Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విరుల విలాపం

[నెల్లుట్ల సునీత గారు రచించిన ‘విరుల విలాపం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

అలజడిని మోస్తున్న పూల మీద
సారించిన చూపులోంచి
నేల రాలుతున్న దృశ్యం

పూల జీవిత యాత్రలో
మొగ్గయి పుట్టి పువ్వుగా
వికసిస్తున్నప్పుడు
పెనుగాలుల దాడిని తట్టుకొని
విరిసే పరిణామ క్రమం గోచరిస్తుంది

రాలిన పూల సోయగంలో
జీవితానుభవాల పరిమళ
గుబాళింపుల దరహాసం
వినిపిస్తుంది
కంటకాల్లో విరిసిన సౌందర్య
కోమలం వెనక
వివర్ణమైన విలాపాల తలపోతలు
కనిపిస్తాయి

వర్ణాల లేపనాల్ని అద్దుకుని
ఎన్నో మండుటెండలకు
వసివాడి శోకదగ్ధమైన కంఠశోషలో
జీవిత పరమార్థం
జడివానలకు తడిసి ముద్దవుతున్న
పూలలో జీవన భావనలు
కనిపిస్తాయి

క్షణికమైన ఊపిరితో
తనువులు చాలిస్తున్నా
ఎప్పుడు దిగులు వర్ణాల్ని
కప్పుకోని
తృప్తిని దర్శించవచ్చు

కర్కశంగా కోసే కసాయి
పరిమళం పంచే
వాటి కన్నీటి చెమ్మ ఎప్పటికీ తాకదు
హృదయం పూరేకులా వికసించి
మనసు లోతుల్ని తడిమితేనే
పూల వెతలు అవగతమయ్యేది

Exit mobile version