[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
మన నిత్యజీవితంలో విద్యుత్ ఉపయోగం గురించి మనకి తెలుసు. విద్యుచ్ఛక్తి లేనిదే ప్రస్తుతం మన జీవితం ముందుకు సాగదని మనందరికీ తెలుసు. ఈ విద్యుత్తుని మనం నీరు, బొగ్గు, గాలి, సముద్రపు అలలు, సౌరశక్తి నుండి తయారు చేసుకుంటున్నాము.
ఈ విద్యుత్తును కొన్ని రోగాలను నయం చేయడానికి, రోగతీవ్రతను తగ్గించడానికి వైద్యులు ఉపయోగిస్తారు. ఇప్పుడే కాదు పూర్వకాలం కూడా విద్యుత్‌ను ఉపయోగించి రోగాలను నయం చేసేవారు. ఇదెలా? చూద్దాం.
రోమన్ సంస్కృతి చాలా పురాతనమైనది కదా! ఆ ప్రాచీన రోమన్ల కాలంలో కాడియస్ గాలెన్ అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన సజీవ విద్యుత్ కేంద్రాలను ఉపయోగించి రోగాలను నయం చేసేవాడు.
సజీవ విద్యుత్ కేంద్రాలు ఏమిటనుకుంటున్నారు కదూ! అవి మధ్యధరా సముద్రంలో నివసించే విద్యుత్ స్కేట్ చేపలు. వింతగా ఉంది కదూ! వీటి లక్షణం విద్యుత్‌ని ఉత్పత్తి చేసి ఆహారాన్ని వేటాడడం.
వీటి తలకి రెండు వైపులా మూత్ర పిండాకారంలో విద్యుదుత్పత్తి అవయవాలుంటాయి.
వీటిని టార్పెడోలు కూడా అంటారు. ఆడ టార్పెడోలు 4 నుండి 8 నెలల గర్భధారణ కాలం తర్వాత సుమారు 28 పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సుమారు 24 అంగుళాల పొడవుంటాయి. సముద్రపు అడుగు భాగంలో నివసిస్తాయి. ఈదుకుంటూ వెళతాయి.
ఈ చేప సుమారు 26 వోల్టుల బలమైన విద్యుత్‌ను ఇవ్వగలుగుతుంది. రాత్రి పూట హఠాత్తుగా ఆహారం కోసం వేటాడుతుంది. విద్యుత్ కిరణాలను విడుదల చేస్తుంది. దీని సమీపంలోని చిన్న చిన్న చేపలు, నత్తలు, ఆక్టోపస్‌లు, విద్యుత్ షాక్ తగిలి క్షణాలలో చచ్చిపోతాయి. వెంటనే వాటిని ఆహారంగా తీసుకుంటుందీ స్కేట్ చేప. కొంచం పెద్దవయితే మెలికలు తిరిగి పడిపోతాయి. కొన్ని స్కేట్లు సముద్రతీరం లోని రాతి దిబ్బలు, ఇసక ప్రాంతాలలో నివసిస్తాయి.
వీటి షాక్ మనుషులకు అంతగా ప్రమాదకారి కాదు. అందుచేత ప్రాచీన కాలంలో గ్రీకు, రోమన్ వైద్యులు దీర్ఘకాల తలనొప్పి, గౌట్ వంటి వ్యాదులకు వీటిని ఉపయోగించి వైద్య చికిత్స చేసేవారు.
ఈ చేపలనుండి విద్యుత్ లభిస్తుందనే విషయం వారికి తెలియదు. వాటి నుండి విడుదలయ్యేది విషమని, దానిని వ్యాదులను నయం చెయ్యడానికి ఉపయోగించుకోవచ్చని మాత్రమే వారికి తెలుసు. సముద్రపు నీటిని చెరువులలో నింపి ఈ చేపలను పెంచి పోషించి వైద్యంలో వాడేవారు. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలలో ఇది విషం కాదు విద్యుత్ అని తేలింది.
ఈ విధంగా జంతువులు అనాదిగా మనకి ఉపయోగ పడుతూనే ఉన్నాయి.
