[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘విజయాలకు విత్తనాలు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రతిరోజు..
పైసా పైసా పొదుపు చేస్తే..
రేపటి అవసరాలకు
అది భరోసా బంగారమౌతుంది.
ప్రతిరోజు..
క్షణం క్షణం
సానుకూలంగా ఆలోచిస్తే..
మనసులో
ఆశల అరణ్యం పచ్చబడుతుంది.
ప్రతిరోజు..
నైపుణ్యానికి పదును పెడితే..
మొద్దుబారిన ఇనుము సైతం
మెరుపులు చిమ్మే కత్తిగా మారుతుంది
ప్రతిరోజు..
పుస్తకాలతో స్నేహం చేస్తే..
అక్షరాలు
అడుగులకు దిక్సూచులౌతాయి.
ప్రతిరోజు
కొంచెం ప్రేమ..
కొద్దిగా దయ పంచితే..
మనిషి హృదయం
పరిమళించే పూలతోట ఔతుంది.
జీవితం ఒక్కసారిగా మారదు..
చినుకు చినుకు చేరి చెరువౌతుంది,
బిందువుబిందువు కలసి సింధువౌతుంది,
అడుగు అడుగు ముందుకు సాగితే
అసాధ్యమే ఆత్మీయబంధువౌతుంది.
చిన్న సంకల్పాలే
పెద్ద విజయాలకు విత్తనాలు..
నిత్య ప్రయత్నాలే
బంగారు భవిష్యత్తుకు పునాదులు.
ఒక్క చుక్కని
తక్కువగా చూడకు మిత్రమా..
అదే లక్ష చుక్కలతో
మహాసంద్రంగా మారుతుంది..!
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
