వెళ్ళిపోయినా వులుకూ లేదూ, పలుకూ లేదు. ఏం. జరిగింది?” అంటూ వనజ ఒక ఆదివారం మద్యహ్నం ఫోన్ చేసింది. “నేను బాగానే వున్నాను వనజా, పిల్లవాడు కుటుంబంతో సహా అమెరికాకు వెళ్ళిపోయేడు. అందుకోసం నేనేమి బెంగపడలేదులే అయిన ఇదేమీ మొదటిసారి కాదుకదా! ఎవరి జీవితం వారిది! ఆపేక్షగా ఇంతదూరం వచ్చేరు మనవణ్ణి చూపించేరు. ఇరవై రోజులున్నారు. వాడి ఉద్యోగ ధర్మం తప్పదుకదా! సరే వెళ్లేరనుకో అందరు బంధువులూను” అంది శాంత. “అలా అనుకో… అని సాగ తీస్తున్నావు. మరి ఇంకేదయినా విషయం మనస్సులో పెట్టుకుని భాదపడుతున్నావా ఏమిటి? నీ మనసులో మాట నాకు చెప్పు శాంతా, అప్పుడే నీకు భారం తగ్గి హాయిగా వుంటుంది” అన్నది వనజ.
“సరేలే థ్యాంక్యూ ” అని ముక్తసరిగా వూరుకుంది శాంత.
‘ఏదో పెద్ద బాధ మనస్సుకు తగిలినట్లుంది పాపం శాంతకు’ అని కాసేపు ఆలోచించింది వనజ.
రెండు రోజులు గడిచాయి. “శాంత! నేను పని మీద అనకాపల్లి వస్తున్నాను. అక్కడనుండి వైజాగ్ వస్తాను” సరేనా అంది వనజ ఫోనుచేసి.
“చాలా సంతోషం వెరీగుడ్ న్యూస్ వనజ తప్పకుండా రా థ్యాంక్యూ” అంది శాంత. ‘దేవుడా వనజకు నా మనసులో బాధ చెప్పేస్తే కొంచెం వూరట. ఇంక ఎవరితో చెప్పుకొంటాను. ఇది చాలా సున్నితమైన విషయం గోపాలంగారతోగాని, పిల్లలతోగాని చెప్పడానికి డెలికేట్ గా వుంటుంది’. ‘సరే ఇదీబాగానే వుంది’ అనుకుని శాంత వనజకోసం ఎదురుచూస్తున్నది.
మరో ఐదు రోజుల్లో వనజ వచ్చింది. భోజనాలు అయ్యేయి. ఒక గది సదుపాయంగా వనజకు రిలాక్సు అవడానికి ఏర్పాటు చేసింది శాంత. రాత్రి తొమ్మిది దాటాక స్నేహితురాలిద్దరూ అక్కడకు చేరుకున్నారు. కాసేపు పిచ్చాపాటీ అయ్యేక వనజ, “మరీ ఇలా నీరసించి పోయేవు. ఏమిటి నీ బాధ” అంది.
“అదో పెద్ద కథ ఏం చెప్పమంటావు? కొన్ని ఏళ్ళుగా నేను మనస్సులోనే దాచిపెట్టుకున్నాను. గోపాలంగారితో నాకు వివాహం జరిగి అబ్బో ముప్పది ఏళ్ళు పైనే అయింది. ఆ రోజుల్లో పెళ్లి సంబంధాలు మాట్లాడటం చాలా కీలకమైన ఘట్టాలతో ఉండేవి. చిన్న చిన్న పట్టింపులు, మాట నెగ్గాలనే పట్టుదలలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్లు ఏదైనా పట్టుపట్టేరనుకో, చాలా సీరియస్ అయిపోతారు. చెల్లించుకుని తీరుతారు.
ఇంతకీ మావారికి మేనరికం వరుస ఒక అమ్మాయి వున్నదట. పేరు సరోజ. మా అత్తగారికి (సావిత్రమ్మగారికి) యీ సరోజ తండ్రి సాంబమూర్తిగారు తమ్ముని వరస. “అక్కయ్యా, మా అమ్మాయి సరోజను మీ గోపాలానికి చేసుకో. మనం మనం కావలిసిన వాళ్లము. సంప్రదాయం అన్నీ కలుస్తాయి. సరోజ మెట్రిక్ పాసయింది. మాదేమో పల్లెటూరు. అంతకన్నా చదువుకోడానికి అవకాశం లేదు. పని పాటలు బాగా చేస్తుంది. వంట బాగా రుచిగా చేస్తుంది. మీ అబ్బాయికి ఏలోటూ రానివ్వదు. అత్తామావల్ని గౌరవంగా చూస్తుంది. అన్ని విధాలా బాగుంటుంది” అని.
మా అత్తగారు “సరే సాంబా, నీవు చెప్పింది బాగానేవున్నది. నేను వారితో (మామగారితో) మాట్లాడుతాను. ఇంకా అబ్బాయి ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో వున్నాడు కంగారు లేదు.” అన్నారట.
ఈ లోగా గోపాలంగారు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవడము టాటా కంపెనీలో వుద్యోగం లభించి, బొంబాయికి పోస్టింగు, వచ్చేసాయి. సాంబమూర్తిగారు మంచిరోజు చూసుకుని సావిత్రమ్మగారి దగ్గరకు వచ్చి, “అక్కయ్యా” జయం. ఇంకేమి గోపాలానికి ఉద్యోగం వచ్చింది. ఆమ్మో బొంబాయి మహానగరం ఒక్కడూ వుండడం కష్టము. ఆ మూడు ముళ్ళూ పడితే హాయిగా చిలకా గోరింకల్లా సుఖంగా బ్రతకవచ్చును. మీకు కూడా అబ్బాయి ఒక్కడే తెలియని మహానగరంలో వున్నాడన్న బాధ, బెంగ వుండవు” అని తొందర పెట్టేరట.
సావిత్రమ్మ గారు “ఆయనతోటి, పిల్లవాడు గోపాలం తోటి సంప్రదించి చెప్తాను లేరా సాంబా! ఇంతకీ ఓ ముఖ్యమైన విషయం. మా పెద్దబ్బాయికి నాలుగేళ్ళక్రితం నాలుగువేలు కట్నం ఇచ్చి, మాకు లాంఛనాలు ఇచ్చి దర్జాగా పెళ్లి చేసేరు మా వియ్యాలవారు. మా ఇంట్లో మరీ అన్నదమ్ముల విషయాల్లో పట్టింపులు ఎక్కువ. అన్నయ్య కన్న తక్కువ తమ్ముడికి కుదరదు. గోపాలానికి మంచి సంబంధాలే వస్తున్నాయి. నువ్వు పిల్లనిస్తానని చాలా రోజులనుండి అడుగుతున్నావు. మన బంధుత్వం, సంప్రదాయం అన్ని దృష్టిలో వుంచుకుని చెప్తున్నాను. గోపాలంతో మాట్లాడుతాము. నేనేమి పెద్ద ఆశలకు పోవట్లేదు సుమా! నీకు ఇలా అంగీకారమైతే చెప్పు” అన్నారట.
సాంబమూర్తిగారి ముఖంలో ఆనందం ఒక్కసారిగా ఆవిరి అయిపొయిందిట “అక్కయ్యా, నేనా పల్లెటూరులో వుంటున్నాను. నాలుగు ఎకరాల పొలం వున్నది. కొంచెము కౌలుకు చేస్తున్నాను. పాడి, పంట, చిన్న పెంకుటిల్లు, బాధ్యతలు. దీనికి తోడు సరోజ మా పెద్ద అమ్మాయి. మరో ఆడపిల్ల తర్వాత ఆలస్యంగా పిల్లవాడు కలిగేడు. వాడు ఇంకా అందిరాలేదు. ఇంటరు పరీక్ష వ్రాసేడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నా తాహతుకు తగినట్లుగా పెళ్లి ఏ లోటు రాకుండా చేస్తాను. మూడు వేల రూపాయలు కట్నం ఇవ్వగలను. ప్రస్తుతం పంట చేతికి ఇంకా అందలేదు. అదీకాక రెండో అమ్మాయికి కూడా త్వరలో పెళ్ళి చేయాలికదా, మరోలా అనుకోకు. పెద్ద మనస్సు చేసుకో అక్కయ్యా” అని శతవిధాలా ప్రాధేయపడ్డారట.
మా అత్తగారికి సడన్‌గా కోపం వచ్చింది. మాట పట్టింపు కూడా వెంటనే వచ్చేసింది. గొంతు కఠినం చేస్తూ “సాంబా! ఈ విషయంలో మరో మాటకు అవకాశమేలేదు. అంతే. నువ్వు వెళ్లి బాగా ఆలోచించుకో” అనేసి వున్న పళంగా లేచి, వంట ప్రయత్నానికి వెళ్లిపోయేరట! మా మామగారు ఈ అనుకోని పరిణామానికి ఆశ్చర్యపోయి అవాక్కయి పోయి ఊరుకుండి పోయేరట.
ఆ విధంగా గోపాలంగారికి, సరోజతో వివాహం పొసగలేదు. సాంబమూర్తిగారు మధ్యవర్తులతో ఎన్నోవిధాలుగా ప్రయత్నించేరు. మరి సావిత్రమ్మగారు మాట పట్టుదలగల మనిషి. ఇంక అదే సంవత్సరం సాంబమూర్తిగారు ఆ పల్లెటూరులోనే మరో దూరపు బంధువుల అబ్బాయికి సరోజనిచ్చి వివాహం కానిచ్చేరు. అతని పేరు పార్థసారధి. తండ్రి లాయర్. అతని అన్నగారు కూడా లాయరుగా ప్రాక్టీసు మొదలు పెట్టేరట. దగ్గరలో పట్నంలో వాళ్ళు వుంటారు. తండ్రి బాగా సంపాదించేరు. ఆ పల్లెలో పదెకరాల మాగాణి సంపాదించి పార్థుకు ఎలాగూ సరిగ్గా చదువుమీద ఆసక్తి లేక పోయేసరికి, ఆ పల్లెలో వ్యవసాయం చూసుకోమని ఏర్పాటు చేసేరు. చక్కని డాబా ఇల్లు కట్టించేరు. కరెంటు, సకల సదుపాయాలూ, పాలేర్లు, పనివారు, అన్ని బాగున్నాయి.
వనజ ఇలా అంది “అయ్యో శాంతా అలా జరిగిందా పాపం సరోజకు. సరే నీకు గోపాలంగారికి బ్రహ్మదేవుడు ముడి వేసేడన్నమాట. నీకు ప్రాప్తం వున్నది అనుకో. ఆమ్మో రాత్రి పన్నెండు దాటింది. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ నువ్వు వెళ్లి పడుకో మిగతా విషయాలు రేపు చెప్పుకుందాములే” అని శాంత వీపు నెమ్మదిగా నిమిరి పంపించింది.
***
తరువాత రెండు రోజులు ఇంట్లో బిజీ, బిజీ. వనజ వచ్చిందని కొందరు స్నేహితులు, బంధువులు వచ్చి వెళ్ళేరు. అతిథులు, బోజనాలు, బజారు పన్లు, సినిమాలు ఇలా తీరిక లేక గడిచాయి. మరోరోజు స్నేహితులిద్దరూ కూర్చున్నారు. “ఇప్పుడు చెప్పవే శాంతా” అన్నది వనజ.
సరోజ పెళ్ళయి ఏడాది తిరిగి పొయింది. మా నాన్నగారికి స్నేహితులద్వారా రామచంద్రరావు గారి (మామగారు) అబ్బాయి గోపాలంగారు పెళ్ళికొడుకని తెలిసింది. ప్రయత్నాలు మొదలు పెట్టేరు. నేను బి.యస్.సి. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. కదా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసేక గోపాలంగారికి లెటర్ వ్రాసేరు. చదువుకున్న అమ్మాయి. నగర జీవితం కొత్త భాషా, కొత్త తరహా వ్యక్తులతో మాట మంతీ వ్యవహారాలు అవీ కనుక డిగ్రీ చేసిన అమ్మాయికి ఇంగ్లీషు బాగానే వస్తుందనే వుద్దేశ్యం కలిగి, గోపాలంగారు సరే అన్నారు.
“నా విషయంలో ఎంచడానికి పెద్ద లోపాలేమీ లేవుకదా! వనజా” అంది శాంత.
“అబ్బో నీకేం లోపాలు? ఎవరు ఏంచగలరు? చక్కగా వుంటావు, మంచి రంగు. ముఖంలో కళ, వర్చస్సు, తెలివి, చదువు, మంచి మాట నేర్పు… నీకేం తక్కువ” అంది వనజ.
“పోనీలే వనజా స్నేహితురాలివి కదా!!! నన్ను బాగానే మెచ్చుకన్నావులే” అంది శాంత.
“సావిత్రమ్మగారు పెట్టిన కండిషన్లనింటికి మా నాన్నగారు సమ్మతించేరు. అలా నా వివాహం అయ్యింది”.
“ఇంతకీ సరోజ విషయానికి వద్దాము. పెళ్లయి కొన్ని నెలలు గడచినా పార్ధసారధి ముభావంగా వుండేవాడు. రాత్రి పొద్దు పోయేవరకు ఇంటికి రాడు. పేకాట అలవాటు. బాగా అలిసి పోయి వచ్చి పడుకునేవాడు. మర్నాడు ఆలస్యంగా లేచి, కాఫి, టిఫిన్లు అయి పొలం పనులూ వ్యహారాలకోసం వెళ్లిన మనిషి రెండు దాటేక ఇంటికి రావడం జరిగేది. సరోజకు దిగులుగా వుండేది. కొన్ని నెలలకు ఆమె గర్భం ధరించింది. నెలలు నిండకుండానే ప్రసవం జరిగి బిడ్డ పురిటిలోనే వెళ్లి పోయేడు. ఆ బాధతో పాపం సరోజ పుట్టింట్లో ఉంది పోయినది. పార్థు రాలేదు. కొన్ని నెలలకు సాంబమూర్తిగారు సరోజను ప్రక్కపట్నంలో పార్థు తండ్రిగారింట్లో తీసుకెళ్లి అప్పగించేరు. “బావగారు మీ కోడలిని మీకు అప్పగిస్తున్నాను” అన్నారు.
లాయరుగారు పార్డును పిలిచి, మందలించి, కోడలిని తీసుకుని స్వయంగా సరోజ అత్తమామలు పార్థు ఇంటికి తీసుకెళ్లి ఓ పదిరోజులుండి “చక్కగా చిలుక గోరింకల్లా వుండండి” అని చెప్పి వెళ్ళేరు. సరోజకు ఒకటి రెండు అబార్షన్లు అయ్యేయి. కొంతకాలానికి ఒక పాపా పుట్టింది. అనారోగ్యాలతో సతమతమయ్యేది. అయిదేళ్ళు బ్రతికింది అంతే.
ఈ లోగా పార్థు దురలవాట్లుకు బానిసయ్యాడు. ఆరోగ్యం క్షీణించి యీ లోకం వదిలి వెళ్ళిపోయేడు. వనజా – ఈ విషయాలు మా అత్తగారు అప్పుడప్పుడు నేను వైజాగ్ వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. నాకు ఒకసారి సరోజను చూడాలనిపించింది. ఒక దూరపు బంధువుల పెళ్ళికి మా అత్తగారు, మావగారు వెళ్తుంటే నేను కూడా వెళ్ళేను. సరోజను చూసేను. కళావిహీనమైన ముఖము చూస్తే చాలా బాధ కలిగింది.”
ఇంతకీ వనజా పదిరోజుల క్రితం, సరిగ్గా అబ్బాయి, కోడలు అమెరికా ప్రయాణమైన మర్నాడు విన్నవార్త. సరోజ మరణించిందని. గట్టిగా యాభై సంవత్సరాలు బ్రతకలేదు. పాపం ఏమి అనుభవించలేదు. పిల్లలు లేరు. భర్త ముందే వెళ్ళిపోయాడు.” శాంత చాలా సేపు కన్నీళ్ళు పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది.
వనజ కూడా చలించి పోయింది. “అయ్యో పాపం విధి లీలలు ఎలా వుంటాయో ఆశ్చర్యం కదా!”
మాట పట్టింపులా? సాంబమూర్తిగారి తొందరపాటా? ఒక వెయ్యి రూపాయలకు ఇంత శిక్షా? ఏమిటో!! దేముడా!!! అర్థం కాని ఈ ప్రశ్నలకు బదులేది?