Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విజయానికి మార్గాలు

[శ్రీ విష్ణుభొట్ల రామకృష్ణ గారి ‘విజయానికి మార్గాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

నేటి యవత అపజయం వస్తే కుంగిపోవటం, విజయం వస్తే ఆనంద పడటం సహజం అయిపోయింది. జయాపజయాలు సహజం అని, వాటిని తట్టుకొని విజయం సాధించటమే గొప్పతనమని, నేటి యవతరం గ్రహించటం లేదు. చిన్న అపజయం కలిగితే చాలు, జీవితంలో తాను ఒడిపోయాను అనే అభద్రతా భావనలో వున్నారు.

ప్రతి యువత జీవితంలో, ఇటవంటి సందర్భాలు అప్పుడపుడు ఎదురవుతూ వుంటాయి. అయితే సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకొని, భవిష్యత్ భారాన్ని తన భుజాలపై వేసుకొని, లక్షాన్ని సాధించే వారిని, తప్పక విజయం వరిస్తుంది అనే దానిలో సందేహం లేదు.

మహాభారతంలో కౌరవ పాండవ మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధంలో, అర్జునుడు బంధు మిత్రలతో, గురువులతో, ఇతర పెద్దలతో, యుద్ధం చేయటానికీ సుముఖత చూపలేదు. తన కారణంగా, తన వారందరు మరణం పొందుతారు, వారి మరణంతో రాజ్యము పొంది, అనుభవించే సుఖాలు ఎందుకు? అనే భావనలో యుద్ధం చేయలేక, అసహాయ స్థితిలో వున్నపుడు, శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి ఇలా ఉపదేశించాడు..

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన।
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్॥ (గీత 2 -41 )

“అర్జునా! ప్రయత్నపూర్వకంగా, నిశ్చయాత్మకమైన బుద్ధిని ఏకాగ్రాం చేసుకొని, నీ జీవిత లక్షమేదో నిర్ణయించుకో! ఇలా ప్రయత్నించని వారి, బుద్ధి పరిపరి విధాలుగా పరుగులు పెడుతుంది” అని హితవు పలికాడు.

అపజయం సహజం, ఒక అపజయం విజయానికి మెట్టు అని యువత భావించటం లేదు. అక్కడితో జీవితం అయిపోయింది, తరువాతి జీవితం అంతా అంధకారమనే భావనలో నేటి యవత వుంది. ఇక్కడ తెలుసుకోవాలసింది ఏమిటంటే – ఒక చోట ఓడిపోవటం అంటే, మరోచోట విజయం నీ కోసం ఎదురు చూస్తోంది అని అర్థం. చదువు, ఉద్యోగం వున్నంత మాత్రాన జీతంలో ఉన్నత శిఖరాలు ఎక్కినట్లు కాదు. జీవితంలో లోటుపాట్లు తెలుసుకొని, జీవిత వైకుంఠపాళిలో పాముల నుండి తప్పించుకొని వైకుంఠం (విజయం) చేరటం. అని యువతరం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అపుడే యువత సంపూర్ణ విజయం సాధించినట్లు.

ఆనాడు.. శ్రీకృష్ణుడు అర్జునునికి గురువుగా మారి అతనికి మార్గనిర్దేశం చేశాడు. మరి ఈనాడు నిస్సహాయ స్థితిలో వున్న యువతకు, మార్గనిర్దేశం చేసేదీ ఎవరు? వారికి మార్గ నిర్దేశకులు కావాలి. మరి అటువంటి గురువులు ఎక్కడ వున్నారు? మార్గదర్శకులు ఎపుడు వస్తారు? అంటే చెప్పలేము. కానీ ఒకటి మాత్రం చెప్పగలం. అటువంటివారు మన మధ్య, మన ముందే, మన చుట్టూ వుంటారు. వారు తల్లితండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అటువంటి వారిని తెలుసుకొని, వారి మార్గదర్శకంలో నడిస్తే విజయం తథ్యం.

మనలో చాలమంది విజయం అంచువరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే – ప్రయత్నలోపం. సాధించాలి అనే కోరిక వున్నా, కష్టానికి భయపడి, వెనుతిరుగుతున్నారు. విజయం అనేది వండి వడ్డించిన విస్తరి కాదు, వెంటనే భోజనం చేయటానికి. దానికి ముందు ఎన్నో కష్టాలు, ఎన్నో భాదలు పడితేనే కానీ, వంట సిద్ధం అవుతుంది.

సాధించవలసిన లక్ష్యం, అందనంత ఎత్తులో వుంటుంది. దాని కోసం కఠోరమైన తపస్సు చేయాలి. అనేక సుఖాలు వదులుకోవాలి, అనేక కష్టాలుపడాలి, ఈ మధ్యలో అనేక అవాంతరాలు వస్తాయి. అయిన వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, అపుడే విజయం మన సొంతం అవుతుంది.

నిర్ణయంలో లోపం:

చాలా సందర్భాలలో యువత, తాము తీసుకొనే నిర్ణయాలలో లోపం ఉంది అని తెలుసుకోలేక పోతున్నారు. అందువల్ల తను సాధించగలను అనే నమ్మకమైన పనిని వదలిపెట్టి, ఎవరో చెప్పారు, ఎవరో కాదన్నారు అని, ఆవేశానికి, ఉద్రేకానికిలోనై, తమ నిర్ణయాన్నీ పక్కన పెట్టి, ఎదుటివారు చెప్పిన దాన్ని అంగీకరిస్తారు. దాని వల్ల వారు తమ లక్షాన్ని సాధించలేక అపజయం పొందుతూ వుంటారు. నలుగురిలో నవ్వుల పాలవుతుంటారు. చివరికి తమకు ఇస్టం లేని పనిలో కొనసాగుతూ వుంటారు.

సరైన నిర్ణయం:

ఒకసారి ఒక నిర్ణయం తీసుకొన్న తరువాత, ఆ నిర్ణయానికే కట్టుబడి దానిలో విజయం సాధించాలి. (అది విద్య అయినా, ఉద్యోగం అయినా) దీనితో పాటు, చేసే పనిలో నిబద్దత (కమిట్‌మెంట్) వుండాలి. ఆ నిర్ణయాలతో అనేక కస్టాలు వస్తాయి. వాటిని ధైరంగా ఎదుర్కోవాలి, అనేక ప్రతికూలతలు వస్తాయి, వాటిని భరించాలి. అనుకూలత, ప్రతికూలతలను బేరీజు వేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మనకు ఉచిత సలహాలు ఇచ్చే వారు వుంటారు. మన ప్రయత్ననాన్ని చెడగొట్టేవారు వుంటారు. అయినా మన నిర్ణయం మార్చుకోకూడదు. మన లక్ష్యం మారకూడదు, మనం మన గమ్యము వైపు సాగిపోతూ వుండాలి.

నిర్ణయం మారకూడదు:

లక్ష్యం సాధించాలి అంటే, మనం తీసుకొన్న నిర్ణయం మారకూడదు, నిర్ణయం మార్చకూడదు. ఉదాహరణకు, కొంతమంది ఏ నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోరు, నాన్చుతూ వుంటారు. కారణం నిర్ణయం తీసుకొంటే ఫలితం ఎలావుంటుందో అనే భయం. అందుకోసం తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకొంటారు. ఇటవంటి వాయిదా లేదా నాన్చుడు ధోరణి వల్ల, పనులు పూర్తవక అవకాశాలు దూరం అవుతాయి. దీనినే ‘డిసైడో ఫోబియో’ అంటారు. ఇటువంటివారు సమాజంలో చాలామంది వుంటారు. అటువంటి వారు మన పక్కన తిరుగుతూ వుంటారు. అటువంటి వారి సలహాల వల్ల, కొన్నిసార్లు మనం చాలా అవకాశాలు కోల్పోతూవుంటాం. సమస్య వచ్చినపుడు, దాన్ని ఎదురుకొనే ధైర్యంతో పాటు, అవగాహన, తెగువ రెండూ వుండాలి. అపుడే విజయాన్నీ సాధించ గలరన్న విషయం తెలుసుకోవాలి.

అందుకే.. స్వామి వివేకానంద ఇలా అంటారు “నీ భవిష్యత్తుకు నీవే నిర్మాతవని తెలుసుకో! నీ బాధ్యతనంతా నీ భుజస్కందలపై వేసుకో” అంటారు. మన జయానికి కానీ అపజయానికి కానీ మనమే బాధ్యత వహించాలి. అంతే కాని ఎదుటి వారిని నిందించకూడదని తెలుకొన్నరోజు, మన జీవితంలో అన్ని జయాలే వుంటాయి, అపజయాలు వుండవు అని నేటి యవత తెలుసుకోవాలి.

Exit mobile version