Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వినాయక వృత్తాంతం

[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘వినాయక వృత్తాంతం’ అనే కవితని అందిస్తున్నారు ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు.]

పార్వతీ పరమేశ్వరుల
ముద్దు బిడ్డడతడు
దేవతల, మునుల, మనుషుల
పూజలందుచున్నాడు
ప్రతి దినం తప్పనిసరిగా

పూజలు వ్రతాలు నోములు
అన్నీ మొదలు పెడుతారు
అతనినీ పూజించిన తర్వాతనే

ప్రథమ తాంబూలం సమర్పయామి
అతనికి గుడిలో బడిలో అంతట

నలుగుతో చేసి
ప్రాణ ప్రతిష్ఠ చేసి
కాపలా వుంచింది
భవాని మాత అతన్ని ఇంటికి

అమ్మ ఆజ్ఞ మేరకు
ఎవరికీ ప్రవేశం ఇవ్వరాదు
శివయ్యకు ప్రవేశం నిరాకరించాడు
అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం

వచ్చిన వ్యక్తి వివరాలు అడగలేదు
వచ్చిన వ్యక్తి తన వివరాలు చెప్పలేదు

కోపోద్రిక్తుడైన ముక్కంటి ముక్కోపి
శిరశ్ఛేదనం చేసాడు
నిర్జీవి అయ్యాడు ముద్దు బిడ్డ

పరుగు పరుగున వచ్చిన
శివాని ద్వారా తెలుసుకున్నాడు నిజం
తెప్పిచ్చాడు తల ఆగమేఘాల మీద

అది ఏనుగు తల
కాదు తెగిన తల
అతికించాడు బిడ్డకు
పరమేషునికి సాధ్యం కాని పని
వుండదు కదా..

నవ్వాడు చంద్రుడు ఫక్కున
వింత రూపం చూసి
తల్లి మనసు నొచ్చుకుంది
కోపగించి పార్వతి శపించింది చంద్రున్ని
అతనిని చూసిన వారు
నిందల పాలవుతారని

దేవతలు మునులు ఋషులు
వేడుకొనగా శాపాన్ని
సవరించింది జగన్మాత
వినాయక చవితి నాడు మాత్రం
చూస్తే తప్పవు నీలాప నిందలు

శివుడు అనుగ్రహించాడు
దేవతల కోరిక మేరకు
నియమించాడు విఘ్నాధిపతిగా
తమ ముద్దుల బిడ్డను
అతనే మన బొజ్జ గణపయ్య

పెద్ద చెవులు ఎక్కువగా వినమని
బుజ్జి నోరు తక్కువ మాట్లాడమని
మనకు బోధిస్తున్నవి

భారీకాయుడు
మూషిక వాహనుడు
మన వినాయకుడు
మొక్కెదం రండి
చేతులు జోడించి

Exit mobile version