[శ్రీ నండూరి రామచంద్ర రావు రచించిన ‘విలువలు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
కైలాసంలో ఉన్న పార్వతమ్మ గారికి ఏ ఆచార వ్యవహారాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ మన కథలో ఉన్న పార్వతమ్మ గారికి కావలసినన్ని పట్టింపులు ఉన్నాయి. ఆమె స్నానం చేసి వంటగది లోకి వెళ్తే భోజనాలు అయిపోయి గిన్నెలన్నీ సర్దినాకనే పరాయి మనిషి మొహం చూడటం. అప్పటిదాకా వాకిటి గుమ్మం తలుపు వేసే ఉంటుంది. భర్త ఇంట్లో ఉంటే సరే గానీ ఆయన లేకపోతే బయటినుంచి ఎవరూ పిలిచినా తలుపు తీసేది లేదు ఓ గంట ఆగి రండి అని వినిపిస్తుంది. తెలిసిన వారూ బంధువులు అయితే వెనకాల పెరటి వైపు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి. దూరాభారం నుంచి వచ్చిన వారయితే బట్టలు కూడా మార్చుకోవాల్సిందే, ఏ అంటు మైల తగిలిందో ఏమో మరి!
భర్త సీతారామయ్య గారికైనా ఇదే పద్ధతి. ఆఫీస్ నుంచి రాగానే పెరట్లోకి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకునే లోపలకి రావాలి. కొడుకు సుందరమైతే స్నానం చేసి మరీ లోపలికి రావాలి. ఆమె పెరిగినప్పటి సాంప్రదాయాలు ఆమెకు నేర్పిన పద్ధతి అది మరి. సీతారామయ్య గారికి కూడా సాంప్రదాయాలు గట్రా అంటే పట్టింపు ఉంది. కాకపోతే భార్యకు ఉన్నంత లేదు. సుందరం కాలేజీ చదువులలోకి వచ్చినాక బయట కొంచం కొంచంగా పట్టించుకోక పోయినా ఇంట్లో మాత్రం తప్పనిసరిగా తల్లి పెట్టిన నిబంధనలు పాటించు కుంటూనే వచ్చాడు. కొద్దికొద్దిగా ఈ పురాతన ఆచార వ్యవహారాలు సమాజంలో మారుతూ వచ్చినా పార్వతమ్మ గారు మాత్రం ఇంకా మారలేదు. ఆమెను బట్టే సీతారామయ్య గారూ.
చదువు ముగిసి ఉద్యోగంలో చేరటానికి సుందరం బొంబాయి వెళ్లాల్సి వచ్చింది. ఇది తల్లికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా సీతారామయ్య గారు నచ్చ చెప్పారు ఆమెకు. “చూడు సమాజం మారుతోంది. ఇవాళా రేపూ ఉన్న చోట్లో ఉండి ఎదుగుదల కావాలి అంటే కుదరని పని. నువ్వు బొంబాయికే వద్దంటే రేపు వాడు ఏ అమెరికాకో వెళ్ళవలసి వస్తుంది. మనం ఆపే రోజులు కావివి. చుట్టుపక్కల ఉన్న సమాజం బట్టి మనం కూడా కొద్ది కొద్దిగా మారాలి తప్పదు” అంటూ.
ఒకరోజు పొద్దున్నే వచ్చాడు సుందరం ముంబై నుంచి. కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు వస్తున్నానని. కాఫీ వగైరాలు అయినాక “ఏమిటి ఇంత అకస్మాత్తుగా వచ్చావు?”, అవి సీతారామయ్య గారు అడిగారు.
బ్యాగు లోంచి ఒక ఫోటో తీసి “నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే. మీకు ఇష్టం లేదు అంటే అలాగే, ఇక నా పెళ్లి విషయం మర్చిపోండి. ఈ అమ్మాయి వివరాలు మన కులం కాదు మన మతం కాదు ఆఖరికి తెలుగు అమ్మాయి కూడా కాదు. అయినా నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను,” అన్నాడు.
సుందరం నిజంగా సుందరం గానే ఉంటాడు, గుమ్మడి పండు రంగులో, ఒడ్డు పొడుగూ బాగుండి. ఆ అమ్మాయి నల్లగా కొద్ది పొట్టిగా ఉంది. తల్లీ తండ్రి మాత్రమే కాదు ఎవరైనా సరే ఈడూజోడు కుదరలేదనే అంటారు.
తల్లి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పోయింది., అంటే ఆమెకు ఇష్టం లేదు ఏ మాత్రం, ఆ అభిప్రాయం మారదు అని. సీతారామయ్యగారు మౌనంగా కొడుకు వంక చూసారు. సుందరం బ్యాగ్ సర్దుకుని తల్లి దగ్గరకు వెళ్ళి “నేను బొంబాయి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను”, అని చెప్పి తండ్రితో “ఒక వారంలో నేను అమెరికాకు వెళ్ళాలి, ఆఫీస్ వాళ్ళ ఆదేశం ప్రకారం. ఒకటిన్నర రెండు సంవత్సరాలు పడుతుంది తిరిగి రావటానికి. వెళ్ళినాక వేరే ఫోన్ నంబర్ ఇస్తాను, అప్పటి వరకు ఇదే ఫోన్ నంబర్ పని చేస్తుంది. వస్తాను,” అంటూ వెళ్ళిపోయాడు.
మూడు నెలలు గడిచాయి. సుందరం ఫోన్ చేస్తుంటే సీతారామయ్య గారు మాట్లాడారు కానీ పార్వతమ్మ గారు మాట్లాడలేదు. ఒక రోజు పొద్దున్నే సీతారామయ్య గారికి గుండెలో నొప్పి మొదలయింది. అప్పుడు తనంత తానుగా కొడుక్కి ఫోన్ చేశారు పార్వతమ్మ గారు
“ఏమీ కంగారు పడవద్దు, పది నిమిషాల లోపల అన్నీ ఒకతను వచ్చి చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, నాన్నగారికి ఏ ప్రమాదం లేదు,” అని తల్లికి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేశాడు సుందరం. అయిదు నిమిషాలలో సుందరం స్నేహితుడు ఒకతను రావటం , పదిహేను నిమిషాలలో అంబులెన్స్, అర్ధగంట లోపల ఆసుపత్రికి వెళ్ళటం చకచకా జరిగిపోయాయి. కొంచంగా తెలిసింది ఆమెకు మనిషికి వేరే మనిషితో అవసరం ఉంటుంది, ఆ అవసరంకు తేడాలు – ఉండవు, గమనించరు, పట్టించుకోరు – అని.
“ఆయన బాగానే ఉన్నారు, డాక్టర్లు చూస్తున్నారు, ఏ ప్రమాదం లేదు, కొద్ది సేపట్లో ఆయనను చూసి రావచ్చు,” అని సౌమ్యంగా ధైర్యం ఇస్తూ చెప్పి ఆ స్నేహితుడు ఆమెను కాఫీ ఏమన్నా తాగుతారా అని అడిగాడు. ఇన్స్యూరెన్స్ ఉందా, డబ్బులేమన్నా ఉన్నాయా అని ఒక్క మాట అడగలేదు. ఇసిజీ, ఆంజియో వగైరా అన్నీ అయి, ఐసియులో పడుకోబెట్టినాక అప్పుడు ఆమెను ఆయనను చూడటానికి పిలిచారు. ఆయన మత్తులో ఉన్నా, ఆమె స్పర్శకు కొద్దిగా కదిలారు. ఆమెకు ధైర్యం వచ్చింది.
కళ్ళ నుంచి నీళ్లు కారుతుండగా ఆ స్నేహితుడికి దండం పెట్టబోయారు. ఆ అబ్బాయి చటుక్కున ఆమె చేతులు పట్టుకుని, “అమ్మా, మీ అబ్బాయి లాంటి వాడినే నేను, అట్లా దండాలు అవీ పెట్టకండి,” అంటూ దూరంగా వెళ్ళాడు. అతను తనను ముట్టుకున్నాడు అన్న మాటే ధ్యాసకు రాలేదు ఆమెకు.
ఆ ఆసుపత్రి మిగతా ఆసుపత్రుల లాగా లేదు. ఎమర్జెన్సీ కేసులు, ఐ సి యూ లో ఉన్న రోగుల కోసం విడిగా ఒక వెయిటింగ్ రూమ్. తగినన్ని కుర్చీలు, విశాలంగా . అక్కడ ఒక ఉద్యోగిని. వెళ్లగానే ఆమెకు ఒక సీటు చూపించి దాని నెంబర్ నోట్ చేసుకుంది, ఏదన్నా పని ఉన్నా ఏ సమాచారమైనా ఇవ్వాలనుకున్నా మిగతా వారికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మంచి నీళ్లు వగైరా ఇవ్వటానికి ఒక మనిషి. నిశ్శబ్దంగా ఏ సి పనిచేస్తూ. ఇక కూర్చున్న వారికోసం ఒక పెద్ద టీ.వీ. దాంట్లో అన్నీ కామెడీ స్కిట్స్, అదీ నిశ్శబ్దంగా. కూర్చున్న వారు మాటలు వినాలి అనుకుంటే హియరింగ్ ప్లగ్స్. చూస్తూ చూస్తూ కాస్త టెన్షన్ తగ్గుతుంది అట్లా వేచి ఉన్న వారిలో.
మధ్య మధ్య లో స్లైడ్స్ , తెలుగు హిందీ ఇంగ్లీష్ లో “మానవ జాతి మొత్తానికి అన్ని ప్రాంతాల వారికి ధర్మం నీతి న్యాయం ఒక్కటే. ఉదాహరణకు ఎవరికీ హాని కలిగించవద్దు, అవినీతి వద్దు, ఇంకొకరిని మోసం చేయవద్దు అంటూ. దీనికి వ్యతిరేకంగా ఏ మతము చెప్పలేదు. కలిసి బతికితే ఆనందం అభివృద్ధి ఉంటుంది. ఇంకొకరికి బాధ, కష్టం కలిగించే సాంప్రదాయం మార్చుకుంటే శాంతి నిలుస్తుంది.” వేరే పనేమీ లేక టీవీ చూస్తున్న వారు అప్పుడపుడు వస్తున్న ఈ స్లైడ్స్ ఒకటి రెండు సార్లు చూడటం జరుగుతోంది. విసుక్కోకుండా మళ్ళా కామెడీ సీన్ ఒకటి.
ఇంతే కాదు గంటకొక సారి అక్కడున్న ఉద్యోగిని ఒకో వేచివున్న వారిని పిలిచి సీ సీ టి వి కెమెరా ద్వారా వారి తాలూకు చికిత్స పొందుతున్న వారిని చూపిస్తోంది, ఆరాట పడటం లేకుండా.
‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ నడవదు, కానీ లాభమొక్కటే చూసుకోకుండా వచ్చిన వారికి అన్ని విధాలా సౌకర్యం సమకూర్చడం చాలా గొప్ప మానవీయతగల పని,’ అనుకున్నారు పార్వతమ్మగారు. ఆ విధంగా ఆలోచించడం మొదటి సారి కావచ్చు ఆమెకు జీవితంలో.
సాయంత్రం నాలుగు అయిదు మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది, ఆ ఆసుపత్రిలో నర్సులు కాక ఇతర ఉద్యోగినులు ధరించిన చీరలాంటిది కట్టుకుని. “అమ్మా, మీరు ఇంటికి వెళ్ళి కాస్త దీపం పెట్టుకుని, ఎంగిలిపడి రండి. ఆహారంతో బలం వస్తుంది, అది మీకు కావాలి. బెంగతో మీరూ కలవరపడి అడ్దం పడితే ఎలా”, అంటూ ఇంటికి పంపించింది నచ్చచెప్తూ. హాస్పిటల్ వారు ఆమెను అమర్చారు, ఎవరు నువ్వు అని అడిగితే బాగుండదేమో అనుకుంటూ. ఆ రోజు గడిచింది. రెండో రోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి వచ్చాక ఆమె ఇంట్లోనే ఉండిపోయారు, ఆయనకి తెలివి వచ్చి కులాసాగానే ఉన్నారు, ఆ పైన సుందరం స్నేహితుడు, ఆసుపత్రి వారు అమర్చిన ఆమె ఉన్నారు అన్న ధీమాతో. ఒక వయస్సు అంటూ వచ్చాక మనిషికి విశ్రాంతి అత్యవసరం. అయిదు రోజు డిశ్చార్జ్ అయినాక పార్వతమ్మ గారు ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని చాలా సేపు కృతజ్ఞతలు తెలుపుతుంటే సీతారామయ్య గారు సీరియస్‌గా అన్నారు,
“అది సరే గానీ పార్వతీ, కోడలికి మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి ఎప్పుడు ఆహ్వానిస్తావో చెప్పు.”
