[బాలబాలికల కోసం ‘విమానాన్ని కనుగొన్న రైట్ సోదరులు’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
హాయ్ లిటిల్ ఫ్రెండ్స్! ఆకాశంలో విమానం ఎగిరే శబ్దం వినబడగానే మీరంతా ఇంటి బయటికి పరిగెత్తి తలెత్తి ఆకాశంలో సాగిపోయే విమానాన్ని చూస్తుంటారు కదా! పిల్లలే కాదు పెద్దలు కూడా ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మరి ఈ విమానాన్ని తయారు చేయాలనే కోరిక ఎప్పుడు? ఎలా కలిగింది? విమానాన్ని ఆకాశంలో విహరింపచేయటానికి ఎవరు తమ జీవితాన్ని ధారపోశారో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్నివేల మైళ్ళ దూరాన్ని సైతం గంటలలో చేరుకునే సాధనమైన విమానాన్ని రైట్ సోదరులుగా విఖ్యాతి గాంచిన విల్బర్ రైట్, ఆర్విల్ రైట్ అనే ఇరువురు సోదరులు కనుగొన్నారు. 1867 ఏప్రిల్ 16వ తేదీన విల్బర్ రైట్, 1871 ఆగష్టు 19న ఆర్విల్ రైటు లు అమెరికాలోని ఒక చర్చి బిషప్ ఇంటిలో జన్మించారు. చిన్నతనం నుండీ యంత్రాలతో ఆడుకుంటూ ఇంకా వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని కనబరచేవారు. ఏ యంత్రం ఎలా పనిచేస్తుందో, ఇంకా ఏ మార్పులు చేస్తే మనకు కావలసిన రీతిలో అమరుతుందో అనుక్షణం విశ్లేషించేవాళ్ళు. వీరు మొదట్లో ముద్రణా యంత్రాలను, సైకిళ్ళను తయారుచేసేవారు. వాటిపై వచ్చిన డబ్బును విమాన ప్రయోగాలకు వినియోగించేవారు.
”ఓటో లిలియాంతల్’ అనే జర్మన్ ఇంజనీరు అప్పటికే గాలిలో ఎగురగలిగే పలురకాల ఇంజన్ లేని విమానాలను (గ్లైడర్) రూపొందించి విజయవంతంగా ప్రయోగించగలిగాడు. కానీ 1896లో అతను మరణించటంతో రైట్ సోదరుల దృష్టి ఎగిరే యంత్రాలపై పడింది. లిలియాంతల్ ప్రయోగాల వలన విమానాన్ని గాలిలో ఎగిరించవచ్చు. కానీ దాని గమనాన్ని మనకు కావలసిన రీతిలో నియంత్రించుకోలేక పోతున్నామని అర్థమైంది. తన శరీర కదలికల ద్వారా గ్లైడర్ సమతుల్యాన్ని అదుపుచేసే లిలియాంతల్ విధానం వారికి నచ్చలేదు. ఫలితంగా కంట్రోల్, బ్యాలెన్స్ అన్న అంశాలమీదే ప్రధానంగా వారి పరిశోధన కొనసాగింది. చివరికి ఎలాగైతేనేం ఇంధనశక్తితో నడిచే విమానాన్ని తయారుచేశారు.
1903 డిసెంబరు 17వ తేదీన తమ ప్రయోగానికి ముహూర్తం పెట్టారు. రైట్ సోదరులు అప్పటికి తమ యంత్రానికి ‘రైట్ ప్లైయర్’ అని పేరు పెట్టుకున్నారు. ఆ రోజు చాలామందిని ఆహ్వానించినప్పటికీ ఎవరూ రాలేదు. వీరు తయారుచేసినది కేవలం ఒక్కరు కూర్చునే వీలు మాత్రమే ఉండటంతో, మొదట విమానాన్ని ఎవరు నడపాలన్న విషయాన్ని టాస్ వేసి తేల్చుకున్నారు. అదృష్టం ఆర్విల్ ని వరించింది. మొదటిసారి 120 అడుగుల ఎత్తున 12 సెకన్లపాటు విహరించింది. రెండవసారి విల్బర్ 812 అడుగుల ఎత్తున 59 సెకన్లపాటు ఆకాశంలో విహరింపచేశాడు. అయినా ప్రపంచం వారిని పట్టించుకోలేదు. 1904లో మెరుగైన ఇంజన్‌తో మరో విమానాన్ని తయారుచేసి ప్రయోగించారు. 1905లో ఎటు కావాలంటే అటు తిరిగే మరింత మెరుగైన విమానాన్ని రూపొందించారు. ఇప్పుడు ప్రపంచం వీరి మేధస్సుకు నీరాజనాలు పట్టింది.
1908 ఆగస్టు నుంచి డిసెంబరు వరకూ తమ ప్రయోగాలను వందసార్లు చేసి చూపారు. నిరంతర ప్రయోగాలతో వైమానిక విజ్ఞానంలో గొప్ప మార్పులను తీసుకు రావటంతో 1909 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వీరికి గుర్తింపు లభించింది. 1912లో విల్బర్ టైఫాయిడ్ జ్వరంతో మరణించారు. నిరంతర ప్రయోగాలతో ప్రపంచానికి మరిన్ని విజ్ఞాన ఫలాలను అందించిన ఆర్విల్ 1948 జనవరి 30న కన్ను మూశారు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
