[శ్రీ నాగరాజు రామస్వామి గారు రచించిన ‘విశ్వ రవళి’ అనే కవితని అందిస్తున్నాము.]
విశ్వ రవళి – స్పేస్ మ్యూజిక్:
అంచులు లేని ఆకాశం. అసీమ.
సమస్త విశ్వద్రవ్యం సచ్ఛిద్రం. సుషిరం. సర్వం చిల్లుల మయం.
విశ్వ వేణువుకు రెండంచులు.
ఒక చివర పృథ్వి ఒడి, మరో చివర రోదసీ ఎద.
ఏవో కృష్ణబిలాలు ఊపిరులూదుతుంటవి.
పిల్లనగ్రోవి రంధ్రాలు ఆకాశాలను పుక్కిలిస్తుంటవి.
భూమికీ భువన గోళాలకూ నడుమ
నిరంతర నిత్య సంభాషణ. నిర్వికల్ప సంగీతం. విశ్వ రవళి.
కక్షీయ గమకాల ఎలక్ట్రాన్లు, గ్రహగోళాలు.
ఆటమిక్ ఆర్బిట్ల మధ్య ఆకాశం ఖైదీ.
అవని లోని ప్రతివణువూ
ఆవలి తీరాల అద్దాలలో ప్రతిఫలిస్తుంటుంది.
అంతరిక్ష అస్తిపంజరంలో తన
అనాటమీని గుర్తించి మురిసిపోతూ
మెలికలు తిరుగుతున్న అణువు.
విశ్వాంతరాళాలలో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్.
భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్లు లయబద్ధంగా కదలుతుంటవి.
హిమగిరి జననం ఓ జియొలాజికల్ ఫైర్ అండ్ స్వోర్డ్ మ్యూజికల్ ఈవెంట్.
శాంతీ సమరాలు కాలా(వ)కాశ
సినొసాయిడల్ వేవ్ పై కదలాడే పేలక తప్పని శతఘ్ని శబ్ద బిందువులు.
కటపయాది లెక్కల కందని యుద్ధ రాగాల గణితాంకాలు.
అనంతాకాశం. అంతటా.
కాలాకాశ కాస్మిక్ స్వరాల సుర సంగీతం. ఎల్లెడలా.
అణువణువులో, అంతరాకాశంలో.
రోదసీ సీమల చీకటి ఛిద్రాలను చీల్చుకుంటూ
నక్షత్ర పథాల గుండా దిగివచ్చిన వియద్గోళాల వేణునాదం
భూగోళాన్ని కప్పేస్తున్నది.
