Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశేషశేముషీ దురంధరుడు శేషప్ప

[శ్రీ కాకుత్థ్స శేషప్ప కవి గురించి డా.  కొర్లగుంట సాయి ప్రసాద్ రచించిన వ్యాసాన్ని అందిస్తున్నాము.]

శతనమస్సులు కాకుక్థ్స శేష కవికి:

శ్రీ కాకుత్థ్స కవి రచనాచాతురిని ప్రశంసిస్తూ, నేను వ్రాసిన సీస పద్యమాలికతో ఈ వ్యాసాన్ని ప్రారంభిస్తాను

సీ.॥
కాకుత్థ్స శేషప్ప కవనమాధుర్యంబు
తెనుగు వారల నోట తేనెఊట
ఉగ్రుడౌ స్వామికి అగ్రభక్తుడతడు
పద్యాలు రచియించె హృద్యముగను
సూటిగా సులభంగ తేటమాటల మీటి
మోక్షమార్గమ్ము సూచించె ముదము తోడ
జీవునే శివునిగా చిత్తాన తాదల్చి,
అద్వైతమునునేర్పె ఆంధ్రులకును
అదరు బెదరులేక ఆ ఉగ్రస్వామిపై
నిందాస్తుతులజేసె నిర్భయముగ
విశ్వేశ్వరుని తల్చి వివశుడై పోయాడు
తాదాత్మ్యతను చెందె తన్మయతతొ
తనవశుడైనట్లు, తనవాడె అయినట్లు
తలచిస్వామిని సదాకొలిచినాడు
అలఘు విషయాల అలతి పదాలతో
అభినవపోతనై అల్లినాడు
పరమాత్మ జీవాత్మ భాషణ వలెనుండు
కాకుత్థ్స వంశజు కవనశైలి.
తే.॥
ఇతని కవితల వెలసిన యింపుసొంపు
జ్ఞానిగాసేయు పరమ సామాన్యునైన
శతక వాఙ్మయ నభవీధి చారుతార!
శతనమస్సులు నీకుయో శతకశ్రేష్ఠి!

శతక సాహిత్యము తెలుగు భాషకున్న ప్రత్యేక ప్రక్రియా విశేషం. సంస్కృత, కన్నడ భాషల్లో ఇట్టి రచనలున్నా తెలుగు శతకాలకున్న ప్రత్యేక ప్రజాదరణ అసామాన్యము.

వేమన, సుమతి, కృష్ణ శతకాలవలె తెలుగునాట ప్రతి నిజమైన తెలుగువాని నోట అలవోకగా పలుకబడిన అలతి పదముల మూట శ్రీ శేషప్ప విరచిత లక్ష్మీనరసింహస్వామి శతకము.

వాఙ్మయ  విమర్శనాధురీణుడు శ్రీవల్లరామకృష్ణకవి శేషప్పకవి క్రీ.శ.1730-1825వ జీవించెనని, నందికుల సంజాతుడని తెలిపినారు. వంగూరి సుబ్బారావుగారు తన శతకకవి ‘జీవితగ్రంథము’లో కూడ ఈ విషయమే వక్కాణంచిరి. శ్రీ  బసవరాజు నరేంద్రగారు కూడ బలపరిచారు. ప్రముఖ శతకకారుడు శ్రీ కాకుత్థ్స నరసింహదాసు శేషప్పకు మనుమడు. గంగమ్మ శేషప్ప సహోదరి.

1976లో పదవ తరగతి విద్యార్థుల నిస్వార్థ కృషితో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రధాన మరియు ప్రవేశ ద్వారాల నడుమ శేషప్ప గారి దివ్యమంగళ విగ్రహం ప్రతిష్ఠింపబడింది. మెడలో తంబుర, చేతిలో చిడత, నెత్తిన భిక్షాపాత్రతో ఈ విగ్రహం కడుంగడుసొంపుగా, కనులకు ఇంపుగా ఉన్నది.

ఆయనది కటిక దారిద్ర్యంపు కడగండ్ల బ్రతుకు. సంవత్సరానికి మూడు రూపాయల వేతనంతో ‘దీపరక్షకుడు’గా నియమింపబడినారు. ఆ జీతభత్యాలు కూడ సమయానికి అందక, కుటుంబపోషణ గగనమైపోయింది- అందుకే “కువలయశ్యామ! నీ కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట జెప్పవైతివని” స్వామిని నిలదీశాడు. ‘కూటికోసము నేకొరగాని జనులచే పలుగద్దరింపులు పడగవలసె’నని వగచినాడు. “తిరుపతిస్థలంబున తిన్నగానేనున్న” అను పద్యంలో కూడ విచారించినాడు.

స్వామి ఆభరణ అలంకరణావైభవాన్ని కమలారగా చూస్తూ, తనివి తీరకీర్తిస్తూ; దురిత దూరాయని సంబోధిస్తూ వర్ణించిన ‘ద్విపాద పద్యమకుటం’లో శేషప్ప పాండితీ ప్రాభవం ప్రస్ఫుటం.

ఈతని కవితా సరస్పులో ఈక్రింది విలువైన కలువలు విరిశాయి:

నరహరి శతకం, ధర్మపురి రామాయణం, శ్రీ నృకేసరి శతకం, అవనిజాచరితము.

ధర్మపురి రామాయణమన్నది వచనరహిత యక్షగానము. ఇందులో 252 పాటలు, 34 రకాల రాగాలు, 110 ద్విపదులు, 290 తేటగీతులు, 27 సీసపద్యాలు, 67 కందాలు ఉన్నాయి. గ్రామీణులకు ఇవి గానమకరందాలు.

శేషప్ప కవితావైభవమే కాదు, పద్యచాలనా వైదుష్యము, భక్తి భావప్రకటనావైవిధ్యము, లలిత పద బంధ వైశిష్ఠ్యము అమోఘము, అద్భుతము. తాను ఉద్దండ పండితుడ కానని పద్యంలో వక్కాణించినా, తన విద్వత్తుతో సామన్య జనహృదయాలలో తత్వమయ విద్యుత్తు వెలిగించిన విశేషశేముషీ దురంధరుడు శేషప్ప.

ఈ పద్యాలను భావస్ఫోరకంగా, రాగయుక్తంగా పాడితే ఆబాల గోపాలం నోట భక్తిరసమయగీతాలయినాయి.

ఈతని కవిత రమణీయము, కమనీయము, అభినందనీయము, ప్రతిదిన పఠనీయము, భక్తజనాళి అనుదిన ఆచరణీయము, ఆ భగవంతునికి హర్షణీయము.

సమాజ హితాన్ని కోరి, స్వానుభవంతో, నిజజీవిత సామాజిక నగ్నసత్యాలను జోడించి, సామెతలను దట్టించి, పద్యసేద్యము చేసిన కృషీవలుడు శేషప్ప.

తాత్విక చింతనతో బాటు, సామాజిక సమస్యలనూ తన రచనల్లో స్పృశించినాడు, అవకతవకల్ని అభిశంశించినాడు; అవినీతియని ఆక్రోశించినాడు.

“అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి” అని ఆనాటి ఆయన పలుకులు నేటికీ ప్రత్యక్షరసత్యాలు.

‘కులవిచక్షణ’ యంటే ఈతనికి ఈసడింపు. అందుకే “వ్యాసుడే కులమందు వాసిగా జన్మించె; విదురుడే కులమున వృద్ధి చేసె.. నీ కృపాపాత్రులకు జాతి నీతు లేల?” అని ప్రశ్నించినాడు. సర్వకులాలను సమదృష్టితో చూడాలన్నది కవి భావన.

ఈతని రచనలో ‘అధిక్షేప పద్యాలు’ ఎక్కువ. దానికి తోడు ‘నిందాస్తుతి’. ‘ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చె’; ‘వాంఛతో బలిచక్రవర్తి పంచనజేరి’, ‘బిచ్చమెత్తితివేల బిడియపడక’ అను పద్యాలు ఈ ఒరవడికి మచ్చుతునకలు. అహంబ్రహ్మాస్మియని తలచి అదరు బెదరులేక ఉగ్రనరసింహునితో వాగ్వాదమునకు దిగుట ఈయన కవితలోని విలక్షణత, విశిష్ఠత. తిడితేనే బాగా చూస్తాడని, నిలదీస్తే విలువ ఇస్తాడని ఈ కర్మయోగి నమ్మకం. ఇది పొగడ్తకు తెగడ్తకు తేడా తెలియని అద్వైతం, ఆత్మసంతర్పణం; ఆవిశ్వేశుతో సంయోగం.

ఆయన ఆర్తి, అలగడం, నిందాస్తుతి చేయడం, మరలా క్షమించుమని ప్రాధేయపడటం లాంటి అపూర్వ దృశ్యాలు కళ్లకు కట్టినట్లుగా అక్షరగవాక్షాల్లో కనిపిస్తుంటాయి.

స్వామిని సంబోధించడంలో మృదులత్వము, కాఠిన్యము, బెదరింపు, హుంకరింపు, ప్రకోపప్రదర్శన, ఆ వెంటనే బుజ్జగింపు – ఈ లక్షణాలతో కవి భక్తి భావనా స్వాతంత్ర్యము ప్రకటించినాడు. జీవితమంతా స్వామితో గడిపినందున, ఆయనతో అంత చనువు. స్వామికి ఇది సంతోషమే! ఇద్దరిమధ్య విశ్లేషణకందని విశిష్ఠ అవినాభావ సంబంధము. అది అనుభవైకవేద్యము. మృదు మధుర భక్తి సంభరితము. పాఠకులకు పరమాన్నసమం. లేకపోతే “తెగబడితి చూడు నీతో జగడానికి” అని ఉగ్రనరసింహునితో అనడానికి ఎంత తెగువ ఉండాలి? అంతమాట జన సామాన్యము అనగలదా?

పరమేశుడు తన వశుడైనట్లు, తనవాడే అయినట్లు, తన్మయత్వంతో జీవాత్మాపరమాత్మ తాదాత్మ్యమ చెందే సంధిసమయంలో పలికిన పలుకులివి. కుటుంబపెద్దను పిల్లలు చనువుతో పలకరించెడి వైనమిది. ఈ స్థితికి చేరాలంటే భక్తుడు బాహ్యము మరచి అంతర్ముఖుడై పోవాలి. అనంత భక్తి పారవశ్యంతో అలసి పోవాలి.  పరమాత్మ పరిపూర్ణ పరిష్వంగనా  సౌఖ్యాన్ని స్వప్నీకరించుకోవాలి.

నిందాస్తుతి వక్రోక్తికాదు. అది ఒక వైచిత్రి. కష్టమైన సమాసాలు, క్లిష్టమైన పదబంధాలు, కాకుక్థ్సుల వారి కలానికి గాని, కంఠానికి గాని అచ్చిరావు. నచ్చుకోవు. అలతి పదాలతో అనంత అర్థాలను అలవోకగా మేళవింపగల అసాధారణ రచనాసత్వము, సత్యాన్ని నిర్భయంగా చెప్పగలతత్వము అతనికి కొట్టిన పిండి. కవితాధార ప్రశస్త పవిత్ర గోదావరి ప్రవాహంలా పరుగులు తీసింది. భక్తి పారవశ్యము ఉరకలేసింది. ఎన్నిసార్లు పఠించినా, ఇంకొక్కసారి చదవాలనిపించే ఇంపు, సొంపు, గుబాళింపు ఈయన పద్యాలలో ఇమిడి ఉంది.

శతక కవుల్లో జ్వలన్మూర్తి అయినా, తాను ఉద్దండపండితుడను కానని సవినయంగా ప్రకటించిన సౌమ్యుడు ఈ కవి.

ఆయన పద్యాలు ప్రక్కవాద్యాలు లేని పాట కచేరీ; పరుగులు తీసే గోదావరి; అక్షర రూపాన కురిసిన అమృతఝరి; ఉత్సాహం నింపే ఊపిరి; భక్తజనానందలహరి.

అన్నీ సమృద్దిగా ఉన్న నీకు నేనేమియ్యగలనని తర్కంతో దైవాన్ని తనవాడిగా చేసుకున్న ధన్యుడు, భక్తమూర్థన్యుడు, మాన్యుడు ఈ శతక సాహితీ సామ్రాజ్య చక్రవర్తి.

Exit mobile version