విడగొట్టుకోవటమనేది
మనుషులకే కాదు.
మట్టికీ అలవాటే!
నదులకీ, కొండలకీ, సముద్రాలకీ
చివరికి ఆకాశానికి కూడా!
సౌరభాలకూ.. సంగీత పవనాలకూ
మమతానురాగాలకూ
మౌన వేదలనకే కాదు
ముక్కలు ముక్కలుగా కత్తిరించుకోవటం
సృష్టి లోని ప్రత్యణువు నైజం!
ఒకప్పటి అఖండ ఉపఖండం
ఎన్ని దేశ పటాలుగా ఏమారిపోయింది!
ఒకప్పటి విశాల రాష్ట్రం
భిన్న స్వరాల బహుముఖీనమయింది
ఒకప్పటి దేశభాషలందు లెస్సయినా
విభిన్న యాసల ఖండిత శిరోభూషిత
ఒకప్పటి ఉమ్మడి కుటుంబ సంశోభిత
వేరు కుంపట్ల వ్యథా ఆకులిత
ముక్కలయిపోవటం
మనిషికీ మట్టికీ మామూలే అయినా
విడిపోయే విధ్వంసంలోని వ్యథ మాత్రం
ఎప్పటికప్పుడు పచ్చి గాయమే!
ఏనాడూ సలపరించే చరిత్ర శకలమే!
విడివిడిగా…
