[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘విష పన్నాగం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్షరం నేర్చి నేటి సమాజం
మరీ అనాగరికమవ్వడం శోచనీయం.
విజ్ఞానం వంటబట్టని
ఆ పురాతన సమాజమే నయమనిపిస్తూ!
విద్యలేని వాడు వింత పశువా?..
ఉన్నత విద్యనభ్యసించి..
పశువుకన్నా హీనమైన ఈ విద్యాధికులా?
రాక్షస ప్రవృత్తికిది పరకాష్ట కదా!
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు
ఉసురులు తీసే అసురులుగా మారడం!
మతం పేరిట మారణహోమాలకు తెగబడడం!
భరతమాతకు ఆజన్మ శాపమేమో?
ఈ గర్భ శోకం.. పాపం..!
తనని అమ్మగ సమ్మతించని
కుపుత్రుల కుతంత్రాల మాటున
బలవుతున్న సుపుత్రుల సాక్షిగా!
దాయదుల పంచన చేరిన నయవంచకులు
పాలు తాగి రొమ్ము గుద్దే కృతఘ్నతా ఖలులు
అడుగడుగున మాటు వేసిన ఆ విష సర్పాలు
భరతమాత బాటలో పరుచుకున్న కంటకాలు!
పైశాచికత్వం వేయి తలల పన్నగంలా
రెసిన్ విషాన్ని విరజిమ్మగా ఎత్తిన
కుత్సిత పడగల దుర్మార్గాన్ని పసిగట్టిన
భరత మాత అనుంగు పుత్రులు వారు
వీర జవానులు.. ఈ జాతికి రక్షకులు..
వారికివే నా కృతజ్ఞతాభివందనములు!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు, 100 కవితలు రాశాను.
