Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విషమ ఘడియలు

[శ్రీమతి అక్షర రాసిన ‘విషమ ఘడియలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

 చాలాకాలం క్రితం  జరిగిన సంఘటన ఇది.

ఇప్పటికీ   జరిగిన ఒకొక్క  క్షణం నా మెదడు పై ముద్ర వేసినట్టు గుర్తుండిపోయింది.

ఆ రోజు మా కాలేజ్ వార్షికోత్సవం. చాలా రోజుల నుండి ఎంతో కష్టపడి సన్నాహాలు చేసుకుపోతున్నాము.  ఆ రోజు బాగా పని ఎక్కువ అయి, మొత్తం కార్యక్రమం ముగిసి, కాలేజ్ లెక్చరర్‌గా నా బాధ్యత నిర్వహించి, బయట పడేసరికి పొద్దు వాలి పోయింది.

పార్కింగ్‌లో నుంచి కారు తీసి ఇంటికని దారి తీశా. ప్రతి రోజు కారు డ్రైవ్ చేసుకుని కాలేజ్‌కి రావటం, ఇంటికి వెళ్ళటం నాకు కొట్టిన పిండే అయినా, చీకటి పడ్డాక డ్రైవ్ చేయటానికి ఇప్పటికీ జంకే.

ఒకొప్పుడు కొన్ని పరిస్థితుల్లో తప్పదు కదా. అలాగనే ఆనాడు మామూలు కంటే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ మెయిన్‍ రోడ్‌పైకి వచ్చి యథాలాపంగా రియర్ వ్యూ మిర్రర్ లో చూశాను. నా కారుకి కొద్ది దూరం లోనే ఒక ఎర్ర ఫియెట్ లైట్స్ కనిపించాయి. దాని వెనక మరి ఎన్నో వాహనాలు ఉండటం వల్ల అప్పుడు అంత పట్టించుకోలేదు నేను.

దూరం పెరుగుతున్న కొద్దీ నా వెనకా ముందు వాహనాల సంఖ్య పల్చబడింది, మరెన్నో వాహనాలు నన్ను దాటుకుని వెళ్ళిపోతున్నాయి కానీ నా వెంబడి వస్తున్న ఎర్ర ఫియెట్ మాత్రం అంతే దూరంలో వెంటాడుతున్నదని గ్రహించిన క్షణం ఏదోలా అనిపించి ఒక్కసారిగా ఒళ్లు ఝల్లుమన్నది.

ఆ కారు డ్రైవ్ చేస్తున్నవ్యక్తి ఒకవేళ మా పరిచయస్థుడేమో అన్న అనుమానమూ రాకపోలేదు. అలా అయితే కనుక నేను కారు మెల్లగా నడుపుతున్నప్పుడు, పక్కకి వచ్చి ‘హలో’ అని పలకరించ వచ్చును కదా?

‘చీకటి పడ్డాక కారు డ్రైవ్ చేయటానికి ఉత్తప్పుడే భయపడుతున్న దానికి ఈ కొత్త బెడద ఏమిటి దేముడా’ అనుకున్నా.

చవకగా వస్తుంది కదా అని ఊరికి ఇంత దూరం పెద్ద విల్లా కట్టిస్తునప్పుడు, ఇందుకే మా వారితో అనేక సార్లు మోర పెట్టుకున్నాను. “పర్వాలేదులే. త్వరలో ఊరు పెరిగి మన ఇంటి దాకా వస్తుంది” అంటూ నా అభ్యర్థనని తోసి పుచ్చారు.

మా ఇల్లు చేరాలంటే కనీసం ఇంకా ఆరు కిలోమీటర్లు దాటాలి. కంగారు ఎక్కువయి పదే పదే  నా కారు వేగం హెచ్చిస్తున్నప్పుడల్లా ఆ ఫియెట్ కూడా వేగం పెంచుతోంది. ఎన్నిసార్లు సైడ్ ఇచ్చినా కానీ నా కారుని దాటి ముందుకు పోవటం లేదు.

‘ఇదేం ఖర్మ రా దేముడా’ అనుకుంటూ చేసేది లేక డ్రైవ్ చేస్తూ పోతున్నాను. మనసులోని భయం మెదడుని ఆక్రమిస్తోంది. బాగా తెలిసిన ఊరు అవటాన్న, వెంబడిస్తున్న కారుని వదిలించుకోవటానికి అన్ని  రకాల సందులు  గొందుల్లోంచి బాగా జన సంచారం ఉన్న చోటు నుండీ నా కారుని పోనిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా ఆ కారు మాత్రం పట్టు విడవని విక్రమార్కుడిలా నా వెంటే వస్తోంది.

ఈసారి జన సంచారం ఉన్న ప్రదేశం వచ్చినప్పుడు కారు ఆపి చూడాలి,  అని ఒక నిర్ణయానికి వచ్చాక ‘దేముడా.. దేముడా’ అని స్మరించుకుంటూ కారు నడుపుకుపోతున్నాను.

నా కారు నుంచి సురక్షితమైన దూరం ఉంచుకుని డ్రైవ్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు ఎవరో. నోటికి ఎలా వస్తే అలా ఆంజనేయ దండకం, హనుమాన్ చాలీసా.. ఒకటి ఏమిటి నోటికి వచ్చిన దేముడి స్తోత్రాలన్నీ చదివేసుకుంటున్నాను, ఎలాయినా గండం గడిచి ఇంటికి చేర్చమని.

ఇంతలోకి చిన్న పళ్ల మార్కెట్టు తగిలింది. ఎక్కువ ఆలోచించకుండా కారు ఆపి డోరు తీసి నేను దిగేలోగా ఫియెట్ నన్ను దూసుకు ముందుకు వెళిపోయింది. ‘బతుకు జీవుడా’ అనుకుని అక్కడే కారుని ఆనుకుని కాసేపు ఊపిరి పీల్చి నిలదొక్కుకున్నాను. నేను చేద్దామనుకుంటున్నదీ ముందే పసిగట్టి నాకావకాశం ఇవ్వకుండా దాటేశాడు. ‘ఏదో ఒకటి, పీడ వదిలింది కదా’ అని చుట్టూ పక్కల చూశాను. బీటు పోలీసు కానీ, తెలిసిన ముఖం కనిపిస్తే ఇంటి దాకా తోడు రమ్మని అడగాలని. అలాంటి వారు ఎవరు కనిపించక ఉస్సూరుమంటూ కారులో దూరాను.

ఇంకా అరగంట దూరం ఉంది మా ఇల్లు ఎంత లేదన్నా. మెల్లగా ఆ ప్రదేశం వదిలి మళ్ళీ మెయిన్ రోడ్ పైకి వచ్చాను. కొంచెం దూరం వెళ్ళి చూస్తిని కదా మళ్ళీ అదే ఎర్ర ఫియెట్ కనిపించి భయంతో గుండె లయ తప్పింది. నాకున్న శక్తినంతా ప్రయోగించి నా కారు వేగం పెంచి మెల్లగా నడుపుతున్న ఆ కారుని దాటాను. కానీ ఏం లాభం? మళ్ళీ మామూలే. ఎలాగైతేనేం మా ఇల్లు దగ్గర పడింది. ఆమడ దూరం నుంచే గట్టిగా హార్న్ కొడుతూ మా ఇంటి గేటు వేపుకి దూసుకుపోతున్నాను.

ఇంతవరకు ఆ ఫియెట్ వాడు ఎలాంటి అఘాయిత్యం చేయనందుకు కానరాని దేముడికి దణ్ణం పెట్టుకున్నాను. నేను నిర్విరామంగా ముగిస్తున్న హార్న్ ధ్వనికి విస్తుపోతూ అప్పటికే గేటు తీసి పక్కకి తొలగినించున్నారు మా వారు.

రివ్వున కారుని లోపలికి పోనిచ్చి డోరు తీసి పరిగెత్తుకువెళ్లి మా వారి వెనక నిలుచున్నా. వెంబడి వస్తున్న కారు కూడా అంతే వేగంగా వచ్చి గేటు బయట ఆగింది. కారులోంచి  ఒకతను దిగి, మేము మా కళ్ల ముందు జరుగుతున్నది గ్రహించే లోపే, మా కారు వెనక డోర్ తీసి. టార్చ్ లైట్ వేసి చేతిలో కత్తి ఉన్న మరో మనిషిని బలంగా లాగి కింద పడేసి కత్తి ఉన్న చేతిని విరిచి పట్టటానికి ప్రయత్నిస్తుంటే మావారు కూడా వెంటనే వెళ్లి ఆ మనిషి ని బలంగా పట్టుకుని వాడి చేతిలోని కత్తి విడిపించి దూరంగా విసిరారు.

నా కళ్ళ ముందు జరుగుతున్నది నా నియంత్రణలో లేకపోయినా అప్పటికి మొద్దుబారి ఉన్న నా మెదడు మళ్ళీ పని చేయటం ప్రారంభించగా వెంటనే దూరంగా విసర బడిన కత్తిని వణకుతున్న చేతులతో స్వాధీన పర్చుకుని నా బ్యాగులోంచి ఆ నాటి కార్యక్రమానికి వాడగా మిగిలిన రిబ్బన్ తీసి మా వారికి అందించాను. మావారు – ఇంక నన్ను వెంటాడిన ఆ అపరిచితుడు కలిసి బలంగా పట్టుకున్న పట్టు నుంచి తప్పించుకోవాలని పెనుగులాడుతున్న ఆ రౌడీ చేతులు విరిచి పెట్టి కట్టి పడేశారు.

ఈ లోపున లోపలికి వెళ్ళి నా నైలాన్ చున్నీ తీసుకువచ్చి ఇస్తే వాడి కాళ్ళు కూడా కట్టి మా కారు డిక్కిలో పడేసి లాక్ చేసి పోలీస్ స్టేషన్‌కి కాల్ చేయటానికి ముగ్గురం ఇంటి లోపలికి నడిచాము. ఆ సరికి జరుగుతున్నది అర్థమై ఆపద్బాంధవుడిలా వచ్చిన అపరిచిత వ్యక్తి వేపు కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ, మా వారితో నా అనుభవాన్ని వల్లించి, “ఇంత దూరం నా వెనకాతలే రాకపోతే జనం ఉన్న చోట కారు ఆపి ఈ పని అప్పుడే చేయవల్సింది కదా? ఇంతకీ మీకెలా తెలిసింది నా వెనక సీటులో రౌడీ ఉన్నాడని?” అని అతన్ని అడిగాను.

“దైవికంగా మీ వెంటే పార్కింగ్ లోంచి కారు తీస్తున్న నా కంట, మీతోపాటే కారు వెనక సీటులో వీడు దూరటం పడింది. నేను గట్టిగా కేక వేసి మిమ్మల్ని హెచ్చరించేలోగా మీరు వినిపించుకోకుండా రయ్యిమంటూ కారు తొలుకు పోతుంటే మీ వెంట పడక తప్పింది కాదు. స్వతహాగా నేను ఎస్.పి.గా ఉద్యోగ నిర్వహణ చేస్తూ నాలుగు రోజులు సెలవలు వస్తే ఈ ఊరు మా అమ్మా నాన్నలని చూడటానికి వచ్చాను. కానీ ఇక్కడ కూడా నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుకునేట్టుగా చేశారు మీరు.” అంటూ నవ్వుతూ చూశాడు అతను నా వేపు.

“ఇక మీ రెండో అనుమానం – వాడి చేతిలో మెరుస్తున్న కత్తి నా కంట పడింది. జనాలు ఉన్న చోట ఎక్కడ ఆపినా కత్తి చూపించి మిమ్మల్ని లొంగదీసుకుని తిరగ పడవచ్చును. మీ వెంటే వస్తున్న నా కారుని పసిగట్టి వాడు కూడా దారంతా సరైన అవకాశం కోసం చూస్తూన్నాడు. ఇంతకీ మీరు లేచిన వేళ బాగుంది ఇవాళ. వాడికి మాత్రం ఈ రోజు మూడింది. నిజానికి మొండి ధైర్యంతో వాడు మిమ్మల్ని ముందే లొంగదీసుకుని ఉంటే, ఉట్టి చేతులతో నేను మీకు ఎంత వరకు సాయపడదునో తెలీదు. ఇంతకీ మీ ఫోన్ ఎక్కడుందో చూపించారు కాదు, ఆలస్యం చేసామంటే వాడు తప్పించుకోగలడు” అని మావారు చూపించన వైపుకి వెళ్లి ఫోను అందుకున్నారు. ఆ ఎస్.పి. కాల్ చేసి వచ్చాక నేను, “సారీ ఆండీ. మిమ్మల్ని అపార్థం చేసుకునేందుకు.” అన్నాను సిగ్గుపడుతూ.

“భలే వారే. మీ స్థానంలో ఎవరున్నా మీలానే అపోహ పడేవారు.” అన్నాడు.

ఆ తరవాత మావారు ఆ ఎస్.పి., ఒకరినొకరు పరిచయం చేసుకుంటుంటే నేను వారిద్దరి కోసం కాఫీ కలపటానికి కిచెన్ లోకి దారి తీస్తూ అనుకున్నాను, ‘అనుమానస్పదమైన పరిస్థితులు తోటి మనిషిని ఎంతలా తప్పు అంచనా వేయిస్తాయో కదా’ అని.

Exit mobile version