Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రపంచ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవాలన్న జిజ్ఞాసను కలిగించే ‘విశ్వసాహిత్యం’

[తెలుగు సాహితీవనం వారు ప్రచురించిన ‘విశ్వసాహిత్యం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. తిక్కా సత్యమూర్తి.]

విశ్వసాహిత్య మహాసాగరంలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్న గ్రంథాలెన్నో! వాటిలో కొన్నింటిని ఎన్నికచేయడం వాటిని సమీక్షించి, ఉపన్యసించగల వ్యక్తులను గుర్తించి, పన్నెండు నెలలపాటు క్రమం తప్పకుండా జూమ్ సమావేశాలలో విశ్లేషణ చేయించడం సామాన్యమైన పని కాదు.

ఈ మహాకార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని తెలుగు సాహితీవనం ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వర్తించి శ్రోతల అభినందనలు ప్రశంశలు అందుకుని, ఆ ఉపన్యాసాలకు పుస్తకరూపమిచ్చి ఆవిష్కరించిన డా. ఏనుగు నరసింహారెడ్డి గారు, సత్యాజీ గారు, తెలుగు సాహితీవనం వ్యవస్థాపకులు శాంతికృష్ణగారు ప్రత్యేకంగా అభినందనీయులు.

ఎన్నిక చేసిన గ్రంథాలను వ్రాసినవారు సాహితీ స్రష్టలు. వాటిని సమీక్షించినవారు నిష్ణాతులు. అటువంటి సమీక్షలను విశ్లేస్తూ వ్రాయడం అన్నది కత్తిమీది సాములాంటిదే! ఆ పనిని శాంతికృష్ణ నాకు అప్పచెప్పినప్పుడు నేను కొంచెం సంకోచించాను. కానీ ఆమె నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేక ఆ కార్యానికి ఉపక్రమించి ‘విశ్వసాహిత్యం’ పుస్తకాన్ని సమీక్షించే సాహసం చేస్తున్నాను.

ఈ పుస్తకంలో ప్రసంగ వ్యాసాలు ఎంత మధురంగా ఉన్నాయో ప్రసంగ వ్యాసాలకు ఇచ్చిన శీర్షికలు కూడా అంతే సందర్భోచితంగా ఉన్నాయి. సమీక్షించిన గ్రంథం ఆత్మను ఆవిష్కరించేలా ఉన్నాయి.

సమీక్షించిన గ్రంథాలలో జనసామాన్యానికి బాగా తెలిసిన ‘ది మదర్’ లాంటి పుస్తకాలతోపాటు అంతగా తెలియని ‘ది టిన్ డ్రమ్’ లాంటివీ ఉన్నాయి. ‘విశ్వసాహిత్యం’ పుస్తకం చదివిన తర్వాత అందులో సమీక్షింపబడ్డ గ్రంథాలలో ఏది అత్యుత్తమం అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అన్ని సమీక్షా వ్యాసాలు బాగున్నాయి.

‘విశ్వ సాహిత్యం’ పుస్తకం సమీక్షింపబడ్డ గ్రంథాలను చదవాలనే ఉత్సుకతను కలిగించడంతో బాటు విశ్వసాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవాలన్న జిజ్ఞాసను కూడా కలిగిస్తుంది. సామాన్య పాఠకులలో విశ్వసాహిత్యం పట్ల మక్కువను పెంపొందించడంతో పాటు రచయితలకు విశ్వసాహిత్యపు విభిన్న శైలులను రచనా శిల్పాలను పరిచయం చేసి, మన సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి సహకరిస్తుంది. ఆ పుస్తకాలు వెలువడిన నాటి కాలమాన పరిస్థితులను వర్ణించినతీరు అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులపై చక్కని అవగాహన కలిగిస్తుంది.

ఒక్కొక్క గ్రంథంలో అంతర్లీనంగా ఉన్న మూల భావాన్ని గ్రంథం స్వభావానికి అనుగుణంగా బహిర్గతం చేస్తూ మనసుకు హత్తుకునేలా చేసిన ప్రసంగ వ్యాసాలు మనల్ని ఆ పుస్తకం నాటి కాలమాన పరిస్థితులలోనికి తీసుకువెళ్తాయి. ఉదాహరణకు ‘అమ్మ’ పుస్తకం గొప్పతనం గురించి అందరికి తెలిసిందే కానీ, అమాయకపు అమ్మ వ్యవస్థపై పోరాడే శక్తిగా ఎలా ఆవిర్భవించిందో ‘ది మదర్’ పుస్తకంపై సత్యాజీ అభివర్ణించిన తీరు చదువరులను అప్పటి పరిస్థితులలో జీవిస్తున్నామా అనే అనుభూతికి గురి చేస్తుంది. మాయా వాస్తవిక వాదం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సోలిట్యూడ్’ గ్రంథంపై శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ నవలా వస్తువు నేపథ్యంగా మాయా వాస్తవిక వాదాన్ని వివరించిన తీరు సాహితీ ప్రక్రియలో దాని ప్రాముఖ్యత అరటిపండుని ఒలిచి తినిపించినట్లు ఉంటుంది. అలాగే ‘ది టిన్ డ్రమ్’ పై డా. చంద్రలత వ్రాసిన వ్యాసంలో కూడా మాయా వాస్తవిక వాదాన్ని సోదాహరణంగా వివరిస్తారు. ఈ వ్యాసం నిజంగా పరిశోధనా వ్యాసంలాగే ఉంది. ఆత్మాశ్రయ రచనల విశిష్టతను గురించి డేవిడ్ కాఫర్ ఫీల్డ్ పై వ్రాసిన వ్యాసంలో కస్తూరి మురళీకృష్ణ వివరించిన తీరు చాలా బాగుంది.

విశ్వసాహిత్యం పఠనం వల్ల మన సాహిత్యం పరిస్థితి తులనాత్మకంగా తెలుస్తుంది. కొత్త కొత్త పోకడలను, రచనా శైలులను అన్వయించుకోవడానికి దోహదం చేస్తుంది. విశ్వసాహిత్యం పఠనం ఇంతవరకు మనభాషలో అనువదింపబడని ఇతర మంచి గ్రంథాలను అనువదించాలన్న అభిరుచిని సామర్ధ్యం కలవారికి కలిగిస్తుంది.

ఇతర గ్రంథాలను మరీ ముఖ్యంగా ప్రపంచ సాహిత్యం అనువదించేటప్పుడు మక్కీకి మక్కీ అనువదించకుండా గ్రంథపు మూల స్వభావం చెడకుండా కొంచెం నేటివిటీని చొప్పిస్తే చదువరులను పఠనాసక్తులను చేస్తుంది. అనువదించేటప్పుడు అటువంటి ఆస్కారం లేకున్నా, సమీక్షిస్తున్నప్పుడు భాషా పరంగా ఆ అవకాశముంటుంది అన్నది నా భావన. అటువంటి నేటివిటీ ‘విశ్వసాహిత్యం’ పుస్తకంలో కనబడుతుంది.

ప్రస్తుత తరానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదివే ఓపిక ఉండకపోవచ్చు. ఆ కారణం చేత ప్రఖ్యాతిగాంచిన పర భాషా రచనలను ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోవచ్చు. అటువంటి వారికి ‘విశ్వ సాహిత్యం’ లాంటి పుస్తకాలు, ఆ రచనలను ఆసాంతం చదవాలన్న ఆకాంక్షను కలిగిస్తాయి.

విశ్వసాహిత్యం ఆవిర్భావం గురించి డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ‘విశ్వసాహిత్యం’ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో ఇలా వివరిస్తారు:

“అన్నిరకాల ఆలోచనలు అవి మహోత్కృష్టమైనప్పుడు ఉత్తమ సాహిత్యం నమోదవుతుంది. అలా నమోదైన సాహిత్యంలో కొన్ని మాత్రమే కాల పరీక్షకు నిలబడతాయి. అలాంటివి కాలం పట్టే జల్లెడలోంచి జారిపోకుండా మిగులుతాయి. అలామిగిలినవి మాత్రమే భాషలను దాటి ప్రాంతాలను దాటి విశ్వ వ్యాప్తం అవుతాయి.”

విశ్వసాహిత్యం లక్షణాలను గురించి ‘ఒడిస్సీ’ కావ్యంపై శ్రీ కొల్లూరి సోమ శంకర్ వ్రాసిన వ్యాసంలో ఇలా విశదీకరిస్తారు:

“సాహిత్యంలో ఏదైనా ఒక ఇతివృత్తాన్ని విస్తృత శ్రేణి పాఠకులు తమదిగా పరిగణించినప్పుడు మనం దానిని విశ్వసాహిత్యం అంటాం. సాధారణ జీవిత అనుభవాలను పొందుపరచడం లేదా చాలామంది పాఠకులు అర్థం చేసుకోగలిగే మానవ స్వభావం యొక్క భావనల కారణంగా విశ్వసాహిత్యం ప్రపంచంలోని పలుదేశాల్లోని పాఠకులను చేరుతుంది. ఉదాహరణకు వ్యక్తిగత విలువలు, కుటుంబ విలువలు సామాజిక విలువలు, తమ సంస్కృతిని నిలుపుకోవడం చేసే ప్రయత్నాలు, దేశం కోసం పోరాటం, ప్రకృతిని రక్షించుకోవడం, ప్రకృతిలో తన ఉనికిని కోల్పోవడం, ఒక్కడే పదిమంది కోసం నిలవడం వంటి అంశాలు ఏ దేశంలోని పాఠకులనైనా ఆకర్షిస్తాయి. ఇలాంటి యూనివర్సల్ థీమ్స్‌ని చేయి తిరిగిన అనువాదకులు ఇతర భాషల్లోకి తెస్తే ఆయా భాషల సాహిత్యాభిమానులు మూల రచనని ఆస్వాదించగలుగుతారు.”

‘విశ్వసాహిత్యం’ పుస్తకంలోనికి వచ్చిన గ్రంథాలన్నీ డా. ఏనుగు నరసింహారెడ్డి చెప్పినట్లు విశ్వవ్యాప్తమైనవే. కొల్లూరు సోమశంకర్ చెప్పిన లక్షణాలు కలిగినవే. అటువంటి విశ్లేషణతో వ్యాసకర్తలు మెరుగులద్దిన తీరు ‘విశ్వసాహిత్యం’ పుస్తకాన్ని విశిష్టమైన పుస్తకంగా మార్చి పాఠకులకు దగ్గర చేసింది.

ఇప్పుడు ప్రతీ ప్రసంగ వ్యాసం పైనా స్పందన తెలియజేస్తాను.

***

డేవిడ్ కాపర్‌ఫీల్డ్ – కస్తూరి మురళీకృష్ణ:

చార్లెస్ డికెన్స్ రచించిన ‘డేవిడ్ కాపర్‌ఫీల్డ్’ అనాథ బాలుడైన డేవిడ్ జీవిత కథ. అతను క్రూరమైన బాల్యం, పేదరికం మరియు ద్రోహాన్ని అధిగమించి ఒక విజయవంతమైన రచయితగా ఎదుగుతాడు. అతను అమాయక యువకుడి నుండి వివేకవంతుడైన వయోజనుడిగా పరిణతి చెందుతాడు. ఈ క్రమంలో, చిన్నపిల్లలాంటి తన భార్య డోరాను కోల్పోయిన బాధను అధిగమించి, చివరకు ఆగ్నెస్ విక్ ఫీల్డో నిజమైన ప్రేమను, స్థిరత్వాన్ని పొందుతాడు.

సన్నివేశ స్పష్టీకరణలో, పాత్రల వ్యక్తిత్వ చిత్రీకరణలో, మానవ సంవేదనలను అతిసున్నితంగా ప్రతిబింబించడంలో రచయితలు అందరికీ చార్లెస్ డికెన్స్ మార్గం చూపాడని సమీక్షకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ అభిప్రాయపడడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రచయిత అనుభవాలు, అతని జీవితం ద్వారా సమాజానికి రచయిత అందించే సందేశం, ఆదర్శాలు, తద్వారా పాఠకులకు కలిగే మానసిక ఆనందం, వారి ఆలోచనలలో కలిగే ఔన్నత్యం మనకు డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవల ద్వారా తెలుస్తుంది. అనేక పాత్రలతో, విభిన్న వ్యక్తిత్వాలతో, మానవ మనస్తత్వంలోని వైరుధ్యాలను, ఔన్నత్యాలను వివరంగా విశదపరుస్తూ మానవ జీవితాన్ని అన్ని కోణాల్లో ప్రదర్శిస్తుంది డేవిడ్ కాపర్‌ఫీల్డ్. అందుకే సమాజాన్ని, మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారు, ఉత్తమ వ్యక్తిగా ఎదగాలనుకునేవారూ తప్పనిసరిగా చదవవలసిన అత్యుత్తమ రచన డేవిడ్ కాపర్‌ఫీల్డ్ అంటారు శ్రీ మురళీకృష్ణ.

లెహ్ మిసరబుల్స్ – చెలమచర్ల భాస్కర రెడ్డి:

విక్టర్ హ్యూగో రచించిన ‘లెహ్ మిజరబుల్స్’ అనేది 19వ శతాబ్దపు ఫ్రెంచ్ కథ. ఇది జీన్ వాల్జీన్ అనే ఒక మాజీ ఖైదీ చుట్టూ తిరుగుతుంది, అతను కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి పెరోల్‌ను ఉల్లంఘిస్తాడు. ఇన్‌స్పెక్టర్ జావార్ట్ కనికరం లేకుండా వెంబడిస్తుండగా, వాల్‌జీన్ అనాథ అయిన కోసెట్ను దత్తత తీసుకుంటాడు. ఒక బారికేడ్ వద్ద ఆమె ప్రేమికుడు మారియస్‌ను కాపాడతాడు. చివరికి ప్రేమ, త్యాగాల ద్వారా ఒక దయగల వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు.

ఎన్నో మలుపులు తిప్పి రకరకాలైన వ్యక్తుల మనస్తత్వాలను వివరించి, సంఘటనలను చిత్రించి మన ముందు ఉంచాడు విక్టర్ హ్యూగో. ఫ్రెంచ్ సమాజం గురించి రాసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కష్టాలన్నీ రాశి పోసిన నవలలా దీని తీర్చిదిద్దాడు. పేదల వేదనలను చదువుతూ కన్నీరు కార్చకుండా ఉండలేని తనం ఒకవైపు, అక్కడి చట్టాల వికృత రూపాన్ని చూసి నివ్వరపోవటం మరొక వైపు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది చేస్తుంది ఈ నవల అంటారు శ్రీ చెలమచర్ల భాస్కర రెడ్డి.

రూట్స్ – డా. ఏనుగు నరసింహా రెడ్డి:

అలెక్స్ హేలీ రచించిన ‘రూట్స్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అమెరికన్ ఫ్యామిలీ’ అనేది ఒక మైలురాయి వంటి గాథ. ఇది 18వ శతాబ్దంలో బానిసగా అమెరికాకు తీసుకువెళ్ళబడిన గాంబియన్ కుంటా కింటే నుండి, ఏడు తరాల వారసుల వరకు రచయిత వంశాన్ని తెలియజేస్తుంది. ఇది బానిసత్వానికి వ్యతిరేకంగా వారి పోరాటం మరియు మనుగడను వివరిస్తూ, చివరికి వారి వారసత్వ కథను తర్వాతి తరాలకు అందిస్తుంది.

నీగ్రోల పట్ల అమెరికన్ల ప్రవర్తన అమెరికా దేశం చరిత్రలో ఒక మాయని మచ్చ. మనుషులను అమ్మడం, కొనడం జంతువులను వేరు చేసినట్లు నీగ్రోల కుటుంబాలను వేరుచేయడం అమెరికా చేసిన ఘోర తప్పిదం. తల్లిని ఒకరు కొంటే పిల్లలను ఒకరు కొనడం, చాకిరీకి వాడుకోవడం, లైంగికంగా వినియోగించుకోవడం తెల్లజాతి చరిత్రకు మాయని మచ్చ అంటూ రూట్స్ నవల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తారు డా. ఏనుగు నరసింహా రెడ్డి.

చరిత్రను పరిశోధించి మానవీయ కోణం ఉట్టిపడేలా రాసిన అరుదైన నవల రూట్స్. అందువల్లనే అది ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక నవలల్లో గణనీయమైన పేరు సంపాదించుకుంది. సామాన్యుల పక్షాన ఆలోచించటం వల్ల రచనలు ప్రజల మనస్సులో చిరకాలం నిలిచిపోతాయని చెప్పడానికి రూట్స్ ఒక తిరుగులేని దాఖలా అంటారు డా. ఏనుగు నరసింహా రెడ్డి.

జమీల్యా – డా. చెమన్ సింగ్:

చింగిజ్ ఐత్ మాతోవ్ రచించిన ‘జమీల్యా’ ప్రపంచంలోని అత్యంత సుందరమైన ప్రేమకథలలో ఒకటిగా తరచుగా అభివర్ణించబడే ఒక ప్రఖ్యాత నవల. రెండవ ప్రపంచ యుద్ధం చివరి కాలంలో గ్రామీణ కిర్గిజిస్తాన్ నేపథ్యంలో సాగే ఈ రచన, ప్రేమ, స్వాతంత్ర్యం మరియు సంప్రదాయాలకు, వ్యక్తిగత ఆనందానికి మధ్య ఉండే సంఘర్షణ వంటి ఇతివృత్తాలను లోతుగా విశ్లేషిస్తుంది.

సున్నితమైన భావాలకు, అనుభూతులకు పెద్దపీట వేస్తూ మనసుకు హత్తుకునేలా ఈ నవలను మలిచాడు రచయిత. అందుకే అందమైన దృశ్య కావ్యంగా చరిత్రలో మిగిలిపోయింది అంటారు డా. చెమన్ సింగ్.

సమాజం ఎన్ని కట్టుబాట్లను సాంప్రదాయాలను విధించుకున్నప్పటికీ మనిషి అంతర్లీన వాస్తవాలు, భావాలు స్థిరంగా ఉంటాయి. సాంప్రదాయాలను బద్దలు చేసి అంతర్లీన భావాలకు అనుగుణంగా జీవితాన్ని నిర్ణయించుకోవడం అనేది వ్యక్తియొక్క నిర్ణయంమీద ఆధారపడి ఉండే విషయం అంటారు డా. చెమన్ సింగ్.

ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ – స్వాతి శ్రీపాద:

వయసు పైబడిన క్యూబన్ జాలరి శాంటియాగో, గల్ఫ్ స్ట్రీమ్‌లో ఒక భారీ మార్లిన్ చేపను పట్టుకోవడం ద్వారా తన 84 రోజుల వైఫల్యానికి అడ్డుకట్ట వేస్తాడు. అతను ఆ చేప యొక్క హుం పోరాటపటిమను ఆరాధిస్తూ, దానితో మూడు రోజుల పాటు భీకరమైన పోరాటం చేసి, చివరకు దానిని చంపుతాడు. చివరికి, సొరచేపలు ఆ మార్లిన్ మాంసాన్ని తినేసి, కేవలం అస్థిపంజరాన్ని మాత్రమే మిగులుస్తాయి. శాంటియాగో విజేతగా తిరిగి వస్తాడు.

గర్వం గొప్ప సాహసానికి ప్రేరేపిస్తుందని శాంటియాగో పాత్ర నేపథ్యంలో వక్కాణిస్తారు వ్యాసకర్త స్వాతి శ్రీపాద.

మార్లిన్‌ను పట్టుకోవటం అతని వీరోచిత ఓటమికి దారి తీసినందున అహంకారం శాంటియాగో గొప్ప బలానికి మూలం అవుతుంది. శాంటియాగో గర్వం ప్రకృతి విధ్వంసక శక్తులను అధిగమించాలనే అతని కోరికను కూడా ప్రేరేపిస్తుంది. నవల అంతటా అతని పరిస్థితులు ఎంత దుర్భరంగా మారినప్పటికీ మార్లిన్‌ను పట్టుకుని ఒడ్డుకు తీసుకురావాలనే అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ప్రతి వ్యక్తినీ, జీవినీ అడుగడుగునా ప్రోత్సహించే నవల. అజరామరంగా నిలిచిపోయే కథనం అంటారు స్వాతి శ్రీపాద.

గాడ్స్ పాపర్ – వాడ్రేవు చిన వీరభద్రుడు:

సెయింట్ ఫ్రాన్సిస్ క్రైస్తవులలో సర్వత్రా గౌరవించబడే ఒక వ్యక్తి, అస్సిసికి చెందిన ఫ్రాన్సిస్ యొక్క కల్పిత జీవిత చరిత్ర. ఇది కేవలం ఒక మతపరమైన గ్రంథం మాత్రమే కాదు, ఐరోపా మధ్యయుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరి హృదయానికి, మనసుకు అద్దం పట్టేది. ఈ కథను సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క సన్నిహిత సహచరుడు, తోటి సన్యాసి అయిన బ్రదర్ లియో వివరిస్తాడు.

సెయింట్ ఫ్రాన్సిస్ ప్రతిఒక్క అస్తిత్వంలోను పువ్వులో పిట్టలో గొర్రెలో మనిషిలో మట్టిలో – ప్రతి ఒకచోటా చరాచరాలన్నిటిలోను క్రీస్తును దర్శించడానికి తపించాడు. అందుకే గాడ్స్ పాపర్ గ్రీకులో వ్రాసిన మహాభాగవత కథ అంటారు ఉపన్యాసకులు. గాడ్స్ పాపర్ చదువున్నంతసేపు సెయింట్ హుడ్ తాలూకు వాసన మనల్ని తాకుతూ మనకు ఎందరో భారతీయ భక్తి కవులు యోగులు తపస్వులు మహర్షులను గుర్తుకు తెస్తుందంటారు. గాంధీ గారిని కూడా సెయింట్ ఫ్రాన్సిస్ ప్రభావితం చేశారంటారు. వస్తువ్యామోహం, శ్రమించని ఇంద్రియతాపం, అంతర్వాణి మాటలనుకూడా లక్ష్యపెట్టని విచ్చలవిడితనం పేట్రేగి పోతున్న ఈ కాలంలో, గాంధీ గారి కాలం కన్నా సెయింట్ ఫ్రాన్సిస్ గురించి తెలుసుకోవడం బహుశా మరింత అవసరం అంటారు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు.

మర్చంట్ అఫ్ వెనిస్ – డా. బెల్లంకొండ సంపత్ కుమార్:

విలియం షేక్‌స్పియర్ రచించిన ‘ది మర్చంట్ ఆఫ్ వెనిస్’ నాటకం హాస్యం మరియు నాటకీయతల సంగమంగా ఆకట్టుకునే నాటకం. ఈ కథ వెనిస్ నగరంలో జరుగుతుంది. యూదు వ్యతిరేకి అయిన క్రైస్తవ వ్యాపారి ఆంటోనియో, ధనవంతురాలైన పోర్షియాను వశపరచుకోవడంలో తన స్నేహితుడైన బస్సానియోకు సహాయం చేయడానికి, యూదు వడ్డీ వ్యాపారి షైలాక్ నుండి రుణం కోరతాడు. ఆంటోనియో రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు కథనం నాటకీయ మలుపు తీసుకుంటుంది. అందులో షైలాక్ గారంటీగా ఆంటోనియో శరీరం నుండి ఒక పౌండ్ మాంసాన్ని డిమాండ్ చేస్తాడు. ఈ నాటకం ఆ కాలంలోని ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను చిత్రీకరిస్తుంది.

విశేషంగా ఆకట్టుకునే పాత్రల చుట్టూ, పాత్రలతో సంబంధాలు గల ఇతర పాత్రలు చుట్టూ కథ నిర్మితమై ఉన్నందున పాత్రలు గుర్తుంటే కథనంతా గుర్తించుకునే సారళ్యత ఈ రచనల్లో ఉంది అంటారు విశ్లేషకులు శ్రీ బెల్లంకొండ సంపత్ కుమార్.

ఈ నాటకం ద్వారా డబ్బు కన్నా ప్రేమ ముఖ్యమని తెలుస్తుంది. ప్రతీకారం కన్నా దయార్ద్రమైన హృదయంతో మెలగాలని నాటకం చెబుతుంది. చదివించే శైలి, శైలిలో నాటకీయ సన్నివేశాలు గుర్తిండి పోయే విధంగా చదివినంతనే రచన ముద్ర వేస్తుంది అంటారు ఆయన. ఈ నాటకం మూర్ఖంగా ప్రవర్తించటం మంచిది కాదనే సందేశాన్ని ప్రవచిస్తుంది. ఏ విషయంలోనూ పరిధి దాటి వ్యవహరించటం ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేస్తుంది అంటారు బెల్లంకొండ సంపత్ కుమార్.

ది టిన్ డ్రమ్ – డా. చంద్రలత:

‘ది టిన్ డ్రమ్’ ఒక విషాదభరితమైన, రూపకాలంకార యుద్ధ నాటకం. ఇది ఆస్కార్ మాట్జెరాత్ అనే ఒక అసాధారణ ప్రతిభ గల బాలుడి కథ. పెద్దల కపటత్వం, నాజీయిజం పెరుగుదల చూసి అసహ్యించుకున్న అతను, తన మూడవ పుట్టినరోజున పెరగడం ఆపేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక బొమ్మ డ్రమ్ అద్దాలు పగిలిపోయేలా అరిచే కేకతో, ఆస్కార్ తన చుట్టూ ఉన్న ప్రపంచంపై తిరుగుబాటు చేస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన విధ్వంసాన్ని చూస్తూ, శారీరకంగా బాలుడిగానే మిగిలిపోతాడు.

అధిక్షేప ప్రతీకాత్మక రచన, యుద్ధానంతర జర్మనీలో ప్రకటించబడిన ఒక ఉమ్మడి అపరాధ భావన. నాజీ కాలపు భయాన్ని, బీభత్సాన్ని, దోషాన్ని దాటి వచ్చిన జర్మన్ స్పృహగా ఈ నవలను వర్ణిస్తారు డాక్టర్ చంద్రలత.

ప్రతీకాత్మక సాహిత్యంగా, మాజికల్ రియలిజంగా, ప్రయోగాత్మక శైలిగా భాషలో భావనలో అటు జర్మన్ సాహిత్యంలోనూ, ఇటు ప్రపంచ సాహిత్యంలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది ఈ నవల అంటారు చంద్రలత.

సాహిత్య కళా రంగాల్లో యుద్ధానంతరం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన యదార్థవాదానికి, నయా వాస్తవిక వాదానికి భిన్నంగా మార్మిక వాస్తవికతా కథనాన్ని ఎంపిక చేసుకున్నాడు గ్రాస్. నాజీ నియంత్రణకు గురైన అచ్చమైన జర్మన్ భాషకు తిరిగి ఒక స్వతంత్ర రూపం ఇచ్చాడు గ్రాస్ అంటారు చంద్రలత.

ఆఫ్ హ్యూమన్ బాండేజ్ – డా. అంపశయ్య నవీన్:

‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ లైంగిక వ్యామోహం యొక్క శక్తిని, ఆధునిక మానవుని స్వేచ్ఛాకాంక్షను శక్తివంతంగా వ్యక్తీకరించే ఒక రచన. పుట్టుకతోనే వంకర పాదంతో జన్మించి, అనాథగా మిగిలి, మతభక్తి గల అత్తయ్య, మామయ్యలచే పెంచబడిన సున్నితమైన బాలుడు ఫిలిప్ క్యారీ కథను చెబుతుంది. ఫిలిప్ సాహసాల కోసం తపిస్తాడు, మరియు పద్దెనిమిదేళ్ల వయసులో ఇంటిని విడిచిపెట్టి, చివరికి పారిస్‌లో ఒక కళాకారుడిగా వృత్తిని కొనసాగిస్తాడు. వైద్యశాస్త్రం చదవడానికి లండన్‌కు తిరిగి వచ్చినప్పుడు, అతను ఆకర్షణీయమైన మిల్డ్రెడ్‌ను కలుస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమకథ మొదలవుతుంది, అది అతని జీవిత గమనాన్ని మార్చేస్తుంది. లైంగిక వ్యామోహం అనుబంధం మరియు స్వేచ్ఛ కోసం మానవుని ఆరాటంగా సాగిన శక్తివంతమైన కథ ఈ నవల.

మామ్ సృష్టించిన సాహిత్యమంతా ఆయన అనుభవంలో నుంచి ఉత్పన్నమైనది అంటారు నవీన్. మొత్తం నవల కాకపోయినా ఈ నవలలో చాలా భాగం మామ్ జీవితాన్ని పోలి ఉంటుంది అంటారాయన. ఈ నవలలో మామ్ ఎలాంటి ఐడియలిస్టు ఆదర్శాలు బోధించడు, ఎలాంటి నీతులు చెప్పడు. జీవితాన్ని జీవితంగా చూపిస్తాడు తప్ప ఆచరించడానికి వీల్లేని పెద్ద పెద్ద ఆదర్శాలేవి బోధించడు. ఈ నవల మన బుచ్చిబాబును చాలా ప్రభావితం చేసిందని అతడు రాసిన ఏకైక నవల ‘చివరకు మిగిలేది’ చదివితే తెలిసిపోతుంది అంటారాయన. మనతో మనం తృప్తి పడటంతోనే మనకు శాంతి లభిస్తుందని ఆఫ్ హ్యూమన్ బాండేజీలో మామ్ చెప్పినట్లే చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు చెబుతాడు. ఏవేవో ఆదర్శాలు పెట్టుకొని సంఘాన్ని మరమ్మత్తు చేయబోతే సంఘమే మనల్ని మరమ్మత్తు చేస్తుందని ఈ రెండు నవలలు చెబుతాయి. ఎవరికివారు తమను ఉన్నతీకరించుకొని తమతో తాము సమాధానం పడటంవల్లే శాంతి లభిస్తుందని ఈ రెండు నవలలు ఇచ్చే సందేశం అనుకోవచ్చు అంటారు అంపశయ్య నవీన్.

ది మదర్ – సత్యాజీ:

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచయితలలో ఒకరైన మాక్సిమ్ గోర్కీ యొక్క క్లాసిక్ అయిన ‘మదర్’, చదువుకోని ఒక మహిళలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కథ. తన నిస్తేజమైన రైతు జీవితం నుండి, తన ప్రజల న్యాయ పోరాటంలో చురుకైన భాగస్వామిగా ఆమె ఎదిగిన తీరు ఇది. తన కొడుకుపై ఉన్న సాధారణ మాతృ ప్రేమ, అణచివేయబడిన వారందరిపై మాతృ ప్రేమగా మారుతుంది. ‘మదర్’ చదవడం ఒక గొప్ప భావోద్వేగ అనుభూతిని పొందడం లాంటిది. ఇది శక్తితో నిండిన నవల, వ్యక్తి యొక్క గౌరవానికి నివాళి. వాస్తవ సంఘటనల్లోంచి ప్రజల బాధా గాథల దుఃఖంలోంచి ఆనాటి కార్మిక వర్గం, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాల్లోంచి, కన్నీళ్ళలోంచి, లోలోన రగులుతున్న ఆవేదనల్లోంచి, అప్పుడప్పుడే పురివిప్పుతున్న ఆలోచనల్లోంచి, ప్రజా సమూహాల చైతన్యంలోంచి అక్షరక్షరంగా అల్లుకున్న కథ ‘అమ్మ’. సరిహద్దు రేఖలను, తరాల అంతరాలను దాటి దేశ దేశాల్లో భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిలిచింది. శ్రామిక వర్గ శక్తిని, చైతన్యాన్ని ప్రతిబింబించి సామ్యవాద వాస్తవికతకు అద్దం పట్టిన రచనగా ‘అమ్మ’ ప్రసిద్ధి చెందింది అంటారు సత్యాజీ.

ఏ సిద్ధాంతమైనా, ఏ ఆదర్శమైనా, అది కేవలం బోధనగా మాత్రమే ఉంటే దాని శక్తి పరిమితం. అది ఆచరణగా మారి, వ్యక్తుల్లో ప్రవర్తనలో వ్యవస్థలో ప్రతిబింబించినప్పుడు పాటించినప్పుడు – సజీవ శక్తిగా మారుతుంది. వ్యక్తుల ఆచరణ, పరిణామక్రమాల ప్రగతి సంఘర్షణ రూపంలో కనిపించినప్పుడు ప్రభావం చూపిస్తుంది. అక్కడక్కడ ఉన్న నిజపాత్రలను, ప్రవర్తనలను ఒకచోట కూర్చి గోర్కీ ‘అమ్మ’ నవలకు అపారమైన సజీవ శక్తిని ఇచ్చాడు అంటూ ‘అమ్మ’ నవల గొప్పతనాన్ని సంక్షిప్తంగా చెబుతారు సత్యాజీ.

వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్ – బొడ్డపాటి చంద్రశేఖర్:

గార్సియా మార్క్వెజ్ రచించిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్’ నవల, కొలంబియాలోని ఒక చిత్తడి నేలలో వారు కనుగొన్న మకాండో అనే కల్పిత, ఒంటరి పట్టణంలో నివసించే బుయెందియా కుటుంబం యొక్క ఏడు తరాల కథను ఆవిష్కరిస్తుంది. ఈ నవల మ్యాజికల్ రియలిజంను చరిత్రతో మేళవించి, ఆ పట్టణం నాశనమయ్యే ముందు ఆ కుటుంబంలో చోటుచేసుకున్న అక్రమ సంబంధాలు, యుద్ధం మరియు తీవ్రమైన ఒంటరితనంపై దృష్టి పెడుతుంది.

మాయా వాస్తవికతా వాదానికి మచ్చు తునక ఈ నవల. మాయా వాస్తవికత అనేది సాహిత్యానికి సంబంధించిన ఒక ప్రత్యేక శైలి. ఇందులో సాధారణంగా వాస్తవికంగా ఉండే నేపథ్యాన్ని అద్భుతమైన అసాధ్యమైన లేదా మాయాజాలంలా కనిపించే అంశాలతో మిళితం చేస్తారు. ఇది వాస్తవికతను అలాగే అంగీకరించి అందులో అసాధారణ సంఘటనలను సహజసిద్ధమైన వాటిగా చూపిస్తుంది. మాయా వాస్తవకిత అనేది వాస్తవాన్ని కల్పిత పురాణాత్మక అంశాలతో కలిపే ఓ సాహిత్య శైలి. ఇందులో ఆశ్చర్యమైన అనూహ్యమైన కల్పితమైన సంఘటనలు, కాలగమనం వంటి అంశాలు ఉండవచ్చు. అదే విధంగా, వాస్తవాన్ని కలలో చూసినట్లుగా పాఠకులకు అనుభూతి కలిగిస్తూ మారుస్తూ సాగే కథనమే మాయా వాస్తవికతగా వర్ణిస్తారు చంద్రశేఖర్. ఈ శైలిలో రచయిత తన సృజనాత్మకత ద్వారా ఒక సామూహిక చైతన్యాన్ని సృష్టించి వాస్తవికతను మిధ్యాకథలతో, మాయాజాలంతో నూతన దృక్కోణంలో చూపించగలుగుతాడు. ఈ నవల సమకాలీన చరిత్ర మిథ్యల సమ్మేళనం, మాయా వాస్తవికతను కలిపి కాల చక్రాన్ని అద్భుతంగా వివరిస్తుంది అంటారు చంద్రశేఖర్.

ఒడిస్సీ – కొల్లూరి సోమ శంకర్:

హోమర్ రచించిన ఒడిస్సీ అనేది ఒక ప్రాచీన గ్రీకు ఇతిహాసం. ఇది ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సియస్ తన పది సంవత్సరాల ప్రమాదకరమైన ప్రయాణాన్ని, ఇథాకాకు తిరిగి రావడానికి చేసిన వృత్తాంతాన్ని వివరిస్తుంది. అతను మిథికల్ రాక్షసులను, కోపంతో ఉన్న దేవతలను ఎదుర్కొంటుండగా, అతని భార్య పెనెలోప్ మరియు కుమారుడు టెలిమాకస్ అతని సింహాసనం కోసం పోటీపడే వారిని తరిమికొడతారు. చివరికి ఒడిస్సియస్ తిరిగి వచ్చి, వారిని సంహరించి, తన కుటుంబాన్ని తిరిగి పొందుతాడు.

ఒడిస్సీ కావ్యంలో క్లిష్ట పరిస్థితిలో పట్టుదల చూపించే ఏకైక జీవి మానవుడు మాత్రమే. ఒడిస్సీలో ఈ లక్షణాన్ని స్పష్టంగా చూపించే అనేక పాత్రలు మానవులు మాత్రమే. ఎందుకంటే క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారీ కావ్యంలో. ఉదాహరణలు ఒడిస్సియస్ , పెనెలోప్, ఆమెను వేధించిన ఆకతాయిలు. జీవితం, ప్రేమ, కుటుంబం ఇంకా ఇంటి ప్రాముఖ్యత గురించి వివరించే ఒక అద్భుతమైన కావ్యం ఒడిస్సీ. ఇన్ని జీవిత పాఠాలను చెప్పే ఒడిస్సీకి విశ్వసాహిత్యంలో ప్రముఖస్థానం ఉంది. కాస్త శ్రమించి చదివితే ఇలియడ్, ఒడిస్సీ కావ్యాలను ఆస్వాదించవచ్చు అంటారు కొల్లూరి సోమ శంకర్.

12 వ్యాసాల గురించి క్లుప్తంగా వివరించాను. ప్రతి ఒక్క ఇంటి గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకం ఈ ‘విశ్వసాహిత్యం’.

***

విశ్వసాహిత్యం
ప్రచురణ: తెలుగు సాహితీవనం
పేజీలు: 128
వెల: ₹ 120/-
ప్రతులకు:
83096 86404

Exit mobile version