[ఇటీవల నాందేద్ సమీపంలోని కాంధార్ కోటని దర్శించి, ఆ అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ కోవెల సంతోష్ కుమార్.]
దివిస్పృగ్భిః స్ఫాటికైరత్రాట్టాలకగోపురైః।
వైడూర్యమరకతవజ్రపద్మరాగాదిభిర్ధృతైః॥
గృహైశ్చ రాజతైః సౌవర్ణైర్మహాభైర్భవితైరమలైః।
నారదః ప్రవివేశాథ ద్వారకాం కృష్ణపాలితామ్॥
(శ్రీమద్భాగవతము – 10.69.8, 9)
శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించిన తరువాత ఆ నగరాన్ని చూడటానికి ఒకసారి నారదుడు వచ్చాడంట.. లక్ష్మీదేవికి నివాసమైన ద్వారకానగరాన్ని చూసేందుకు ద్వారకకు వచ్చిన ఆ నారదుడికి ఆ నగరాన్ని చూసిన తరువాత కళ్లు బైర్లు కమ్మాయంట.. ఎత్తైన రాజ ప్రాసాదాలు అంటే భవనాలు, కోట బురుజులు, పెద్ద పెద్ద సభా మంటపాలు, ఆ మంటపాలు, భవనాల శిఖరాలపై విలువైన వజ్రవైఢూర్యాలతో రూపొందిన కలశాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన పక్షుల మధురమైన కిలకిలారవాలు, కలువలు, తామరలు, పద్మరాగాలు, రంగురంగుల పూలు.. మనోహరమైన పెద్ద ఉద్యానవనాలు, పెద్ద వీధులు, సంతలు, సభా మంటపాలతో అద్భుతంగా, అపూర్వంగా అబ్బురపరిచేలా ఉందంట. వ్యాసభాగవతంలో దశమస్కంధంలోని ద్వారకా నగర వర్ణనకు సంబంధించిన శ్లోకాలు ఇవి. తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతనామాత్యుడు ఇదే ద్వారకానగరాన్ని ఇంత అద్భుతంగా వర్ణించాడు.
పద్మరాగ స్ఫటిక ప్రభాపటలముల దివము నా
చ్ఛాదించు సౌధములు, మరకతాసన కనక మణి
మంటపంబులు, ముత్యాల కొలువుల ముద్దులొలుకు
రమ్య మృదంగ స్వనములు చెలఁగఁగాఁ కాంచె నారదుఁడు.
అంతటి మహానగరాన్ని.. అద్భుతమైన నగరాన్ని ఆ శ్రీకృష్ణుడే మళ్లీ అవతరించి మరో మహా నగరాన్ని, అద్భుతమైన కోటను నిర్మిస్తే.. ఎంత ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.
నాకు గాలి మార్పు అంటే ఇష్టం. అప్పుడప్పుడూ అలా స్థానిక ప్రాంతాన్ని వదిలి.. మరో ప్రాంతానికి వెళ్లి.. అక్కడ ఉన్న అనేక అద్భుతాలను చూసి వస్తాను. అనేక విషయాలను తెలుసుకొని వస్తాను. పనిలో ఒత్తిడి ఉన్నా.. తీవ్రంగా ఒంటరితనం భాధిస్తున్నా.. మానసికంగా అనేకానేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. మళ్లీ సరికావడానికి, రీచార్జ్ కావడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్తే గాలి మార్పు ఉంటుంది. ఇది పెద్దలు మనకు ఎప్పుడూ చెప్పే మాటే.. 1982లో మాథెసన్ అండ్ వాల్, ఈ గాలి మార్పుకు చక్కని నిర్వచనం ఇచ్చింది. “The temporary movement of people to destinations outside their normal places of work and residence. The activities undertaken during their stay in those destinations, and the facilities created to cater to their needs.” ఈ గాలి మార్పు కోసం మనం చేసే ప్రయాణాలు కొన్ని ఫార్మల్గా అయిపోయి కాలగర్భంలో కలిసిపోతాయి. వాటిని గురించిన గుర్తులు ఏవీ ఉండవు. మరి కొన్ని ప్రయాణాలు కేవలం ప్రయాణాలుగా మాత్రమే మిగిలిపోవు. ఆ ప్రయాణాలు మనల్ని ఒడలంతా ఒక్కసారి కదిలించేస్తాయి. మన శరీరంలోని అణువణువూ ఒక కొత్త అనుభవాన్ని పొందుతుంది. ఆ అనుభవం జీవితాంతం మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ అనుభూతిని పదిమందితో పంచుకోకపోతే.. మనతోనే అది ముగిసిపోతుంది కూడా.
అలాంటి నా ప్రయాణాల్లో నేను ఎప్పటికీ మరచిపోనిది.. నన్ను నిరంతరం వెంటాడుతున్నది కాంధార్ కోట సందర్శనం. ఈ మధ్య కాలంలోనే అంటే సెప్టెంబర్ 16, 2026న హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు అత్యవసరంగా వెళ్లాల్సిన పని పడింది. నాందేడ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండగా, గూగుల్ సర్చ్ చేస్తుంటే.. అక్కడికి సమీపంలోనే రాష్ట్రకూటుల నాటి కోట కాంధార్ ప్రాంతంలో ఉన్నట్టు కనిపించింది. నాందేడ్ సిఖ్ గురుద్వారాకు అత్యంత ప్రసిద్ధ క్షేత్రం. సిక్కులు భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావించే అయిదు పవిత్ర ప్రదేశాల్లో నాందేడ్ గురుద్వారా కూడా ఒకటి. ఈ గురుద్వారాను కూడా సందర్శించాను. అయితే.. నాందేడ్‌కు సుమారు 38 కిలోమీటర్ల దూరంలో కాంధార్ భూయి ఖిల్లా (కోట) ఉంది. రాష్ట్రకూటులు నిర్మించిన కోట అది.
మనకు దాదాపు పన్నెండొందల ఏండ్ల నాడు తెలింగ శబ్దం వినిపించిన కోట ఇది. నేను తిలింగ దేశాధిపతిని అని చాటుకున్న రాష్ట్రకూట రాజు శ్రీకృష్ణ-3 నిర్మించిన మహా కోట ఇది. ఇంకేం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు కోట వైపు మళ్లింది. కాంధార్ కోటను చూసిన తర్వాత నాకు కలిగిన అనుభూతి అక్షరాల్లో ఇక్కడ పెట్టడానికి ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కాంధార్ పట్టణం వద్ద ఉన్న ఈ భారీ కోట గురించి ఇంతకు ముందు చదివి ఉండొచ్చు. ఫొటోలు చూసి ఉండొచ్చు. చరిత్రలో దాని పేరు విని ఉండొచ్చు. కానీ ఒక చారిత్రక కట్టడం ముందు మనం నిలబడటం వేరు. ఆ మహాద్భుతమైన రాతి కట్టడాన్ని కండ్లారా చూడటం వేరు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న గోడల మధ్య మనం నడవటమే పూర్తిగా కొత్త అనుభవం. కాంధార్ కోటను చూడగానే మనకు అనిపించేది ఇది కోటేనా, లేక రాళ్లతో రాసిన ఒక మహా చరిత్ర గ్రంథమా? అని. అక్కడి శిలాశాసనాల ప్రకారం రాష్ట్రకూటుల రాజు కృష్ణుడు-I పరిపాలించిన ప్రస్తుత శకం 758లో ఈ కోట నిర్మాణం ప్రారంభమైంది. మొదట ఈ కోటను మట్టితోనే నిర్మించారు. దాదాపు రెండువందల ఏండ్ల పాటు ఇది మట్టి కోటగానే ఉన్నది. ఆ తరువాత రాష్ట్రకూట రాజు కృష్ణుడు-III పట్టాభిషక్తుడు అయినత తరువాత ప్రస్తుత శకం 941లో రాతి నిర్మాణంగా పూర్తి చేశారు. నేను చూసిన ఈ కాంధార్ కోట దాదాపు పన్నెండు వందల సంవత్సరాల చరిత్రను నాదాకా మోసుకొచ్చి చెప్తున్నది. ఈ కోట అనేక తరాల భారతీయ రాజుల చరిత్రను, రాజవంశాలను, యుద్ధాలను, సింహాసన మార్పులను, సామ్రాజ్యాల ఉత్థాన పతనాలను కూడా చూసింది. బహుమనీలు, మొఘలుల దాడులను ఎదుర్కొన్నది. రాజులు వెళ్లిపోయారు. రాజ్యాలు కూలిపోయాయి. సైన్యాలు కనుమరుగయ్యాయి. పాలకుల పేర్లు చరిత్రలో కలిసిపోయాయి. కానీ కాంధార్ కోట మాత్రం చెక్కు చెదరకుండా భారతీయ రాజవంశాల జయపతాకను సగర్వంగా ఎగురవేస్తూ పన్నెండు శతాబ్దాలుగా నిలబడే ఉన్నది.
దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట విస్తరించి ఉన్నది. కోట చుట్టూ సుమారు వంద అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతైన కందకం ఉన్నది. కోటకు రెండు వరుసల ప్రాకారాలు ఉన్నాయి. 32 బురుజులు ఉన్నాయి. కోటకు నాలుగు వైపులా నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కోటలో అడుగు పెట్టాలంటే కందకాన్ని దాటుతూ వెళ్లాల్సిందే.. ఆ భారీ గోడలు, బురుజులు, ఫిరంగుల ఏర్పాటును కనుక మనం జాగ్రత్తగా గమనిస్తూ.. అధ్యయనం చేస్తూ.. పరిశోధన చేస్తూ ముందుకు సాగుతుంటే.. రాష్ట్రకూటుల నాటి సమగ్రమైన రక్షణ వ్యవస్థ మనకు స్పష్టంగా అవగతమవుతుంది.
శత్రువు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. వస్తే ఎలా అడ్డుకోవాలి.. ఎక్కడి నుంచి బాణాలు సంధించాలి? ఎక్కడి నుంచి ఫిరంగులు పేల్చాలి.. ఎక్కడెక్కడ సైనికులు కాపలా ఉండాలి.. కందకంలో నీటిని ఎలా నిల్వ చేసుకోవాలి.. ఆ నీటిలో మొసళ్లు, సర్పాలు ఇతర విషపు జంతువులను ఏర్పాటు చేసుకోవాలి.. కోటను శత్రువులు ముట్టడిస్తే.. ఎంతకాలం తట్టుకొనగలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి అన్ని ప్రశ్నలకు రాష్ట్రకూటులు ఆలోచించి నిర్మించిన అద్భుతమైన ఒక ఇంజినీరింగ్ వ్యవస్థ. వందల ఏండ్ల నాటి సమగ్రమైన రక్షణ ప్రణాళికను రూపొందించిన భారతీయుల మేధస్సుకు ప్రతీక ఈ కోట.
కోటలో రాణి మహల్, దర్బార్ హాల్, జల మహల్, లాల్ మహల్, ధాన్యాగారాలు వంటి అనేక నిర్మాణాల అవశేషాలు ఉన్నాయి. పర్షియన్, అరబిక్, సంస్కృత, ప్రాకృత భాషల్లో మనకు ఇక్కడ అనేక శాసనాలు కనిపిస్తాయి. అంబరీ ఫిరంగి వంటి భారీ ఆయుధం కూడా మనకు కనిపిస్తుంది. సుదూర ప్రాంత లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి ఇది. అక్కడ ఒక మసీదు కూడా ఉన్నది. నేరగాళ్లను బంధించే కారాగారాలు, వంటశాలలు, ఆనాటికి అత్యాధునిక స్నాన గదులు అన్నీ కూడా మనకు చూస్తుంటేనే ఏ విధంగా ఉండేవో కండ్లకు కడతాయి.
రాష్ట్రకూట కృష్ణుడి భారీ విగ్రహాన్ని ముస్లిం రాజులు ధ్వంసం చేసి పడవేసిన ముక్కలు మనకు ఇక్కడ దయనీయంగా కనిపిస్తాయి. తల, కాళ్లు, చెవులు, చేతులు, ఇలా ఎక్కడికక్కడ ముక్కలు చేసి ఆ విగ్రహాన్ని పడేశారు. కాకపోతే ఆ శిథిలాలతో ఆ బాహుబలి రాతిశిల్పాన్ని పునరుద్ధరించే పనిని ప్రభుత్వాలు చేయకపోవడం దురదృష్టం.
(ముక్కలు ముక్కలుగా పడేసి ఉన్న తల, కాళ్లు, చేతులు, చెవులన్నింటినీ ఏఐకి ఇచ్చి ఒరిజినల్ విగ్రహం ఎలా ఉండేదో తయారు చేయాలని అడిగితే.. అది ఇలా ఇచ్చింది)
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తెలుగు ప్రాంతాల చరిత్రతో దానికి సంబంధం ఉండటం. రాష్ట్రకూట రాజు కృష్ణ-III తనను తాను “తిలింగ దేశాధిపతి”గా ప్రకటించుకున్నట్లు ధార్వాడ్ శాసనంలో కనిపిస్తుంది. “తిలింగ దేశాధిపతిః శ్రీకృష్ణో రణవిక్రమః” అనే పదబంధం అందులో ఉంది. “తిలింగ” అనే పదం ద్వారా తెలుగు ప్రాంతంతో ఉన్న రాజకీయ సంబంధానికి ఒక ముఖ్యమైన చారిత్రక ఆనవాలు ఇది. అంటే కృష్ణ-III పాలనా పరిధి దక్కన్‌లోని విస్తారమైన ప్రాంతాలతో పాటు తెలుగు ప్రాంతాల వరకూ విస్తరించి ఉన్నదనే విషయాన్ని ఈ శాసన ఆధారం గుర్తుచేస్తుంది. మనకు మొదట ప్రస్తుత శకం సుమారు 7వ శతాబ్దంలో ఐహోలే శాసనంలో మొదటిసారి తిలింగ శబ్దం కనిపిస్తుంది. ఇదే అతి ప్రాచీనమైంది. ఆ తరువాత మరో చోట కనిపించేది 9వ శతాబ్దంలో అమోఘవర్షుడి శాసనంలో ఇదే మాట కనిపిస్తుంది. తరువాత మనకు తిలింగ శబ్దం కనిపించేది ఈ శ్రీకృష్ణుడి ధార్వాడ్ శాసనంలోనే. కాంధార్ కోట గోడల మధ్య నడుస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుచేసుకోవడం చాలా చాలా ఆనందాన్ని, అనుభూతిని కలుగజేసింది. ఇది కేవలం మహారాష్ట్రలోని ఒక కోట చరిత్ర కాదు; దక్కన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర పరస్పరం ఎంతగా ముడిపడి ఉన్నదో చెప్పే ఒక సజీవ సాక్ష్యం.
కాంధార్ కోట ఒకే రాజుకు పరిమితమైన చరిత్ర కాదు. ఒకే రాజవంశానికి మాత్రమే పరిమితమైన చరిత్ర కాదు. దక్కన్ పీఠభూమి చరిత్రలోని అనేక మలుపులను తనలో దాచుకున్న ఒక సజీవ చరిత్ర గ్రంథం. రాష్ట్రకూటుల కాలం నుంచి తరువాతి శతాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజవంశాల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. యాదవులు, తుగ్లక్‌లు, బహమనీ, నిజాం షాహీ, మరాఠా, బ్రిటిష్ పాలనల కాలపు చరిత్రతోనూ ఈ కోటకు సంబంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒకే ఒక్క ప్రాంతంలో.. స్థలంలో శతాబ్దాల రాజకీయ చరిత్ర గడ్డకట్టిపోయింది.
కానీ, ఈ అద్భుతాన్ని చూస్తున్న ఆనందం ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే కోట వైభవాన్ని ఎంతగా ఆస్వాదిస్తామో, దాని సంరక్షణ పరిస్థితిని చూస్తే అంతే ఆవేదన కలుగుతుంది. ఇంతటి విస్తీర్ణం, ఇంతటి నిర్మాణ వైభవం, ఇంతటి చారిత్రక ఆధారాలు, ఇన్ని శతాబ్దాల కథలు ఉన్న ఒక కట్టడాన్ని మరింత సమగ్రంగా సంరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి. మరో దేశాల్లో ఇలాంటి కోట ఒకటి ఉంటే.. ప్రపంచంలోనే మహాద్భుతంగా విరాజిల్లేది. దీని చరిత్ర మార్మోగేది. పర్యాటకంలో దీనికి అపూర్వ కీర్తి ప్రతిష్ఠలు లభించేవి. ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి, మ్యూజియంలను ఏర్పాటు చేసి, దుబాసీలను పెట్టి, డిజిటల్ మ్యాపింగ్, త్రీడీ పునర్నిర్మాణాలు, లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనలు, పరిశోధనా కేంద్రాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి నానా హంగామా చేసేవారు. ఖజానాకు టూరిస్టుల ద్వారానే భారీగా ఆదాయం సమకూరేది. కానీ కాంధార్ కోట ఎవరూ పట్టించుకోని అనాధగా మారిపోయింది. ప్రవేశ ద్వారం దగ్గర ఒక వ్యక్తి వచ్చిపోయే వారి వివరాలు రాసుకోవడం తప్ప ఇతరత్రా అక్కడ వేరే ఏర్పాట్లు ఏవీ లేవు.
మన దేశంలో పర్యాటక అభివృద్ధి అవకాశాలకు కొదవ లేదు. మనకు దేవాలయాలు ఉన్నాయి. కోటలు ఉన్నాయి. గుహలు ఉన్నాయి. శిల్పాలు ఉన్నాయి. శాసనాలు ఉన్నాయి. వేల ఏళ్ల నాగరికతకు సాక్ష్యాలుగా నిలిచిన నిర్మాణాలు ఉన్నాయి. కానీ వాటిని కేవలం ‘పాత కట్టడాలు’గా చూస్తే వాటి అసలు విలువను మనమే తగ్గించినట్టవుతుంది. అవి మన జ్ఞాపకాలు. ఒక కోట కూలిపోతే కేవలం రాళ్లు నేలకూలినట్టు కాదు. మన చరిత్ర మాయమవుతున్నట్టు. ఒక శిల్పం ధ్వంసమైతే కేవలం ఒక రాయి విరిగినట్టు కాదు. దాన్ని సృష్టించిన శిల్పి నైపుణ్యం మాయమైనట్టు. ఒక శాసనం చెరిగిపోతే కేవలం అక్షరాలు పోయినట్టు కాదు. మన గతం మనతో మాట్లాడే స్వరం మూగబోయినట్టు. నిజానికి కాంధార్ కోటను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎంతో చేయవచ్చు. కోట చరిత్రను వివరించే ఆధునిక మ్యూజియం ఏర్పాటు చేయవచ్చు. ప్రతి నిర్మాణ భాగం దగ్గర దాని చరిత్రను వివరించే బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేశారు కానీ, అవన్నీ తుప్పుపట్టి ఒక్క అక్షరం కూడా కనిపించడం లేదు. శాసనాలను డిజిటల్‌గా నమోదు చేసి వాటి అనువాదాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. కోట నిర్మాణం, నీటి నిర్వహణ, రక్షణ వ్యవస్థలను ఆధునిక సాంకేతికతతో చూపించవచ్చు. ఇంటరాక్టివ్ గ్యాలరీలు ఏర్పాటు చేయవచ్చు. స్థానిక సంస్కృతిని పర్యాటకంతో అనుసంధానించవచ్చు. అప్పుడు కాంధార్ ఒక కోటగా మాత్రమే కాకుండా ఒక సాంస్కృతిక, విద్యా, పరిశోధనా, పర్యాటక కేంద్రంగా ఎదుగుతుంది.
కాంధార్ సందర్శన నా వరకు నాకు కేవలం ఒక టూర్ మాత్రమే కాదు. ఒక చరిత్రను సంపూర్ణంగా అవలోకనం చేసుకొనే అవకాశం. ఆ రాళ్ల మధ్యన నిలబడి దాన్ని అనుభవించడం. ఇంతటి సంపద మన దగ్గర ఉంది. ఇంతటి చరిత్ర మన నేలలో ఉంది. ఇంతటి నిర్మాణ ప్రతిభ మన పూర్వీకులది. కానీ దాన్ని శాస్త్రీయంగా సంరక్షించుకోవడంలో మనం ఎంత దారుణంగా విఫలమవుతున్నామో చెప్పడానికి కాంధార్ సజీవ సాక్ష్యం. కంధార్ కోటను చూసి తిరిగి వస్తూ నాకు చివరగా అనిపించింది ఒక్కటే.
రాళ్లు మాట్లాడుతున్నాయి.. మనం వింటున్నామా?
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.

