[‘విజ్ఞానశాస్త్ర బోధన – మాతృభాష ప్రాముఖ్యత’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు ఎన్. సాయి ప్రశాంతి.]
సారం:
దేశ పురోగతిలో విద్యాబోధన – విద్యార్జన అత్యంత ముఖ్యమైన విషయాలుగా పూర్వకాలం నుండి పరిగణింపబడుతున్నాయి. అయితే విద్యలో ప్రాచీనకాలం నుండి కూడా విజ్ఞానశాస్త్రానికి ప్రాధాన్యత ఉంది. అయితే ప్రస్తుత కాలంలో విజ్ఞానశాస్త్రము అభివృద్ధి పొంది ప్రపంచీకరణ జరిగిన నేపథ్యంలో ఆంగ్ల భాష – విద్య ప్రథమ స్థానాన్ని పొందుతుంది, కాబట్టి విజ్ఞానశాస్త్ర విద్యలో మాతృభాష ప్రాముఖ్యత, ఉపయోగాలు, లక్ష్యాలు మరియు సవాళ్ల గురించి చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం.
ఉపోద్ఘాతం:
శాస్త్రవిజ్ఞానం ప్రపంచానికి దొరికిన వరం అంటారు అబ్దుల్ కలామ్. ఈ కారణంగా ప్రపంచం ఎన్నో రకాల సౌలభ్యాలను పొందినది. నిత్యజీవితంలో అనేక రకాల సౌకర్యాలు మానవజాతి పొందినది. మానవ ఆయుః ప్రమాణం పెరిగింది చివరగా విశ్వ రహస్యాల గురించి కూడా తెలుసుకుంటూ భూమిపై ఆధిపత్యం కూడా పొందినది. అయితే విద్యార్థులు నేర్చుకునే శాస్త్రాలలో ఇది ఒకటి. తద్వారా విద్యార్ధులు ప్రకృతి రహస్యాల గురించి, దాని ద్వారా సమస్యలకి పరిష్కారాల గురించి నేర్చుకుంటారు.
ప్రాచీన కాలంలో కూడా విజ్ఞానశాస్త్రము బోధించేవారు అయితే అప్పుడు వ్యవహారంలో ఉన్న సంస్కృత భాషలోనే విద్యాబోధన గురుకులాల్లో సాగేది. అప్పుడు వ్యావహారిక భాష కూడా సంస్కృతమే కావడం వల్ల చాలా సులువుగా గ్రహించడం సాధ్యమైంది. పూర్వంకంటే విజ్ఞానశాస్త్రము వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల మేధ వికసించేలా వైజ్ఞానిక విద్యని అందించడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకనగా విద్య అంటే రకరకాల భావాలను కంఠస్థం చేయడం మాత్రమే కాదు. వారి మేధ వికసించేలా విద్యా బోధన ఉండగలిగితే ఎన్నో అద్భుతాలను శాస్త్ర రంగంలో సాధించగలరు.
మాతృభాషే ఎందుకు??
అసలు మాతృభాష అంటే ఏమిటి!! మాతృభాష అనగా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి ఏ వాతావరణంలో అయితే పెరుగుతాడో ఆ పరిసరాలలోని వ్యక్తులు కుటుంబ సభ్యులు ఏ భాషలో మాట్లాడుకుంటారో, వ్యవహరిస్తూ ఉంటారో అది వారి మాతృభాషగా పరిగణింపబడుతుంది. ఇది నేర్చుకోవడానికి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. మనిషికి సహజంగా అలవడుతుంది. అయితే ప్రాథమిక పాఠశాలలో చేరినప్పటి నుండి ప్రస్తుత కాలంలో ఆంగ్ల భాషా బోధన ప్రాముఖ్యత పెరిగింది. దీనికి కారణంగా ప్రపంచీకరణని పేర్కొనవచ్చు. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంది. బోధనా భాషగా తెలుగు బదులు ఆంగ్లమే ఎంచుకుంటున్నారు. అయితే విద్యార్ధులలో సహజ మేధస్సుని వికసింపజేసే తెలుగు భాషా బోధనని విస్మరించడం విచారకరం. దీనికి ఉదాహరణగా జగదీశ్ చంద్రబోస్‌ని పేర్కొనవచ్చు. ఆయన తండ్రి చాలా గొప్ప వ్యక్తి, చాలా సేవ చేసే స్వభావం కలిగి ఉన్నవారు. అయితే ఆయన జగదీశ్ చంద్రబోస్‌ని తన మాతృభాష అయిన బెంగాలీ మాధ్యమంలో చేర్చారు. దాని ద్వారా ఆయనలో మేధస్సు వికసించడమే కాక జీవితంలో అన్నింటిని సమానంగా చూడాలనే గొప్ప గుణం కూడా నేర్చుకున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన తర్వాత బెంగాలీలో విజ్ఞానంపై, ప్రత్యేకించి పిల్లల కోసం వ్యాసాలు రాసారు. ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా అంటారు – “మాతృభాషలో విద్యాబోధన విద్యార్థులకి తల్లిపాల వంటి పోషణ అందిస్తుంది”.
అయితే పరాయి భాషలో నేర్చుకోవడం వల్ల మస్తిష్కంపై అదనపు భారం పడుతుంది. ఎందుకంటే విషయంతో పాటు, భాషని కూడా నేర్చుకోవలసి వస్తుంది. దీనివల్ల విద్యార్థులలో ఆలోచించే శక్తి, ప్రజ్ఞ సన్నగిల్లి కేవలం కంఠస్థం చేసే వరకే పరిమితమవుతుంది. ఈ కారణంగా దేశ వైజ్ఞానిక పురోగతిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందువల్ల కనీసం పాఠశాల విద్య అయిన మాతృభాషలో బోధించడం చాలా అవసరం. అప్పుడు వారు చాలా వేగంగా నేర్చుకోవడమే కాక ఇతర భాషలు కూడా త్వరగా నేర్చుకుంటారు. అప్పుడు వారి మేధస్సుతో పాటు అన్ని రకాల వికాసం జురుగుతుంది. రాష్ట్రాలలో పరిస్థితి పరిశీలిస్తే పట్టణాలకి, గ్రామాలకీ వ్యత్యాసం ఉండడం వల్ల ఆంగ్లంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కష్టమైన పని. అయితే వైజ్ఞానిక ఆవిష్కరణలని వారి వారి భాషలో చెప్పడం ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో వారు అర్థం చేసుకుంటారు. దాని ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతే కానీ మాతృభాష మాధ్యమం పూర్తిగా తొలగిస్తే సమగ్ర వికాసం సాధ్యం కాదు. ముందు మాతృభాష నేర్చుకుంటే ఏ విషయాలైనా నేర్చుకోవడం చాలా సులభం ఎందుకంటే మన నాడీ వ్యవస్థ, మాతృ భాషకి చాలా సులభంగా స్పందిస్తుంది. తద్వారా అవగాహనా వేగం పెరుగుతుంది, కంఠస్థం చేసే అవసరం లేకుండానే విషయాలను అవగాహనతో అర్ధం చేసుకోని రాస్తారు. అప్పుడు ఆ జ్ఞానం వారిలో ఎప్పుడూ ఉంటుంది.
కనీసం ప్రాథమిక విద్యనైనా మాతృభాషలో అందించడం ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరం.
విభిన్న భాషలకు నిలయమైన భారతదేశంలో ఒక భాషవారు మరొక భాష ప్రజలతో మాట్లాడడానికి సమస్యలు రాకుండా త్రిభాష సూత్రం తప్పకుండా అమలు చేయాలి.
సవాళ్లు:
ఒక తరగతిలో విభిన్న భాషలవారు ఉండాల్సి రావడంవల్ల విద్యాబోధన సవాలుగా మారే అవకాశం ఉంది. కానీ కనీసం ప్రాథమిక పాఠశాలలో విద్య మాతృభాషలో ఉండడం అవసరం. ఒక ప్రాంతం వారు మరో ప్రాంతంలో చదవడం కూడా వ్యావహారిక భాషకి బోధనా భాషకు భేదాన్ని కలిగిస్తున్నది కాబట్టి ఆంగ్లం వైపు మొగ్గు చూపుతున్నారు.
విదేశాలకు వెళ్లాలనే తపనతో కూడా మాతృభాషని విద్యా బోధనా భాషగా అంగీకరించడం లేదు. అయితే ఎంతో మంది మేధావులు మాతృభాషలో చదివి ఆంగ్లం నేర్చకుని మరీ విదేశాలకి వెళ్లారని గుర్తించడం అవసరం.
కావున పరిశీలించగా సంస్కృతి వికాసానికైనా మేధో వికాసానికైనా మాతృభాషలో విద్యాబోధన చాలా ముఖ్యమైనది. ఇది విద్యార్థుల సమగ్ర వికాసానికి వారిలో ఆలోచనా శక్తి పెరగడానికి అవసరం. ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు కానీ అదే ముఖ్యమనుకుని మన భాషలను మనం కాదనుకోవడమే తప్పు.
“అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు కానీ భాషా ఆచారాలను మింగేయొద్దు”.
ఆధారాలు:
1. జగదీశ్ చంద్రబోస్ జీవిత చరిత్ర – మాడభూషి శ్రీధర్
2. Importance of mother language in science education – N. Sai Prashanthi, eekshanam.org