Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెంటాడే వేదన – ఆకట్టుకునే దృఢ సంకల్పం – ‘వైలెట్స్’!

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా ‘వైలెట్స్’ అనే కొరియన్ నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సాహిత్యం ఎలా జనాదరణ పొందుతుందో చూసి ఒక పాఠకురాలిగా, నేను నిజంగా ఆనందించాను. స్త్రీ-పురుష సమానత్వం, కుటుంబ సంబంధాలు, ఆధునిక జీవితంలోని ఒత్తిళ్ల వంటి ముఖ్యమైన సామాజిక సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో అన్న విషయంపైనా, కొరియన్ సమాజం గురించి నాకు లోతైన అవగాహన కల్పిస్తున్నాయి ఈ కథలు. హాన్ కాంగ్ రచించిన ‘ది వెజిటేరియన్’, చో నామ్-జూ రాసిన ‘కిమ్ జియోంగ్, బోర్న్ 1982’ వంటి నవలలు శక్తివంతమైన కథలతోనూ, సార్వజనీన ఇతివృత్తాలతో నాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. ఈ పుస్తకాలు అంతర్జాతీయ గుర్తింపునీ, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందడం, సాంస్కృతిక సరిహద్దులను దాటి చర్చలను రేకెత్తించడం ఆశ్చర్యమనిపిస్తుంది.

కొరియన్ అనువాద సాహిత్యం విరివిగా అందుబాటులోకి రావటం మరింత ఉత్తేజం కలిగించింది, ఇది కట్టిపడేసే కథల ప్రపంచాన్ని మన ముందుకు తెచ్చింది. హ్వాంగ్ సోక్-యోంగ్ (‘త్రీ జనరేషన్స్ ఆఫ్ రైల్‌మెన్’), కిమ్ హే-సూన్ (‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ డెత్’), ప్యూన్ హై-యంగ్ వంటి రచయితలు వల్ల విభిన్న దృక్కోణాలలో కొరియన్ సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి నాకు వీలవుతోంది. కె-పాప్, కె-డ్రామాను ఆస్వాదించే వ్యక్తిగా, ఈ పుస్తకాలను చదవడం – కొరియన్ సమాజంతో మరింత గాఢంగా సంధానమయ్యే సహజ మార్గంగా అనిపించింది. కొరియన్ సాహిత్యం నాకు ప్రేరణనిస్తోంది, అంతర్దృష్టి కల్గిస్తోంది. దాంతో నా పఠనానుభవం నేను ఊహించిన దానికంటే మెరుగైంది.

Kyung-sook Shin

క్యుంగ్-సూక్ షిన్ రాసిన ‘వైలెట్స్’ నవల చదవడం చాలా కాలం పాటు నాలో ఓ చిరస్మరణీయ అనుభవంగా మిగిలింది. కొరియన్ భాష నుండి అంటోన్ హర్ ఈ నవలని ఆంగ్లంలోకి అనువదించారు. ఒంటరితనం, అణచివేతల నేపథ్యంగా, బంధాలని అన్వేషించే యువతి కథ ఇది. ఎవరికీ తీరిక లేకుండా, నిరంతరం రద్దీగా ఉండే సియోల్ నగరంలో తాను అదృశ్యంగా ఉంటున్నానని భావించే ‘ఓహ్ సాన్’ కథ ఇది. నవల ప్రారంభం నుంచే, నేను సాన్ ప్రపంచం నన్ను ఆకర్షించింది. ఆడపిల్లగా పుట్టడమే ఆమె పాపం, దాంతో తండ్రి ఆమెని వదిలేసిపోతాడు. ఇది భవిష్యత్తులో ఆమె అనుభవించబోయే ఒంటరితనానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ పుస్తకం ఆమె కష్టతరమైన బాల్యం గుండా మనలను నడుపుతుంది, మిత్రురాలు ‘నామే’తో స్నేహం ఓ బాధాకరమైన క్షణంలో ముగుస్తుంది. దాంతో యుక్తవయస్సులో సాన్ మానసిక వేదనని అనుభవించాల్సి వస్తుంది. సాన్ సియోల్‌కు వెళ్లి ఓ పూల కొట్టులో పనిలో చేరుతుంది. అక్కడ, ఆమె కనబరిచిన దృఢ సంకల్పం, సదా వెంట ఉండే తన ఒంటరితనంతో ఆమె వ్యవహరించిన తీరూ నాకెంతగానో నచ్చాయి.

సాన్ అంతర్గత పోరాటాలని, ఆమె లోతైన భావోద్వేగాలని రచయిత్రి క్యుంగ్-సూక్ షిన్ అందంగా తీర్చిదిద్దారు, సాన్ వేదన మనల్ని వెంటాడుతుంది. 1970లలో దక్షిణ కొరియాలో మహిళలు ఎదుర్కొన్న మానసిక ఆరోగ్యం, సామాజిక ఒత్తిళ్లతో షిన్ వ్యవహరించిన తీరు అభినందనీయం. నిరాశలోకి జారిపోతున్న సాన్ ప్రయాణం పట్ల, పువ్వుల కొట్లో మనశ్శాంతిని పొందేందుకు చేసే ప్రయత్నం పట్ల మనకు సహానుభూతి కలుగుతుంది. ముఖ్యంగా, సాన్‍కీ, ఆమె తోటి ఉద్యోగిని ‘సుఏ’కీ మధ్య ఏర్పడ్డ బంధం శక్తిమంతమైనది. ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ఉన్నప్పుడుల్లా, సాన్‍కి అన్నివిధాలా సాయం చేస్తుంది సుఏ. అవ్యక్త ఆశలు నిండిన వారి బంధం, ఈ నవలలోని మానవ సంబంధాల అన్వేషణకు బలాన్నిస్తుంది. కథ సాన్ గతంలోకి దారితీసినప్పుడు, పెరుగుతున్న ఆమె కోరికలను పరిశోధిస్తున్నప్పుడు – కథ స్వరం మారుతుంది. కోరికలు, వ్యక్తిగత నియంత్రణకి సంబంధించిన అసౌకర్యమైన నిజాలు స్ఫురించి నన్ను ఆలోచింపజేశాయి.

Anton Hur

నవల అంతటా రచయిత్రి వైలెట్‌లను (పువ్వులను) ప్రతీకలుగా ఉపయోగించడం నాకు బాగా నచ్చింది. ఈ సున్నితమైన పువ్వులు – సొగసుని, నిర్లక్ష్యాన్ని – రెండింటినీ సూచిస్తాయి, తనలాంటి స్త్రీలను తరచుగా విస్మరించే ప్రపంచంలో – సాన్ ఎదుర్కునే కష్టాలను ప్రతిబింబిస్తాయి. ఎదగడానికి అనువు కాని ప్రదేశాలలో వైలెట్ మొక్కలను నాటే సన్నివేశం నా మనసును తాకింది, అది తన ఉనికిని చెరిపివేయడానికి ప్రయత్నిస్తున్న సమాజంలో ఎదుగుదలనీ; గుర్తింపు కోసం ఆమె తపనను సూచిస్తుంది. కొన్ని చోట్ల నవల నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినప్పటికీ, ఈ గమనం సాన్ భావోద్వేగ స్థితికి దర్పణమని భావిస్తాను – వంకరటింకర మార్గంలో వెళ్తున్నట్టు తోచినా, ఆ గమనం అత్యంత స్పష్టతతో కూడి ఉంటుంది. సాన్ ఆలోచనల్లోకి లోతుగా వెళ్లేకొద్దీ కథనం మరీ బరువవుతున్నట్లు ఉంటుంది, అయితే ఇది ఆ పాత్రతో మరింతగా కనెక్ట్ అవ్వడంలో నాకు తోడ్పడింది.

సాన్ ప్రస్థానానికి ఒక రూపమిచ్చిన, పాఠకుల హృదయాలలో ప్రతిధ్వనించే అనేక కీలక అంశాలను ‘వైలెట్స్’ నవల ప్రస్తావిస్తుంది. వ్యథాపూరిత బాల్యంలోనూ, సామాజిక అంచనాలలో పాతుకుపోయిన భావాలైన – ‘ఒంటరితనా’న్ని, ‘వేరుచేయబడడా’న్ని లోతుగా అన్వేషిస్తుంది. ఇవి వ్యక్తి ఉనికిని, భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేస్తాయో నవల ప్రదర్శిస్తుంది. సాన్ అనుభవాలు దక్షిణ కొరియాలో ‘స్త్రీ  పురుష సమానత్వం, అస్తిత్వం’ చుట్టూ ఉన్న విస్తృత సమస్యలను ప్రతిబింబిస్తూ ‘పితృస్వామ్య సమాజంలో’ మహిళలు చేస్తున్న పోరాటాలను కూడా ప్రస్తావిస్తాయి. ‘మానసిక ఆరోగ్యం’తో, ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళనలతో సాన్ జరిపిన పోరుని; ఈ ఘర్షణలు ఆమె సంబంధాలను, ఆమె వ్యకిత్వాన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా ఈ పుస్తకం చెబుతుంది.

‘కనెక్షన్ మరియు డిస్‌కనెక్షన్’ (దగ్గరయి, దూరమవటం) అనే ఇతివృత్తం ఈ నవలకు కీలకం, ఎందుకంటే సాన్ ఏర్పరచుకున్న బంధాలు – ముఖ్యంగా ఆమె సహోద్యోగి ‘సుఏ’తో – వేరుచేయబడినప్పటికీ, అర్థవంతమైన బంధాల కోసం మనుషుల ఆరాటాన్ని చూపుతాయి. ఈ సంబంధాల ద్వారా, ‘ప్రేమ, స్నేహం’ ఎలా సహాయకారులుగా ఉంటాయో, ఎలా హాని చేస్తాయో ఈ కథ వెల్లడిస్తుంది. సవాళ్లతో నిండిన సాన్ ప్రయాణం, ఆమె ‘శక్తి’నీ; వేదన ఉన్నప్పటికీ సౌందర్యాన్ని కోరుకునే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది, క్లిష్ట పరిస్థితుల్లో వ్యక్తిగత ఎదుగుదల ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈ ఇతివృత్తాలు సాన్ కథను మాత్రమే కాకుండా –  ఒంటరితనం, గుర్తింపు, బంధాల కోసం సాగే అన్వేషణతో పాఠకులను తమ సొంత అనుభవాల గురించి ఆలోచించేలా చేసే కథను సృష్టిస్తాయి.

‘వైలెట్స్’ చదువుంటే, ఇటీవల చదవటం పూర్తి చేసిన జుంపా లాహిరి రాసిన ‘ది లోలాండ్’ గుర్తొచ్చింది. ఈ రెండు నవలలు భావోద్వేగపు ఒంటరితనం, సామాజిక ఒత్తిడి, నిజమైన బంధం కోసం తపించే ఇతివృత్తాలతో సాగుతాయి. ప్రధాన పాత్రలు -’వైలెట్స్’ లోని సాన్; ‘ది లోలాండ్’ లోని మహిళలు – కుటుంబం, ఇంకా ‘జెండర్ ఎక్స్‌పెక్టేషన్స్’ ఆధారంగా ఏర్పడ్డ నిర్బంధ వాతావరణంలో తమదైన ఉనికిని కనుగొనే సవాలును ఎదుర్కొంటారు. రెండు పుస్తకాలు – మానసిక ఆరోగ్య పోరాటాల – భావోద్వేగ ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తాయి, అణచివేత, నిర్బంధకాండల భారం వారి సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. రెండు నవలలూ విభిన్న సంస్కృతుల నేపథ్యంలో సాగినప్పటికీ – వ్యక్తిగత ఎదుగుదలని, దేన్నైనా తట్టుకునే సామర్థ్యాన్ని, ఇంకా జీవితంలోని అడ్డంకులను ఎదుర్కోడానికి అవసరమైన దృఢ సంకల్పాన్ని చక్కగా అన్వేషిస్తాయి.

చివరగా, ‘వైలెట్స్’ కేవలం ఒక మహిళ సంఘర్షణల కథ కంటే ఎక్కువ. ఇది మారుతున్న సమాజంలో స్త్రీపురష భేదాలు, వర్గం, అస్తిత్వాల – హృద్యమైన అన్వేషణ. క్యుంగ్-సూక్ షిన్ అందమైన, హృదయ విదారకమైన కథను సృష్టించారు, సాన్ పరిస్థితి నాకు బాధను కలిగించినా, నిశ్శబ్ద ప్రపంచంలో తమ స్వరాలను కనుగొనగలమనే ఆశను భవిష్యత్తు తరాల మహిళలకు కల్గిస్తుంది. సామాజిక నిబంధనలను సవాలు చేసే; దుర్బలత్వం వెనుక ఉండే దృఢ సంకల్పాన్ని వ్యక్తీకరించే ఆత్మపరిశీలనాత్మక సాహిత్యాన్ని (introspective literature) ఆస్వాదించేవారు ఈ నవల తప్పక చదవాలి.

***

Book Title: Violets
Author: Kyung-sook Shin
Translated By: Anton Hur
Published By: Feminist Pr
No. of pages: 212
Price: ₹ 1,374/-
For copies:
https://www.amazon.in/Violets-Kyung-Sook-Shin/dp/1558612904

Exit mobile version