[ఇటీవల మృతిచెందిన డా. ముదిగొండ శివప్రసాద్ గారి స్మృతిలో, ‘విస్మృత యుగాల రూపశిల్పి- డా. ముదిగొండ శివప్రసాద్’ అనే వ్యాసం అందిస్తున్నారు శ్రీ కడప రఘోత్తమరావు.]
ఉపోద్దాతం:
సాహిత్యాన్ని కాలయంత్రంగా మార్చి చరిత్రను సమకాలీన పాఠకులకు అందించడమనేది సాహిత్య నవలారంగంలో సవాలుతో కూడుకున్న పని.
రచయితలు నిఖార్సైన చారిత్రక సత్యాలను, ఆకట్టుకునేలా కథ నడవడానికి కావల్సిన కాల్పనికత నడుమ సున్నితమైన సమతుల్యతను సాధించాలి. విసుగు పుట్టించే అకడమిక్ విశ్లేషణల్లో పాఠకులు మునిగిపోకుండా చూడాలి. అలానే మితిమీరిన కల్పనలతో చరిత్ర పక్కదారి పట్టకుండా ఉండాలి. కథనంలో
భావోద్వేగం ఉండాలి కానీ చారిత్రక నిజాలు అంతర్లీనంగా మమేకమవ్వాలి. ఈ సమతౌల్యతను సాధించాలంటే కేవలం విస్తృతమైన పరిశోధన మాత్రమే సరిపోదు. సంక్షిష్టమైన చారిత్రక అవగాహనతో బాటు సరళమైన కథన శైలి సమతూకంలో ఉండాలి. వీటి కంటే ముఖ్యంగా పాఠకుల మానసిక ప్రవర్తనల పట్ల లోతైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
తెలుగు సాహిత్యంలో ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా పేరుగాంచిన డా. ముదిగొండ శివప్రసాద్ గారు మునుపు చెప్పిన చారిత్రక-కాల్పనికతల కలయికలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు. 100కు పైగా నవలలను రచించిన ఆయన, పశ్చిమ చాళుక్యుల కాలం నాటి రాజకీయ ఘర్షణల నుండి కాకతీయ సామ్రాజ్యపు శిల్పకళా, సాంస్కృతిక వైభవం వరకు విస్తారమైన చారిత్రక ఘట్టాలను పునర్నిర్మించారు. అదే సమయంలో చారిత్రక కథాకథన కళను ఒక నిరంతర సాధనలా భావించారని చెప్పవచ్చు.
డా. ముదిగొండ గారి అన్ని రచనలను నేను చదవలేదు. కనుక, నా ఈ రాత/మాట నా అవగాహనా పరిమితులకు లోబడినవని పాఠకులు/శ్రోతలు గమనించాలని విన్నమిస్తూ, నేను చదివిన ‘ఆవాహన’, ‘అనుభవ మంటపం’ అన్న రెండు చారిత్రక కాల్పనిక రచనలపై సంక్షిప్త సమీక్షను అందిస్తున్నాను.
డా. ముదిగొండ గారి రెండు చారిత్రక కాల్పనిక నవలల సంక్షిప్త విశ్లేషణ:
స్వచ్చమైన చరిత్ర రాయడం కంటే వాస్తవాలను, కల్పనను సమ్మేళనం చేయడం మరింత కష్టం. పరిశోధనాత్మక చరిత్ర లేదా శాసన విశ్లేషణకు కఠినమైన అధ్యయనం, క్రమశిక్షణ అవసరమైనప్పటికీ, చారిత్రక నవలను నిర్మించడం అంతకంటే ఎంతో సంక్షిష్టమైన సవాలు. చారిత్రక వ్యాసాలు రాయడం సులభం. కానీ నిజమైన సంఘటనల ఆధారంగా కల్పిత కథనాన్ని అల్లడం అత్యంత సంక్లిష్టమైన పని.
లేని పాత్రలను సృష్టించి నిజమైన చరిత్రను ధృవీకరించడం చాలా కష్టమైన ప్రక్రియ. నాన్-ఫిక్షన్ లేదా చారిత్రక వ్యాసాలు రాయడం సులభమే కానీ, కథాత్మక కల్పన ద్వారా చరిత్రను చెప్పడానికి లోతైన పరిశోధన, భాషా పటుత్వం, స్పష్టమైన కళాత్మక దృష్టి అవసరం.
చరిత్ర ఆధారంగా వ్రాసే కాల్పనికాలకు కొన్ని కష్టాలు, క్లిష్టతలు ఉన్నాయి. రచయితలకు కొన్ని విశేషాంశాలపై పట్టు లేకపోతే కథ, కథనం రెండూ దెబ్బతింటాయి. ఈ కష్టాల్లో మొట్టమొదటి – భాష.
రచయిత తను ఎంచుకున్న కథాకాలం నాటి భాషను వాడకపోతే చారిత్రక వాస్తవాన్ని చెప్పలేకపోవడమవుతుంది. అలాగని, ఆనాటి భాషను ఉన్నదున్నట్టుగా వ్రాసేసి పాఠకులను గందరగోళపరిస్తే రచన మొత్తం మూలనపడిపోతుంది. సరళంగా చెప్పాలంటే – ఆనాటి ప్రాచీన భాష నేటి ఆధునిక పాఠకులకు అర్థమయ్యేట్టుగా చెప్పకపోతే రచన వారికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఇక్కడే డా. ముదిగొండ గారి నైపుణ్యాన్ని నేను గమనించాను – వారి ‘ఆవాహన’ నవలలో.
ఎలాగంటే – కథలోని ప్రధానపాత్ర అయిన ఒక కాకతీయుల నాటి రాజనర్తకి ఆత్మ ఆనాటి భాషనే మాట్లాడుతుంది. దాన్ని వింటున్న ఇరవైయ్యవ శతాబ్దపు యువకుడు ఆ మాటలు అర్థంకాక సతమతమవుతుంటాడు. అతని తెలివైన స్నేహితుడొకడు ఆ ఊరిలోని తెలుగు ప్రాధ్యాపకుడిని కలిస్తాడు. ఆయన ఆ ప్రాచీన ఆత్మ వాడిన మాటలు ఏ కాలానికి చెందినవో, ఆ ప్రాచీన తెలుగు లేక సంస్కృత పదాలకు అర్థాలేమిటో 20వ శతాబ్దపు తెలుగులో వివరిస్తాడు. ఇలా, డా. ముదిగొండ గారు 13వ శతాబ్దపు తెలుగు పదాలను పాఠకులకు పరిచయం చేస్తూనే ఒక పాత్ర ద్వారా 20వ శతాబ్దపు పాఠకులకు విసుగు రాకుండా నేర్పుగా వ్రాసారు.
నిజానికి, ‘ఆవాహన’ నవలలో డా. ముదిగొండ గారు వాడిన ‘ప్రాచీన ఆత్మ – నవీన మానవుడు’ అన్న పథకం కొత్తదేమీ కాదు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆనాటి హిట్ సినిమా ‘మూగ మనసులు’లో ఇలానే చనిపోయిన వారు మళ్ళీ పుట్టడం, కలుసుకోవడం, గతస్మృతుల్ని గుర్తుకు తెచ్చుకోవడం జరుగుతుంది. డా. ముదిగొండ గారు కూడా ఇదే పద్ధతిలో వ్రాసారు.
ఈ విధంగా, ఒక చక్కటి చారిత్రక నవలను వ్రాయడానికి కేవలం పరిశోధన మాత్రమే సరిపోదని, కథన వేగానికి భంగం కలగకుండా చారిత్రక సంక్షిష్టతను వివరించే కథన వ్యూహాలు కూడా రచయితకు అత్యంత ముఖ్యమని నిరూపించారు డా. ముదిగొండ.
ఇక ఇప్పుడు చెప్పబోయే అంశం మరింత కీలకమైనది.
తన రచనా ప్రస్థానంలో, కళ, ఆధ్యాత్మికత, రాజ్యాధికారాల కలయికపై పరస్పర విరుద్ధమైన తాత్విక దృక్పథాలను డా. ముదిగొండ విశ్లేషించారు. సరిగ్గా 12 నెలల వ్యవధిలో వెలువడిన రెండు ముఖ్యమైన నవలలు – ‘అనుభవ మంటపం’, (1978), ‘ఆవాహన’ (1979) లలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
అనుభవ మంటపం (1978):
పశ్చిమ చాళుక్యుల కాలంలో, బిజ్జల రాజు పాలనలో సాగిన కథ. పన్నెండవ శతాబ్దానికి చెందిన సాంఘిక సంస్కర్త బసవేశ్వరుని జీవిత కథనే ఈ ‘అనుభవ మంటపం’ నవల. ఒకవైపు ఆధ్యాత్మికవేత్తగా, మరొకవైపు మంత్రిగా ద్వంద్వ పాత్రలను నిర్వహిస్తుంటాడు బసవణ్ణ. తీరికలేని జీవితాన్ని గడుపుతూ భార్యాబిడ్డలకు సమయం కేటాయించలేకపోతున్నాననే బాధ బసవణ్ణలో గూడు కడుతుంది. అదే విషయాన్ని ఒక రాత్రి తన భార్య గంగాంబికతో చర్చిస్తాడు. అప్పుడు, ఒక ఆధ్యాత్మిక చింతకుడు రాజ్యతంత్రపు హింసాత్మక కుట్రల్లో భాగస్వామి కావచ్చా? అని గంగాంబిక ప్రశ్నించగా, ప్రజల సంక్షేమం కోసం రాజకీయంలో పాల్గొనడం లౌకిక ఆకాంక్ష కాదని, అది పవిత్రమైన ‘శివ సేవ’ భావిస్తున్నానని బసవణ్ణ చేత చెప్పిస్తారు రచయిత.
కానీ 1979లో, అంటే ‘అనుభవ మంటపం’ తర్వాత వ్రాసిన ‘ఆవాహన’ నవలలో తద్విరుద్ధమైన అభిప్రాయాన్ని ఒక ముఖ్యపాత్ర చేత చెప్పించారు డా. ముదిగొండ.
కాకతీయ రాణి రుద్రమదేవి ఆస్థానంలో పనిచేస్తున్న రాజనర్తకి ఒకతెను రుద్రమదేవి కూతురైన రుయ్యమ తమ రాజకీయ చదరంగంలో ఒక పావుగా అంటే రాజ్య గూఢచారిగా ఉపయోగించాలని చూస్తుంది. ఆ నాట్యకత్తెను ప్రేమించిన శిల్పి దీనిని తీవ్రంగా నిరసిస్తాడు. నిజమైన కళ లౌకికమైనది, దివ్యమైనది, పవిత్రమైనది అని; దానిని రాజులు/రాణుల కోసమో, రాజకీయ కుట్రలకు ఆయుధంగానో మార్చకూడదని వాదిస్తాడు. ఈ రాజులు, రాణులు ఏదో ఒకనాడు పోతారని కానీ తమ కళలు (నాట్యం, శిల్పం) శాశ్వతంగా
నిలిచిపోతాయని, కాబట్టి ఒక కళాకారిణి రాజకీయ గూఢచారి కావడం తగదని శిల్పి పాత్ర చేత చాలా బలంగా చెప్పించారు డా. ముదిగొండ.
పరస్పర విరుద్ధాలైన పై వాదనలు రచయిత స్వంత అభిప్రాయాలా లేక ఆయా పాత్రల స్వభావాలా అన్న ప్రశ్న నాకు వచ్చింది. దీనికి సమాధానం డా.ముదిగొండ గారి నవలల్లో కంటే వారి పరిశోధనా గ్రంథంలో దొరికింది.
‘ఉద్యమ దర్శనము – ఆధునికాంధ్ర కవిత్వముపై వివిధ ఉద్యమముల ప్రభావము’ అన్న తమ పరిశోధనా గ్రంథంలో డా. ముదిగొండ గారు ఇలా అంటారు –
“నన్నయగారి నాడు చంపువును చిన్నయనాడు వచనమును ఏల వికసించినవి?
రాయలనాటి ప్రబంధము నాయక రాజులనాడేల యక్షగాన ప్రబంధమైనది?
ఇంద్రులనియు చంద్రులనియు భూకామందులను ప్రశంసించిన గత శతాబ్దపు కవిత్వమేల నేడు ప్రజల కొరకు ప్రజల వలన రచింపబడుచున్నది?
కృష్ణశాస్త్రిగారి నాటి నవ్వుల పువ్వుల కవితాకన్యక శ్రీశ్రీ నాడేల పుడమి తల్లి పురింటి నొప్పులను ప్రతిధ్వనించినది? సూక్ష్మ దర్శనముననే భిన్నత్యము గోచరించుచునే యున్నది కదా! తాత్పర్యమేమి? సాహిత్య స్ఫటిక మొక్కటే యయినను ఉద్యమ జపాకుసుమాదులు వివిధ వర్ణాకృతులతో నందు దృశ్యమాన మగుచున్నవి! కావుననే దేశకాల పాత్రముల ననుసరించి సాహితీగమనము కూర్పు నందుట సహజమనియును ఉద్యమములే యీ మహత్తర పరిణామమున కాధారశిలలనియును స్పష్టమగును. ఉద్యమ మంత్రాధిష్టితమైన మూలాధార చక్రముపై పూజారులైన కవికుమారులు కవితాశక్తిని ప్రతిష్ఠించి కొవెలలు కట్టి కోటి గొంతులతో కర్పూర గీతాంజలులు సమర్పించుటే విశ్వసాహిత్యములోని మూలసూత్రమనియును, ప్రపంచములోనే సాహిత్యమైనను ఉద్యమ కూలముల నడుమ నభ్యుదయమందుటే సార్వకాలికమైన సత్యమని యను సిద్ధాంతము!”
నిజమైన సాహిత్యం కేవలం అలంకారం కాదు, సామాజిక పురోగతికి తోడ్చడేది కథనాత్మక నిర్మాణంతో పాటు, సాహిత్య చరిత్ర మరియు సామాజిక వికాసం (అభ్యుదయం) పై డా. ముదిగొండ గారు తన సిద్ధాంత గ్రంథం ఉపోద్దాతంలో ఒక సమగ్రమైన సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. ప్రజల చైతన్యాన్ని, మానవ సంక్షేమాన్ని పెంచడానికి విస్తృత సామాజిక ఉద్యమాలతో పాటు సాహిత్యం పరిణామం చెందుతుంది. ముదిగొండ గారి దృష్టిలో సాహిత్యం కేవలం అలంకారప్రాయమైన కళ కాదు, అది సమాజ పురోగతికి తోడ్పడే సజీవ సాధనం.
అటు బసవణ్ణ చెప్పిన రాజకీయం ‘శివ సేవ’ అన్న మాటను, ఇటు శిల్పి సోమేశ్వరుడు అన్న ‘కళ రాజకీయం కాదు’ అన్న మాటను పై చెప్పిన దృష్టికోణంతో చూసినపుడు డా. ముదిగొండ గారి మనోగతం పాఠకులకు బాగా అవగతమవుతుందని నా అభిప్రాయం.
ముగింపు మాటలు:
డా. ముదిగొండ శివప్రసాద్ గారి సాహిత్య వారసత్వం – వందకు పైగా నవలల ప్రస్థానం – లోతైన చారిత్రక పరిశోధన, సృజనాత్మక కథన నిర్మాణం కలసి గతాన్ని ఎంత ఆకట్టుకునేలా మార్చవచ్చో నిరూపిస్తుంది. ప్రాచీన యుగాలకు, ఆధునిక పాఠకులకు నడుమ కథన వారధులను నిర్మించడం ద్వారా చరిత్ర అనేది వర్తమానంతో సాగే ఒక నిరంతర సంభాషణ అని ఆయన చూపించారు.
ఆయన రచనలు నేటి రచయితలకు, పాఠకులకు ఒక ఆలోచనాత్మక ప్రశ్నను మిగుల్చుతున్నాయి: ఏకాగ్రతతో వందల కొద్దీ పుటలను చదవడమనే అలవాటును సోషియల్ మీడియా నీరుగారుస్తున్న ఈ రోజుల్లో, డా. ముదిగొండ గారి విస్తృత సాహిత్య సంపద భవిష్యత్తు ఏమిటి? అవి తాత్కాలిక కాలక్షేపానికి బలైపోతాయా లేక సామాజిక పురోగతికి సాధనాలై మన విస్మృత చరిత్రలను అనుసంధానించే వారధులవుతాయా?
ఏమో! నాకు తెలియదు! కాలమే సమాధానం చెప్పాలి!!
కాలాయ తస్మె నమః
కడప రఘోత్తమరావు (సి. రఘోత్తమ రావు) ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకుడు, డాక్యుమెంటరీ మేకర్ మరియు పాడ్కాస్టర్. ఆయన ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్ర, విజయనగర సామ్రాజ్య చరిత్ర, మరియు హిందూ దేవాలయాల చరిత్రపై లోతైన పరిశోధనలు చేసి, ఆ వివరాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. వారి యూట్యూబ్ ఛానెల్: అన్వేషి చరిత్ర వాహిని
https://www.youtube.com/@AnveshiHistory
