విద్యుత్ ధరలను పెంచి
ప్రజలను ముంచడమే
ఇప్పటి నాయకుల విద్వత్తు!
ఉచితంగా ఎవడివ్వమన్నాడు!
బిల్లు కట్టేవారినే ఎవరు బాదమన్నాడు!
అప్పనంగా, అక్రమంగా, విద్యుత్తు వాడే వాడిపై ఏది నిఘా!
అందుకే నిజాయితీపరులవుతున్నారు ‘దగా’!
గ్యాస్, బొగ్గు కొనుగోళ్ళలో ‘గోల్మాల్’
ప్రజల బతుకుల్లో చీకటి ‘హల్చల్’
సహజ వనరులతో రాష్ట్రం సుభిక్షం!
అయినా ఎనలేని విద్యుత్ సంక్షోభం!
స్వార్థ ప్రయోజనాలతో వ్యవస్థల పతనం!
సంక్షుభితం అయింది ప్రజా జీవనం!
ఒక ప్రక్క పైర్లు ఎండి రైతుకు గుండె కోత!
ఆత్మహత్యలతో బంధువులకు కడుపు కోత!
ఇప్పుడు ప్రజలకే కావచ్చు ‘షాకు’
రాబోయే రోజుల్లో పెద్దలకే పెద్ద ‘షాకు’
అప్పుడెక్కడ ఉంటుంది ఈ అధికారం ‘సోకు’!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.

