[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘వినాశనం వైపు విశ్వమానవ జాతి పరుగులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
విశ్వమానవ జాతి..
వినాశనం వైపు పరుగులు తీస్తోంది!
విధాత ప్రసాదించిన మేధస్సుతో
వినూత్న ప్రయోగాలెన్నో చేసి
వినీలాకాశంలో హర్మ్యాలు నిర్మించి
శూన్యంలో సరికొత్త ప్రపంచాన్ని
ఆవిష్కరించే సాంకేతికతను
తమ గుప్పిటలో బంధించారు!
మరి.. ఇదేమి అమానుషం..!?
ఆచరణలో ఆధునికతను
అంతరంగంలో విశాల హృదయ భావనను
నిక్షిప్తం చేసుకున్న ఈ మేధావులు..
మానవ సమాజాన్ని
జాతులుగా.. వర్గాలుగా విభజించి
జనావాసాలను..
యుద్ధక్షేత్రాలుగా మార్చారు!!
ఆకస్మిక బాంబు దాడులకు
పసికూనల లేలేత శరీరాలు
ఛిద్రమై రక్తధారలు స్రవించిన వేళ..
మానవత్వం మూగగా రోదించింది!
దేశాధినేతలు ముష్కరులై
నియంతలుగా మారి..
ప్రజా సంక్షేమ పాలనకు మారుగా
నిరంకుశ వికృత పాలనకు శ్రీకారం చుట్టారు!
పాలకుల రక్తంలో
పగలు.. ప్రతీకారాలు..
మహోధృత జ్వాలలై
ఎగిసెగిసి పడతోన్నవేళ..
ప్రజాజీవనమే కాదు
మానవజాతి యావత్తూ..
బూడిదకుప్పగా మారిపోయింది!
ఆధునిక మానవ మేధస్సు
ఆవిష్కరించిన అణుసంపత్తిని
అరేబియా సముద్రం జలాలలో కలిపి
విశ్వమానవ జగతి సంక్షేమాన్ని
ఉప్పునీటి పాలు జేశారు
యుద్ధోన్మాద ముష్కర పాలకులు!!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
