Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విన్నపాలు వినవలె..

[సూరిశెట్టి వసంతకుమార్ గారు రచించిన ‘విన్నపాలు వినవలె..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

శ్రవణా నక్షత్రం శనివారంతో కలిసిరావడంతో శ్రీనివాస భక్త సమాజం ఆ రోజు సభ్యులతో కళ కళలాడిపోతుంది. ప్రతి శనివారం సభ్యులందరూ చేరి సాయంత్రం వేళ శ్రీ విష్టు సహస్రనామ పారాయణం చెయ్యడం చాలా రోజుల్నించి వస్తున్న సంప్రదాయం. అదీ కాకుండా ఆ రోజు వారం నక్షత్రం కలిసి రావడంతో సభ్యులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. నిలువెత్తునున్న వెంకటాచలపతి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించి, ఇరువైపులా వున్న నేతి దీపాల్ని వెలిగించి సభ్యుల్ని చూసి “ప్రారంభించండి” అన్నాడు హయగ్రీవాచారి. విష్టుసహస్రనామ పారాయణం ప్రారంభమయ్యింది.

సభ్యులంతా ఒకే రిథమ్‌లో సహస్ర నామాన్ని పారాయణం చెయ్యసాగారు. హయగ్రీవాచారి మనసులోనే పారాయణం చేసుకుంటూ వెనక వైపునున్న సమాజం వంటశాలలోకి వచ్చి దేవుడికిష్టమైన చక్కెరపొంగలి తయారయ్యిందా లేదా అని ఒకసారి పరీక్షించి “అరటి దొన్నెలు సరిపోతాయో లేదో చూసుకోండి.. పారాయణం పూర్తికావడానికి ఇంకా గంట టైముంది. అంత వరకూ ప్రసాదం వేడి తగ్గకుండా చూసుకోండి” అని అక్కడున్న వారికి పనులు పురమాయించి గేటు దగ్గరకి వచ్చి ఎవరి కోసమో ఎదురు చూడసాగాడు. అంతలో అక్కడికి వచ్చి రఘు హయగ్రీవాచారి ఎవరికోసమో తీక్షణంగా ఎదురుచూడడం గమనించాడు.

“లోపల పారాయణం జరుగుతుంటే ఎవరి కోసం మామయ్యా అలా ఎదురుచూస్తున్నారు?” అని అడిగాడు రఘు స్కూటర్ని ఒక ప్రక్కగా పార్క్ చేస్తూ.

హయగ్రీవాచారి సమాధానం చెప్పేలోపలే ఎదురుచూస్తున్న వ్యక్తి రావడం కనిపించింది. సన్నగా, పొడుగ్గా వుండి అవసరవసరంగా సమాజంవైపు నడుస్తూ రాసాగాడు.

“అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు మన శేషాచలం!”

“అరే! మన శేషాచలం గురించా ఈ ఎదురు చూపులు.”

“అలా తేలిగ్గా మాట్లాడకు రఘు.. మన శేషాచలం ఇప్పుడు చాలా కష్టంలో వున్నాడు. మన మందరం కలిసి ఏదో విధంగా సహాయం చేయాలి మరి!”

“అంత కష్టం ఏమొచ్చింది? మన శేషాచలానికి.”

“పారాయణం పూర్తి అయిన తర్వాత అందరికీ చెబుతాను. అంతవరకూ ఆగు” అని హయగ్రీవాచారి చెబుతుండగా శేషాచలం వారి దగ్గరకి వచ్చి నమస్కరించాడు.

“రా శేషు. నీ గురించే ఎదురుచూస్తున్నాను. వెళ్ళిన పని ఏమైంది?” అడిగాడు హయగ్రీవాచారి ఆత్రుతగా.

“ఏమని చెప్పమంటావు? ఒక్కో డాక్టరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ఏమవుతుందో ఏమో అర్థం కావడం లేదు” అని చెపుతున్నప్పుడు శేషాచలం గొంతు వణికింది. కళ్లల్లోనించి నీళ్ళు దారలా కారసాగాయి.

“ఏమయింది శేషు. ఎవరికి బాగోలేదు?” అంటూ గాబరాగా అడిగాడు రఘు ఆత్రుతగా.

“ఏం చెప్పమంటావ్ రఘు. గబగబా మాట్లాడే మా శ్రీహరికి..” శేషాచలం చెప్పడం ప్రారంభించడం చూచి కళ్లతోనే వద్దని వారించాడు హయగ్రీవాచారి.

తర్వాత శేషాచలం భుజం మీద చెయ్యి వేసి “శేషు ఇప్పుడేమీ మాట్లాడవద్దు. వెళ్ళి లోపల పారాయణంలో కూర్చుని ఆ ఏడు కొండలవాడ్ని ప్రార్థిస్తూ కూర్చో. అందరి డాక్టర్లకన్నా పెద్ద డాక్టరు ఆ శ్రీనివాసుడు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. లోపలికి వెళ్లు” అని శేషాచలాన్ని లోపలికి పంపించి రఘుతో పాటు తనూ పారాయణంలో కూర్చున్నాడు హయగ్రీవాచారి.

అందరూ విష్టు సహస్రనామ పారాయణాన్ని గంభీరంగా కోరస్‌గా పాడుతున్నారు. రఘు మాత్రం టెన్షన్‌లో మునిగిపోయాడు. విషయం తెలవక. ఏమై వుంటుంది శేషాచలానికి అన్న సందేహంతో చూసిన రఘుకి నిద్రలేని కళ్లతో తదేకంగా దేవుడ్నే చూస్తున్న శేషాచలం కనిపించాడు. పారాయణం ముగింపుకి వచ్చింది. హారతి చూపించి పూజ ముగించారు. హాలంతా పూర్తి నిశ్శబ్దం.

ప్రతి శనివారం పారాయణం అయిన తర్వాత శ్రీవారి భక్త సమాజంలో సెక్రటరీ అన్నహోదాలో ఆ వారం విరాళాలు అందించిన పెద్దల గురించి, మిగతా ముఖ్యమైన విషయాల గురించి కొద్ది సేపు మాట్లాడడం హయగ్రీవాచారికి అలవాటు. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే మాట్లాడడం ప్రారంభించాడు.

“సభ్యులందరికీ నా నమస్కారాలు. ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు మన సభ్యులందరికీ ఎల్లవేళల వుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు స్వామి వారి ప్రసాదానికి ధన సహాయం చేసిన వారు మన సమాజంలో కొత్తగా చేరిన గోమతి గారు. వారికీ, వారి కుటుంబ సభ్యులకీ ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మరో ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడదలుచుకున్నాను. మన సమాజంలో ఎన్నో ఏళ్ళ నుంచి సభ్యుడిగా వున్న శేషాచలం మీకందరికీ తెలిసే వుంటుంది. ఆయన కొడుకు శ్రీహరికి సడన్‌గా మాటపడిపోయింది..” హయగ్రీవాచారి ఆ మాట చెప్పడంతో అందరి కళ్లూ శేషాచలాన్ని చూసాయి. అతడి కంట్లో నుంచి కన్నీరు జలజలా కారుతూనే వుంది.

“స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టు వచ్చే శ్రీహరికి సడన్‌గా మాటపోవడంతో ఏం చెయ్యాలో అర్థంకాక మన శేషాచలం చూపించని డాక్టరు లేడు. ఎక్కని హాస్పటల్ లేదు. కానీ ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. లక్షల్లో ఒకరికి ఇలా ఓకల్ కార్డు పాడైపోయి మాటలు పోతాయట. ఆపరేషన్‌కి చాలా ఖర్చు అవుతుందట. ఒకవేళ చేసినా మాట వస్తుందన్న నమ్మకం లేదట. ఈ క్షణాన్న మన శేషాచలానికి కావలసింది మన అండదండలు, దానితో పాటు మన వెంకటేశ్వరుడు వున్నాడు అన్నీ చూసుకోవడానికి. ప్రార్థన వల్ల సాధించలేనిది ఏదీ లేదంటారు. అందువల్ల మనమందరం రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా మన శ్రీహరికి మాట రావాలని ఆ తిరుమలరాయుడ్ని వేడుకుందాం..” అని చెప్పి చేతులెత్తి నమస్కరించి ప్రార్థించడం మొదలు పెట్టాడు హయగ్రీవాచారి. సభ్యులందరు కూడా ఆ ప్రార్థనలో పాల్గొన్నారు.

రోజులు గడుస్తున్నాయి. మహావిష్ణువుకి ఇష్టమైన మార్గశిరమాసం రానే వచ్చింది. మార్గశిర మాసంలోని మొదటి రోజున తిరుపతికి పాదయాత్రలో వెళ్లేవాళ్లకి మాలధారణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. శ్రీనివాస భక్త సమాజంలో మాలధారణకోసం వచ్చిన సభ్యులు ముందుగా అక్కడున్న శ్రీనివాసుడ్ని పూజించి ఆ తర్వాత అక్కేడ వున్న పూజారి చేత తులసి మాలను మెడలో వేయించుకోసాగారు. శేషాచలం కూడా శ్రీహరిని వెంట బెట్టుకుని వచ్చాడు. ఆ రోజు అందంగా, అమాయకంగా వున్న శ్రీహరి మీదే అందరి చూపులు.

శ్రీహరి సంతోషంగా అందర్ని చూస్తున్నాడు. శేషాచలం కళ్లల్లో విచారం కొట్టోచ్చినట్టు కనపడసాగింది. పుట్టుకతోనే మాట రాకపోతే అంత బాధనిపించదేమో! చక్కగా మాట్లాడుతూ వున్న పిల్లవాడికి సడన్‌గా మాట పోవడంతో శేషాచలం ఆ బాధని భరించలేకపోయాడు. అందర్నీ చూస్తూ ఏదో తెలియని ఉద్వేగంలో శేషాచలం గబ గబా వెళ్లి శ్రీహరి మెడలో పంతుల చేత మాల ధరింపచేసి, తనూ ఒకటి ధరించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత శ్రీహరి చేతిని పట్టుకుని తిన్నగా దేవుని ముందుకు తీసుకుని వెళ్లాడు.

“ఏడు కొండల వాడా, చిన్నప్పట్నించీ అన్నీ నీవే అని బతుకుతున్న వాడిని! నీ దగ్గర కోట్ల కొలది ఆస్తి కావాలని అడగలేదు. నా కొడుక్కి మాట ఇమ్మని అడుగుతున్నాను అంతే! నిన్నందరూ ఆపద మొక్కులవాడని, ఆపదలో వున్న వాళ్లు మనసారా ప్రార్థిస్తే వచ్చి కాపాడుతావని అందరి నమ్మకం! మేమూ పాదయాత్ర ముగించుకుని వచ్చి మాల తీసే లోపల మా శ్రీహరికి మాటలు రాకపోతే నీ హుండీలో డబ్బులు వేసే విధంగా నీ హుండీలో వీడ్ని వేసేస్తాను. అప్పట్నించీ వాడు నీ సొత్తు. ఏం చేసుకుంటావో చేసుకో. ఆ రోజునుంచీ నేను నిన్ను పూజించను, నమ్మనూ..” అంటూ వీరావేశంగా మొక్కేసాడు.

సంగతి తెలిసి హయగ్రీవాచారి ఒక్కసారిగా షాక్కయ్యాడు. శేషాచలం దగ్గరకి పరుగెత్తుకుని వెళ్లి “ఒరే శేషూ ఏమిటర్రా ఈ మొక్కుబడి. హుండీలో ఒక్కరూపాయి వేస్తానని చెప్పి వెయ్యకపోయినా వడ్డీతో సహా రాబట్టుకొనే వడ్డీకాసులవాడు ఆ శ్రీనివాసుడు. ఆయనకి నీ కొడుకుని హుండీలో వేస్తానని మ్రొక్కుకున్నావు నీకేమయినా పిచ్చా?” అన్నాడు కోపంగా.

“లేదురా వాడికి నా మీద ప్రేమ ఉందో లేదో ఈ విషయంలో తేలిపోవాలి అంతే!” విరక్తిగా అన్నాడు శేషాచలం బయటికి వెళ్లిపోతూ!

‘ఆ ఏడుకొండలవాడు తప్పకుండా నీ కోరిక తీర్చాలి’ అని మనసులోనే ప్రార్థన చేసుకున్నాడు హయగ్రీవాచారి.

ఆఖరికి పాదయాత్ర చేసే రోజు రానే వచ్చింది. సమాజమంతా పాదయాత్ర చేసే వాళ్లతో, వారి బంధువులతో కిటకిటలాడిపోయింది. హయగ్రీవాచారి ముందు నడుస్తూ వుంటి భజన గోష్ఠి వెనక నగర సంకీర్తన చేసుకుంటూ పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడుగునా భజనలూ పురాణ కాలక్షేపాలతో హాయిగా గడిచిపోయింది. రెండు రోజుల తర్వాత తిరుమలలోని స్వామి వారి సన్నిధిని చేరుకున్నారు అందరూ.

‘గోవిందా.. గోవిందా..’ అంటూ దేవుని తనివితీరా దర్శించుకుని తమ తమ బాధలు స్వామికి చెప్పుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.

ఆఖరికి అదరూ సమాజానికి చేరుకున్నారు. యాత్రని నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని దేవునికి హారతిని ఇచ్చాడు హయగ్రీవాచారి. అంతలో “హయగ్రీవాచారీ” అంటూ గట్టిగా కేకపెట్టి “వాడు నా కొడుక్కి మాట ఇవ్వలేకపోయాడు. నేనైనా నా మాట నిలబెట్టుకోవాలి కదా! ఈ రోజు నుంచి నా కొడుకు ఈ గుడికే సొంతం! వాడ్ని వాడే చూసుకోవాలి. ఇక మీదట వాడికీ నాకు ఏ సంబంధం లేదు అంటూ గట్టిగా అరుస్తూ సమాజం గుమ్మం బయటికి కాలుపెట్టే సమయంలో “గోవిందా” అన్న శ్రీహరి పిలుపు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు శేషాచలం.

అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే “గోవిందా.. గోవిందా” అంటూ ఆనందంతో గంతులు వేయసాగాడు శ్రీహరి. హయగ్రీవాచారి కృతజ్ఞతలతో దేవుడికి చేతులెత్తి నమస్కరించాడు. కళ్లలోనించి కన్నీరు జలజలా కారుతుంటే!

Exit mobile version