Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విపత్తుల కాలం..!

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘విపత్తుల కాలం..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

లోకానికి వెలుగుల ఆరంభం
అంతులేని జీవన యానానికి ఆహ్వానం
నిన్నటి గాయాల వలపోతలన్నీ
వెచ్చని స్పర్శతో ఎగిరి పోతున్నాయి
ఎవరెన్ని చెప్పినా కానీ
భరోసాతోనే దుఃఖాలు కుదుటపడుతాయి..!

దూర తీరాలనుండి తరలివస్తున్న
కాంతి కిరణాలు మన ఆత్మ బంధువులు
ఆకర్షణీయమైన నీటి రంగులతో
పలకరిస్తున్న మబ్బుల ఆత్మీయతలకు
కఠినమైన మాటలు మటుమాయమై
తనువంతా నిలువెల్లా పులకరిస్తుంది..!

దుర్బలత్వంతో తులనాడడం కొత్త కాదు
దీనావస్థల అవస్థలకు చివరంకం లేదు
దయనీయమైన కథనాలకు కొదవలేదు
మట్టి బంధాలు పలుచబరుతున్నాయి
మానవీయపు కరచాలనాలు కరుగుతున్నాయి
విపత్తుల కాలంలో విలవిల్లాడుతున్నాం..!

నదులు కొండల మధ్యన సంచరిస్తూ
ఆహాకారాల ఆర్తనాదాలు వింటూ
పట్టు వదలని సంకల్పాలతో
ఎగుడు దిగుడు ముళ్ళ దారిని
దట్టమైన అడవులను, లోయలను దాటుతూ
రగిలిపోతున్న విశ్వగోళాన్ని తిలకిస్తున్నాం..!

నేలంతా విస్తరించిన అశాంతి
రక్తపు టేరులతో మొలకెత్తిన వ్యత్యాసాలు
యుద్ధపు విలయతాండవ దృశ్యాలు
అత్యాచారల అంతంకై మోగిన నగారా
కదులుదాం ఒకరికి ఒకరం తోడుగా
కపటపు వాగ్దానాలను పెకిలించి వేద్దాం..!

ఊహల ప్రపంచానికి సరిహద్దులు లేవు
అధికార దాహానికి అడ్డుదారులే దిక్కు
అంధకారంలో అంతరంగం అతలాకుతలం
కలిమిలేములతో మానవలోకం సతమతం
కల్లోల భరితమైన జీవనానికి పాతర వేస్తూ
పదండి ముందుకు వసంతగానం కోసం..!

Exit mobile version