Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరళమూ, సుబోధకమూ ‘వినండర్రా! విష్ణుకథ’-1

[శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన ‘వినండర్రా! విష్ణుకథ’ పుస్తకం మొదటి భాగాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక తరం నుంచి మరో తరానికి అనూచానంగా అందేవి భక్తి ప్రపత్తులు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల కొనసాగింపు. ఇంట్లో పెద్దలు నిర్వహించే పూజలు, నిర్వహించే ఉత్సవాలు, చేసే మంచిపనులు వంటి వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు.

బాల్యంలో పిల్లలు – తల్లిదండ్రులో ఇతర పెద్దలో పూజ చేసుకుంటుంటే, అక్కడే తిరుగుతూ, జాగ్రత్తగా గమనిస్తూ, వారికి ఏం కావాలో అందిస్తూ, పూజ ముగిసాక ప్రసాదం తింటూ, తనకు కల్గిన సందేహాలను తీర్చుకునేవారు.

పురాణేతిహాసాలు, రామాయణం, మహాభారతం భాగవతం లోని మంచిమాటలు పెద్దల కథల ద్వారా పిల్లలకి అందేవి. అన్నం కలిపి ముద్దలు పెడుతూనో లేదా నిద్రబుచ్చే సమయంలో తల్లో/నాయనమ్మో/అమ్మమ్మో ఇలాంటి కథలు చెప్పి, పిల్లల్లో దేవుడి పట్ల, నీతినిజాయితీల పట్ల, సత్ప్రవర్తన పట్ల అవగాహనని కల్పించేవారు.

స్వయంగా చదువుకోగలిగే వయసుకొచ్చేసరికి పిల్లలకి చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉండేవి. వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించేవారు. ముఖ్యంగా చందమామలో వినాయకుడు, విష్ణుకథలు, ఆంజనేయుడు, దేవీభాగవతం వంటి పౌరాణిక ధారావాహికలు వెలువడి ఆబాలగోపాలన్ని అలరించాయి.

కాలక్రమంలో, మౌఖికంగా సాగిన కథల పద్ధతి, బాలపత్రికల ద్వారా అందే కథావిజ్ఞానం రెండూ దూరమయ్యాయి. పిల్లలు పాఠ్యపుస్తకాలకీ, ర్యాంకులకీ పరిమితమయ్యారు, గత కొన్నేళ్ళుగా మొబైల్ ఫోన్‌ వారిని తన ప్రపంచంలోకి లాక్కుంది.

పౌరాణిక కథలు తప్పించి, ఇతరత్రా బాలసాహిత్యం కొద్దికాలంగా కాస్త పుంజుకుంది. కొన్ని ప్రచురణ సంస్థలు, చాలామంది బాలసాహితీవేత్తలు స్వయంగా పుస్తకాలు ప్రచురిస్తూ, బాలసాహిత్యానికి ఆలంబన అవుతున్నారు.

ఈ క్రమంలో సామెతల ద్వారా రామాయణ కథలు (రామాయణ మార్గదర్శనం) పిల్లలకు అందించారు విశ్రాంత బ్యాంక్ అధికారిణి శ్రీమతి మద్దూరి బిందుమాధవి. ఆ తర్వాత, విష్ణుసహస్రనామాలు నేర్చుకునే పిల్లలకు ఉపయుక్తంగా ఉండాలన్న ఆలోచనతో, విష్ణుసహస్రనామాలపై రోజుకో కథ చెప్పున వ్రాశారు. ప్రస్తుతానికి 840 నామాలతో 87 కథలు వ్రాశారు. వేసవి సెలవుల్లో విష్ణుసహస్రనామాలు నేర్చుకునే పిల్లలకి ఉపకరించేలా ఉండాలన్న ఉద్దేశంతో 50 కథలతో ‘వినండర్రా విష్ణుకథ’ పేరిట పుస్తకంగా వెలువరించారు. త్వరలో రెండో భాగం కూడా వెలువరించనున్నారు.

~

ఏ దేవుని/దేవత సహస్రనామాలనైనా పఠించడం అంటే, ఆ దైవం గుణాలను, శక్తిని స్మరించుకోవడమే. సాధారణంగా సహస్రనామాలు సంస్కృతంలో ఉండి, కొత్తగా నేర్చుకుందామనుకునేవారికి కాస్త కష్టంగా అనిపిస్తాయి. పెద్దల మార్గదర్శనంతో పాటు, ఒక్కో నామాన్ని వివరించే ఇలాంటి కథలు చదువుతూ అభ్యాసం చేస్తే, నామాల అర్థాన్ని, అంతరార్థాన్ని సులువుగా గ్రహిస్తారు. సాధనతో, దోషరహితంగా నామాలను ఉచ్చరించడం కూడా అలవడుతుంది.

మొదటి కథలో ‘అనంత’ అన్న నామానికి అర్థం చెబుతూ, కొడుకికి కలిగిన సందేహాన్ని శ్రావణి తీర్చిన విధానం బావుంది. డబ్బు సంపాదించేది నాన్నైతే, అందులో దేవుడి ప్రమేయం ఏముందని అడుగుతాడు వికాస్. అందరికీ అన్నీ దొరికి, అందరూ జీవితం సుఖంగా గడపగలుగుతున్నారంటే అనంతుడైన భగవంతుడికి మన పట్ల ఉన్న కరుణే కారణమని వివరిస్తుంది శ్రావణి.

మూడవ కథలో ‘కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం’ అన్న శ్లోకానికి, దాని తరవాతి శ్లోకానికి అర్థమేమిటని రవి తాతగారిని అడుగుతాడు. లోకం మొత్తానికి ఏకైక దేవుడు ఎవరు, ఎవరిని ధ్యానిస్తే అవిద్య తొలగిపోతుంది అని ధర్మరాజు భీష్ముడిని అడిగిన ప్రశ్నలకి గాంగేయుడు చెప్పిన జవాబులను మనవడికి అర్థమయ్యే ఉదాహరణలతో, వాస్తవాలని అర్థమయ్యేలా చేసేది జ్ఞానం అనీ, ఆ జ్ఞానం విద్య వల్ల కలుగుతుందనీ, ఆ విద్యే శ్రీమన్నారాయణుడని చెప్తారు తాతగారు.

మర్నాడు రవి తాతగారిని అడిగి దేవుడికి ఉండే గొప్పలక్షణాలను తెలుసుకుంటాడు. ఎలా పూజించాలో నేర్చుకుంటాడు.

ఆన్‌లైన్‌లో విష్ణుసహస్రనామాలు నేర్చుకుంటున్న రవి, పావని మాట్లాడుకుంటారు. తను తాతగారి దగ్గర తెలుసుకున్న వివరాలన్నీ తన నేస్తంతో పంచుకుంటాడు. ‘పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః’ అనే శ్లోకపాదం గురించి చక్కగా చెప్తాడు రవి.

రవి పావనితో పాటు అభిరామ్, మరికొంత మంది పిల్లలు వచ్చి తాతగారిని విష్ణుసహస్రనామాల గురించి మరింత చెప్పమని కోరుతారు. అప్పుడాయన ‘విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్’ అనే శ్లోకపాదాన్ని చక్కని ఉదాహరణలతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు.

ఏడవ కథలో, తాతగారి పక్కన కూర్చుని ప్రవచనం వింటున్న పిల్లలకి సందేహాలు కలుగుతాయి. అప్పుడు తాతగారు రామాయణ ఘట్టాలు, నరసింహావతారం ఉదంతాలు చెప్పి, వాళ్ళ సందేహాలు తీరుస్తారు.

ఎనిమిదవ కథలో పిల్లల్ని బీచ్‌కి తీసుకువెళ్ళి, సముద్రాన్ని చూపిస్తూ, అదీ ఓ విధమైన విశ్వమేననీ, అందులోని జీవులన్నీ విష్ణుస్వరూపాలనే చెప్తారు. పొద్దున్న నేర్చుకున్న ‘విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః। భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః’ శ్లోకం అర్థమవుతుంది పిల్లలకి.

తొమ్మిదవ కథలో యోగ అంటే ఏమిటో పిల్లలకి అర్థమయ్యేలా ఉదాహరణలతో చెప్తారు తాతయ్య. పూర్తిగా అర్థం కాలేదంటూ బామ్మని చెప్పమంటాడు వికాస్. అప్పుడామె చక్కగా వివరిస్తుంది. ‘యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః। నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః’ అనే శ్లోకమూ, దాని తర్వాతి శ్లోకంలోని సారాన్ని గ్రహిస్తారు పిల్లలు.

11వ కథలో ‘స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః’ అనే శ్లోకం గురించి తెలుసుకుంటారు. ముఖ్యంగా ‘మహాస్వన’ అనే పదానికి ఉన్న అర్థాన్ని పిల్లలకి సులువుగ అర్థమయ్యేలా చెప్తారు తాతగారు.

విష్ణువుకి నశించటం, మరణించటం, అయిపోవటం అనేది ఉండదని ‘అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః’ బామ్మ పిల్లలకి వివరిస్తుంది.

14వ కథకి వచ్చేసరికి పిల్లలతో పాటు, మెడిసిన్ చదువుతున్న మానస కూడా వచ్చి చేరుతుంది. ‘అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః’ అనే శ్లోకానికి అర్థం చెబుతూ, నువ్వు అనాటమీ చదువుకున్నావు కదా, ప్రాణం అనేదాన్ని ఎప్పుడైనా చూశావా? అని బామ్మ మానసని అడిగితే, లేదంటుంది. ప్రాణం అంటే చైతన్యం అని మనం చెప్పే దైవశక్తి అని చెప్తుంది బామ్మ. శరీరంలో ఉండే పది ప్రాణాల గురించి వివరిస్తుంది.

16వ కథలో శ్రీమన్నారాయణుడు ఒక దేశానికో, కాలానికో, ప్రదేశానికో పరిమితం కాడని చెబుతూ, ఆయనకి పుట్టుక అనేది లేదనీ, నశించటం అనేది లేదని ఉదాహరణలతో చెప్తారు తాతయ్య.

17వ కథలో వృషాకపి అనే నామానికి అర్థం చెబుతుంది బామ్మ. అలాగే అష్టవసువుల పేర్లు చెప్పి, వారేం చేస్తారో పిల్లలకి చెబుతుంది.

విష్ణువంటే.. ఏ పని చేసినా తనని స్మరిస్తూ, భక్తిగా ఉండేవారి ప్రయత్నాలని వృథా కానివ్వని వాడని చెబుతుంది బామ్మ.

19వ కథలో పిల్లల చేత తోట శుభ్రం చేయిస్తూ, ‘రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః’ శ్లోకానికి ప్రాక్టికల్‌గా వివరిస్తుంది బామ్మ.

20వ కథలో పరీక్షిన్మహారాజుకి ఆ పేరు ఎలా వచ్చిందో బామ్మ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ‘వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః’ అనే శ్లోకపాదానికి చక్కని ఉదాహరణలిస్తుంది.

21వ కథలో పిల్లలకి విష్ణుసహ్రసనామలు ఎంత వరకు అర్థమయ్యాయో పరీక్షిస్తుంది బామ్మ. ‘లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః’ అనే శ్లోకాన్ని చక్కగా వివరిస్తారు పిల్లలు.

తర్వాతి కథలో, ‘ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః’ అనే శ్లోకాన్ని వివరిస్తూ చక్కని ఉదాహరణలు చెప్తారు తాతయ్య.

‘పునర్వసు’ అనే నామానికి బామ్మ చెప్పిన వివరణ గొప్పగా ఉంటుంది. విష్ణువు బుద్ధిబలాన్ని మనం అంచానా వేయలేమంటూ, ‘మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః’ శ్లోకాన్ని అర్థమయ్యేలా చెప్తుంది బామ్మ.

27వ కథలో ‘మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః’ శ్లోకంలోని ఒక్కో నామానికి ఒక్కొక్క పిల్ల/పిల్లాడి చేత అర్థం చెప్పిస్తారు తాతయ్య.

30వ కథలో శ్లోకంతో పాటు కష్ట తరం, కష్ట తమం అనే పదాల అర్థాన్ని, వాటి మధ్య తేడాని వివిరిస్తుంది బామ్మ. ‘గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః’ శ్లోకాన్ని వివరిస్తుంది.

తరువాతి కథలో విష్ణువుని ‘సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్’ అని ఎందుకు వ్యవహరిస్తారో చాలా సరళంగా వివరిస్తుంది బామ్మ. తరువాతి ‘ఆవర్తనో’ అన్న నామానికి చక్కని వ్యాఖ్యానం చేస్తుంది బామ్మ. అలాగే ‘శిపి విష్టః ప్రకాశన’ అనే నామాలకీనూ!

బాలు తన అమ్మ ‘నైకరూప’ అని మిత్రుడితో వాదిస్తాడు. విష్ణువు ఆ పేరుకి ఉన్న లక్షణాలన్నీ అమ్మకి ఉన్నాయంటాడు. బామ్మ కూడా నిజమే అంటుంది.

విష్ణువు మనని ఎప్పుడూ కనిపెట్టుకు ఉండి, ఎలా కాపాడుతూంటాడో ‘అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదననంతజిత్’ అనే శ్లోకపాదం వివరణలో చెప్తుంది బామ్మ.

శ్లోకాలు, అర్థాలు చెప్పడమే కాదు, పిల్లలు వాటిని ఎంతవరకు గ్రహించారో ప్రశ్నలు వేసి తెలుసుకుంటుంది బామ్మ.

ఓ పిల్లాడు ఏడుస్తూ వస్తాడు. వాడి కాలికి దెబ్బ తగిలింది. గాయం తుడిచి, దాని మీద కొంత పసుపు అద్ది, వాడిని మరపించి – విష్ణువుకి దుఃఖమూ, శోకమూ ఉండదని చెప్పే ‘అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః’ శ్లోకాన్ని వివరిస్తుంది.

47వ కథలో వ్యవసాయం అంటే మొక్కలపని, పశుపోషణకి సంబంధించిన జ్ఞానమే కాదంటూ, వ్యవసాయం అంతే కృషి ప్రయత్నం అని చెబుతూ, ‘వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః’ అనే శ్లోకాన్ని వివరిస్తుంది బామ్మ.

ఇవన్నీ గమనిస్తుంటే, ఒక శ్లోకం చెప్పేముందు, దానికి తగిన సందర్భాన్ని, సన్నివేశాలని రచయిత్రి కల్పించిన తీరుని అభినందించకుండా ఉండలేం.

~

ఈ కథల విశిష్టత ఏమిటంటే – ఇంట్లో పెద్దలు అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు – పిల్లలతో సమయం గడిపి, వాళ్ళకి అర్థమయ్యేలా చిన్న చిన్న కథల్లా విష్ణు సహస్రనామాలని పరిచయం చెయ్యడం! కలిసి సమయం గడపడం, మంచిమాటలు చెప్పుకోడం, భక్తిని అలవర్చుకోడం, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించటం వల్ల ఇంట్లోని పెద్దలకీ, పిల్లలకీ మధ్య అనుబంధం గాఢమవుతుంది. ఆధ్యాత్మికత వెల్లివిరియడంతో పాటు, కుటుంబ వ్యవస్థ బలపడి సామాజికంగానూ సానుకూల మార్పుకి దోహదం చేస్తుంది. రచయిత్రి చేస్తున్న ఈ కృషి అభినందనీయం!

***

వినండర్రా! విష్ణుకథ (మొదటి భాగం)
రచన: మద్దూరి బిందుమాధవి
పేజీలు: 161
వెల: 100/-
ప్రతులు దొరుకు చోటు:
1. శ్రీమతి ఎమ్. బిందుమాధవి
ఫ్లాట్ నెం. 402, శ్రీముఖ రెసిడెన్సీ
ఇం.నెం.8-3-1027/2/ఎ
శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ – 500 073.
ఈమెయిల్: bindumadhavi.madduri@gmail.com
9491727272
~

 

2. నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్.
040 24652387, 9000413413

Exit mobile version