‘ప్రపంచ శాంతి దినోత్సవం’ సందర్భంగా, 21-9-2025 తేదీన ‘వి.సా.1971’ ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకానగర్ లోని, బి.వి.కె. కళాశాలలో ప్రముఖ రచయిత కీ.శే. అంగర వెంకట కృష్ణారావు ‘విరామం’ నవలకు, హిందీ సాహిత్యకారులు డాక్టర్ నిర్మలాదేవి చిట్టిళ్ల హిందీ అనువాదం ‘విరామ్’ ఆవిష్కరణ సభ జరిగింది.
ప్రముఖ రచయిత మల్లాప్రగడ రామారావు తమ అధ్యక్ష ప్రసంగంలో కృష్ణారావు ఏ ఆశయాల సాధనకు 1971లో ‘విశాఖ సాహితి’ స్థాపించారో, ఆ దిశగా కృషి చేసేందుకే ‘వి.సా.1971’ 2022లో తొలుత ఒక వాట్సాప్ బృందంగా ప్రారంభమై, ఈ పుస్తకావిష్కరణ సమావేశంతో ఒక సంస్థగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు.
ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేసిన నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి. బాలమోహన్ దాస్ రెండు ప్రపంచ యుద్ధాల బీభత్సం తర్వాత కూడా ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోలేదని, ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా 56 చోట్ల సాయుధ సంఘర్షణలు జరుగుతున్నాయని, ఆనాడే “యుద్ధమే యెల్లప్పుడూ సాగేది. శాంతి ఒక ‘విరామం’ లాంటిది” అని ‘విరామం’ నవల ‘ముందుమాట’ లో కృష్ణారావు నిర్ధారించడం విశేషమన్నారు. మేధావి, వినుతికెక్కిన పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు ‘విరామం’ పుస్తక సమీక్షలో “అంతవరకు యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన అన్ని నవలలోకి ‘విరామం’ ఉత్తమమైనదని, సాధాకారికమైనది” అని, తేల్చారని గుర్తు చేసారు.
ప్రముఖ హిందీ సాహిత్యకారులు డా. ఎస్. కృష్ణబాబు తమ ఆత్మీయ భాషణంలో, తెలుగు సాహిత్యం ఇతర భాషలోకి ఇంకా ఎక్కువ అనువాదం కావల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధ దుష్పరిణామాలను ప్రతిభావంతంగా చిత్రించిన ‘విరామం’ నవలను సమర్థవంతంగా హిందీలోకి అనువదించిన తమ శిష్యురాలు నిర్మలా దేవిని అభినందించారు.
‘విరామ్’ తొలి ప్రతి స్వీకరిస్తూ, అంగర కృష్ణారావుగారి పుత్రిక శ్రీమతి వెంకట రమణి వారి తండ్రితో చిన్నప్పుడు వంగరాష్ట్రంలో గడిపిన రోజులు స్మరించుకున్నారు. ‘విరామం’ హిందీలోకి అనువదించిన డాక్టర్ నిర్మలా దేవికి, ప్రచురణ బాధ్యత తీసుకున్న ‘వి.సా.1971’ కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రసిద్ధ రచయిత్రి, అనువాదకురాలు, ఆచార్య పి.కె. జయలక్ష్మి తమ పుస్తక సమీక్షలో “ద్విభాషా సాహిత్యకారిణిగా ప్రసిద్ధి పొందిన డా. నిర్మలాదేవి ‘విరామం’ నవలలో ప్రతిబింబించిన ద్వితీయ ప్రపంచ యుద్ధం, బంగాల్ కరువు, సామాజిక–ఆర్థిక సంక్షోభాలను, మానవ సంబంధాల లోతును హిందీ భాషలో సహజంగా, సరళంగా, సజీవంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం” అని అన్నారు.
రచయిత్రి డా. చిట్టిళ్ల నిర్మలాదేవి తమ స్పందనలో, ‘విరామం’ నవల అనువాదం మూల విధేయంగా ఉంటూనే, హిందీ నుడికారాన్ని దృష్టిలో పెట్టుకుని చేసానన్నారు. అనువాదాల ఆవశ్యకత తెలిపి, తనను ఆ దిశగా నడిపిస్తున్న తమ గురుదేవులు డాక్టర్ కృష్ణబాబుకి, హిందీలో ‘విరామం’ అనువదించడానికి అనుమతించిన శ్రీమతి రమణికి, పుస్తక ప్రచురణకు పూనుకొన్న శ్రీ మల్లాప్రగడ రామారావుకి ధన్యవాదాలు తెలియజేసారు.
పలువురు సాహిత్యకారులు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభా ప్రారంభంలో రచయిత, సమావేశకర్త ఘండికోట విశ్వనాధం స్వాగత వచనాలు పలికారు.

