Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వికీర్ణ స్వప్నం!

[శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు రచించిన ‘వికీర్ణ స్వప్నం!’ అనే కవితని అందిస్తున్నాము.]

అలుపెరుగని అనంతమైన నిశ
హృదయోల్లాసంగా ఆరని పిపాస
నిరాపేక్ష నిండిన కౌగిళ్ళ వేడుకలు
ఒకరిపై ఇంకొకరు
తోడిపోసుకుంటున్న ప్రేమల పూలజల్లు
కొంటెతనం కొసరి కొసరి
అల్లెత్రాడు బిగించుకున్న మన్మథుడి విల్లు
అన్ని గోలలూ చేతులెత్తేసి
ఓడి బేలగా మారిన వేళ
సంపూర్ణ సావకాశ సంగమంలో
సంకీర్ణమవుతున్న స్వప్నసలిలాల సాగరం
శ్వేత నిశ్శబ్ద వర్ణ శాంతి స్థావరం!
***
అసహాయ అయిన రాత్రి
అలసి అరకొరన నిద్రిస్తున్న దేహం
బరువైన శ్వాస.. బుసల శబ్దాగ్ని
నివురైపోతున్న నీరవమైన నిశ్శబ్దం
మనోవల్మీకాన్ని ఛేదించి
మానస సరోవరాన మునకలేసి
రెక్క విప్పబోయిన ఓ జ్ఞాపకాల కూన
రెమ్(REM) నిద్రలో.. భ్రమ ముద్రలో
శల్యమై, శలభమై మాడిపోతున్న సంగరం
కాలం కరచాలనం కట్టడికి
ఉక్కిరి బిక్కిరి చేసే ఉక్కు కౌగిళ్ళు
ఊపిరొదిలేసిన సంబరం
ఆమెను పోగొట్టుకున్న
ఇప్పటి పాన్పు పై
పాము విషంలా ప్రాకి వెక్కిరిస్తున్న
చిక్కటి.. చీకటి కాంతి
విచ్ఛిన్నమై, వికీర్ణమైన ఒక స్వప్నం!!!

Exit mobile version