[శ్రీమతి హిమజ రచించిన ‘విడివిడి ఆకులు’ అనే కవితని అందిస్తున్నాము.]
ఒకప్పుడు నవ్వులతో మారుమోగిన ఇల్లు
ఇప్పుడు నిశ్శబ్దపు గోడలతో మాట్లాడుతోంది..
మాటలు కలలు మాయమై,
మౌనం మాత్రమే మిగిలిందిప్పుడు
తప్పెవరిదన్న ప్రశ్నలు
ఎప్పుడో అర్థం కోల్పోయాయి,
జవాబులకంటే,
గాయాలే ఎక్కువయ్యాయి.
నాలుగు చేతులు దూరమవుతున్నా
హృదయాలింకా తడబడుతున్నాయి,
కలిసి ఉండలేమన్న కఠిన నిజం
విడిపోయేందుకు ధైర్యం ఇవ్వడం లేదు.
అమ్మానాన్నల ప్రేమ
నడుమ ఒక చిన్న హృదయం..
కస్టడీ కాగితాల్లో భవిష్యత్‌ను
కొలుస్తున్న కోర్టు హాలు అడిగిన
“ఎవరితో ఉంటావు?” అన్న ప్రశ్న
ఆ బెరుకు కళ్ళల్లో
జీవితాంతం మిగిలిపోయే భయంగా!
కుటుంబ యుద్ధంలో
అత్యధికంగా ఓడిపోతున్నది
ఆ చిన్ని చిరునవ్వే అని
ఎవరూ గుర్తించడం లేదు
ముగియబోయే ప్రేమకథలో,
విధి తిరగ రాసేందుకు నిరాకరించిన పేజీలో
విడాకులు చట్టపరమైన ముగింపే
హృదయ సంబంధాల
భావోద్వేగాల తీర్పు మాత్రం
అంత త్వరగా మాసిపోదు!
విడిపోతున్నారు..
వేరైపోతున్నారు..
కోపంతో కాదు,
ఓటమితో కాదు,
ఒకరినొకరు ఇంకా
ఇంకా గాయపరచకూడదన్న
చివరాఖరి ప్రయత్నంగా..!!
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందించారు.
