Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వ ప్రేమ

[ఆచార్య పి. ఆర్. హరినాథ్ గారి ‘విశ్వ ప్రేమ’ అనే కథని అందిస్తున్నాము.]

“మీ ఊరి మీదే వెళ్తున్నాను – స్టేషన్‌కు రాగలరా?” అని ప్రత్యూష నుంచి ఉత్తరం వచ్చింది. ఎన్నేళ్ల తర్వాత ఆ అక్షరాలు పలకరిస్తున్నాయి.

ఒక్కసారిగా మనసు గతంలోకి జారింది.

***

కాలేజీ రోజులు – లైబ్రరీలో పుస్తకాల కోసం వెతుకుతూ ఉన్నాను. వెనుక నుంచి వినబడింది:

“విశ్వం, మీ వద్ద షేక్‌స్పియర్ నోట్స్ ఉందా?”

తలెత్తి చూశాను. కాలేజ్ బ్యూటీ ప్రత్యూష. ఆమె కటాక్షం కోసం, కడగంటి చూపు కోసం కలవరించే వాళ్లు చాలామంది ఉన్నారు. ఆమె నా వద్దకు రావడం, నన్ను పేరుతో పిలవడం, నాకు ఆశ్చర్యమూ, ఆనందమూ కలగాపులగంగా కలిగాయి.

మర్నాడు నోట్స్ ఇచ్చాను. “మీరు బాగా రాస్తారని ప్రొఫెసర్ గారు చెప్పారు.” అంటూ తీసుకుంది.

ఆ పరిచయం క్రమంగా తరచూ మాటాడే దాకా వచ్చింది. లైబ్రరీలో చాలా పుస్తకాలను ఆమెకు పరిచయం చేశాను.

చాలా ఆసక్తిగా వినేది. ఆమె వినే దృశ్యం నాకొక కావ్యనాయికను తలపించేది.

“రాబోయే రోజులలో మీరు ప్రొఫెసర్ అవుతారు” అని కితాబిచ్చేది.

మా పరిచయాలు పెరిగాయి.

ఆఖరి సంవత్సరం వచ్చింది. చదువు పూర్తి కావస్తూంది. చివరి సెమిస్టర్.

పరీక్షల ముందు అడిగింది – “కొండపై గుడికి వెళ్ళొద్దామా?”

ఇద్దరమూ వెళ్లాము. గుడి వాతావరణం మనోహరంగా ఉంది.

కర్పూరమూ, పూలూ, అగరువత్తులూ కలిసి పరిమళించాయి.

దర్శనం అయ్యాక దూరంగా తిన్నెపై కూచున్నాము. అక్కడే పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేశాము.

కాఫీ తాగుతూ ఆమె అంది – “దూరంగా కొండకింద ఊరు చూశావా – ఎంత చిన్నగా కనిపిస్తూందో! ఇళ్లు అట్టబొమ్మల్లా ఉన్నాయి. వీటి కోసం ఎంత ఆరాటం కదా మనుషులకు! ఎంతో పెద్దగా ఊహించుకుంటాం – ఆ రాజభవనం చూడు ఎంత చిన్నగా ఉందో! ఏదైనా అంతేనేమో- ఎత్తుకు ఎదిగేకొద్దీ జీవితం కూడా అంతే. విశాలంగా పరచుకుని – ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది.”

నవ్వుతూ ఆమెను చూపిస్తూ “ఫిలాసఫర్” అన్నాను.

“జీవితాన్ని విడిచి వేదాంతం లేదు కదా! ఫిలాసఫీ అంటే అన్నిటినీ వదిలి ఎక్కడో గుహలో ఉండడం కాదు. ఇక్కడే ఉండాలి. దీనితోనే ఉండాలి. దీనిలోనే ఉండాలి. దీనిని గమనించాలి” అంది. కాఫీ అయిపోయింది.

కొండ దిగడం మొదలెట్టాము.

“ప్రత్యూషా – ఓ మాట చెప్పాలనుంది.” నిదానంగా అన్నాను.

“చెప్పు – పర్మిషన్ దేనికి?” అంది.

“నేను – నిన్ను – ప్రేమిస్తున్నాను.” తడబాటు నాకే తెలుస్తుంది.

ఆమె మాట్లాడలేదు. అంతా నిశ్శబ్దం.

ఆమె జవాబు కోసం వీధిదీపాలు కూడా వంగి ఆసక్తిగా నిలబడినట్లు తోచింది. చలిని ఆపుకోడానికి వొంటి చుట్టూ కొంగను చుట్టుకుని నడుస్తూంది ఆమె. ముందుకు చూస్తూ అంది:

“ప్రేమించు – నేను వద్దనలేదుగా. నాతో చెప్పడం దేనికి?” నిబ్బరంగా ఉంది కంఠం.

“నీ ప్రేమను పొందాలని ఆశ” అన్నాను.

“విశ్వం, ఆశ నుంచే దుఃఖం వస్తుంది – అందరినీ ప్రేమించు – అదిగో ఆ చెట్టును – ఈ కొండను – మనుషులను గాలినీ – నేలనూ – నిన్నూ – నన్ను అందరినీ – అన్నిటినీ ప్రేమించు. చెప్పాల్సిన అవసరమేముంది?” అంది.

“ప్రత్యూ – నేను చెప్పేది మన ప్రేమ గురించి. నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అన్నాను.

ఆమె మాట్లాడలేదు. నాకు చిత్రంగా అనిపించింది.

“ఎవరైనా ఈ వయస్సులో కోరే ప్రేమే కదా ఇది” అన్నాను.

“ఔననుకో – మా అమ్మ కూడా అలాగే అనుకుంది. మా నాన్న, అఫ్‌కోర్స్ – ఆయనెవరో నాకు తెలీదనుకో – నేను ఇంకా మా అమ్మ కడుపులో ఉండగానే వదిలేసి వెళ్లాడట. ఆ తర్వాత మా అమ్మ నన్ను పెంచడంలో ఎంత కష్టపడిందో తెలీదు. ఆమె పోయాక అర్థం అయింది. చందమామకు రెండోవైపు చీకటి – ఎవరికి తెలుస్తుంది.” అంది.

ఆమె పై జాలి కలిగింది. చెప్పలేని సంకీర్ణమైన అనుభవం కలిగింది.

“ఓహ్ – సరేలే. నా కథ ఎందుకు గానీ – మహాశయా – తమ ప్రేమను లోకానికి పంచండి. ప్రేమకు నోచుకోని వారెందరో ఉన్నారు. వారిని ప్రేమించండి” అంది నవ్వుతూ.

మాటలు తోచలేదు. మౌనంగా వెళ్లిపోయాము.

రోజులు దొర్లిపోతున్నాయి. సెమిస్టర్ ముగింపు.

చివరి పరీక్ష జరుగుతూంది. సాయంత్రం కలిసింది.

“నీ అడ్రస్ ఇవ్వలేదు. కనీసం ఉత్తరాలు రాసుకోవచ్చు గదా ప్రత్యూ” అని అడిగాను పేపర్ తీస్తూ.

“నీ అడ్రస్ నా వద్ద ఉంది. అది చాలు కదా! ఇక నాదంటావా – ప్రపంచమే నా అడ్రస్.” చతురంగా మాట దాటేసింది.

తర్వాతి రోజు ఊరికెళ్ళిపోయింది. ఏ ఊరో ఎవరికీ చెప్పలేదు.

***

ఇన్నేళ్లకు మళ్లీ ఆమె నుంచి లేఖ.

రైలు వివరాలన్నీ చూసుకుని ముందుగానే ప్లాట్‌ఫారం చేరుకున్నాను. నిదానంగా జనం చేరుతున్నారు. కాసేపటికి రైలు రాబోతున్న ప్రకటన వినబడింది. హడావిడి.

అదిగో దూరంగా రైలు. వస్తూంది.

శబ్దం చేస్తూ రైలాగింది. జనం పరుగులు – అటూ ఇటూ తిరుగుతున్నారు. కోచ్ వద్దకు వెళ్ళేసరికి ప్రత్యూష వాకిలి వద్దకు వచ్చి నిలబడింది.

రైలాగింది. ఆమె క్రిందకు దిగింది.

“ప్రత్యూ – ఎన్నేళ్లకు – ఎలా ఉన్నావు?” అన్నాను.

“ఇదిగో- ఇలా” అని తనను తాను చూపుకుంది. నవ్వింది. మల్లెల వాన కురిసింది.

మనిషి పెద్దగా మారలేదు. కళ్లద్దాలు వచ్చాయి. జుట్టు రవంత నెరిపింది.

అదే పసిమి వన్నె ముఖం – అదే ప్రశాంతత. అదే పవిత్రత. ద్రాక్షపండు రంగు చీర కట్టుకుంది. ఆమె అప్సర.

“ఇప్పుడం చేస్తున్నావు! ప్రొఫెసర్ అయ్యావా?” అంది.

“లేదు – ప్రేమలో పడ్డాను” అన్నాను.

కళ్ళు పెద్దవి చేసి – పెదవులపై నవ్వును నొక్కి పట్టి – “ఎవరితో?” అంది.

“ప్రపంచంతో! చదువు మానేశాను. రకరకాల సంస్థలతో, వ్యక్తులతో కలసి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఏర్పరచాను. అవసరమైన వారికి సహాయం చేస్తున్నాను. ప్రేమించడంలో ఇంత హాయి ఉందని నీవు చెప్పాకనే తెలిసింది” అన్నాను.

“మరి పెళ్లి?” అంది. కంఠం వణికింది.

“లేదు.”

“అంటే? నాకోసం!” అని ఆగింది.

“ఔను – నీ కోసం – ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను” అని మాట మార్చాను.

ఆమె ఏదో చెప్పాలనుకుంది.

“మీవారేం చేస్తారు ప్రత్యూ?” వేరే వైపుకు మాట తిప్పాను.

“నీలాంటి వాడు నాకు దొరకాలిగా విశ్వం” అంది. కంఠంలో జీర తెలుస్తుంది.

“అంటే – నీవు కూడా?” నా గొంతులో భయమూ, విషాదమూ నాకే తెలుస్తుంది.

గార్డు విజిల్ వినబడింది. ఆమె కోచ్ లోకి ఎక్కింది.

రైలు కదుల్తూండగా ఆమె జవాబిచ్చింది.

రైలు కూతలో వినబడలేదు.

Exit mobile version