Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విషాద యశోద-5

[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

కం.
ఒకటా? రెండా? ఎన్నియొ
ప్రకటంబగు స్మృతులవెన్నొ పరిపరి విధముల్!
అకటా! ఎట్టుల మరతువొ?
ఇక తిమిరమె నాదు బ్రదుకు! ఎక్కడ కాంతుల్ ? (36)

ఆ.వె.
నాకు వోలె నిన్ను నవ్వించి, మెప్పించి,
గారవమును జేసి కరుగు తల్లి
విశ్వమెల్ల తిరిగి వెదికినన్ దొరుకునా?
వదులుకొనగ నీకు హృదియె గలదె? (37)

కం.
అసలే తుంటరివి! యచట
మసలు దెవరి తోడ నెట్లొ ? మరి పోట్లాటన్ –
రుసరుస లాడెడి పడతుల
పస దింపగ వాదులాడి, పంపితి మును నేన్! (38)

ఆ.వె.
ఇప్పుడచట నెవ్వ రిట్లు గాచెదరు నిన్?
“తల్లి చాటు బిడ్డ” తలపు లేదొ?
ఎల్ల ముదిత లవని నిట్లు రాణింతురా?
నేను లేని వెలితి నీకు తెలియు! (39)

ఆ.వె.
పిచ్చి దాన నేను – పెద్దవాడవయితి
వన్న సత్యమింక నరయనైతి!
నీకు నీవె రక్ష నిచ్చుకొందువొ? ఏమొ?
ఇంక నా యవసర మేమి నీకు? (40)

ఆ.వె.
ఏల తిరిగి రావు? ఏమైన నా చేత
తప్పు దొర్లెనేమొ చెప్పు నాన్న!
ఇంత కోప మేల? ఏకాకి నను జేసి,
ఏలుచుంటి వచట నే పురముల? (41)

కం.
ఏటికి కోపము తండ్రీ!
చీటికి, మాటికి యలుగుచు చిరు కోపముతో
మాటాడుట మానెద, వీ
మాటిటు లదియెల్ల విడచి, మరి యీ శిక్షా? (42)

శా.
ఏమో? నాడటు గోపభామలు కసి న్నేవేవొ కొండెంబులన్
నీ మీదన్ తెలుపంగ నమ్మి, నిను దండింపంగ నే బూనితిన్!
ఆ మొత్తంబున కిన్ని నాళ్ళుగ మది న్నంతంతకున్ కోపివై –
నీ మాత న్నిటు నీవు గూడ మరి దండింపంగ భావించితో? (43)

చం.
ఒకపరి మన్ను తింటివని యుగ్రముగా కనుగ్రుడ్ల నుర్మితిన్ –
ఒకపరి వెన్న దొంగవని యుట్టిని యందని నెత్తు నుంచితిన్ –
ఒకపరి కల్లలాడు టది యొప్పక, రోటను కట్టి వేసితిన్ –
సకల విధాల నీవిటు ప్రశాంతిని కోల్పడునట్లు చేసితిన్! (44)

కం.
ఎంతటి పాపిష్ఠిని! నా
కంతకు నంతయును శిక్ష లర్హమె! కానీ,
ఇంత కఠినమగు శిక్ష వి
ధింతువనుచు సుంతయైన నెరుగక పోతిన్! (45)

(సశేషం)

Exit mobile version