Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ విహారి ‘ఉత్తర రామచరిత’ ఆవిష్కరణ సభ – నివేదిక

ఆ సభాప్రాగణం శ్రీ విహారి రచన ఉత్తర రామచరిత గత కొద్దివారాలుగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘సంచిక’ ఆన్లైన్ సాహిత్య పత్రిక ద్వారా అందించిన రస స్పూర్తితో నిండిన హృదయాల కలయికలా అనిపించింది.

6500 పద్యాలతో శ్రీ పద చిత్ర రామాయణం రచయత తెలుగు వారి గర్వం, గౌరవంగా భాసిల్లుతున్న  శ్రీ విహారి (జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి) కలం నుంచి వెలువడిన ‘ఉత్తర రామ చరిత’  తెలుగువారి సాహితీ సంపదలో మరో విలువైన మణిహారం అని అంటూ ఆవిష్కర్త, ముఖ్య అతిథిగావిచ్చేసిన బహ్మశ్రీ తాడేపల్లి పతంజలి గారు ఈ గ్రంథానికి  ‘ఉత్తర రామ చరిత్ర’ అని కాకుండా ‘ఉత్తర రామచరిత’ అని పేరు పెట్టడంలోని ఔచిత్యాన్ని వివరించారు.

శ్రీ శ్రీకర్ ప్రార్థనతో ప్రారంభమైన ‘ఉత్తర రామచరిత’ ఆవిష్కరణ సభకు ప్రముఖ సాహితీవేత్త, పలు సాహితీప్రక్రియల సృజనకర్త శ్రీ సుధామ సభకు అధ్యక్షత వహిస్తూ  ఆత్మీయులైన సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో తరలిరావటం ఎంతో సంతోషకరమని, పద్యంలో శ్రీపదచిత్రరామాయణం అందించిన విహారి గారు ఉత్కృష్టమైనరీతిలో చక్కటి వచనంలో ఈ గ్రంథాన్ని తీసుకురావటం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గున్న  సీనియర్ పాత్రికేయులు, సాహితీవేత్త శ్రీ జి. వల్లీశ్వర్ గతంలో విహారిగారి ‘జగన్నాథ పండితరాయలు’ గ్రంథం ఏ విధంగా విజయవంతం అయిందో అలాగే ‘ఉత్తరరామచరిత’ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు.  ఆత్మీయ అతిథి శ్రీమతి భండారం వాణి ఈగ్రంథంలో అనేక పౌరణిక సందేహాలకు సమాధానాలు లభిస్తాయని, విహారి గారి రచనాశైలి పాఠకులకు ఆకట్టుకుంటుందని అన్నారు.

వచనంలో అందించిన ఈ ‘ఉత్తర రామచరిత’ విహారిగారి రచనల్లో ఎంతో విశేషమైనదని ఇటువంటి విలువలతో కూడిన రచనలు మన పిల్లలకు అందేలా ప్రతి కుటుంబంలో కృషి జరగాలని, ఆవిధంగా మన సాహిత్యాన్ని రాబోయే తరాలకు అందించాలని మరో ఆత్మీయ అతిథిగా పాల్గున్న యం.వి.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు  శ్రీ మట్టిగుంట వెంకటరమణ అభిప్రాయపడ్డారు. రసం సాహితీ సంస్థ నిర్వాహకులు శ్రీ గుప్తా గారు రచయితను సత్కరించారు.

ఈటివి భారత్ సి. ఇ. వో. శ్రీ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ‘ఉత్తర రామచరిత’ సాహిత్యాంశాలను ప్రస్తావిస్తూ ఈ గ్రంథం సాహిత్యాభిమానుల మన్నన పొందుతుందని అభిలషించారు.

రచయిత విహారి తన రచన ‘ఉత్తర రామచరిత’ ఆవిష్కరణ సందర్బంగా స్పందిస్తూ శ్రీపదచిత్ర రామాయణాన్ని 6500 పద్యాలతో రాసిన తరువాత వస్తున్న ఈ గ్రంథాన్ని వచనంలో రాయమని తన శ్రీమతి శ్యామలాదేవి సలహా మేరకు వచనంలో రాశానని అందుకు ఆమెను సత్కరించి ధన్యవాదములు తెలియజేశారు. తన కుమారుడు శ్రీనివాస్ ఈ ఉత్తరరామ చరిత అంశంపైన అనేక సాహిత్య వివాదాలను వ్యాస రూపంలో తన దృష్టికి తీసురావటం జరిగింది. గతంలో ఎంతోమంది లబ్దప్రతిష్ఠులైన వారు అవలంబించిన మార్గాన్నే తాను అనుసరిచానని విహారి అన్నారు. ఈ సభను చక్కటి రాజపుష్ప అట్రియా క్లబ్‌లో ఏర్పాటు చేసిన సాహిత్య అభిమానుల మండలి కార్యవర్గానికి,  వివిధ ప్రాంతాల నుంచి సభకు విచ్చేసిన సాహిత్యాభిమానులందరికీ విహారి గారు ధన్యవాదములు తెలియజేశారు.

ఈ సభలో మ్యూజ్ ఇండియా ఆంగ్ల అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారు, రంజని పూర్వాద్యక్షురాలు శ్రీమతి పద్మలతాజయరాం గారు, శ్రీమతి వసుందర పాల్గొన్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ సభను రాజపుష్ప అట్రియా సాహిత్య అభిమానుల మండలి (RASAM) సభ్యులు శ్రీ పి. వి. యల్. నరసింహారావు, వాసుదేవ రావు, రాంబాబు తదితరులు నిర్వహించారు.

Exit mobile version