Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విషాద యశోద-3

[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

చం.
నిను గొని తెచ్చి నా కడుపు నీడన నాడు పరుండ బెట్టినా
రనుచును క్రొత్త క్రొత్త కథలల్లుచు నుండి రదెంత సత్యమో?
అనుటకు వారికెట్లు మనసన్నది యొప్పెనొ గాని, యద్దియున్
వినుటకు నా మనస్సు మరి వీసము సైతము నొప్పదాయెరా! (16)

సీ.
“దేవకీ వసుదేవ దివ్య దంపతులకు
అష్టమ గర్భమై యవతరించ –
మామయౌ కంసుడే మట్టుబెట్టు ననుచు
వసుదేవుడే యంత భయమునొంది,
నిను బుట్టలో బెట్టి నిశ చిమ్మ చీకటిన్,
కుండ పోతగ వాన కురియుచుండ –
నతి రహస్యంబుగా నరిగి బృందావని,
చేర్చె నా కడ” కంచు చెప్పుచుండ్రి!
తే.గీ.
నవ్వనా? ఏడ్వనా? నమ్మనా? మరి యిక
నమ్మలేనని, గుండెను నాటుకొన్న
మాతృ ప్రేమ కన్నీళ్ళుగా మార్చి, కార్చి,
పిచ్చి చూపులు చూడనా? వేణు లోల! (17)

ఉత్సాహము.
నేటి మాట కాదు! పదియు నేడు వత్సరాల యా
నాటి నుండి తలచుకొనిన నాదు కనుల లోపలన్
మేటి దృశ్యము లవి వరుస మెదులు! – పాలు ద్రాపెడిన్
నాటి నుండి నేటి వరకు నాటుకొన్న బంధమున్!! (18)

మ.
క్షణమైనన్ విడకుండ, స్నానమిడి, పై సామ్రాణియున్ బట్టుటన్;
చనుబాలిచ్చియు బొజ్జ నింపుట; రసాస్వాదంబుగా జోల పా
టను గానంబొనరించి, యూయల పరుండంబెట్టుట న్నిట్టు లా
చిననాట న్నిను గుండె కద్దుకొని, చేసిందెల్ల నే తల్లియో? (19)

కం.
ముద్దుగ నీ రూపమ్మును
దిద్ది, మధుర వేణు గాన దీప్తిని నీలో
యద్ది, ముదుముద్దు పలుకు
లొద్దికగా నేర్పి, ముద్దులుంచిన దెవరో? (20)

కం.
బుడిబుడి యడుగుల నడకలు
వడివడిగా నేర్పి, జున్ను పాలన్, వెన్నన్
తడవ తడవకున్ తినిపిం
చెడి దాన – నిపు డవియెల్ల చెదరిన కలలో? (21)

కం.
వలదని యెది వారించిన,
నలిగెడి వాడవయ! అప్పు డలుకను దీర్చన్ –
పలు విధముల బ్రతిమాలుచు
నిలువెల్లయు నీరసించు నీ యమ యెవరో? (22)

ఆ.వె.
కథల నెన్నొ చెప్పి, గలగలా నవ్వించి,
ఆటలాడి, కలసి పాట పాడి,
చిలిపి చూపులు చూడ – చేర్చి కౌగిట నిన్ను
తన్మయత్వమందు తల్లి యెవరొ? (23)

తే.గీ.
ఎంత ముద్దాడిన, తనివి యెంత మాత్ర
దీరక, మరల మరల ముద్దిడి, యటుపయి –
“దిష్టి తగులునేమో!” యని దిష్టి తీసి,
దేవుని మనమందున మ్రొక్కు దీన యెవరొ? (24)

ఉ.
ఇంతకు నింత నీ వెదిగి యెన్నియొ బుద్ధులు, క్రొత్త విద్దెలన్
వింతగ జూపినంత – మది విస్మయమొందుచు ప్రేమ పొంగుచు
న్నంతకు నంతయున్ పదిలమాయె మహోన్నత పర్వతం బటున్!
చింతను గూర్చ కిప్పుడిక – ఛిద్రమునౌ హృదయమ్మె! ఆత్మజా! (25)

(సశేషం)

Exit mobile version